రంగుల రారాజుతో నేను-కడలి సురేష్

(30 డిశంబర్ వడ్డాది పాపయ్య గారి వర్థంతి సందర్భంగా… 1986 ప్రాంతంలో వారిని కలిసిన చిత్రకారుడు కడలి సురేష్ గారి అనుభవాలు…)

భగవంతుడు భరతదేశానికి ప్రసాదించిన గొప్ప వరం వడ్డాది పాపయ్య. ఆ మహా చిత్రకారుడి గురించి చెప్పడానికి ఏ చిత్రకారుడూ సరిపోడనే నా భావన. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాంక్ ప్రెజెర్రీ, బోరీస్ వంటి మాయాజాల చిత్రకారులు వాడుతున్న అద్భుత రంగులను మన ‘రంగుల రారాజు’ ఏనాటి నుంచో వాడారు. ప్రపంచంలో ఏ చిత్రకారుడి శైలి నైనా అనుకరించగలం కాని, వపా శైలి మాత్రం అనుకరించలేరు. కారణం ఏ ఆర్టిస్ట్ బొమ్మ వేయాలన్నా ఎంతో కొంత… ఇతర బొమ్మ నుంచో లేదా ఫొటోగ్రఫీ నుంచో ఆధారాన్ని వెతుక్కుంటారు. కాని వపా బొమ్మగీయాలంటే అది ఆయన మనసునుంచే రావాలి. అదే ఆ గంధర్వ చిత్రకారుడి గొప్పతనం. ఆయనకు ఈ లౌకిక ప్రపంచంతో పనిలేదు. అనునిత్యం దేవతలతో, దేవుళ్ళతో, ఋషులతో, గంధర్వులతో, దేవకన్యలతో, విశ్వమంతా విహరించే మహా చిత్రకారుడు వపా. ఆయన్ని కలవాలని పలకరించాలని గాని అనుకుంటే ఆయన్ని తపోభంగ పరచినట్టే. అయినా ఒక్కసారి కలవాలనే తపనతో మద్రాసు నుంచి వైజాగ్ వెళ్ళి, అక్కడి మిత్రుడ్ని తీసుకుని కళింకోట అనే గ్రామానికి వెళ్ళాను. ఒక ఇంటి తలుపు కొట్టి మేము మద్రాసునుంచి వచ్చామండీ వడ్డాది పాపయ్య గారిని చూట్టానికి అని చెప్పాము. ఆవిడ ఆశ్చర్యపోయి అయ్యో అంత దూరం నుంచి వచ్చారా? ఆయన చాలా కోపిష్ఠి. ఎవరితోనూ మాట్లాడరే… అని జాలిగా చూసి, అదిగో… ఆ పక్కరెండో వీధిలో… ఆరో ఇల్లు అని చెప్పి మేము వీధి చివరికి వెళ్ళే వరకూ మమ్మల్ని జాలిగానే చూసింది. ఆవిడే కాదు…, ఆ వీధిలోని చాలా మంది అలాగే చూసారు. దారి పొడుగునా అవే మాటలు, ఆ మహా చిత్రకారుడ్ని చూడాలనే ఆశ కాస్తా నిరుత్సాహంగా మారనుంది.

artist Kadali Suresh with Vaddadi Papaiah

ఎట్టకేలకు ఇంటి తలుపు తట్టాము, ఎవరో పాత సినిమాలో కన్నాంబలాగ ఉన్నారు… ఎవరు బాబూ మీరు? అని అడిగారు. గురుపత్ని అని గ్రహించి నమస్కరించి మా కోరిక విన్నవించాము. ఆ తల్లి లోనికి వెళ్లిన కాస్సేపటి దేవతామూర్తి దర్శనం అయింది. తేనె రంగు కనుపాప ఆయన బొమ్మలాగ తీర్చిదిద్దిన ముఖవర్చస్సు, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో…. నేత్రానందంగా వపా బొమ్మలా దర్శనమిచ్చి ఏం కావాలి? మీకు అని అడిగారు. ఆయన్నే పరవశంతో చూస్తున్న నాకు ఆయన మాటతో ఉలిక్కిపడి తేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి, నేను మీ అభిమానిని, మిమ్మల్ని చూడాలని మద్రాసు నుంచి వచ్చాను… అని చెప్పగా, మనిషిని మనిషి ఏం చూస్తారు? ఇవిగో రెండు చేతులూ… రెండు కాళ్లూ… నాతలకాయ… చూసారుగా. నేనూ మీలాగే ఉన్నాను. ఇక వెళ్ళండి అన్నారు. నా పక్కనున్న మిత్రుడు జేజి నారాయణ కల్పించుకుని అలా కాదండీ… వీరు కూడా చిత్రకారుడే… చాలా సినిమాలకు పనిచేసారు అని చెప్పగా. మద్రాసులో ఎవరిదగ్గర నేర్చుకున్నావ్ అన్నారు. ఆ ప్రశ్నకు కొంత మనసు కుదుటపడింది. వెంటనే కేతా గారి దగ్గర అని చెప్పాను. కేతాగా రంటే వారికి పరిచయమో.. లేక అభిమానమో… తెలీదుగాని, వెంటనే లోనికి ఆహ్వానించారు. మేడపైకి తీసుకెళ్లి ఆయన చిత్రశాలలోకి ఆహ్వానించి… కేతా ఏం చేస్తున్నాడు? అని అడిగారు. N.T.R గారి బ్రహ్మర్షి విశ్వామిత్రకు ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు, అని చెప్పాను. N.T.R గారు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ ఎవరయితే బాగుంటుంది? అని అడినప్పుడు ఈ సినిమాకు వడ్డాది పాపయ్యగారు అయితే బాగుంటుందని కేతాగారు చెప్పగా, ఎందుకూ? చందమామ కవర్ పేజీలు దగ్గర పెట్టుకుని ఈ సినిమాకు మిరే చెయ్యండి… అని చెప్పారు. అందుకే కేతాగారు చేస్తున్నారు అని చెప్పాను. రామారావుకూడా బొమ్మలు గీస్తాడని వపాగారు చెప్పారు. ఇలా కాసేపు గడిచిన తరువాత, ఆయన ఒరిజినల్స్ చూపించారు జన్మధన్యమైంది. కొంతసేపు గంధర్వలోకంలో ఉన్నట్టు అనిపించింది.

మరికొంతసేపు ఆయన గోడలు మిద గీసుకున్న చిత్రలేఖనాలు తిలకించి, ఆ మహా చిత్రకారుడితో కొన్ని ఫోటోలు దిగి, రంగుల రారాజు పాదాలకు మళ్ళీ నమస్కరించి… ఏనాటికైనా ఇంత గొప్ప చిత్రకారుడ్ని కావాలని, ఊహాలోకంలో విహరిస్తూ వచ్చాను. కొన్నేళ్ళ తరువాత వపా ఇక లేరు అని దినపత్రికలో చూసి తెలుగు వారికి రెండు కళ్లలో ఒక కన్నుపోయిందని కన్నీరు కార్చాను. అయినా ఇంకో పక్క ఆనందభాష్పాలు. ఎందుకంటే ఈ భూమ్మీద కారణజన్ముడిలా పుట్టి ఆయన విహరించే దేవగంధర్వలోకాలకు చేరుకున్నారన్న ఆనందం. అవే ఆనంద భాష్పాలు. అంత గొప్ప చిత్రకారులు మళ్లీ పుట్టకపోయినా పుట్టిన చిత్రకారులకు వడ్డాది పాపయ్య గారి బొమ్మల పుస్తకం ఒక భగవద్గీతే అవుతుంది.

సురేష్ కడలి
__________________________________________________________________________

బ్రహ్మకే బ్రహ్మ మన బొమ్మల బ్రహ్మ వపా!

ఒకానొక సమయంలో రావణ బ్రహ్మ ఆకాశ మార్గన వెళ్తూ రంభను చూసి మోహించి కోరిక తీర్చమన్నాడు రంభ ఒప్పుకోకపోతే రంభను బలత్కరించి కోరిక తీర్చుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నిన్నిష్టపడని పరాయి స్త్రీని తాకితే నీ తల వేయి చెక్కలవునుగాక అని శపిస్తాడు.

Vaddadi Papaiah art

ఇంత కథను ఒకే బొమ్మతో ఎలా వేసారో చూడండి. మనకు కనిపించే బ్రహ్మ మూడు తలలూ మూడు రకాల భావాలు…
ఒకటి (బ్లూ) రావణుడ్ని కోపంగా ఖండిస్తున్నట్లు…
రెండు (ఎల్లో) రంభను ఓదారుస్తున్నట్లు…
మూడు (రెడ్) నీవు ధన్యురాలవు, నీ వల్ల ఇష్టం లేనీ ఏ పరస్త్రీని తాకలేడు అని. అలాగే చేతులు పిడికిలి బిగబెట్టినట్టు హెచ్చరిస్తున్నట్టు కమండలంలోని తపోజం రావణుని మీద పడుతున్నది.
చిరిగిన వస్త్రాలతో రంభ విచారిస్తున్నట్టు, ఇన్ని భావాలను ఇంత కథనూ ఒకే బొమ్మలో ఎవరు వేయగలరు. – మన రంగుల బ్రహ్మ వపాగారు తప్ప.
______________________________________________________________________

Vaddadi Papayya

ఆర్ట్ డైరెక్టర్…!

ఈ కైలాస నివాసాన్ని చూడండి, ఏ సినిమా ఆర్ట్ డైరెక్టరూ ఊహించలేని, వేయలేని సెట్టింగు. నంధీశ్వరుడికి ఆ డెకరేషను.. పైన సింహాసనమూ… ఎవరికి సాధ్యం? తండ్రి దక్షుడి యజ్ఞానికి మొండికేసి వెళుతున్న పార్వతీదేవి వెలితే ఏం జరుగనుందో? తెలిసి విచారంతో వంగి ఆలోచిస్తున్న పరమేశ్వరుడి భంగిమ. ఇంత గొప్పగా ఊహించి వేయగలిగిన మన రంగుల రారాజుకి తప్ప భారతదేశంలో ఏ చిత్రకారుడూ ఇంతకంటే గొప్పగా వేయలేరు. ఆయన పాదాలు ఒక్కసారి తాకినా మనం ధన్యులమే!

SA:

View Comments (3)