వృత్తికి – ప్రవృత్తికీ వన్నెతెచ్చిన చిత్రకారుడు

ఆర్నేపల్లి అప్పారావు వృత్తి ఒకటిగా, ప్రవృత్తి మరొకటిగా రెండింటికీ వన్నెతెచ్చిన కళాకారునిగా గుర్తించబడ్డారు. చిత్రకళారంగంతో పెనవేసుకున్న కుటుంబంలో జన్మించడం వల్ల కళారంగం వైపు ఆయన మొగ్గు చూపారు. కృష్ణాజిల్లా, ఆత్కూరు గ్రామంలో అప్పలస్వామి, సీతమ్మ పుణ్యదంపతులకు ది. 15-7-1953న నాల్గవ సంతానంగా జన్మించారు అప్పారావు. నాల్గవ సంతానంగా పుట్టటం చేత నలుగురినీ కలుపునే స్వభావం, నలుగురిచేత మంచివాడనిపించుకునే తత్వం బాల్యం నుండే వచ్చివుంటుంది.
అన్నగారైన రామారావు డ్రాయింగ్ టీచర్ కావటం చేత వారే అప్పారావుకు ప్రధమ గురువు అని చెప్పొచ్చు. పాఠశాల విద్యనుఅభ్యసించే సమయంలోనే అన్నగారికి సహాయకులుగా పనిచేయడం వల్ల, చిత్రకళపై మక్కువ పెరిగి సైన్ బోలు వ్రాయడం, స్కెచ్చెస్ వేయటం అలవాటైంది. ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తయ్యాక డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పాసై ఉపాధ్యాయ శిక్షణ కూడా పొందారు.

వృత్తి :
1972వ సం. నుండి 1975 సం. వరకు విజయవాడ లోని సినీ ఆర్ట్స్ లో సినీ బ్యానర్లు చేయడం ప్రారంభించారు. 1975వ సం.లోనే “మద్రాస్ సినీ పబ్లిసిటీ’లో అవకాశం రావడంతో అక్కడ ‘కేతా ఆర్ట్స్ వద్ద అసిస్టెంట్ గా చేరారు. అదే ఏడాది డ్రాయింగ్ టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో కృష్ణాజిల్లా గట్టు భీమవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చేరారు. ఆ తరువాత ముప్పాళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 22 సం.ల పాటు డ్రాయింగ్ టీచర్ గా సేవలందించారు. విజయవాడ సమీపంలోని పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 10 సం.రాలు పనిచేసి 31-7-2011న పదవీ విరమణ చేశారు.

బి.ఎఫ్.ఏ. పూర్తిచేయడం :
సాధారణంగా ఉద్యోగవిరమణ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు, కాని వీరిలో నున్న కళాపిపాసి ఇంకా అన్యేషణలోనే వున్నాడు. కాబట్టే కర్ణాటక ఓపెన్ యూనివర్శిటీ వారి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో 2010-13 కాలంలో బి.ఎఫ్.ఏ. పూర్తి చేశారు. బి.ఎఫ్.ఏ. చేస్తున్నప్పుడు ఎంతోమంది చిత్రకారులతో పరిచయం ఏర్పడడంతో వీరి కళాసృజన ఎంతో పరిణితి చెందింది.

పాల్గొన్న ఎగ్జిబిషన్స్ :
రాష్ట్రంలో పలు చిత్రకళా సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేసినప్పుడు తన చిత్రాలను వాటిల్లో ప్రదర్శించి చూపరుల మన్ననలను పొందారు. డ్రాయింగ్ టీచర్ గా వేలాది మంది విద్యార్ధులకు చిత్రకళను బోధించిన విశేష అనుభవం ఉన్నా, నిత్య విద్యార్ధిగానే చిత్రకళలో మెళకువలు నేర్చుకుంటూ అలుపెరుగక ఇప్పటికీ చిత్రాలను గీస్తూనే ఉన్నారు. యువ చిత్రకారులకు ‘పెద్దదిక్కుగా ఉన్నారు. చిత్రకారులు తారసపడినప్పుడు ‘నమస్కారం మాష్టారు’ అన్న సంబోధన అప్పారావుకు ఎంతో సంతృప్తిని ఇస్తుంటుంది. అదే ఆయన పెద్దరికానికి నిదర్శనం.

సత్కారాలు :
అమలాపురంలోని ‘కోనసీమ చిత్రకళా పరిషత్’ వారు, తెనాలిలోని ‘అజంతారామం సంస్థ’ వారు, రాజోలు లోని ‘చిత్రకళా పరిషత్’ వారు, అనకాపల్లి లోని ‘అనకాపల్లి ఆర్ట్స్ అకాడమీ’వారు, నెల్లూరులోని ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ వారు వీరిని సత్కరించారు.

