చంద్రంటే తెలీని తెలుగోడిని కనుక్కోవడం కష్టం. కొందరికి ఆయన బొమ్మలంటే ఇష్టం ! కొందరికి ఆయన కార్టూన్లంటే ఇష్టం ! కొందరికి ఆయన రాసిన కథలంటే ఇష్టం ! మరికొందరికి ఆయన నటించిన సినిమాలంటే ఇష్టం ! ఇలా గత ఐదు దశాబ్దాలుగా అన్ని విధాలుగా తెలుగు వారికి దగ్గరయిన పేరు చంద్ర. తన 74 వ యేట 29-04-2021 గురువారం తెల్లవారు జామున మనల్ని వదిలి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ప్రముఖ కథారచయిత ఎమ్బీయస్ ప్రసాద్ గారు రాసుకొన్న చంద్ర గారి జ్ఞాపకాలు… మీ కోసం…!
‘చంద్ర’లో చాలా విద్యలున్నా చిత్రకారుడిగా ఎక్కువ ప్రసిద్ధుడు. ఆయన చిత్రకళా నైపుణ్యం గురించి వ్యాఖ్యానించే కౌశలం నాకు లేదు. బొమ్మలు చూసి ఆనందించేవాడిగా చెప్పాలంటే – ఆయన బొమ్మలు నాకు బాగా నచ్చుతాయి. నా కథల్లో చాలా వాటికి ఆయన వేశాడు. సాంప్రదాయక చిత్రాల దగ్గర్నుంచి అత్యంత ఆధునిక చిత్రాల దాకా అన్ని రకాలూ వేయగలడు. ఆ ఆధునికాల్లో కొన్ని బోధపడతాయి, కొన్ని… పడవు. కథకు ఇలస్ట్రేషన్ వేసినప్పుడు కూడా వ్యక్తుల హావభావాలతో బాటు చుట్టూ ఆకులు, కాయలు, పిందెలు, లతలు ఏవేవో వేసి అలంకరిస్తారు. వాటిల్లో చాలా గూఢార్థాలు వుంటాయని దృష్టి కలవారు అంటూంటారు. అదో ‘డావిన్చీ కోడ్’. ఆయన కార్టూన్లు కూడా కొన్ని అర్థమవుతాయి, మరికొన్ని ఫారిన్ కార్టూన్లలా తోచి బుర్ర వేడెక్కిస్తాయి. దీనికి కారణమేమిటంటే చంద్ర మన మధ్య వుంటూ మామూలు వ్యక్తిలా నటిస్తూనే దేశ విదేశాల కళా రూపాలన్నీ అధ్యయనం చేసేస్తూంటారు, అవి మనకు పరిచయం చేద్దామని తాపత్రయ పడతారు. మనమింకా ఆ స్థాయికి ఎదగకపోవడం చేత తికమక పడతాం. ముందే చెప్పానుగా, నాకు ఆయన బొమ్మల గురించి వ్యాఖ్యానించడం రాదని. ‘ఆయన జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడు. మన మధ్య పుట్టడం ఆయన దురదృష్టం, మన అదృష్టం. ఆయన శైలిలో మరొకరి శైలి దాగుంది.
ఇద్దరు ముగ్గుర్ని కలిపి రుబ్బితే చంద్ర తయారవుతాడు’ యిలాంటి పరిశీలనలు చేయడం నా వల్ల కాదు. అందువలన రెండు దశాబ్దాల స్నేహాన్ని పురస్కరించుకుని వ్యక్తిగత విషయాలు రాస్తాను. చంద్రలో కొట్టవచ్చేట్టు కనబడే లక్షణం – స్నేహం. అతి సులభంగా అల్లుకుపోగలడు. అవతలివాడు పరిచయస్తుడా కాదా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, గొప్పా, బీదా, ఔత్సాహికుడా, సీనియరా, ప్రఖ్యాతుడా, అనామకుడా, వాడితో అవసరం యిప్పుడుందా, రేపు పడుతుందా లాంటి లెక్కలేమీ వేసుకోడు. ఎవరైనా మంచి కథ రాసినా, బొమ్మ వేసినా, సినిమా తీసినా, మరో మంచి పని చేసినా వెళ్లి పరిచయం చేసుకుని అభినందించి, ప్రోత్సహించే రకం.
నేను రాసిన ‘పొగబోతు భార్య’ హాస్యకథా సంకలనం అంకితం యిస్తూ రాసిన వాక్యాలివి – “ఈ పుస్తకాన్ని ప్రముఖ చిత్రకారులు, కథకులు, బహుముఖ ప్రజ్ఞావంతులు చంద్రగారికి అంకితం యిస్తున్నాను. నేను 1996లో ‘రచన’, ‘ఆంధ్రజ్యోతి వీక్లీ’లలో కథలు రాసేటప్పుడు సంపాదకులు చంద్రగారిచేత బొమ్మలు వేయించేవారు. ఆ విధంగా వారితో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. నా కథలను ఆయన మెచ్చుకోవడంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందుకంటే వృత్తిరీత్యా ఆయన రోజుకి 10, 15 కథలు చదువుతారు. ఆయన నా కథలను మెచ్చారంటే వాటిలో ఎంతో కొంత విషయం వుండే ఉంటుంది అనిపించింది నాకు. తత్ఫలితమే 1996 నుండి నేను విస్తారంగా రాయడం! పైగా చంద్రగారు నన్ను అందరి వద్దకూ తీసుకెళ్లి పరిచయం చేసి నన్ను ‘ప్రొజెక్టు’ చేసేవారు. సంపాదకులకు సిఫార్సు చేసేవారు. మరిన్ని కథలు రాయమని యిప్పటికీ నన్ను ప్రోత్సహిస్తారు. అదీ ఈ అంకితానికి కారణం!” అని.
నేను అక్షర రూపం యిచ్చిన భావాలు చాలామంది రచయితల్లో, చిత్రకారుల మనసుల్లో వున్నవే. ఆయనకు అక్కరలేని విషయం లేదు, అక్కరలేని మనిషి లేడు. పుస్తకాలు, బొమ్మలు, సినిమాలు, కథలు, క్రికెట్, ప్రజా ఉద్యమాలు… యిలా ఏదీ వదలడు. అలాగే ఎవర్నీ వదలడు. ఫోన్ చేస్తే గంటల తరబడి మాట్లాడగలడు. వ్యక్తిగతమైన స్నేహాలకు చాలా విలువనిచ్చి, యింటికి వస్తూ పోతూ వుంటాడు. ఈయనకింత టైము ఎలా వుంటుందాన్న ఆశ్చర్యం వేస్తూంటుంది. ఈ టైములో నాలుగు బొమ్మలు వేసుకుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు కదాన్న ఆ ఎందుకు రాదన్న చింతా కలుగుతుంది.
బొమ్మలు వేయడమంటే గుర్తుకు వచ్చింది. చంద్ర గొప్ప అరాచకవాది, రాజ్యమూ ఆయనదే, తిరుగుబాటూ ఆయనదే అని అందరూ అంటారు. ఆయన్ను చూడగానే ‘మెథడ్ యిన్ మ్యాడ్ నెస్’ అందామా, ‘మ్యాడ్నెస్ యిన్ మెథడ్’ అందామా అని సందేహంలో పడుతూ వుంటాను. రమణగారు అప్పారావు గురించి రాశారు – ‘అప్పారావు ఒక మనిషితో పది నిమిషాల పాటు మాటాడి కూడా దమ్మిడీ అప్పు అడక్కుండా వెళ్లిపోయి యెదటివాణ్ని చితక్కొట్టేసిన సందర్భాలున్నట్టు చరిత్రలో దాఖలాలున్నాయి. పది నిమిషాలూ మాటాడి కేవలం ఒక్క దమ్మిడీయే అప్పుచ్చుకుని అవతలివాణ్ని చితగొట్టేసిన రోజులూ వున్నాయి. అతను యెప్పుడు యెవర్ని యెంత అడుగుతాడో, యెవరి దగ్గర యెంత ఎలా పుచ్చుకు చక్కాపోతాడో అతనికే తెలియాలి. అతనికి తెలియదేమో గూడా. ఆ రుణలీల మనకి అర్థం కాదు’ అని. చంద్ర చిత్రలీలా యింతే! ఒక్క బొమ్మ వేస్తానని ఏడాది వాయిదా వేసిన సందర్భాలూ వున్నాయి. ఆర్నెల్ల దాకా ఖాళీ లేదని చెప్పి ఓ యిరవై బొమ్మలు రాత్రికి రాత్రి వేసి యిచ్చేసిన ఘట్టాలూ వున్నాయి. ఆ వేళ కచ్చితంగా యిస్తానన్న కవరు పేజీ పుచ్చేసుకుని, అట్నుంచి అటే ప్రెస్ కి వెళ్లిపోదామని వాళ్లింటికి వెళితే దివాను మీద పడుకుని తాపీగా టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ, మనకేసి ఓ చూపు పడేసి ‘బొమ్మ కాలేదు’ అని చులాగ్గా, కొంటెగా నవ్వేయగల ఘనుడాయన. కడుపు మండి మనం తిట్టినా ఏమీ అనుకోడు, మనసులో పెట్టుకోడు. ఆయన అమాయకుడిలా, బోళా మనిషిలా కనబడతాడు, హాయిగా నవ్వుతాడు. కానీ లౌక్యుడే. ఎవరు ఎటువంటి వాళ్లో కచ్చితమైన అంచనా ఉంది. నచ్చినవాళ్ల కోసం ఎలాంటి కన్సిడరేషన్లు చూసుకోకుండా సాయపడతాడు. నచ్చనివాళ్లకు ఆ ముక్క మొహం మీద చెప్పడనుకుంటా.
బొమ్మలు వేసేవాడికి ఊహాశక్తి అవసరమే. అయితే చంద్ర ఊహలు బొమ్మల పరిధిని దాటి, ఎక్కడెక్కడికో వెళ్లిపోతాయి. ఎన్నో ప్రాజెక్టులు ప్లాను చేస్తాడు. కథాసంకలనం వేద్దామంటాడు, ఇంగ్లీషులోకి అనువాదం చేయిద్దామంటాడు, వత్రిక నడుపుదామంటాడు, ఆర్డు స్కూలు పెడదామంటాడు, సినిమాలు తీద్దామంటాడు, డైరెక్టు చేద్దామంటాడు, ఆర్ట్ మ్యూజియం అంటాడు, ప్రజల్లో చైతన్యం తెద్దామంటాడు, వాళ్లెవరికో సాయం చేద్దామంటాడు, మరోటంటాడు. ఒక వ్యాపకం కాదు, ఒక లంపటం కాదు. అసలు చంద్రుడికి పదహారు కళలుంటే యీ చంద్రుడు యింకో నాలుగు ఎక్కువ చదివాడు. వాటితో పాటు కళాకళలూ ఎక్కువే. మూడ్ ని బట్టి కొత్త ప్లాను ఫోకస్లోకి వచ్చి పాత పాను మూల పడుతుంది. ఈ గందరగోళమే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందనుకుంటాను.
– ఎమ్బీయస్ ప్రసాద్
భోళా చంద్రుడు, వెన్నెలంత చల్లని తెల్లని నవ్వుతో దివికేగి చంద్రుణ్ణి పలకరిస్తే నీ ఎన్నో బొమ్మల్లో నేనున్నాను కదా. ఇక నా పక్కనే నువ్వు. నువ్వు బొమ్మ వేస్తుంటే నేనూ అందులో దూకుతా.
నీ చిత్రాలు చూసి, కథలూ చదివి నన్ను పలకరిస్తూ వెళ్లిన వాళ్ళు ఎందరో. నిన్ను మాత్రం దాటి వెళ్లనివ్వను. ఆకాశంలో ఒంటరి ఓడలా ఉన్నానని మీ శ్రీ శ్రీ అన్నారు కదా.. ఇక నుండి ఆకాశంలో ఇద్దరు చంద్రులు. నిన్ను తలచుకొనే వారందరికీ వెన్నెల పంచుదాము.
కొబ్బరి ఆకు మాటు నుండి మబ్బుల చాటు నుండి నన్ను చూపిస్తావే..ఇక నుండి నా మాటున .. నా చెంతన నువ్వుంటావు చంద్రమా..నేస్తమా..!!
అరె.. ఎందరి కన్నులు స్రవిస్తున్నాయో.. వాటిని దాచిపెడతాలే.. వారి వేదన చల్లారేలా సిరి వెన్నెల కురి పిస్తా.. నిజం.. నీ కన్నుల చెమరింపు సాక్షిగా చెబుతున్నా.
వారిని వదలి వచ్చావని కలత పడకు.. ఎన్ని ఎన్ని చిత్రాలూ, కథలూ లేవు. అంతెందుకు వారిని మళ్లీ నవ్వించడానికి నీ కార్టూన్ లే ఉన్నాయి కదా.
శ్రీ శ్రీ నీ, చలాన్నీ, మహనీయ చిత్రకారులను నీతో మాట్లాడిస్తా. సరేనా.!