గోపి గారి చివరి కోరిక తీరకుండానే…

చిత్రకారుడుగా, డిజైనర్ గా ప్రఖ్యాతి చెందిన ‘గోపి’ గారు నిన్న (21-5-2021) శుక్రవారం ఉదయం కరోనా తో హైదరాబాద్ లో కన్నుమూసారు. వారికి నివాళిగా సమర్పిస్తున్న వ్యాసం…

70 – 80 దశకాల మధ్యకాలంలో వార, మాసపత్రికలో వచ్చిన కథలకు, సీరియలకు తన బొమ్మలతో ప్రాణం పోసిన చిత్రకారుడు ‘గోపి’. ఆయన సంతకమే ఒక అందమైన బొమ్మ. తెలంగాణ పల్లె సంస్కృతిని ఒడిసి పట్టుకున్న గోపి ఆరణాల పాలమూరి బిడ్డ.
‘మొదట్నుంచీ ఆకాశంలో ఎగిరే విహంగంలా, నీటిలో ఈదే చేపలా స్వేచ్చగా జీవించాలనే తత్వం నాది. అది మొండితనమో, ఆత్మ విశ్వాసమో తెలియదు. దానివల్ల జీవితంలో ఎన్నో కోల్పోవలసి వచ్చినా అధైర్యపడకుండా ఒకవైపు ఆర్టిస్టుగా అస్తిత్వాన్ని చాటుకుంటూనే మరోవైపు జీవిక కోసం భిన్న వృత్తుల్ని చేపట్టాల్సి వచ్చిందంటారు.

బాల్యం:
‘గోపి’గా కళా ప్రపంచానికి తెలిసిన నా అసలు పేరు లగుసాని గోపాల్ గౌడ్. మాది రైతు కుటుంబం. మహబూ బనగర్ జిల్లా, కొల్లాపూర్‌కు 12 కి.మీ. దూరంలోని ‘ఎన మెట్లు’ గ్రామం. నాన్న హనుమంత్ గౌడ్, అమ్మ నారాయ ణమ్మ, ఏడుగురి సంతానంలో రెండో వాణ్ణి. మా తాత పశువుల నోటికి కట్టే ముట్లని, మెడకు కట్టే తాళ్లను కళాత్మకంగా పేనడం నన్ను ఆశ్చర్యపర్చేది. నాన్న చేతిరాత కూడా ముత్యాల్లా ఉండేవి. బహుశా వాళ్లని గమనించడంలోనే నాలో కళాత్మక దృష్టికి బీజం పడిందేమో!

మూడవ తరగతిలో ఉండగా ఒకసారి బాలకిష్టయ్య సారు ఉమ్మెత్త పువ్వొకటి తీసుకొచ్చి టేబుల్ పైన ఉంచి, దానిని చూస్తూ బొమ్మ గీయమని పిల్లలను ఆదేశించారు. అందరిలో నేను వేసిన బొమ్మ బాగుండడంతో నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అప్పట్నుంచి నా మాదిరి రాయాలని, గీయాలని పిల్లలకి చెప్పడంతో గర్వంగా అన్పించేది.

బొమ్మల్ని మరింత అందంగా గీసే ప్రయత్నం చేసేవాడ్ని. సినిమా చూసేందుకు ఎడ్ల బండిలో వెళ్లి రావడం … కూడా నాకొక కళాత్మక దృశ్యంగా గుర్తుండిపోయింది. సినిమా పాటల పుస్తకాల్ని తెచ్చుకుని వాటిపై ఉన్న యాక్టర్ల బొమ్మల్ని గీసే ప్రయత్నం చేసేవాడ్ని. ‘శ్రీవెంకటేశ్వర మహత్యం’ సినిమా పాటల పుస్తకంపై సావిత్రి కళ్లు నన్ను బాగా ఆకర్షించడం, తదేకంగా ఆ క్లళ్లను చూస్తూ బొమ్మగా మలచిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. పొలంలో కన్పించినవన్నీ గీసేవాణ్ణి నా చిన్నతనంలోనే ఒకసారి ఎలక్షన్లు వచ్చాయి. ఒక పార్టీ తరపున నిలబడ్డ ఆయన గుర్తు ‘కాడెద్దులు’. ఆ గుర్తు నన్ను బాగా ఆకర్షించడంతో సరదాగా ఆ బొమ్మని మా ఊళ్ళోని గోడలపైన గీసాను. గోడలెక్కి ఆ బొమ్మ వేస్తుంటే తోటి పిల్లలు రంగుల డబ్బాల్సి, నిచ్చెనని పట్టుకుని సహకరించేవారు. కాడెద్దుల బొమ్మను గుర్తుగా చేసుకున్నాయన అనుకోకుండా గెలవడం, ఆయన గెలుపునకు పరోక్షంగా నేను కారణమైనట్టు మా తాత (చుక్కా రామన్ గౌడ్) నా దగ్గరకు వచ్చి నన్ను పొగడ్డం ఇంకా గుర్తున్నాయి.

“నాన్న పొలంలో ఉండగా సద్ది తీసుకెళ్ళేవాడ్ని, ఒక చేతిలో కారేజీ ఉంటే మరో చేతిలో తెల్లకాగితాల బొత్తి తగిలించిన ప్యాడు ఉండేది. పొలంలో కూర్చుని కనిపించిన పిట్టల్ని, ఉడుతల్ని, పశువుల్ని, వృక్షాల్ని, గాలికి ఊగే పైరునీ, తూనీగల్ని, తుమ్మెదల్నీ, చేలో వేసే మంచెల్ని … ఏవి కన్పిస్తే వాటిని గీసేవాడ్ని. ఊరి చివర వాగుల దగ్గరున్న ఇసుక దిబ్బలపైన కూడా పొడవాటి కర్రతో పరిగెత్తుతూ బొమ్మని గీయడంలో అలౌకిక ఆనందు పొందేవాడ్ని.
హైస్కూల్ చదువు కోసం రోజూ నడుస్తూ సింగోటం వెళ్లాల్సివచ్చేది. మా హెడ్ మాస్టర్ అచ్చిరెడ్డిగారు నన్ను ప్రత్యేకంగా చూసేవారు. క్లాసులో టీచర్ ‘పెద్దయ్యాక ఏమవుతార్రా?’ అని ప్రశ్నించినప్పుడు ఆర్టిస్టునౌతా అనే వాడ్ని.

బాపుగారి ప్రశంసతో తేలిపోయా : హెచ్.ఎస్.సి. తర్వాత హైద్రాబాదు వచ్చి, ఫైనార్ట్స్ లో చేరాను. కోఠీ గుజరాతీ గల్లీ నుంచి మాసబాంకు వరకు నడకే. ఈ ఐదేళ్ల ఫైనార్ట్స్ డిప్లొమా కోర్సు జీవితంలో అనుకోని మలుపు తిపారు. చిక్కడపల్లి ప్రసాద్ కంపెనీ’లో సినిమా పోస్టర్స్ డిజైనింగ్ చేసే అంబదాసాగారు. నేను రోజూ ఆయన వేసే పెయింటింగ్స్ ని చూస్తుండే వాడ్ని. అప్పట్లో వచ్చే ‘అపరాధపరిశోధన’ పై కవర్ ఆయన గీస్తుండేవాడు. లోపలి కథలకి నేను బొమ్మలు వేసేలా రికమెండ్ చేస్తూ, తొలిసారి పత్రికలకి పరిచయం చేశారు. ‘బాపు’గారి బొమ్మల్ని, అక్షరాల్ని గమనించమని తరచూ చెప్పేవాడు. అప్పట్నుంచి బాపుగారి బొమ్మల్ని స్టడీ చేసేవాడ్ని.

Gopi art

బాపుగార్ని ఆరాధ్యదైవంగా, రోల్ మోడ గా భావించేవాడ్ని. ఆయనంతటి చిత్రకారుడ్ని కావాలని కలలు కనేవాడ్ని. విజయవాడ నుండి వచ్చే ఆంధ్రపత్రిక వాళ్లు కూడా కథలకి బొమ్మల్ని వేయమని అడిగేవారు. కాలేజీలో చదు వుతూనే పత్రికల్లో బొమ్మల్ని వేసేవాడ్ని. క్రమేపీ హైద్రాబాద్లోని ప్రముఖ ఆర్టిస్టులతో పరిచయాలు అయ్యాయి. అప్పట్లో సాయంత్రాలు దీపక్ మహల్ పక్కనుండే ఇరానీ హోటల్లో ఆర్టిస్టులు, రచయితలూ కలుస్తుండేవారు. .
ఒకసారి శంకుగారు “ఈ మధ్య బాపు గారిని కల వడం జరిగింది. అప్పుడాయన ‘ఈ గోపి ఎవరండి? బొమ్మలు బాగా వేస్తున్నారు’ అన్నారని చెప్పారు. నన్ను నేను మైమరచిన మధురమైన క్షణాలవి. ఒకసారి ‘ముత్యాలముగ్గు‘ చిత్రం శతదినోత్సవం (సుదర్శన్ థియేటర్లో) కోసం వచ్చిన బాపుగారు అన్నపూర్ణ హోటల్లో బస చేశారని తెలసుకుని అక్కడికి వెళ్లి నన్ను పరిచయం చేసుకున్నాను. అదే నేను తొలిసారి బాపుగార్ని చూడటం. ఆ పక్కనే ఉన్న నవోదయ రామ్మోహనరావుగారికి నన్ను పరిచయం చేస్తూ నా గురించి చెప్పారు బాపు గారు. జీవితాంతం గుర్తుండిపోయే అపురూప క్షణాలవి. ‘విజయవాడ వచ్చేయండి. నవలలు ఎక్కువగా పబ్లిష్ అవుతుంటాయక్కడ. వాటికి ముఖచిత్రాలు వేసే అవకాశం దొరుకుతుంద’ని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు రామ్మోహనరావుగారు. నా ఫైనార్ట్స్ కోర్సు కంప్లీట్అయ్యాక విజయవాడ వెళ్లాను.


మద్రాసులో పొసగని జీవితం: నవలలకి ముఖచిత్రాలు వేస్తూ రెండేళ్ళు విజయవాడలో ఉండిపోయాను. ముఖచిత్రం నాకు తృప్తిగా రాక పోతే మళ్లీ మళ్లీ వేస్తూ ఉండేవాడ్ని. దాంతో వాళ్లిచ్చిన టైం దాటిపోయి చిరాకు పడేవారు. నన్ను బాపుగారు పరిచయం చేసిన ఆర్టిస్టుగా అనుకునేవారు కాబట్టి పబ్లిషర్స్ నా బొమ్మల ఆలస్యం గురించి బాపుగార్కి చెప్పుకున్నారట. దానికాయన ‘రేడియో మంచి కంపెనీది అని చెప్పా. దాన్లో మంచీ చెడు ప్రోగ్రాంల గురించి నేను చెప్పలేదు’ అని జవాబిచ్చారట. ప్రింట్ మీడియాలో చాన్నాళ్ళ వరకూ ఈ మాటని జోకుగా చెప్పుకునే వారు.

Gopi art exhibition in Hyderabad

సినిమా రంగంలో :
ఫిలిం జర్నలిస్టు మోహన్‌ కుమార్‌గారు నన్ను మద్రాసు రమ్మని, సినిమాల్లో పోస్టర్ డిజైనింగ్ అవకాశాలు వస్తాయని చెప్పడంతో అక్కడికి వెళ్లాను. నేను సమయానికి స్పందించకపోవడం చేతనో, మరెందుకో గాని ‘సిరిసిరిమువ్వ’ చిత్ర అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది. అతి కష్టమ్మీద ఒకటి రెండు సినిమాలకి పోస్టర్ డిజైనర్‌గా పని దొరికింది. “దొంగల దోపిడి‘ అనే సినిమాకు పని చేశాను. సినిమాలో చూడాల్సింది ఏమీ లేదంటూనే …. టైటిల్స్ లో గోపి బొమ్మల్ని చూడ్డానికి మాత్రం సినిమా ఒకసారి చూడొచ్చు అని ఈ చిత్ర సమీక్షలో రాయడం క్రెడిట్ గా భావిస్తాను.

Cine poster designed by Gopi

మద్రాసులో నిర్మాతలు సరిగ్గా డబ్బులు ఇచ్చేవారు కాదు. అయినా ఓపిగ్గా ఒకటిన్నర సంవత్సరాలు మద్రాసులో ఉండి, ఇక లాభం లేదనుకుని విజయవాడకు మకాం మార్చాను. స్వాతి బలరాంగారితో పరిచయం కలిగింది. స్వాతిని వారపత్రికగా కూడా తీసుకురమ్మని తరచూ చెప్పేవాడ్ని, స్వాతి వారపత్రికగా రావడం వెనక నా ప్రోద్బలం చాలానే ఉంది.
ఉదయం ‘లోగో’:
‘ఉదయం’ దినపత్రిక రాబోయేముందు ఆ సంపాదక వర్గం ఆ పత్రికకు నేను వేసిన లోగోనే సెలక్ట్ చేసింది. కొన్ని వందల లోగోల నుండి నా లోగో ఎంపిక చేయడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన సంఘటన. హైద్రాబాదులో ఆ పత్రిక ఆవిష్కరణ సందర్భంలో ప్రత్యేకంగా పిలిచి సినారె గారితో నాకు సన్మానం చేయించారు.

ఎన్.టి.ఆర్ చూపిన అభిమానం :
బి.నరసింగరావుగారు అడిగితే ‘మా భూమి’ సినిమాకి పనిచేశాను.
తర్వాత కొన్నాళ్ళకి హైద్రాబాద్ వచ్చి కె.సదాశివరావు గారి ప్రోత్సాహంతో ‘ఆంధ్రప్రదేశ్ డయిరీ డెవలప్మెంటెలో ఆర్టిస్టుగా చేరాను. తర్వాత చిక్కడపల్లిలో ఫ్రీలాన్స్ ఆర్టీ స్టుగా ఉంటూ పత్రికలకి బొమ్మలు గీయడం ప్రారంభించాను.

Gopi illusrtration

ఆ సమయంలోనే జీవితంలో కొంత మార్పు – అది ఎన్.టి.ఆర్.గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్. సీనియర్ జర్నలిస్టు నందగోపాల్ గారు అప్పట్లో ‘తెలుగు వెలుగు‘ అనే పత్రికకి సంపాదకుడిగా ఉండేవారు. వారి ప్రోత్సాహంతో సమాచారశాఖలో పోస్టర్ డిజైనింగ్ వర్క్ చేసేవాడ్ని. తెల్లవార్లూ కష్టపడి వర్క్ చేసి ఉదయమే ఎన్. టి.ఆర్.గార్ని కలిసి వేసిన డిజైన్లను వారికి చూపించేవాడ్ని, వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అవి అచ్చుకి వెళ్లేవి. ఆ సమయంలో రామారావుగారు నాపై చూపించిన అభిమానం మరిచిపోలేనిది.
ధైర్యం: పిల్లలు ఎదుగుతున్న దశ. జీవితంలో ఇంకా స్థిరపడని నేను ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. రియలెస్టేట్ వైపు వెళ్ళి రిక్తహస్తాలో వెనక్కి వచ్చాను. ఆత్మవిశ్వాసంతో ఉంటూ నిరంతరం బొమ్మలు వేస్తూ చిత్రకారుడిగా నన్ను నేను పుటం పెట్టుకున్నాను.
అదీగాక ‘నీవు ఏది గీసినా బొమ్మ’ అన్న బాపుగారి మాట నా వెన్నంటే ఉండి ధైర్యం కలిగించేది. నా చిత్రాలు నన్ను గట్టెక్కించగలవనే ధైర్యం నాలో సజీవంగా ఉంది. అన్ని రోజులూ బాగుంటే ఒక వృద్ధాశ్రమం నెలకొల్పాలని, నా ఆర్ట్ గేలరీ కూడా పెట్టాలనే బలమైన కోరిక ఉంది.

జదీశ్వర రెడ్డి (నవ్య సౌజన్యంతో…)
______________________________________________________________________
సౌమ్యులు, స్నేహశీలి…
గోపి గారితో నా తొలి పరిచయం 2018 సం.లో అమలాపురంలో జరిగింది. వారు కోనసీమ చిత్రకళాపరిషత్ వారి పురస్కారం అందుకోవడానికి అమలాపురం వచ్చిన సందర్భంలో మేము కలవడం జరిగింది. అక్కడే వారి మొబైల్ నంబర్ తీసుకొని వారితో టచ్లో వున్నాను. ఆర్టిస్ట్ బాతుల బాపూజి గారి దగ్గర గోపి గారి ప్రస్తావన వస్తే, వారు చెప్పారు “గోపి గారి ఇల్లు మీ అమ్మాయి గారి ఇంటి దగ్గరే అని చెప్పారు.” మా అమ్మాయి కూడా హైదరాబాద్, మనికొండలో వుంటుంది. నేను హైదరాబాద్ వెల్లినప్పుడల్లా వారిని కలిసేవాడిని. ఈ మూడేళ్ళలో అనేక విషయాలు నాతో మాట్లాడేవారు. ఇంటి ఆర్థిక పరిస్తితులు ఏమీ బాలేదని, వారి శ్రీమతి అనారోగ్యం తో బాధపడుతుందని చెప్పారు. ఇంకా ఒక కుమారునికి పెళ్ళి చేయాల్సివుందని అన్నారు. ఆయన విజయవాడలో వున్నప్పటి సంగతులు చెప్పేవారు. తను ఎన్నో ఏళ్ళు గా చిత్రాలు గీసిన స్వాతి పత్రిక ఎడిటర్ బలరాం గారికి తన పరిస్థితి వివరించినా సహాయపడలేదని, అడగడానికి తనకి ఇష్టం లేకపోయినా ఒక మిత్రుని సలహాతో అడిగానని వాపోయారు.
ఇలాంటి సున్నిత మనస్కులు, గొప్ప చిత్రకారులు 70 యేళ్ళు (పుట్టింది : 6 జూన్ 1952 లో) నిండకుండానే మనకు దూరమయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ…
కళాసాగర్ (editor: www.64kalalu.com)-9885289995

Kalasagar and LRV Ramana with artist Gopi in 2018

5 thoughts on “గోపి గారి చివరి కోరిక తీరకుండానే…

  1. గోపీగారిపై వ్యాసం బాగుంది. ఒరిజినల్ చిత్రకారులు గోపీగారు. ఒక నిండుదనం ఉండేది వారి చిత్రాలలో..
    వారికి నా హృదయ పూర్వక అశ్రునివాళి‌

  2. బాపు గారి బొమ్మల తర్వాత నేను ఇష్టపడేది గోపి గారి బొమ్మలు.వారి మొదటి చిత్రం ఆంధ్రపత్రికలో డబుల్ స్ప్రెడ్ లో వచ్చినప్పుడు, సంపాదకీయంలో వీరి గురించి గొప్పగా రాసారు.నాకు తెలిసి ఒక ఆర్టిస్టుని పరిచయం చేస్తూ అలా రాయటం తొలిసారి.ఒక సందర్భంలో 1978 లో వారిని కలిశాను.స్నేహశీలి.కార్టూనిస్టుల ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు కూడా మాట్లాడారు.తర్వాత మాట్లాడతా చాలా విషయాలు చేప్పాలి అన్నారు.కానీ నాకా అదృష్టం లేదు.నేను పనిచేసిన ఆర్టీసీకి చాలా పనులు చేశానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap