ఎంత ఎక్కువగా చదివి, ఎంత తక్కువగా రాస్తే అంత కొత్తగా ఉంటుంది రచన అని నా అభిప్రాయం. బాలి కథలు ఈ సూత్రానికి లోబడకున్నా జీవితంలో అతి తక్కువ కథలు రాసిన వాళ్ళల్లో అందునా మేలైన రచనలు చేసిన వాళ్ళల్లో ఒకడని మాత్రం చెప్పవచ్చు.
బాలి కథలు ఏ ‘ఇజాలు’ లేని ఏ సందేశాలు లేని ఏ వాదాలూ లేని అచ్చు తెలుగు కథలు. ఆయన తెలుగువాడు కావటం మన అదృష్టం. ఆయన చేత ఈ ముప్పై రెండు కథలు రాయించుకున్న తెలుగువాడి నేల గొప్పది. ఎనభై ఏళ్ళ జీవిత కాలంలో బాలి కథలు రాశిలో తక్కువైనా వాసిలో గొప్పవి. ఈ కథలకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదీ నవ్య వారపత్రిక సంపాదకుడు జగన్నాథశర్మ పోత్సాహపరిస్తే, దీపావళి ప్రత్యేక సంచికల కోసం రాసిన కథలు చాలానే ఉన్నాయి. దాంతోపాటు మరి కొంతమంది సంపాదకుల పుణ్యమూ ఈ కథల వెనక ఉంది. అంచేత ఇవి రాసిన కథలు కావు. సంపాదకులు రాయించుకున్న కథలు. బాలి కథలుగా మన ముందుకు వచ్చిన ఈ పుస్తకం వెనక ఉన్న రహస్య చరిత్ర ఇది. అంతేకాదు నవ మల్లెతీగ ప్రచురణల సంస్థ కూడా ఈ బాలి కథలు పుస్తకం మన ముందుకి తెచ్చిన ధైర్యం వెనక ఉన్న బాలిగారి ఔదార్యమూ మరోచరిత్ర. పరిచయం అక్కరలేని బాలి కథలు పరిచయం చేయాలన్న నా వ్యాసం వెనక ఉన్న సాహసమూ ఎవరూ పట్టించుకోవద్దు. ఎందుకంటే గొప్ప కథలని ఎవరూ చెప్పక్కర్లేదు. అయితే పుస్తకాలు చదవడం, కొనటం మరి తక్కువైపోతున్న ఈ సంక్షోభిత వాతావరణంలో కనీసం ఈ బాలి కథలు చదవడం ద్వారా తెలుగు పాఠకుడు కాస్తలో కాస్తగా స్వాంతన పడ్డాడని, జీవితం అంటే ఏమిటో తెలుసుకొని కొంతలో కొంతగా మెరుగు అవుతాడని నా భావన.
కథకుడిగా బాలిని, ఏ ముళ్ళపూడి వెంకటరమణతోనో, లేదా భానుమతి గారితోనో పోల్చకూడదు. అది చాలా తప్పు. బాలిని బాలి తోనే పోల్చాలి. చిత్రకారుడిగా తెలుగు వారి మనస్సులో చోటు చేసుకున్న బాపు గారి సరసన బాలి గార్ని చేర్చినవారు ఉన్నారు కానీ ఇక్కడ నేను కథకుడిగా బాలిని ఎవరితోనో పోల్చడానికి ఇష్టపడటం లేదు. అయితే మేడిశెట్టి శంకరరావు అనే పేరుని పురాణం సుబ్రహ్మణ్య శర్మ బాలిగా నామకరణం చేయడం జరిగాక; బాపు అనంతరం ఆంధ్రజ్యోతి మొదలు కొనిసాగించిన ప్రస్థానంలో వేలాది కథలకు, వందలాది సీరియళ్ళకు మరెన్నో వేలాది పుస్తకాలకు ముఖచిత్రాలు గీశారు. చిత్రకారుడిగా మూడు యాభైలకి సరిపడా కీర్తి సంపాదించుకున్నాడు. తెలుగుదనం ఉట్టిపడే బొమ్మలకి చిత్రకారుడిగానే కాదు కార్టూనిస్టుగానూ తన కుంచె స్టోక్ రిజిష్టర్ చేసుకున్నాడు.
బాలి బొమ్మ, కార్టూన్ ఇలా ఉంటుందని ఒక ముద్ర వేసుకున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ముఖ్యమైనది ఏమంటే కథకుడిగానూ బాలి ముద్ర ఆయన పాత్రల్లో కనిపిస్తుంది. అదీ కొట్టవచ్చినట్టుగా ఆయన పాత్రలు మనలో తిష్టవేస్తాయి.
బాలి కథల్లో పాత్రను ఒక బొమ్మ కట్టినట్టుగా చూయిస్తారు. ఇక ఆ కథ మనలో గూడు కట్టుకొని కూర్చోని మనల్ని సతాయించడం మొదలపెడ్తుంది. చాలా పాత్రలు ఏడిపిస్తాయి. మరికొన్ని పాత్రలు గతించిన కాలానికి దిష్టిబొమ్మలుగానో, దిష్టిచుక్కలుగానో నిలబడ్డాయి. దాదాపుగా 75 యేళ్ళ తెలుగు సమాజ స్థితిగతులని ఈ కథలు ఫోకస్ చేస్తాయి. నిజానికి బాలి కథలు సెటైరికలు, వ్యంగాస్త్రాలు. అంతే తప్ప హాస్యకథలుగా భావిస్తే మనది హ్రస్వ దృష్టి అవుతుంది. దాదాపు ప్రతి కథలోనూ మానవత్వం ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప సందేశాలు, సలహాలు తదితరాలతో విసిగించరు. ఈ హడావుడి ప్రపంచంలో ఎవరికి కావాలి. మన సందేశాలని బాలిగారు భావించడం మూలంగా కాబోలు కథ పాఠకుడ్ని తనలోకి ఇట్టే లాక్కుంటుంది. అదే విధంగా ఏ కథలోనూ మనకి అనవసర పరిసరాలు, వర్ణనలు, విశేషాలు ఉండవు. ప్రధాన పాత్ర చుట్టే ఫ్లాష్ బ్యాక్ లు లాంటి తెలుగు కథకుల బలహీనతలు బాలి ప్రదర్శించరు. అయితే బాల్య స్మృతులు ఆయనకి యిష్టమైన కథా వస్తువులు. ఇదే ఆయన కథాశిల్పం. భాష పట్ల, పాత్రల హావభావల పట్ల ఆయనకి చాలా మమకారం. అక్కడే పాత్ర జీవం పోసుకొనే విధంగా తీర్చి దిద్దుతారు. అయితే ఏ పాత్రకి ఆయన అనవసరంగా ప్రాధాన్యత ఇవ్వరు. జీవం పోసే వదిలేస్తారు. అంతే, ఆ పాత్రలు మనలో ప్రాణం పోసుకుంటాయి. చదివే క్రమంలో పాత్రల బలహీనతలు, లౌల్యాలు మనల్ని ఒకోచోట నవ్విస్తాయి. కొన్ని పాత్రలు ఏడిపిస్తాయి. నవరసాలూ ఆయన పాత్రలు ప్రదర్శింస్తుంటే చూసి మనం బాలిని ఏదో ఒకగాటన కట్టి, ఫలాన ముద్రవేసి ఇవి ఈ తరహా కథలు అని ఏ విమర్శకుడూ స్టాంప్ వేయలేదు. బహుశా బాలికి కూడా అలాంటి ముద్రలు, లేబుళ్ళూ నచ్చవని అనుకుంటాను. ఎన్నో సజీవ పాత్రలతో, సజీవ పరిసరాలతో, మన ముందు ఇట్టే నడిచిపోయిన వ్యక్తుల కాలాల బతుకు ముద్రలని ఇట్టే పసిగట్టి – యిదిగో వీళ్ళు ఎలా ఆ కావడి కష్టాలు మోస్తా నోట్లో గుడ్డలు కుక్కుకొని, కిరోసిన్లు పోసుకొని మరణించారని, ఆయన కథలు చెప్తుంటే ఈ బీభత్సరస దృశ్యాలని ఎలా త్రోసిరాజనగలం? ఒకో కథ చడవడం ద్వారా మనలోని మానవత్వం ఎగబాకడమో లేదా కుప్పకూలడమో చూస్తాము. ఒకోసారి కన్నీళ్ళూ, ఒకోసారి నిద్దేశ్యతతో మ్రాన్పడి పోతాము. కొన్ని పాత్రలు మన పక్క ఇంట్లోనో, లేదూ వీధుల్లోనో నిత్యం తారసపడున్నట్లుగా ఒప్పుకుంటాము.
బాలివి ప్రేమకథలు కాదు. మనిషిని ప్రేమించే కథలు. అంతే తప్ప డొంకతిరుగుడు ఏ మాత్రం లేని కథలు. నేరుగా, సూటిగా వుంటాయి. ఒకోసారి నాజూకుగా, బాలి బొమ్మల్లానే తలలెత్తుకొని ఉంటాయి. ముందు మాట రాసిన మధురాంతకం నరేంద్ర రాసినట్లుగా “నోట్లో నాలుక లేని కుర్ర గుమాస్తాలూ, పెళ్ళయ్యాక భార్యల గొంతు నొక్కేసే యాంత్రిక భర్తలూ తాతగారి యవ్వనపు తిరుగుళ్ళను సంబరంగా చెప్పుకొనే మనవళ్ళు చెప్పుకొనే (అద్దం కథ) వైభవాలూ, అసమర్ధులైన భర్తని భరించే ఆరిందా గృహిణుల గురించి చెప్పే (సై… కిల్ కథ) వ్యథార్థ కథ, బతకడం తప్ప మరే విలువా తెలియని రైల్వే స్టేషన్ బిచ్చగాళ్ళ జీవితాల్ని వర్ణించిన “చిలకపచ్చ చీరకథ” ఈ క్షణాన నన్ను నిలదీస్తున్నాయి. అదో కరుణరసాత్మక కథ. గ్రహశాంతి కోసం తప్ప మరెప్పుడూ తోటి మానవులకి సహాయం చెయ్యలేని బడుగు జీవుల గురించి రాసిన మేలు చేసిన కీడు కథ గానీ, నీడనిచ్చి ప్రేమనిచ్చిన బావగారితో బిడ్డను గొప్పని నమ్మే మరదలు తారసపడే సూరిబాబు గారు కథ గాని మనల్ని నిశ్చేష్టులని చేస్తాయి. తెలుగు సమాజ దుస్థితిని చెప్పే కాళ్ళు కడితే సీన్ తో ప్రారంభమయిన సూరిబాబుగారు కథ ఓ పెద్ద జీవితాన్ని చిన్న కథలో చెప్తారు బాలి. “కనకరాజు మేడ కథ” లో ఈ నిర్వచనం చెప్పే డైలాగ్ వినండి. “కనకరాజేం తెలివి తక్కువోడు కాదు. భుజాల మీద చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు అంటే ప్రేమ వలకపోసికాదు. వేలితో జంథ్యం పోగు వెతికే రకం. ఇంటి పేరు అడిగేడూ, అంటే మరికొంత అనుమానం తీర్చుకోవడమన్నమాట”. “ఇలా ప్రపంచాన్నే చుట్టేసిన వ్యక్తుల్లాంటి కథలు నిండార దర్శన మిస్తాయి. కనకరాజు మేడ కథ లాంటి గొప్ప చరిత్ర చాటున వున్న జాగ్రత్తలు పాటించే కనకదుర్గలూ మనకి కనిపిస్తారు. స్టేషన్ వైపుకి ఎందుకు తొంగి చూడకూడదో తెలియని దేవసేనకి కాదు, మనకూ ఆ వూరి చరిత్ర యిట్టే తెలిసిపోతుంది. ఇవ్వన్నీ స్థలపురాణ గాథలు. బాలి ఊరు పేరు చెప్పకుండానే ఓ గొప్ప క్రానికల్ గా కనకరాజు మేడ కథ తీర్చిదిద్దారు. స్థలపురాణాల్లో ప్రేమలూ లేచిపోవటాలే కాదు గోప్పోరి గోత్రాలూ ప్రజలు చెప్పుకుంటారు.
బాలి కథలు మనల్ని వెంటాడినట్టే ఆయన పాత్రలూ వెంటాడుతాయి. అమ్మన్న సిస్టర్స్ కథని ఒకరకంగా బాలి జ్ఞాపకాలు రికార్డ్ చేసిన కథగా కనిపిస్తుంది. బ్రహ్మణ వితంతు స్త్రీల చుట్టూతా తిరిగిన ఈ కథలోని ఇద్దరు స్త్రీలు మనకి ఒక ప్రహసనంగా దర్శనమిస్తారు. బాలికి ఈ కథంటే బాగా ఇష్టమని నేను గ్రహించాను. మంచి జీవం ఉన్న గాథ ఇది. యాభైయేళ్ళ నాటి స్త్రీల జీవితం ఈ కథ పట్టుకుంది ఒక బాల్య మురిపెంగా నిలబడుంది!
బాలి కథలు అన్నీ ఒక ఎత్తు అయితే వారి 58 పేజీల పెద్ద కథ “అప్పికట్ల వారి వీధి” మరో ఎత్తు. చౌడవరం ఊళ్ళోని ఒక వీధిలోని మనుషులందర్నీ పాత్రలుగా తీర్చిదిద్ది వారి హావభావాలని చిత్రీకరించిన ఉదాత్తమైన కథ. ఇటువంటి కథకి సరిసమానంగా తెలుగులో మరో కథ వచ్చిందని నేను అనుకోను. ముళ్ళపూడి వారి “జనతా ఎక్స్ ప్రెస్” అనే పెద్ద కథ ఉందట. ఆ కథని నేను చదవలేదు.
కాని అప్పికట్ల వారి వీధిలోని సజీవ పాత్రలు; ఆ జీవితాల చుట్టూతా తిరిగిన వారి బాధలు, మనకి ఆహ్లాదాన్ని, వినోదాన్ని, విషాదాన్నీ, బీభత్సాన్నీ సమపాళ్ళల్లో నేరుగా గుండెల్లోకి ఒంపుతాయి. ఒక విధంగా ఇది చౌడవరం ఊరి కథగా కూడా మనకి రచయిత కొన్ని లొకేషన్స్ పరిచయం చేస్తాడు. ఒకే కథలో అనేకుల జీవితాల్లోకి మనం తొంగి చూస్తాము. లలితమ్మ, జగ్గారావు, చిన్నారావు కళ్యాణి, రమణమ్మ ఒక జట్టుగా అక్కడక్కడ కలుస్తారు. అదో ప్రేమమయ విషాద ప్రహసనం; వరదరాజులు, వెంకాయమ్మ, మనమడు మంగపతి, గున్నమ్మల జట్టు ఇదొక ప్రహసనం. వెరసి బాలి ‘అప్పికట్ల వారి వీధి’ కథ నవరసాలు గుభాళింపు చేసిన ఉదాత్త కథ.
ఎనభై ఏళ్ళు దాటి నాక కూడా వారిలోని కథన చతురత మరింత పెరుగుతున్నదని ఈ కథలన్నీ నిరూపిస్తున్నాయి. మంచివి, గొప్పవి, మహా గొప్పవి అయిన కథలు “బాలి కథలు” పుస్తకం. వారి రాబోయే పుట్టిన రోజుకి కానుకగా వెలువరించిన కలిమిశ్రీని అభినందిస్తూ… బాలి నుండి మన తెలుగు సాహిత్యం మరిన్ని కథలు ఆశిస్తున్నదనే భరోసాతో.
– సాగర్ శ్రీరామకవచం, (98854 73934)
బాలికథలు వెల : 320/-
ప్రతులకు :
నవమల్లెతీగ, 92464 15150