
శ్రీకాకుళం జిల్లాలో వడ్డాది రామ్మూర్తి అనే డ్రాయింగ్ టీచరకు 1921 సెప్టెంబర్ 10వ తారీఖున జన్మించిన ‘పాపయ్య’ చిన్నతనంలో ఇంట్లో గోడమీద వ్రేలాడుతున్న రాజారవివర్మ పెయింటింగ్ ‘కోదండరామ’ క్యాలెండర్ చూసి తనలో ఉరకలు వేస్తున్న ఆసక్తిని అదుపు చెయ్యలేక వెంటనే కోదండరామ పెయింటింగను యథాతథంగా చిత్రించి తనలో తనే సంబరపడిపోయారు. అదే ఆయన మొట్టమొదటి పెయింటింగ్. 1938లో స్కూల్ ఫైనల్ చదువు పూర్తి చేశాక ఇక నిరంతర చిత్రకారునిగా కొనసాగాలని నిర్ణయించుకొని రెండవసారి రవివర్మ ‘హనుమాన్‘ను తిరిగి పెయింట్ చేసినప్పుడు ఏ ఒక్కరి దగ్గరా శుశ్రూష చెయ్యకుండా ఇంతటి ప్రతిభ ఎలా సంపాదించాడని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. 1942 ఆంధ్రప్రభలో మొట్టమొదటిసారిగా పాపయ్యగారి ‘రతీ మన్మధ’ పెయింటింగ్ ప్రింటయ్యంది. అది పాఠకలోకాన్ని, కళాపిపాసకుల్ని తన్మయింపజేసింది. అది మొదలు పాపయ్యగారి ముఖచిత్రాల కోసం పాఠకులు ఎదురు చూడ్డం మొదలు పెట్టారు.

వంపు సొంపులు, వయ్యారాలు, సొగసు సోయగాలు తాండవించే ఆయన చిత్రకళ గమ్యం ఎరుగని తరంగంలా దశాబ్దాలపాటు సాగిపోయింది. అనుకరుణలేని ఆయన చిత్రకళ స్వచ్ఛంద భావసారూప్యానికి నిదర్శనం. ధనికొండ హనుమంతరావుగారు తనకు చిరపరిచితుడైన వడ్డాది పాపయ్యను ఒకసారి చక్రపాణిగారికి పరిచయం చెయ్యడంతో చందమామ కవర్ డిజైన్ అంతవరకూ వేస్తూ వస్తున్న ఎమ్.టి.వి. ఆచార్య తప్పుకోవడంతో పాపయ్యగారిచేత వేయించడం ప్రారంభించారు. ప్రారంభ కాలంలో వారి స్వస్థలమైన శ్రీకాకుళం నుంచి వేసి పంపిస్తున్నా, 1960వ సంవత్సరాంతంలో మద్రాసుకు మకాం మార్చి చందమామ ప్రాంగణంలో వీరికి కేటాయించిన ఆఫీస్ రూమ్ లో కూర్చుని వేస్తుండేవారు.
తనకు మూడొచ్చినప్పుడు తప్ప ఆఫీస్ టైమింగ్స్ పాటిస్తూ రోజంతా వేయడం తనవల్ల సాధ్యం కాదనే నిబంధనతో పనిచెయ్యడం ప్రారంభించారు. స్వతహా మితభాషి, కోపిష్టి ఆయిన పాపయ్యగారు తాను తన పనిలో నిమగ్నమైనప్పుడు ఎవర్నీ లోపలకు అనుమతించడంగాని, తను బొమ్మలు వేయడం చూస్తే సహించలేని వపా ఆయన ఒక రోజున ప్రసాద్ ప్రోసెస్ స్టాఫ్లో ఒకతను ఈయన పనిచేస్తుండగా రూమ్ లోపలకు ప్రవేశించి డ్రాయింగులన్నీ చూస్తున్న సందర్భంలో అది గమనించని ఆయన లేచి అతను లోపల ఉండగానే తాళం వేసుకొని వెళ్లిపోయిన సంఘటన అందర్నీ విస్మయపరచింది. తరువాత కాలంలో ‘యువ‘, ‘అభిసారిక’ అనే పత్రికలకూ కూడా కవర్ డిజైన్స్ వేయడం మనకందరికీ తెలిసిందే!… స్వంత ఖర్చుతో సన్మానాలు, అభినందన సభలు పెట్టించుకునే ఈ రోజుల్లో ఎన్నో సంస్థలు, ఆయన్ను బ్రతిమాలినా సభలకూ, సన్మానాలకు అంగీకరించని ఏకైక – చిత్రకారుడు వడ్డాది పాపయ్య.
–ఈశ్వర్, సినీ పబ్లిసిటీ డిజైనర్
(Courtesy : Cinema Poster by Eswar )
ఇది వాస్తవమే…! కేవలం ఆయన బొమ్మలు వేసేటప్పుడు చూసేందుకు ఎవరినీ అనుమతించేవారు కాదు. అంతేకాదు ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు కాదు.నేను ఆంధ్రభూమి అనకాపల్లి ఇన్ చార్జిగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసేందుకు కశింకోట లో ఉన్న వపా గృహానికి వెళ్లాను. నేను ఎందుకు వచ్చింది ఆయనకి చెప్పాను. అయితే తన గురించి పత్రికలలో ఏమి రాయాల్సిన అవసరం లేదని,కరాఖండిగా చెప్పారు.
Bagundi