వేనోళ్ళ కొనియాడదగిన చిత్రకారుడు “కాళ్ళ “

(నవంబర్ 24కి చిత్రకారుడు “కాళ్ళ” కాలంచేసి రెండేళ్ళు గడిచినా, నేటికీ కాళ్ళ చిత్రాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. వెంటపల్లి జ్ఞాపకాలు… చదవండి…)

కల కరిగిపోతుంది . కాలం తరిగిపోతుంది, కరిగిన కలని కృషితో నిజం చేసుకోవొచ్చు, తరిగిపోయిన కాలాన్ని మాత్రం వెనుకకు తిరిగి తీసుకు రాలేము. అందుకే కాలం కంటే విలువైనది ఏమీ వుండదు ఈ లోకంలో. ఈ నవంబర్ 24కి చిత్రకారుడు “కాళ్ళ” కాలం లో కలిసిపోయి అప్పుడే రెండేళ్ళు గడిచిపోయాయి. క్రమంగా నేడు కాళ్ళను మనం మరిచిపోతున్నాము. కానీ ఆయన బ్రతికిన కాలంలో అతడు కన్న కలలు, ఆ కలలకు తన కుంచె ద్వారా సృష్టించిన రంగుల లోకాన్ని మాత్రం ఎప్పుడూ మనము  మర్చిపోలేము. కారణం ఆయన సృష్టించిన కళా ప్రపంచం సాధారణ  కాళాకారుడి సృష్టి లాంటిది కాదు . అసాధారణ మైన కళను సృష్టించి మనకు వదిలి వెల్లిన గొప్ప అరుదైన చిత్రకారుడు మనమంతా కాళ్ళ గా పిలవబడే కాళ్ళ సత్యనారాయణ.

కారణం లోకంలో కళాకారులంతా అందం,ఆనందం, ఐశ్వర్యం లేదా సౌందర్యం కోసం కళను సృష్టిస్తే కాళ్ళ మాత్రం ఆకలి కోసం కళను సృష్టించి వెళ్ళాడు. అనాదులకోసం , అన్నార్తులకోసం, ఆకలి భాదితులకోసం కడకంట తన కుంచెను విదిల్చి వెళ్ళాడు ఈలోకంలో. ఆయన సృష్టించిన చిత్రాల్లోని బడుగు జీవులు దురహంకార దుస్ష్ట శకుల్ని ప్రశ్నిస్తూ వుంటారు. కర్మాగార కర్కశ యంత్రాలమధ్య నలిగిపోయే కార్మిక వర్గం కసితో కదం తొక్కుతూ మనకు కనబడతారు. పెట్టుబడి దారుల పెత్తందారీ వ్యవస్థకు బలైపోయే బడుగు జీవులు హాహాకారాలని మనకు వినిపింప జేసి మనలో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేసాడు. ఆ చైతన్యంతో సమాజంలో వ్యక్తుల్ని కదిలించేలా చేసాడు. కసితో మనలిని కదిలిస్తాడు . తిరగబడేలా చేస్తాడు. మత దురహంకారుల దుర్మార్గపు దుష్ట చర్యలను ధైర్యంగా ఆయన చిత్రాల్లో ఎత్తి చూపాడు . నిర్భాగ్యుల నిశీధి నీడలను, విషాద చాయలను మనకు కనిపించేలా చేసాడు తద్వారా సమాజాన్ని ఒకింత ఆలోచించేలా చేసాడు తన చిత్రాల ద్వారా. ఖమ్మం లోని ఆ  పాత CPM ఆఫీస్ సందునందు కళా గ్రాఫిక్స్ అనే పేరుతో వుండే ఒక  చిన్న బడ్డి కొట్టులో ఏకాంతంగా పని చేసుకుంటూనే సామాజిక ఆర్ధిక రాజకీయ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను అతడు ఎలా వీక్షించాడో  మనకు తెలియదు, కానీ అవన్నీ తన చిత్రాల్లో ప్రతిబింబింప చేసేవాడు. సకల సౌకర్యాలున్న వాడికే సాధ్యం గానిది, కనీస వసతులు కూడా లేని ఆ బడ్డి కొట్టులో ఉంటూ వాటిని ఎలా వీక్షించాడో మనకు ఊహకందని విషయం. అందుకే అతని కళ సాధారణ స్థాయికి చెందింది కాదు  అసాదారణ స్థాయికి చెందింది .
కళాకారుడిగా ఆయన అసామాన్యుడే , కాని మనిషిగా మాత్రం అతడు అతి సామాన్యుడు. నిరాడంబరుడు. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో సాధారణంగా కనిపించే అతి సామాన్యమైన వ్యక్తి . డబ్బు, కీర్తిలపై మమకారం కాకుండా మేధా మానసిక ఆనందం, ఆత్మ సంత్రుప్తిలపై మమతను పెంచుకున్న వ్యక్తి. వొంటి ఆహార్యంపై అంతగా శ్రద్ధ ఓపికలు లేని ఈ బక్క మనిషి తాను నమ్మిన సిదాంతం కోసం మాత్రం  ఎప్పుడు నిక్కచ్చిగా నిట్ట నిలువుగా ధృడంగా నిలబడే తత్వం గల ఎంతో గట్టి మనిషి. మంచి పనులకు మంచువలే కరిగిపోయే మృదువైన వ్యక్తి . ఆత్మాభిమానంతో ఒకింత గర్వం కూడా నిండిన వ్యక్తి.

చదివింది ప్రాధమిక విద్యనే కాని కళాశాల విద్యార్దులు కూడా చదవని పుస్తకాలు అతడు చదివాడు. బాగా చదివాము అని విర్రవీగే మనుషులని సహితం తన జ్ఞాన సంపన్న విషయ చర్చలతో మమ్మల్ని విస్మయానికి గురిచేసేవాడు. తన మిత్రునిగా ఆయన గొప్ప తనాన్ని మనం చర్చిస్తే ఇందులో నాదేముంది, నాకొచ్చింది నేను చేశానంతే అంతకంటే ఇందులో నా గొప్పతనమేముందని అతిశయం ప్రదర్శించని గొప్ప వ్యక్తి పుట్టింది ఉత్తరాంధ్ర విజయనగరంలోనే అయినా చివరికంటా జీవించింది కళాసేవ చేసింది తెలంగాణా జిల్లా ఖమ్మంలో. నమ్మిన హరీష్ కోసం నవరత్నాలను సృష్టించి అంకితమిచ్చాడు. బాల్య మిత్రుడు జగమెరిగిన కార్టూనిస్ట్ మోహన్,హిందూ సురేంద్ర, మిత్రుడు శ్రీనివాస ప్రసాద్ ల ప్రస్తావన ఎక్కువగా మామధ్య వస్తుండేది అలాగే మిత్రులు. ప్రసేన్ , సీతారాం, శంకర్, అన్వర్ , నర్సిం, వేగుంట మోహన ప్రసాద్, కేశవరెడ్డి,జాతశ్రీ, గుర్రం సీతారాములు , చిత్రకారులు విన్సెంట్ వేంగో, డాలి , పికాసో, ముఖ్యంగా జర్మన్ చిత్రకారిణి  కేతే కోల్విజ్ గురించి బాగా చెప్పేవాడు . ఇక తెలుగు సాహితీ ఉద్దండులు చిత్రకారుల గురించి సరే సరి. తను నమ్మి వొచ్చిజీవితాంతం తనతో వున్న కోటమ్మగారికి ఎన్నో సేవలు చేసినా ఆమె తనకంటే ముందుగా పోవడం గురించి బాధపడేవాడు. తన పిల్లల గురించి, తనకు తోడుగా ఇంట్లో వుండే అబ్బాయి గురించి కూడా చెప్తుండేవాడు.

ఏడు పదుల వయసులో వున్నతనకి రేషన్ కార్డ్ కోసం, వృద్ధాప్య పించన్ కార్డ్ కోసం తిరిగి తిరిగి అలిసిపోయిన తనకు నేను చెప్పిన ఒక్క మాటతో వాటిని రెవిన్యూ అధికారులే  కాళ్ళ ఇంటికి తెచ్చి ఇచ్చేలా చేసిన ఆనాటి జాయింట్ కలెక్టర్ దివ్య దేవరాజన్ (నేటి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ) మేడంని , భద్రాచలం  నందలి ITDA  ప్రాజెక్ట్  అధికారిగా అమాయక గిజన ప్రజలకు ఆమె చేస్తున్న సేవలను బాగా మెచ్చుకునే వాడు. మోడు వారిన చెట్టును చిగిర్చి పువ్వులు పూయించారన్న కృతజ్ఞతా భావంతో అతడు వేసిన  బొమ్మను నేను , కాళ్ళ వెళ్లి దివ్య మేడమ్ కి ఇచ్చిన సందర్భం, రెండు మూడు సార్లు మా ఇంట్లో భోజనం చేసినప్పుడు నా శ్రీమతి వండిన  చేప పులుసును బాగా ఇష్టపడి  అమ్మ చేసిన వంటను గుర్తు చేససిన్దంటూ మెచ్చుకోవడం , మరల చివరి రోజుల్లో కాళ్ళతో కల్యాణి యూ ట్యూబ్ చానళ్ వారితో నేను ఇంటర్వ్యూ చేయించడం నిజంగా ఆయనతో నాకున్న కొన్ని తీపి గుర్తులు . ఇక నా మిత్రుడు బీర శ్రీనివాస్ , హార్రీ నవీన్లుకలిసి చేసిన చిత్ర ప్రదర్శన .మేము  తరచు ఫోన్ లోనే గాక . ముఖాముఖీ కలిసిన సందర్భాలలో కూడా ఆయనతో జరిపిన సంభాషణలు  నిజంగా మరువలేని ముచ్చట్లు .

గుంపులో గోవిందలా కాకుండా ఎంత కష్టంలో కూరుకున్నప్పటికి  తన బాటను విడువకుండా నమ్మిన సిద్దాంతంలో రాజీపడకుండా చివరిదాకా  నిఖార్సిగా నిలబడి  నడిచిన ఒక గొప్ప వ్యక్తితో మాకు అనుభందం ఏర్పడడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాము . పుట్టిన దగ్గరనుండి గిట్టిన వరకు కూడా ఒక ప్రత్యేకంగా సాగిన అతని జీవితాన్ని నిజంగా డాక్యుమెంట్ చేయవలసిన అవసరముంది. కాళ్ళ నేడు మనతో లేడు . కాని ఆయన జ్ఞాపకాలున్నాయి. ఆయన సృష్టించి వెళ్ళిన అపురూపమైన కళా సంపద వుంది . అతను ఉత్తరాంధ్ర కు చెందినా వాడైనా తన కళా సేవ అంతా చేసింది దక్షిణ తెలంగాణాకు చెందిన ఖమ్మం పట్టణంలో. కనుక అతని కళా సంపదను ప్రభుత్వం లేదా అతని కళాభిమానులు గుర్తించి ఖమ్మంలో అతని పేరుతో  ఒక కళా ప్రాంగణాన్ని నిర్మించి అందులో ఆయన చిత్రాలు పదిలపరిచిననాడే అతని కృషికి, కళా సేవకు మనం ఇవ్వదగిన నిజమైన నివాళి . కాళ్ళ మలి వర్ధంతి సందర్భంగా ఇది  కార్యరూపం ధరించాలని  కోరుకుందాం.

  -వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

12 thoughts on “వేనోళ్ళ కొనియాడదగిన చిత్రకారుడు “కాళ్ళ “

  1. వెంటపల్లి గారు మీలోని కవి ఉప్పొంగి ఆయన చిత్రాలను ఆత్మానందంతో అనుభవిస్తూ అక్షరాలను రంగులగా మార్చి మాకు మంచి చిత్రాన్ని పంపారు .కాళ్ళ గారికి అంజలి గటిస్తూ…….. రాధారాణి పట్నాల

  2. వెంటపల్లి గారు ,మీ లోని కవి ఉప్పొంగి ఆయన చిత్రాలను ఆత్మానందంతో అనుభవిస్తూ అక్షరాలను రంగులుగా మార్చి మాకు మంచి చిత్రాన్ని పంపారు ,కాళ్ళ గారికి అంజలి ఘటిస్తూ ….రాధారాణి పట్నాల

  3. వెంటపల్లి గారు మీరు ఈ ఆర్టికాల్ ని మీరు కలం తో కాదు మనసుతో రాసారు …చాలా బాగుంది .కాళ్ళగారి దివ్య స్మృతి కి నివాళులు అర్పిస్తున్నాను

  4. మంచి విషయం, ….. కాళ్లతో మన అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. ఆయన మనకు ఎన్నెన్నో గొప్ప జ్ఞాపకల్ని అనుభూతులు గా మిగిల్చి వెళ్లారు.
    ఆయనను కలవడం, ఆయనతో మాట్లాడటం గొప్ప అదృష్టం.

    కాళ్ళ గురించి రాయడం అంటే, అదీ తనను బాగా తెలిసిన మీరు రాయడం… నిజంగా పితృసమానులు కాళ్లకు ఇది…అక్షర నివాళి మీకు అభినందనలు.
    …….. శ్రీనివాస్ బీర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap