తనయుడి తోడ్పాటుతో చిత్రకారుడిగా రాణిస్తున్న బాపూజీ

దృశ్య కళారూపాలలో చిత్రకళ ఒక విశిష్టమైన కళ. విశిష్టమైన ఈ కళలో మరలా ఎన్నో రకాలు, రేఖా చిత్రణ , నిశ్చల చిత్రణ, వ్యంగ్య చిత్రణ, ప్రకృతి చిత్రణ, భావ రహిత మరియు భావసహిత చిత్రణ, రూప చిత్రణ, నైరూప చిత్రణ, ఇలా ఎన్నో రకాలు. వీటిల్లో రూప చిత్రకళ అనునది నిజంగానే చాలా క్లిష్టతరమైన ప్రక్రియ అని చెప్పవచ్చు . కారణం దీనిలో మిగిలిన ప్రక్రియల్లో వున్నటువంటి స్వేచ్చ రూప చిత్రణలో వుండదు. ఎందుకంటె ఈ ప్రక్రియలో సృజనాత్మకత కంటే సహజత్వం ప్రధానంగా కావాలి. లేకుంటే సామాన్య ప్రేక్షకుడు సైతం ఇట్టే ఆ చిత్రాన్ని గుర్తు పట్టి విమర్శించదానికి ఆస్కారం వుంటుంది. అలాంటి విశిష్టమైన చిత్రకళలో వందలాది చిత్రాలు వేసి ప్రసిద్ది గాంచిన కళాకారులలో బత్తుల బాపూజీ గారొకరు.

అందుచేతనే… బాపూజీ గారిని తలచు కుంటే ఎవ్వరికైనా వెంటనే మనకు గుర్తుకు వస్తాయి వారు చిత్రించిన వివిధ వ్యక్తుల రూప చిత్రాలు. వాటిలో దేశ విదేశాలలో ప్రసిద్ది గాంచిన రాజకీయ నాయకులు, దేశ అధ్యక్షులు, ప్రధానులు , కళాకారులు, క్రీడాకారులు, చిత్రకారులు, సాంకేతిక నిపుణులు, డాక్టర్లు ఇంకా తనకు ఇష్టమైన మిత్రుల రూపాలు ఇలా వివిధ రకాలుగా ప్రసిద్ధి చెందిన ఎందరో వ్యక్తుల రూప చిత్రాలు మనకు గుర్తుకు వస్తాయి. వారి పేస్ బుక్ ను గనుక మనం తెరచి చూసినట్లయితే అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక ఆన్ లైన్ పోటీలలో ఈ రూప చిత్రాల విభాగంలో ఎన్నో అవార్డులు సాధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే సృజనాత్మకతకు కొంత తక్కువ అవకాశమున్న రూపచిత్రాలతో కొంత విసుపొ, వైరాగ్యమో గాని ఆయన ఇటీవల తన కుంచె కొత్త కోణం వైపు త్రిపినట్టుగా కనిపిస్తుంది.

artist Bapuji Bathula

ఇటీవల ఒక సిరీస్ గా వేస్తున్న వారి చిత్రాలు గతంలోలా రూప చిత్రాలు గాకుండా ఇద్దరు ముగ్గురి కలయికతో ఒక విషయాన్నీ వ్యక్తం చేసే ప్రయత్నం వారి చిత్రాల్లో మనకు కనిపిస్తుంది. వాటిల్లో నేటి యాంత్రిక యుగంలోని రణగొణ ద్వనులమధ్య స్వార్ధపూరితంగా కుట్ర కుతంత్రాలతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ, స్వచ్చతను కోల్పోయిన నేటి సమాజంలోని వ్యక్తులు గాకుండా, సాంకేతికతకు బహుదూరమైన కల్తీ లేని అలనాటి స్వచ్చమైన మనుషులు, వారి జీవన విదానం కనిపిస్తుందిఆధునిక పరిజ్ఞానం అందుబాటులోలేని నాటి కాలంలో వ్యక్తులు,కుటుంభాలు, సమాజం అంతా కూడా ప్రకృతితో మమేకమై వుండడంచేత లోకంలో మనుషుల మధ్య ఒక విదమైన ప్రశాంతతో కూడిన వాతావరణం వుండేది. అందని దానికోసం అర్రులు చాచకుండా వ్యక్తులందరూ కూడా తన చుట్టూ వుండే ప్రకృతి , సమాజం తనకిచ్చిన సౌకర్యాలతో నచ్చిన పనిలోనే ఆనందం వెతుక్కుంటూ హాయిగా జీవితం గడిపేవారు . అందుచేతనే అలనాటి జీవన విధానంలో ఒక విదమైన ప్రశాంతత మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం బాపూజీ గారు వేస్తున్న చిత్రాలు కూడా మనకు అలాంటి అనుభూతినే కలిగిస్తాయి. వీటిల్లో అందమైన కట్టు బొట్టు ఆచారాలతో కనిపించే అలనాటి పల్లె జనాలు, చక్కటి అనుభందతో వుండే కుటుంభాలు, గ్రామీణ వృత్తుల వాళ్ళు. స్వచ్చమైన , ప్రేమికులు, బావా మరదళ్ళు కుమ్మరి, కమ్మరి చాకలి, తదితర వృత్తి పని వాళ్ళు, ప్రేమా ఆప్యాయతలు కలబోసిన కుటుంభాలు అలనాటి వారి వ్యవహార శైలిలో వేసిన ఈ చిత్రాలలో ఒక కవితాత్మక ధోరణి మనకి కనిపిస్తుంది. వాటిలో కుండలు చేసే కుమ్మరినైన, బట్టలు వుతికే రజక కుటుంభ మైన, ఎంకి నాయుడు బావలులాంటి ఆదర్శ దంపతులను చిత్రించినా అన్నింటా కూడా ఒక లయాత్మక సౌందర్యం మనకు కనిపిస్తుంది .

Writer Ventapalli with Bapuji

ఒక వృత్తి పరమైన చిత్రకారుని కంటే ఎక్కువగా ఎక్కువగా చిత్రాలు వేసిన వీరు చిత్రకళను అరవై ఏళ్ళు నిండిన తర్వాత అనగా కేంద్రప్రభుత్వ సర్వీసులో పెద్ద భాద్యతాయుతమైన ఎడిషనల్ సెక్రెటరి స్థాయిలో 2006లో పదవీ విరమణ చేసిన రెండేళ్లకు అనగా 2008 నుండి జన్మతహా తనలో వున్న చిత్రకళా ఆశక్తిని వెలికి తీయడం ప్రారంబించారు అంటే ఎవరూ నమ్మలేము. దానికి ఉద్యోగ రీత్యా అమెరికాలో వుంటున్న తన పెద్ద కుమారుడైన నూతన్ కుమార్ తన తండ్రి యొక్క ఆశక్తిని గమనించి తనకు కావాల్సిన కాన్వాస్లు, రంగులు, బ్రస్షులు అన్ని కూడా అత్యున్నత ఆర్ట్ మెటీరియల్ విన్సర్ అండ్ న్యూటన్ కంపెనీకి చెందినవి పంపిస్తూ ప్రోత్సహించడం గొప్ప విశేషం. నేను వీరిని ఇంటర్వ్యూ చేయడంలో బాగంగా వారి ఇంటిని దర్శించినపుడు వారి ఇంట్లో వున్నఆర్ట్ మెటీరియల్ ని ఆశ్చర్యపోవడం నా వంతయింది.

సాధారణంగా పిల్లల్లో వున్న ఆసక్తులను వెలికి తీసేందుకు పెద్దలు ప్రోత్సహించడం మనం చూస్తాము, కాని ఇక్కడ తన కుమారుడే తండ్రిని చిత్రకళలో ప్రోత్సహిస్తూ ఒక మంచి రూప చిత్రకారుడిగా గుర్తింప బడేలా చేయడం గొప్ప విషయం. అందుకు వారి కుమారుడైన నూతన్ కుమార్ ని ద్వారా అందివచ్చిన అవకాసాన్ని వినియోగించుకుని మంచి చిత్రకారుడిగా నిరూపించుకుంటు నేడు 76వ జన్మ దినం జరుపుకుంటున్న బత్తుల బాపూజీ గారిని కూడా అభినందించకుండా వుండలేము.

artist Bapuji Bathula, Hyderabad
Portraits by Bapuji Bathula
                                                                                         వెంటపల్లి సత్యనారాయణ
(9491378313)
SA:

View Comments (3)

  • మిత్రులు.. శ్రీ బాపూజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ... ఇంతటి చక్కని వ్యాసాన్ని అందించిన మిత్రులు వెంటపల్లి గారికి అభినందానాలతో...

    అంజి ఆకొండి
    కాట్రేనికోన

  • చిత్రకారుడు శ్రీ బాపూజీ గారి చిత్రాలు ఎంతో బాగున్నాయి. కళకు వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించారు. స్ఫూర్తి గా నిలిచారు. ఇలాంటి ఆర్టికల్ వ్రాసిన శ్రీ వెంటపల్లి గార్కి, సంపాదకులైన మీకు ధన్యవాదములు. 🙏బొమ్మన్