విజయవాడ ఆర్ట్ సొసైటీ స్థాపన :
2014 లో స్థాపించిన ‘విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘ సంస్థకు కోశాధికారిగా ఉంటూ ఎంతో నిబద్ధతతో తన బాధ్యతలను నిర్వర్తించడం గమనార్హం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 120 మంది సభ్యులు ప్రస్తుతం ఈ సంస్థలో సభ్యత్వాన్ని పొందారు.

Ganesh-Clay work

ఎస్.ఎస్. ఆర్ట్స్ :
నందిగామలో ఎస్.ఎస్. ఆర్ట్స్ పేరున 22 సం.ల పాటు వ్యాపార సంస్థలకు, పాఠశాలలకు, కళాశాలలకు, దేవాలయాలకు పలు విధాలైన కళాపరమైన సేవలందించడం అప్పారావుకు మంచి తృప్తినిచ్చింది. వీరు కేవలం చిత్రాలు గీయడమే కాకుండా లెటరింగ్, క్లే మోడలింగ్, క్రాఫ్ట్స్ వర్క్ చేయడంలో బహునేర్పరి.

విద్యా భివృద్ధికి కృషి:
చిత్రలేఖనంలో ఉపాధ్యాయుడైనప్పటికీ వివిధ దినపత్రికల్లోని హాయ్ బుజ్జీ, ప్రతిభ శీర్షికల్లో వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలను సేకరించి ప్ పుస్తకాలుగా తయారుచేసి విద్యార్ధులకు అందించారు.

ఉపాధ్యాయ సంఘ సభ్యునిగా :
ఉద్యోగ విధులు, బాధ్యతలతో పాటు ‘ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్’ లో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తూ 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించేవారు. ‘జాతీయ పొదుపు పధకము సంచాయిక స్కూల్ బ్యాంక్’లో విద్యార్ధులందరినీ చేర్పించేవారు. ‘భారత్ స్కౌట్స్, గైడ్స్’లో చేరి 18 రకాల శిక్షణలు పూర్తిచేసుకున్నారు. విశేషానుభవం గడించి, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ట్రైనర్ గా విధులు నిర్వర్తించారు. విజ్ఞాన, విహార యాత్రలు ఏర్పాటు చేసి విద్యార్ధులను ప్రోత్సహించి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు.
కుటుంబం:
విజయవాడకు చెందిన విజయశ్రీని 1976లో వివాహం చేసుకున్నారు. వీరికి జీవనసంధ్య, శాంతి అనే ఇద్దరు అమ్మాయిలు కలిగారు. వీరికి వివాహం జరిపించి చిత్రకళా సేవకు అంకితమయ్యారు.

పొందిన అవార్డులు :
కృష్ణాజిల్లా, రాష్ట్ర స్కౌట్స్-గైడ్స్ వారి సేవా పతకములు పొందారు. 1991లో కృష్ణాజిల్లా ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ పొందారు. 2008 లో ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ స్వీకరించారు.
కార్యక్రమాల్లో ఎందరున్నా అప్పారావు కోసం వెదికేవారే అందరూ. వృత్తి చిత్రకళా ఉపాధ్యాయుడైనా పలు కార్యక్రమాల్లో భాగస్వాములై సేవలందించి, ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు అప్పారావు. కుగ్రామం నుండి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఉపాధ్యాయుడిగా, స్కౌట్ టైనర్ గా, చిత్రకారునిగా విభిన్న రంగాల్లో ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. భావితరాలకు మార్గదర్శి ఈ చిత్రకళా మేటి.
డా॥ తూములూరి రాజేంద్రప్రసాద్

7 thoughts on “వృత్తికి – ప్రవృత్తికీ వన్నెతెచ్చిన చిత్రకారుడు

  1. Very good creative works…Apparao garu, Congrats.
    60 ఏళ్ళ తరువాత కూడా బి.ఎఫ్.ఏ. కోర్సు పట్టుదలతో పూర్తి చేయడం మీ కళాతృష్ణను తెలియజేస్తుంది.
    సుభాని, కార్టూనిస్ట్

    1. మాష్టారు గారిలోని కళా తృష్ణకు అద్దం పట్టే విధంగా వారి జీవితం, వ్రాసిన వారి రచన ఉన్నాయి. వారు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, వారు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను.

  2. మిత్రమా అని ఆప్యాయంగా పిలిచే ఆత్మీయతా పూర్వక పిలుపుకి చిరునామా అప్పారావు. 1974లో ఏర్పడిన మా మైత్రి, నా జీవితంలో మరపురాని మైలురాయి. జీవితానికి ఒక అర్ధం అనేదానికి నిలువుటద్దం అప్పారావు. శుభాకాంక్షలు. శతమానం భవతి!

  3. Kotiveeraiah గారు చిత్రకళ లో చేసిన కృషి అజరామరం. రిటైర్ అయినా సరే ఆయన బిఎఫ్ చదవడం ఆయన కృషికి నిదర్శనం చిత్రకళలో ఆయన అందరికీ ఆదర్శం
    …. మని పాత్రుని నాగేశ్వరరావు,
    శ్రీకాకుళం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap