(నవంబర్ 23న విజయవాడ లో పట్టాభి కళాపీటం వారి ‘సూర్యదేవర హేమలత స్మారక పురస్కారం’ అందుకోబోతున్న సందర్భంగా చిత్రకారుడు గిరిధర్ అరసవిల్లి పరిచయం 64కళలు.కాం పాఠకులకోసం…)
చిత్రకారుడు గీసిన చిత్రవిచిత్రమైన చిత్రాలు బహుచిత్రంగా ఉంటాయి. వీరి మనస్తత్వం, వ్యక్తిత్వం వారు గీసిన బొమ్మల ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. ఓ సరళరేఖ సూటిగా వెళ్తుంటే అర్ధమేముంది.
వైవిధ్యమేముంది. అది పలురకాలుగా వయ్యారంగా కలం ద్వారా ఒంపులు తిరిగితే అక్షరమవుతుంది. కుంచె ద్వారా ఒంపులు తిరిగితే చిత్రమవుతుంది. చిత్రకారుణ్ణి ఓ చట్రంలో వుంచలేము. చట్రానికి వెలుపల పరిభ్రమిస్తూ తన మనస్సును ఆకాశమంత ఎత్తులో విహరింపచేస్తూ ఏ చిత్రాన్ని ఎలా గీయాలా అని, రంగుల్ని ఎలా అద్దాలా అని తపన పడుతూ ఉంటాడు. తపన, ఆర్తి, పట్టుదల, ఏకాగ్రత, వైవిధ్యం – అన్నిటినీ కలగలిపితే చిత్రకారుడవుతాడు.
కళ కళాకారుని కోసం కాదు సమాజం కోసం అంటారు. 64 కళల్లో ఒకటైన చిత్రకళ లిపికంటే ముందే ఆవిర్భవించింది. ఆదిమ మానవుడే గోడలపై కుడ్యచిత్రాలను గీసినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అక్షరాలు పుట్టకముందు, భాష నేర్వక ముందు చిత్రాలను చిత్రించాడు మనిషి. అజంతా, ఎల్లోరా గుహల్లోని అద్భుతమైన చిత్రాలు ఎప్పటికీ అత్యద్భుతాలే. చిత్రించిన చిత్రకారుడు కనుమరుగైనా చిత్రాలు మాత్రం కళాఖండాలుగా ఖండాంతరాల ఖ్యాతిని తెచ్చి పెడతాయి. చిత్రకారుడు గీసిన అద్భుతమైన చిత్రం పద్యకవిచేత ఆసువుగా పద్యాన్ని చెప్పిస్తుంది. నాట్యకారిణి చేత అలవోకగా నాట్యం చేయిస్తుంది. సంగీత విద్యాంసుని చేత సరిగమలు పలికిస్తుంది. వ్యాసకర్త చేత వ్యాసాన్ని రచింపచేస్తుంది. అంతటి శక్తిని తనలో ఇముడ్చుకున్న చిత్రం చిత్రకారుని మనోఫలకం నుండి రాలిన ఓ చిత్రవిచిత్ర శకలం.
సప్తవర్ణాల సాక్షిగా తన మనసు పొరల్లో దాగున్న ఆలోచనలకు పదును పెట్టి సప్తవర్ణాలకు తన కుంచెను అద్ది అలసిపోకుండా అలవోకగా చిత్రాకృతులకు ప్రాణం పోస్తున్న చిత్రకారుడే అరసవిల్లి గిరిధర్. గిరిలు, తరులు, లతలు, పూబంతులు, ఇంతులు – ఒకటేంటి ఎన్నో రకాల ప్రకృతి అందాలను, రమణీయతను కలబోసి చిత్రాలను గీస్తూ తన కలల్ని (కళల్ని) కుంచెద్వారా సాకారం చేసుకుంటున్నాడు. చిత్రకారునికి ఎల్లలు లేవు. పరిధులూ లేవు. ఆలోచనలు అనంతం. గీస్తున్న చిత్రాలు అత్యద్భుతం.
ఎందరో కవుల కృతులకు ముఖచిత్రం (కవర్ పేజీ) గిరిధర్ చేతిలో రూపుదిద్దుకున్న ఆకృతులే. వర్ధమాన కవులు, రచయితలు, తలపండిన కవులు కూడా గిరిధర్ ద్వారా బొమ్మలు గీయించుకోవాలని ఉబలాటపడుతుంటారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ డిజిటల్ పద్దతి చిత్రకళకు తోడైంది. పూర్వకాలంలో వడ్డాది పాపయ్య, దామెర్ల రామారావు, బాపు వంటి ప్రముఖులు చిత్రకళకు జీవం పోశారు. ఆ తరువాతి కాలంలో కంప్యుటర్ అందుబాటులోకి వచ్చాక పెన్సిళ్ళు, పెన్నులు, కుంచెలు, రంగులకు బదులుగా డిజిటల్ ప్యాడ్ పైనే బొమ్మలు గీసే పద్ధతి వచ్చింది. ఈ పద్ధతిని తన స్వంతం చేసుకున్న చిత్రకారుడు గిరిధర్. ఇప్పటి వరకు ఎందరో ప్రముఖుల ముఖచిత్రాలను గీసారు. గ్రాఫిక్ డిజైనింగ్ లో గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచుకున్నారు. ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసి చిత్రకళారంగంలోనూ రాణించగలుగుతున్నారు.
డిజిటల్ బొమ్మ గీయాలంటే కఠోర సాధన, శ్రమ ఉండాలి. ఎవరి బొమ్మ గీసినా వారు ఎదురుగా మనముందు నిలబడినట్లు, మనల్ని పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఎంత విచిత్రమో కదూ! గిరిధర్ కుంచె పట్టినా, కలర్ దిద్దినా వైవిధ్యమే. చిత్రకళలో కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా మనం కూడా మారాలంటారు ఆయన. గిరిధర్ గీసిన వందలాది నీటిరంగులు, ఆక్రిలిక్, ఆయిల్ చిత్రాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇటీవల నీటిరంగులతో (వాటర్ కలర్స్) చిత్రించిన టాల్ స్టాయ్ చిత్రం షి ల్లాంగ్ లో జరిగిన ‘Global Water Colour Summit’ లో ప్రదర్శనకు ఎంపికై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చింది. ఇంకనూ అనేక చిత్రకళా ప్రదర్శనలలో తన చిత్రాలను ప్రదర్శించి పలు బహుమతులు – సత్కారాలు అందుకున్నారు.
నదీపరీవాహక ప్రాంతంతో ఇసుక తిన్నెలపై, చెట్లనీడన, రాళ్ళు రప్పలు, పచ్చని పైర్లు, పారే నీళ్ళు, విహరించే విహంగాలు – చూస్తూ తనను తాను మరిచిపోతూ ప్రకృతిలో లీనమై ప్రకృతి ప్రేమికుడుగా మారి వర్ణచిత్రాలు చిత్రిస్తుంటాడు. ఏ కళకైనా నిత్యసాధన అవసరం అంటారు గిరిధరుడు. కళే తను జీవించడానికి ఆధారమైనప్పుడు రోజురోజుకూ చిత్రకళారంగంలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవాలంటారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒంటబట్టించుకుంటూ, దానిలో నైపుణ్యాన్ని సాధించి చూపరులను ఆకర్షించగలిగేట్లు చిత్రాలు గీసినట్లయితే మంచి రాణింపు ఉంటుందంటారు. ఇంపుగా ఉంటేనే కదా రాణింపు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంటేనే ఏ కళాకారుడైనా రాణించగలుగుతాడు. గిరిధరకు అలాంటి ప్రోత్సాహం ఉంది కాబట్టే చిత్రకళలో గిరిశిఖరాన్ని అధిరోహించగలిగారు.
డా. తూములూరి రాజేంద్రప్రసాద్
Great sir
Congrats Giridhar garu
Very nice 👌👍