నేనూ – చంద్రగారూ! – కిరణ్ ప్రభ

ప్రముఖ కవి, కౌముది వెబ్ పత్రిక సంపాదకులు కిరణ్ ప్రభ గారు 2016 లో చంద్ర 70 వ జన్మదిన ప్రత్యేక సంచికకు రాసిన వ్యాసం)

Art by Chandra

బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివే రోజుల్లో యువ, జ్యోతి మాసపత్రికల్లోనూ, పత్రిక, ప్రభ వారపత్రికల్లోనూ విరివిగా వచ్చిన చంద్ర బొమ్మలు నన్ను విపరీతంగా ఆకట్టుకునేవి. వాటిల్లో చాలా బొమ్మల్ని కార్బన్ పేపర్ ఉపయోగించి కాపీ చేసి వాటికి కవితలు రాయడం అప్పట్లో నాకో గొప్ప హాబీగా వుండేది.

ఉద్యోగరీత్యా హైదరాబాదుకి మకాం మార్చాక ఈ ఆర్టిస్ట్ చంద్రగారు ఎక్కడ వుంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువైంది. కాకతాళీయంగా నూతన్ ప్రసాద్ గారు నిర్మించిన ‘ఓ అమ్మ కథ‘ షూటింగ్ సమయంలో చంద్రగారిని కలుసుకోవడం నాకింకా నిన్నా మొన్నటిలా గుర్తుంది. (ఆ చిత్రానికి చంద్రగారు కళాదర్శకుడిగా పనిచేశారు.) మొట్టమొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు ‘మీ బొమల్ని కాపీ చేసి, వాటికి కవితలు రాయడం నా హాబీ’ అని చెప్పినప్పుడు ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు.
తరువాత 1984 ప్రాంతాల్లో మిత్రుడు సుబ్బారావు ద్వారా చంద్రగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడే ఆయన ఏదో నవలకి ముఖచిత్రం వేస్తున్నారు. బాగ్ లింగంపల్లిలోని వారి ఫ్లాట్ లో రాత్రి పదింటి తరువాత వెచ్చటి టీ తాగుతూ ఆయనతో కబుర్లు చెప్పడంతో మా పరిచయం మరింత బలపడింది.

ఆ తరువాత నేను’పల్లకి’లో విరివిగా కవితలు రాస్తున్న సమయంలో తరచూ పంజాగుట్టలోని పల్లకి ఆఫీసులో ఇద్దరం కలుసుకుంటుండేవాళ్ళం. ఆ రోజుల్లోనే ఆయన ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగంలో జాయిన్ అవడం నాకు తెలుసు. సాయంకాలం అవగానే నేను ఇ.సి.ఐ.ఎల్ నుంచీ పల్లకి ఆఫీసుకి వెళ్ళేవాడిని. అదే సమయానికి కొందరు రచయితలతో పాటు చంద్ర… అందరం ఎడిటర్స్ ఆఫీసులో కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కేవలం బొమ్మలు వేయడమేగాక అనేక రంగాల్లో ఆయనకి గల ప్రవేశం వల్ల ఆయనతో మాట్లాడ్డం గొప్ప అనుభవం. పల్లకి మూతబడ్డాక ఒకటి రెండుసార్లు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కలుసుకున్నప్పుడు, చాలా రోజులైంది కదా అని నన్ను నేను పరిచయం చేసుకుంటే పక్కనున్న వారికి, “ఈయన పేరు కిరణ్ ప్రభ అటండీ… నాకు పరిచయం చేసుకుంటున్నాడు” అని చనువుగా, వ్యంగ్యంగా వ్యాఖ్యానించేవారు…!


దాదాపు పదిహేనేళ్ళ తరువాత హఠాత్తుగా గత సంవత్సరం టెక్సాస్ నుంచీ ఫోన్… “కిరణ్ బావున్నావా?” అంటూ… ఎక్కడో విన్న స్వరం.. “గుర్తుపట్టావా గురువా?” అనగానే ఐదు సెకన్లలో “చంద్రగారూ బావున్నారా?” అనడం, ఇన్నేళ్ళ తరవాత కూడా నేను ఆయన కంఠస్వరాన్ని గుర్తుపట్టడం గమనించిన చంద్రగారి మాటల్లో ఆనందాన్ని ఇప్పటికీ మరిచిపోలేను. ఒకసారి మా ‘సుజనరంజని‘ ప్రత్యేక సంచికకి ముఖచిత్రాన్ని కూడా ఆయనే వేసి ఇచ్చారు. తుపాను హెచ్చరికతో వాళ్ళ అబ్బాయి వూరు నుంచి వాళ్ళ అమ్మాయి వుండే వూరికి వెళ్ళి, జ్వరం బారిన పడి కూడా, అనారోగ్యాన్ని లెక్కచేయక ముఖచిత్రం పూర్తి చేసి ఫ్యాక్స్ లో పంపించి, మళ్ళీ వెంటనే ఫోన్ చేసి అది అందిందని తెలుసుకునేదాకా ఆయన నిద్రపోలేదు.

తరువాత పదిహేను రోజులకి “సిలికానాంధ్ర” నిర్వహించిన ‘ఆంధ్ర సాంస్కృతికోత్సవ’ ఏడుకల్లో పాల్గొనడానికి ఆయన టెక్సాస్ నుంచీ కాలిఫోర్నియా మా యింటికి వచ్చారు. ఆంధ్ర సాంస్కృతికోత్సవం ముగిశాక ఇద్దరం కలిసి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాం. ప్రతి చిన్న దృశ్యాన్ని ఫోటో తీసుకుని, అన్నింటినీ ఆశ్చర్యంతో ఆస్వాదించిన చంద్రగారిని చూస్తుంటే ఆయన ప్రముఖ చిత్రకారుడు అనే విషయం కంటే పసితనం ఛాయలు విడని అమాయక బాల్యమే ఆయనలో ఎక్కువ కనిపించింది. ఒకప్పుడు ఎవరి బొమ్మల్ని కాపీ చేసి వాటికి కవితలు రాసేవాడినో ఆయనే మా ఇంటికి అతిథిగా రావడం, మంచి స్నేహితుడవడం… ఒక గొప్ప అనుభవం….

  • కిరణ్ ప్రభ
    (చంద్ర వంక పుస్తకం నుండి)

1 thought on “నేనూ – చంద్రగారూ! – కిరణ్ ప్రభ

  1. శ్రీ కిరణ్ ప్రభ గారి భావకవితలు ఎంతో ఇష్టంగా చదివే దాన్ని. ఇప్పుడు చంద్ర గారి గురించి రాసిన వ్యాసం చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు తెలియకుండానే వచ్చాయి .. ఎందుకంటే మీరన్నట్లు చంద్ర గారు పసితనం వీడని అమాయక బాలుడే ఎప్పటికీ.
    చిన్నపిల్లలతో చిన్నపిల్లవాడిలా, పెద్ద వాళ్ళతో పెద్దవారిలా కలిసిపోయి అందర్నీ ఆ ప్రియమైన చూపుతో చక్కని నవ్వుతో అందరికీ స్నేహితులైపోయేవారు. అంత చక్కని మనిషిని మళ్ళీ చూస్తాను అని నేను అనుకోవట్లేదు. ఆయన బొమ్మ ఎంత గొప్పదో అని గీతెంత రమ్యమైనదో ఆయన మనసు అటువంటిదే.

    మా ఇంటిలో యువ, స్వాతి, జ్యోతి వంటి అన్నీ పత్రికలూ ఉండడంతో వారి చిత్రాలెన్నెన్నో నేను డిగ్రీ చదివే రోజుల్లో చూసేదాన్ని. బొమ్మల కోసం కథ చదవాలనిపించేది.. కథల కంటే బొమ్మలే గుర్తుండేవి. 1995 లో అనుకుంటున్నా.. నేను Rajahmundry నుండి youth art festival కు వెళ్లాను. అప్పుడు అక్కడికి చంద్ర గారు ఒక రోజు వచ్చారు. నిజంగా ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేము. నాతో పాటు మా బంధువుల పిల్లలు కూడా వచ్చారు. మేము ముగ్గురు ఇంచుమించు ఆయన చేయి పట్టుకుని తిరిగినట్లుగా తిరిగాం ఆయన వెంట.
    వదల్లేకపోయాం. ఏదో ఇంగ్లీష్ కథలో ఫ్లూట్ వాయిస్తూ పిల్లలను వెంట తీసుకుపోయినట్లు చంద్ర గారు ఏమీ వాయించకుండానే వెంట
    తీసుకుపోయే ఆకర్షణ వారిలో ఏదో ఉంది. ఆయన కూడా ఎంతో ఆప్యాయంగా మా అందరితో చాలా స్నేహంగా మాట్లాడారు. ఆ ఆదరణకి అసలు మేము ఎంత మురిసిపోయామో .. అంత గొప్ప చిత్రకారులు ఇంత సామాన్యంగా, దగ్గర వారిగా మసులుకోవడం చూసి ఆశ్చర్యం కంటే మహా ఆనందపడ్డాం. ఆయన వెళ్తుంటే విడిచిపెట్టలేకపోయాము .కూడా చాలా దూరం వెళ్ళాము. వారు ఇక వెళ్ళండమ్మా అని మమ్మల్ని వదిలించుకుని వెళ్లారు.

    తరువాత 2003లో అనుకుంటున్నాను రాజమండ్రి చిత్రకళా నికేతన్ ఫంక్షన్కు వారు ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు ఇంకా మరి కొందరు చిత్రకారులు కూడా వచ్చారు. అక్కడ ఫంక్షన్ హాల్లో అప్పటికప్పుడు కొందరి పోర్ట్రైట్స్ లైన్స్ లో గీస్తుంటే చూస్తున్న మా అందరికీ ఏదో అద్భుతమైన మాయ జరుగుతుంది ఇక్కడ.. అనిపించింది. ఎదుటి వాళ్ళు ఈ పేపర్లోకి వచ్చి నవ్వుతున్నట్లుగా ఉన్నారు. అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంబరపడ్డారు. ఒక చిన్న పాప బొమ్మ వేసి ఇచ్చి ..”.ఇష్టంగా “- చంద్ర అని సంతకం చేసి ఇచ్చారు. ఆ పాప తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఇప్పుడు ఆ పాప ఎంత మురిసి పోతూ ఉంటుందో అది చూసుకుని.
    మా తాతగారు వరహాగిరి వెంకట భగీరధి గారు ప్రముఖ ప్రకృతి చిత్రకారులు కావడంతో వారి చిత్రాలు చూడడానికి, ఆరోజు మా ఇంటిలోనే భోజన ఏర్పాట్లు జరగడంతో అతిథి చిత్రకారులంతా మా ఇంటికి వచ్చారు.
    మా తాతయ్య గారి చిత్రాలు వచ్చిన ప్రముఖ చిత్రకారులందరూ చూసి సంతోషించారు. నేను కూడా చిత్రాలు వేయడం చూసి అందరూ సంతోషించారు. నా చిత్రాలను కూడా భగీరధి గారి చిత్రాలలాగే ఆసక్తి తో చూసిన చంద్ర గారిని అభిప్రాయం చెప్పమని అడిగితే కన్నులు నెమ్మదిగా మూసి తెరచి, తలను ఓ పక్కకు వంచి చక్కగా నవ్వారు.

    చంద్ర గారి పేరు వింటేనే మనసు పరవశిస్తుంది. పేరుకి తగ్గట్టు చంద్రుడి లాగే కళ్ళ నుండే వెన్నెల కురిపించేవారు.
    పరిచయమైన అందరికీ కూడా నచ్చే మనిషి ఎవరైనా ఉంటారా అంటే అది చంద్ర గారే.
    వారి జ్ఞాపకాలు చెరగనివి. తలచుకోగానే మనసులో పున్నమి ఉదయిస్తుంది. కానీ ఈనాటి అమావాస్యకు అదే మనసు క్షోభిస్తూనే ఉంటుంది.
    — ఎన్.వి.పి.ఎస్.ఎస్.లక్ష్మి( పద్మ)
    రాజమహేంద్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap