కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

ప్రసిద్ధ సంప్రదాయ చిత్రకారుడు, తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను ప్రతిబింబించే చిత్రకళను ప్రదర్శించిన ఆచార్య కొండపల్లి శేషగిరిరావు గారి వర్థంతి ( జులై 26) సందర్భంగా…

1973వ సంవత్సరంలో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ వేడుకలలో తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను తెలియపరచే విధంగా సాగిన చిత్రకళా ప్రదర్శనలో ప్రస్ఫుటంగా అందరినీ అలరించిన చిత్రం “తెలుగు వెలుగులు.” ఈ చిత్రంలో తెలుగు వారి సంక్షిప్తంగా, ఎంతో హృద్యయంగా రచించబడింది. సుమారు 60 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు గల చిత్రం మన రాష్ట్రంలో వున్న అతిపెద్ద చిత్రంగా నమోదయింది. ఈ కాన్వాసు విశ్వామిత్రుని చిత్రంతో ప్రారంభమై బూర్గుల రామకృష్ణరావు చిత్రంతో పూర్తవుతుంది. ఆ చిత్రం మధ్యలో తెలుగువారి ఆరాధ్య దైవమయిన శ్రీ కో వెంకటేశ్వర స్వామి చిత్రించబడ్డారు. ఆ చిత్రానికి ఇరువైపులా తెలుగు నేలను ఏలిన సామ్రాట్టులైన, శాతవాహనుడు, గౌతమీపుత్ర శాతకర్ణిలతో పాటు, వీరనారి రుద్రమ్మ లాంటి చారిత్రక రాజ వంశస్థులే కాక బౌద్ధ నాగార్జునుడు, త్యాగయ్య, అన్నమయ లాంటి వాగ్గేయకారులు, తెలుగు భాషకు శ్రీకారం చుట్టిన నన్నయ భట్టు, వేమన లాంటి ప్రజాకవి, సాహిత్య సమరాంగణ చక్రవర్తులైన రాజరాజ నరేంద్రుడు, శ్రీకృష్ణ దేవరాయలతో పాటు పరమత సహనానికి ప్రతీకగా నిలచిన కులీకుతుబ్షా, శిల్ప సౌందర్యానికి ప్రతీకగా నిలచిన వరంగల్ కాకతీయ తోరణం, రామప్ప దేవాలయంలోని నాగిణి, ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన నాగార్జునసాగర్, నాలుగు వందల సంవత్సరాల నగర సంస్కృతికి ప్రతీకగా నిలబడ్డ చార్మినార్ లాంటి వెన్నో చిత్రించబడ్డాయి. ఒక్క చిత్రంలో తెలుగు తనాన్ని అణువణువునా నింపి, తెలుగువాని గుండె దర్పంతో కొట్టుకునేలా చిత్రించిన అనన్య ప్రతిభాశాలి కొండపల్లి శేషగిరిరావు. ఆ పేరు వింటూనే చిత్రకళలో పండిపోయిన ఒక అతిరథుని మూర్తిమత్వం మన ముందు సాక్షాత్కరిస్తుంది. చిత్రకళా సాంగత్యంతో షష్ఠిపూర్తి చేసుకుని, నిలకడగా ప్రయాణం సాగిస్తున్న ఈ బహుదూరపు బాటసారి వ్యక్తిగత విషయానికి వస్తే…

వరంగల్ వద్ద ఉన్న పెనుగొండలో జనవరి 22, 1924 సంవత్సరంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆంధ్రా మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తిచేసుకొని, హైదరాబాద్ చేరుకొని 1942వ సంవత్సరంలో “హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’లో దీన దయాళు నాయుడు వద్ద చిత్రకళ నభ్యసించి, పరీక్షలలో మొదటి తరగతిలో మొదటి వానిగా నిలిచారు. 1945 సంవత్సరంలో కమలాదేవితో వివాహం జరిగింది. (ఈ దంపతులకు ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె కలదు). 1949లో “సంతాల్ నృత్యం” అన్న చిత్రం అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. 1958లో వేసిన ‘పరామర్శ’ (condolence) బంగారు మెడల్ సాధించింది. 1964లో ‘క్షమ’ అన్న చిత్రం కలకత్తాలో ఒల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇవన్నీ ఆయన సాధించిన విజయాలలో మచ్చుకు కొన్ని మాత్రమే. కైరో, ఇటలీ, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కౌలాలంపూర్ లాంటి దేశాలలో ఆయన చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. మన దేశంలో, ఇంచుమించు అన్ని రాష్ట్రాలలోనూ ఆయన చిత్ర కళా ప్రదర్శనలు జరిగాయి. N.T.R. పేరుతో కళాకారులకిచ్చే మొదటి అవార్డు కూడా ఆయనకే దక్కింది. శేషగిరిరావు వేసిన చిత్రాలలో ‘వరూధునీ ప్రవరుడు ‘పాండవ వనవాసం,’ దమయంతి’ లాంటి చిత్రాలు ఎక్కువ ఆకర్షించ బడటంతో ఆయన సాంప్రదాయ చిత్రకారుడు అనే అపవాదు ఏర్పడింది. ఈ చిత్రాలలో భారతీయ ఆత్మ, జాతీయ పద్ధతి ప్రస్ఫుటంగా ఉండటమే కారణం. ఆయన వేసిన వాష్ రంగుల చిత్రాలలో అవనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్ ముద్రలు కానవస్తాయి. అయితే బహుముఖ ప్రజ్ఞాశాలియైన శేషగిరిరావుగారి చిత్రాలలో మూడు శైలీ విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పైన పేర్కొన్నన విధానం అందులో ఒకటి మాత్రమే. పెన్సిల్, కలం, నీటి రంగులూ, నూనె రంగులు, టెంపెరా, వాష్ ప్రక్రియలు ఆయన చిత్రాలకు వాహికలు. ఆయన రేఖా చిత్రాలలో క్లుప్తత, సొగసు గీతలపై ఉన్న సాధికారతను మన ముందుంచుతుంది. ఆయన వేసిన ‘చెట్టు వేళ్లు’ లాంటి చిత్రాలలో ఇటాలియన్, పునర్వికాశ దశనాటి యథాతథ, వాస్తవ, కాల్పనిక ధోరణులు మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. ప్రకృతిలో దాగివున్న లయబద్ధమైన నిశబ్ద సంగీతానికి అద్భుతమైన దృశ్యరూపమీ చిత్రాలు. ఆయన వేసిన “రాయగిరి కొండ గుట్టలు” ఆయనలోని ప్రకృతి ప్రేమకు నిదర్శనాలు. ఆధునాతన పద్ధతిలో వేసిన “చనిపోయిన ఆవు,” “కోర్కెలు-చావు,” “రాజ్యాధికారం, “క్షమ” లాంటి చిత్రాలలో అంతర్జాతీయ నైరూప్యస్థాయి గల చిత్రకారుడు కనిపిస్తాడు. చిత్రకారునిగా ఆయనలో సామాజిక చైతన్యం వుంది. “ఆంధ్రప్రదేశ్ హరిజనోద్యమం” అన్న కుడ్య తైల వర్ణచిత్రం. ఆయన సృజనాత్మక నైపుణ్యానికి గీటురాయిగా నిలుస్తుంది. పేదల పట్ల, పేదరికం పట్ల స్పందన కలిగిన వ్యక్తి. ఆయన వేసిన అసంఖ్యాక చిత్రాలలో సాంఘిక అన్యాయాలను తూర్పార పట్టడం, అమానుషాలను ఆవిష్కరించడం జరిగింది.

Shakunthala by Kondapalli

సహజ సిద్ధంగా, వ్యక్తిగా, ఆయనలో వేదాంతి ధోరణి హెచ్చు కనుకనే ఆయన కళకు ఆధ్యాత్మికత ఆలంబనగా నిలచింది. ఒక విఖ్యాత చిత్రకారుని కళను వాఖ్యానించడానికి చేసే ప్రయత్నం అసంపూర్ణమూ, అసమగ్రమూ అవుతుందన్న తలపుతో, ఒకనాటి ఉదయం నేను ఆయనతో గడిపినప్పుడు ముందుగా ఆయన మేడపై గదిలో వున్న చిత్రాలను చూపించారు. అందులో ఒక చిత్రంలో రౌద్ర భంగిమలో ప్రథమ గణాలతో కూడి వెండికొండపై తాండవ నృత్యం చేస్తున్న శివుని చిత్రాన్ని చూపించారు. ఆ వెండికొండ క్రింద ఒక మూల గురుదేవు రవీంద్రనాథ్ ఠాగూర్ను చిన్నగా చిత్రించారు. ఈ పౌరాణిక చిత్రంలో ఠాగూర్ను ఎందుకు చిత్రించారన్నపుడు, ఆ చిత్రానికి ఠాగూర్ వ్రాసిన ఒక బెంగాలీ గీతం ప్రాతిపదికని

“మన్మోర్ మేఘరో సంగీతే
ఉడేచల్ దిగ్ దిగాంతారో నిష్యమ శూన్యే శ్రావణవర్షనోసంగీతే”

అనే ఠాగూర్ గీతాన్ని పాడి వినిపించారు. ఆ తరువాత ఆయనతో సాగిన ముఖాముఖిలో ఆయన చెప్పిన విషయాలు.
చిన్న తనం నుండే నాకు చిత్రకళపై మక్కువ వుండేది. నేను పద్యాలు నేర్చుకునే రోజులలోనే సాతాని బుచ్చయ్య పంతులు అనే ఆయన సరదాకు పలక మీద వేసిన కోతి బొమ్మ నాలో నిద్రాణంగా వున్న కళాకారున్ని మేలుకొల్పింది. మా డ్రాయింగు టీచరయిన మహ్మమద్ షరీప్ మా క్లాసులో అందరికన్నా నా బొమ్మలు బాగున్నాయి అని మెచ్చుకోవటమేకాక నన్ను ఎలిమెంటరీ పరీక్షలకు తర్ఫీదు చేశాడు. దానిలో నేను పాసయ్యాను. నాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘దీనదయాళు’ నాయుడు డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్స్ మాష్టారుగా మా స్కూలుకు బదిలీ అయి వచ్చాడు. ఆయన పాకాల అడవులలోనికి వెళ్ళి, చెట్లు, చేమలు, కాలువలు, జింకలు, పులులను చిత్రించి వచ్చేవాడు. ఆ చిత్రాలు నాలో చాలా ప్రభావం గావించాయి. ఆనాటి ‘భారతి’ పత్రికలలో వచ్చే వర్ణ చిత్రాలు, వాటి సంప్రదాయక రీతి నాకు చాలా ఇష్టమయింది. దీనదయాళ్ గారి ప్రోత్సాహంతో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ చేరి, ఐదు సంవత్సరాల అనంతరం ప్రథమ శ్రేణిలో ప్రథమునిగా ఉత్తీర్ణుడయినాను. తరువాత విశ్వభారతి శాంతినికేతన్ కు నవాబు మెహదీ జంగ్ నవాబ్ గారు పంపించారు. అక్కడ నందలాల్ బోసు, అవనీంధ్ర నాథ్ ఠాగూర్ వద్ద శిష్యరికం చేశాను. బనస్తరి విద్యాపత్ వద్ద కుడ్య చిత్రాలు శిక్షణ పొందాను. వివిధ శైలుల గురించి పరిజ్ఞానం కొనసాగింది. తరువాత స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ 1950 నుండి 1984 వరకూ అధ్యాపకునిగా, తరువాత ప్రొఫెసర్గా పనిచేసి, అనుభవం సంపాదించి అనేక మందికి చిత్రకళను బోధించాను. నేటికీ, ఈ వయస్సులో కూడా నాలోని జిజ్ఞాస లోపం లేకుండా సాగుతుంది. ఏదో నూతన ప్రక్రియలను, పోకడలను కనిపెట్టాలనిపిస్తుంది.

కాపీయిష్టుగా ప్రారంభమయిన జిజ్ఞాస సృజనాత్మక కళాకారునిగా పరిణమించింది. ప్రకృతిలో వున్న ఆనందం నుంచి చిత్రాలు సృష్టించే వాణ్ణి. క్రమేపీ ఆనందంలో నుండి ప్రకృతిని చిత్రించే స్థితికి వచ్చాను. సృష్టిలోని లయే ఆనందానికి మూలకారణమని తెలుసుకొన్నాను.

దుఃఖంలో సుఖాన్ని, వికారంలో అందాన్ని, నలుపులో తెలుపునూ, చీకటిలో వెలుగునూ, వెలుగులో రంగులనూ పరస్పరం గుర్తిస్తాం. ఈ ద్వందాలు కలిస్తేనే సృష్టి సంపూర్ణమవుతుంది. రెండూ ఒకటేనని తెలుసుకోవటమే జ్ఞానం. ఈ స్థితిలో స్థిరత్వం కలిగినవాడే కళకు సార్థకత ప్రాప్తిస్తుందని ఆశిస్తున్నాను, కళ ప్రకృతికి భాష్యంగా వర్ధిల్లాలి.

Abstract Art అని పిలువబడే ఈ అవ్యక్త చిత్రకళ 20వ శతాబ్దంలో ప్రారంభమయిన శైలి, ఇది అనేక ప్రయోగాలతో ప్రపంచ వ్యాప్తంగా వర్ధిల్లుతుంది. ఇందులో ప్రాకృతిక వస్తు రూపాలు, రూపాంతరం చెంది లయాత్మక రూపాలుగా ప్రజ్వలనం చెందుతాయి. ఈ అవ్యక్త కళ ఎవరికో గాని అర్థం కాదు. అందులో ఏదో వుందని అనుకోవటం తప్ప, నిజంగా అర్థమయి మెచ్చుకొనే వాళ్ళను వేళ్ళ మీద లెక్కించవచ్చు. కానీ ఈ శైలిని నేను పూర్తిగా నిరశించను. అందులో కొన్ని అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అది నిజం. అయితే అంతకు ఎన్నో రెట్లు ఎందుకూ కొరగానివి కూడా వచ్చాయి. కళా శైలి ఏదైనా అది చూపరులలో ఎక్కువ మంది అర్థం చేసుకొని ఆనందించేదిగా వుండాలి, లేకుంటే కళా ప్రయోజనం సిద్ధించదు.

పికాసో, డాలీలు గొప్ప చిత్రకారులు. ఎన్నో గొప్ప చిత్రాలు వేశారు. అదొక తిరుగులేని వాస్తవం. వారి చిత్రకళపై వందల కొద్దీ పుస్తకాలు వచ్చాయి. ఇంకా రావచ్చు కూడా. దానిలో వారి చిత్రకళపై అనేక పార్శ్వాలలో సమీక్షలు జరిగాయి. వీరి గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన దేమీ లేదు. అయితే ‘వారిరువురి ప్రభావం నా మీద లేదని చెప్పగలను.

నందాలాల్ బోస్, అవనీంద్రనాథ్ ఠాగూర్, చైనా, జపాన్, భారతీయ సంప్రదాయ నన్ను రీతులు బాగా ప్రభావితం చేశాయి. నా చిత్రకళలో వీటి ప్రభావం ఉంది.

నా జీవితంలో మరపురాని సంఘటనగా నేను భావించే దానిలో మొదటిది నవాబు మెహదీ నవాజ్ జంగ్ నాపై చూపిన పుత్రవాత్సల్యం. నన్ను ప్లిమత్ కారులో పక్కన కూర్చొని పెట్టుకొని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేర్చించారు. వారి ద్వారానే నాకు మహా కళాతపస్వి అయిన సాలార్ జంగ్ పరిచయ మయింది. ఒకనాడు సాలార్ జంగ్ ఆహ్వానంపై వారి ఇంటికి వెళ్ళినపుడు, సామాన్యంగా కనిపించే నన్ను భటులు లోనికి వెళ్ళనివ్వలేదు. బాల్కనీ నుంచి అది చూసి నన్ను గుర్తుపట్టిన సాలార్జంగ్ క్రిందకు వచ్చి నన్ను దగ్గరుండి తీసుకొని వెళ్ళారు. ఆయనతో సహ పంక్తిలో కూర్చొని భోజనం చేసి, టీ తాగాను. ఏ చిత్రకారునికి లభించని భాగ్యమది.

ఇక రెండవది కాకి పడవలని చెప్పబడే ఒక పురాతన (బహుశ 14వ శతాబ్దం నాటివి కావచ్చు). చిత్రకళా సంప్రదాయాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొని వచ్చాను. వెంకటయ్య. బానయ్య అనేవారు చెట్టు క్రింద కూర్చొని ఈ చిత్రాలను ‘ఏక్ అణా’, ‘దో అణా’ అంటూ అమ్ముకునే వారు. ఈ చిత్రాల ప్రశస్తిని గమనించిన నేను వాళ్ళను జగదీష్ మిట్టలు పరిచయం చేశాను. వారు వీటిని ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. వారికి ప్రభుత్వంలో ఊహించని గుర్తింపు లభించింది. అందుకు నాకు ఎంతో సంతృప్తి, ఆనందం.

మూడవది నా రీతిలో నేను చిత్రకళ ద్వారా ప్రజలను స్వాతంత్య్ర సమరోత్సాహంలో పాల్గొనేలా చిత్రాలు గీశాను. నన్ను ప్రొఫెసర్ ఎమిరిటస్ గా భారత దేశ ప్రభుత్వం 1980 నుంచీ గౌరవించింది. రామప్ప దేవాలయంలోని నంది మెడ చుట్టూ వున్న హారాన్ని ఎంతో విపులంగా స్పష్టంగా చిత్రించగలిగాను. ఈ నాటికి నా చిత్రమే ప్రమాణికంగా నిలచింది.

ఉత్తమ కళ కాలాతీతం, లయ వస్త నొందిన దానికి భూత భవిష్య దూర్తమానాలు ఏకమవుతాయి. ప్రాచీన కళ, ఆధునిక కళ అన్న పేర్లు వ్యావహారిక, చారిత్రక సంకేతాలు మాత్రమే. కళ కాల్పనిక మయినపుడు అనుకరణ ప్రసక్తి వుండదు. కళాకారుడు స్వతంత్రుడు. చిత్రకళ ఎన్ని రూపాలలో పిలువ బడ్డా నాలుగు కాలాలపాటు నిలచినదే ఉత్తమ కళగా భావించాలి.

ఇక చివరగా చెప్పవలసినది, చిత్రకారులలో ప్రకృతి రూపాలనే ఎన్నుకొన్నవాళ్ళు అధికం. దానికి కారణం ప్రకృతి మనల్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేయటమే. ఈ చేతన (consciousness) పెరిగి అది చేతనకు – అంటే బ్రహ్మజ్ఞానానికి (Super conception) కు దారి తీస్తుంది. అప్పుడే కళాకారుడు పై నుండి క్రిందకు చూడ గలుగుతారు. లయనే వస్తువుగా చేసి, రంగులను, రూపాలను సృష్టించగలుగుతాడు. లయ రూపాలకు కవచం, రూపాలకు లయ ప్రాణం. ఈ రెండూ సంధించినపుడే కళ జీవం పోసుకుంటుంది. ఈ విధమైన ఆనందంలోకి అడుగు పెట్టడానికి తపస్సు, సాధనం అవసరం. ఈ తపస్సుకు శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత చేత ధ్యానం, ధ్యానం చేత లయ సిద్ధిస్తాయి. రూప ధ్యానం వేడిని పుట్టిస్తుంది. ఆ వేడి రూపంలో నున్న భౌతికత్వం కరిగి భస్మమయి పోతుంది. దానిలో వున్న సారం మాత్రం జ్యోతి రూపంగా మిగులుతుంది.

తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై సగౌరవంగా ఆవిష్కరించిన కొద్దిమందిలో శేషగిరిరావు ఒకరు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్ర్తి, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీలతోపాటు ఎంతో మంది ప్రముఖులు ఆయన చిత్రాలను మెచ్చుకున్నారు. తెలంగాణ కాకిపడగలు, రామప్పదేవాలయం విశిష్టతను వివరించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. 1975లో ప్రపంచ తెలుగుమహాసభలకు ఆయన రూపొందించిన తెలుగుతల్లి పెయింటింగ్‌ ప్రశంసలు పొందింది. 1994 లో శేషగిరిరావును అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేకంగా సత్కరించారు. సంగీత ఆంధ్ర విజ్ఞాన కోశం ఎడిటర్‌ లక్ష్మిరంజన్‌, మ్యాక్స్‌ ముల్లర్‌భవన్‌ డైరెక్టర్‌ పీటర్‌ స్విడ్జ్‌ల అభినందనలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలిండియా ఫైన్‌ఆర్ట్స్ అండ్‌ క్రాఫ్ట్‌ సొసైటీల గౌరవం పొందారు.
హైదరాబాదు, మైసూరు, మద్రాసు, ఆలిండియా ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌, కోల్‌కతా అకాడమీ ఆఫ్‌ ఫైనార్ట్‌, ఏపీ లలిత కళా అకాడమీ అవార్డులను అందుకున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ పక్షాన 1988లో ఎమిరిటస్‌ ఫెలోషిప్‌ను, తెలుగు యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్‌ను ఆయనకు అందజేశారు. ప్రతిష్ఠాత్మక హంస అవార్డును కూడా ఆయన అందుకున్నారు.

ఆయన చిత్రకళా ప్రతిభను ‘సృజనాత్మక దిగంతాలుగా’ ఒక్క వాఖ్యంతో సంక్షిప్తకరించారు, ప్రఖ్యాత కళా విమర్శకులు, అరిపిల విశ్వం శేషగిరి రావు తన చిత్రకళపై తాను వ్రాసుకున్న చిన్న గేయంతో ఈ వ్యాసం ముగించటం సముచితమనిపిస్తుంది.
గీతనా పల్లవి : కాంతి కల్పనా క్రాంతి పథము దృక్కు దృశ్యమ్ము అమృత దీపమ్ము లిచట మధ శూన్యంబు రూప ప్రస్థాన యాత్ర.

శేషగిరిరావు 2012 జులై 26 న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన సందర్భంలో అన్ని తెలుగు , ఇంగ్లీష్ దిన పత్రిక లు వీరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేకంగా సంపాదకీయాలు వ్రాసాయి. ఈ చిత్రకళా యశస్వి కళా నైపుణ్యం అంతా వర్ణ చిత్రాలుగా, రేఖా చిత్రాలుగా వీరి కుమారుడైన కొండపల్లి వేణుగోపాల్ రావు స్వగృహంలో ( హైదరాబాద్ ) ‘ కొండపల్లి శేషగిరిరావు ఆర్ట్ గ్యాలరీ ‘ లో సందర్శనకు వీలుగా ఉన్నాయి. శేషగిరి రావు ప్రొఫెసర్ గా పనిచేసిన కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్ , జె.ఎన్ .టి.యు కళాశాలలో చిత్రకళా విభాగంలో అకెడమిక్ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న విద్యార్థికి ‘ స్టుడెంట్ ఎక్స్ లెన్సీ అవార్డ్ ‘ ను కొండపల్లి శేషగిరి రావు పేరు మీద వీరి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం నగదు బహుమతిగా అందజేస్తున్నారు.

  • కాండ్రేగుల నాగేశ్వరరావు

3 thoughts on “కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

  1. మన తెలుగు వారు గర్వంగా ఫీల్ అయ్యే మేటి చిత్రకారులు, శ్రీ శేషగిరి రావు గురించి ఎంతో విపులంగా, స్ఫూర్తిదాయకంగా వివరించారు. వారికి శతకోటి వందనాలు, మీకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap