నేడు కూర్మాపు నరసింహం 118 వ జయంతి సందర్భంగా …
కళింగసీమలో జన్మించి కళామతల్లి కృపాకటాక్షాలను ప్రసన్నం చేసుకోగల్గిన కళాతపస్వి కూర్మాపు నరసింహం. ఆయన పట్టిన కుంచె చిత్రలేఖనంలో సరికొత్త పుంతలు తొక్కితే, ఆ కుంచెనుండి జాలువారిన రంగులు సజీవ చిత్రకళా ఖండాలకు ఊపిరిలూదాయి. తాతతండ్రుల నుండి అనువంశికంగా సంక్రమించిన కళాతృష్ణకు స్వయంకృషి తోడు కావటంతో నరసింహం చిత్రలేఖనంలో నిష్ణాతులుగా రాణించారు.
దేశవ్యాప్తంగా పెక్కు రాజస్థానాలలో నరసింహం తైలవర్ణ చిత్రాలున్నాయి.
వీరు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామంలో 1902 నవంబర్ 2న జన్మించారు. చిట్టిమాచార్య వద్ద రంగుల ఓనమాలు దిద్ది సహజత్వానికి చేరువలో ప్రకృతి అందాలు రవివర్మకు ధీటుగా చిత్రాలు గీసి తన ఖ్యాతిని, శ్రీకాకుళం ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పారు. రూపచిత్రణలో నరసింహంది అందెవేసిన చేయి. వీరి నేతాజీ చిత్రం నేటికి నిత్య నూతనంగా వుంటుంది. వీరు చిత్రించిన రంగుల బాలాజీ చిత్రం తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రశంసలందుకొంది. గాంధీ సంచార సందర్భంగా చూసి, ఆయన నిలువెత్తు చిత్రపటాన్ని చిత్రించి, దాన్ని గాంధీజీకి అందించి ప్రశంసలు అందుకొన్నారు. వంశధార ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, నెహ్రూకు చూపించిన అభ్యుదయవాది. జపాన్లోని టోక్యోకు చెందిన బౌద్ధ బృందం శాలిగుండంలోని బౌద్ధ అవశేషాల్ని తిలకించి, నరసింహం ఆర్డు గ్యాలరీని 1981 డిశంబర్ లో తిలకించి, అందులో గల “బుద్దుని క్షీరనివేదనం” చిత్రం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారంటే అది ఆయన ప్రతిభకు నిదర్శనం.
శ్రీశైలం దేవాలయం ప్రాంగణంలో వున్న భ్రమరాంజ, శివాజీకి ఖడ్గాన్ని ప్రసాదిస్తున్న చిత్రాన్ని ఒకసారి పండిట్ నెహ్రూ చూసి చిత్ర సృష్టికర్త ఎవరని అడిగి చిత్రకారుడి ప్రతిభను ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన పోటీలలో వీరు చిత్రించిన బాలాజీకి ప్రత్యేక బహుమతి లభించింది. నరసింహం చిత్రాలు యింకా హైదరాబాద్ లోని సాలార్‌జంగ్ మ్యూజియంలోనూ, విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ వున్నాయి. వీరి ప్రజ్ఞకు ప్రమాణాలుగా నిలిచిన కొన్ని అపూర్వ చిత్రకళాఖండాలు శ్రీకాకుళంలోని శ్రీ నాగేశ్వరా ఫొటో స్టూడియో ఆవరణలో ఏర్పాటైన ఆర్డు గ్యాలరీలో కనిపిస్తాయి. కాలక్రమంలో గ్యాలరీ మూతపడింది. ఆయన సోదరుడు అప్పారావు కూడా చిత్రకారుడే. నరసింహం 1968 సెప్టెంబర్ 28 న పరమపదించారు. ఆయన కుమారుడు బుచ్చిబాబు ఆధ్వర్యంలో 2002లో నరసింహం శతజయంతి జరిగింది. ఈ సందర్భంగా ఒక విశిష్ట సంచికను ఆయన వర్ణ చిత్రాలు, ఫొటోలతో ప్రచురించారు.
– సుంకర చలపతిరావు
గొప్ప చిత్రకారుల పరిచయాలు మాకెంతో స్ఫూర్తిని ఇస్తున్నాయి… సుంకర వారికి అభినందనలు…
…… శ్రీనివాస్ బీర. ఆర్టిస్ట్.
ఓ మహా చిత్రకారుని గురించి చాలా ఆసక్తి కరమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు
బహుశా 1979-80లో మా బంధువు ఒకాయనతో ఈ ఆర్ట్ గేలరీ ని చూసాను. ధన్యవాదాలు