అలసిన విశాఖ కడలి కెరటం ‘బాలి’

తెలుగు పత్రికా రంగానికి సుపరిచితమైన పేరు బాలి. గత ఐదు దశాబ్దాలుగా చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, కథా రచయితగా తెలుగు వారిని అలరించిన 81 ఏళ్ళ (పుట్టింది 29 సెప్టెంబర్, 1941, అనకాపల్లిలో) నిత్య యవ్వనుడు సొమవారం రాత్రి విశాఖపట్నం హాస్పటల్ లో మనకు శాశ్వతంగా దూరమయ్యారు.
80 వ దశకం తెలుగు పత్రికారంగంలో కడలి కెరటంలా ఉవ్వెత్తున లేచి అలజడి సృష్టించారు. బాపు తర్వాత పత్రికా రంగాన్ని సింగారించడానికి నేనున్నానులే పద మన్నాడు. వేలాది ఇలష్ట్రేషన్లు గీశారు, కార్టూన్లు పండించారు. అంతే కాదు కథా కవనం కూడా చేశారు.

వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. గత సంవత్సరమే అమెరికా లో జరిగిన ప్రమాదంలో కుమారుడు గోకుల్ కన్నుమూశారు. ఈ సంఘటన బాలి గారిని మరింత కృంగ తీసింది. తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన వేంటనే కుమార్తె వైశాలి రెండు రోజుల క్రితమే అమెరికా నుండి వైజాగ్ వచ్చారు.

మార్చి 26 నే చత్తీస్‌ ఘడ్‌ నుండి వెలువడే ‘కార్టూన్‌ వాచ్‌ ’ పత్రిక ఆయనను లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌ మెంట్‌ అవార్డు తో గౌరవించింది.
మా ఇద్దరిది పాతికేళ్ళ అనుబంధం…. బాలి గారికి నివాళి!
కళాసాగర్
________________________________________________________________________________

భోళా శంకరుడు – బాలి

బాలి చిత్రకారుడు, కార్టూనిస్టు. వీరు వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు మేడిసెట్టి శంకరరావు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరి పేరును బాలిగా మార్చారు. వీరి పుట్టింది ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో సెప్టెంబరు 29, 1941.

వ్యక్తిగత జీవితం……
బాలి తండ్రి మిలిటరీలో పని చేసేవారు. తన చిన్నతనంలోనే బాలి తన తండ్రిని కోల్పోయారు. తల్లి పెంపకంలో పెరిగి పెద్దయ్యి, తన తల్లి ముగ్గులు వేస్తూండగా గమనిస్తూ, చిత్రకళ మీద ఆసక్తిని పెంచుకున్నారు. చదువు అనకాపల్లిలోనే జరిగింది. చదువుకునే రోజులలో డ్రాయింగ్ క్లాసంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిత్రకళ మీద కలిగిన ఆసక్తితో సాధన చేశారు. వీరి వివాహం ధనలక్ష్మితో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె వైశాలి, కుమారుడు గోకుల్. ఈ మధ్యనే వీరి కుమారుడు అమెరికాలో అకాల మరణానికి గురైయ్యారు. వీరి భార్య ధనలక్ష్మి 30 ఏళ్ళ క్రితమే మరణించారు. బాలి ప్రస్తుతం ఒంటరిగా విశాఖపట్టణంలో నివాసం ఉంటున్నారు.

Cartoon Watch Life time achievement Award received

చిత్రకారునిగా జీవనం…..
వీరు మొదట్లో ఎం.శంకరరావు అన్న పేరుతో కార్టూన్లు వేసేవారు. ఆ రోజులలో (1970లలో) ఆంధ్రపత్రిక వారు ఔత్సాహిక కార్టూనిస్టులను ప్రొత్సహించటానికి పోటీలు పెట్టారు. వీరికి మూడువారాలు వరుసగా మొదటి బహుమతి వచ్చిందట. ఈ బహుమతులుతో వచ్చిన ధైర్యంతో, మరింత సాధన చేసి తన నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. బొమ్మలను మంచి సమతూకంతో వెయ్యటం అలవడింది. కొంతకాలం పి.డబ్ల్యు.డి. (Public Works Department)లో గుమాస్తాగా పనిచేసినా, చిత్రకళ మీద ఉన్న మక్కువతో 1974 లో ఈనాడు దినపత్రికలో కార్టూనిస్ట్ గా చేరి, రెండేళ్ళ తర్వాత 1976లో ఆంధ్రజ్యోతి స్టాప్ ఆర్టిస్ట్ గా చేరారు.”అమ్మే కావాలి” అన్న నవల చిన్న పిల్లల కోసం వ్రాసి, తానే బొమ్మలు వేసి, ఆంధ్రజ్యోతి వారపత్రికకు పంపారు. ఈ నవల, ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా ప్రచురించబడి పాఠకుల మన్నన పొందినది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరిని ఎంతగానో ప్రొత్సహించి కథలు వ్రాయించి, బొమ్మలు కూడా వేయించేవారు.
బాపు లాంటి చిత్రకారునికి సమకాలీనుడిగా రాణించి, ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రముఖ పత్రికలు, వార, మాస పత్రికలకి తన వేలాది చిత్రాల ద్వారా సేవలు అందించడం గర్వ కారణం.

అలుపెరుగని ప్రయాణం: ‘ఈనాడు’ లో కార్టూనిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆంధ్రజ్యోతి స్టాప్ ఆర్టిస్ట్ గా, తర్వాత విజయవాడలో ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా కొన్నాళ్ళు, అటుతర్వాత హైదరాబాద్ కలర్ చిప్స్ లో కొన్నేళ్ళు, చివరిగా విశాఖలో విశ్రాంత జీవితం ఇదీ వారి జీవన గమనం.
బాలి గారి ఆత్మకథను ‘చిత్రమైన జీవితం‘ పేరుతో ’64కళలు’ పత్రికలో 2012 నుండి 2013 వరకు సీరియల్ గా రాశారు. తర్వాతి రోజుల్లో ‘చిత్రమైన జీవితం’ పుస్తక రూపంలో వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘కళారత్న’ పురష్కారంతో పాటు ఎన్నో అవార్డులు వీరిని వరించాయి.

SA: