సురల గూటికి ‘కోటి వీరయ్య’

ప్రముఖ చిత్రకళా గురువు, అంకాల ఆర్ట్ అకాడమీకి పూర్వ కార్యదర్శి చల్లా కోటి వీరయ్యగారు నేటి ఉదయం భీమవరం లో కన్నుమూశారు. 91 వ సంవత్సరంలో అడుగిడిన కోటి వీరయ్యగారు గత నెల రోజులుగా అనారోగ్యంతో వున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. సినీ పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ గారు కోటి వీరయ్యగారికి స్వయాన బావమరిది.

మన సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానంవుంది. అందుకే ఆచార్యదేవోభవ అన్న నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా కళారంగంలో గురువుల పాత్ర ప్రముఖమైనది. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం వంటి కళావిద్యలు అభ్యసించాలంటే విద్యార్ధులకు ఎంతో ఓర్పుతో, నిస్వార్థంగా, నిబద్ధతతో విద్యాదానం చేసే గురువు లభించాలి. అలాంటి లక్షణాలు కల్గిన చిత్రకళోపాధ్యాయులలో భీమవరానికి చెందిన చల్లా కోటి వీరయ్యగారొకరు. గత నాలుగు దశాబ్దాలు ఎందరో యువకులను భావిచిత్రకారులుగా తీర్చిదిద్దిన ఘనతవీరిది. అలాగే మాష్టారుగారి దగ్గర చిత్రకళను అభ్యసంచి పేరుపొందిన వారిలో సినీ పబ్లిసిటీ డిజైనర్ గా పేరొందిన గంగాధర్ గారు ముఖ్యులు. వీరి శిష్యుల్లో ఇంకా గ్రంథి అప్పారావు, పట్నాల భాస్కర్, కొచ్చెర్ల వెంకటేశ్వరరావు, వాసు, 64 కళలు.కాం సంపాదకులు కళాసాగర్ లాంటి వారెందరో వున్నారు.

కోటి వీరయ్యగారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1932 సం. ఏప్రియల్ 12న చల్లా మల్లయ్య, మంగమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. సుప్రసిద్ధ చిత్రకారులు శలా వెంకటరత్నం, అంకాల వెంకట సుబ్బారావు, అల్లూరి సత్యనారాయణరాజుగార్ల వద్ద చిత్రకళాభ్యాసం చేసి, మద్రాసు ప్రభుత్వం నుండి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు.

కోటి వీరయ్యగారు అల్లూరి సత్యనారాయణ రాజుగారి దగ్గర నీటిరంగు చిత్రాలు (wash technique) పద్దతి నేర్చుకోవాలనే కుతూహలంతో ప్రతీరోజు భీమవరం నుండి రాయలం సైకిల్ మీద వెళ్ళేవారు, ఉదయం 6 గంటల కల్లా రాజుగారి ఇంటి దగ్గర ఉండేవారట. అప్పుడే నిద్రలేచిన రాజుగారు “వీడికి ఎప్పుడు తెల్లారింది రా! అని అనేకునేవారట, దీన్ని బట్టి కోటి వీరయ్యగారిలోని పట్టుదల, ఉత్సాహం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన మనకు తెలుస్తుంది.

Art by Kotiveerayya

వీరు 1950 సం.లో జిల్లా పరిషత్ హైస్కూల్, పాలకోడేరులో డ్రాయింగ్ టీచర్ గా చేరి నాలుగు దశాబ్దాల పాటు వేలాది చిన్నారులకు బొమ్మలు గీయడంలో శిక్షణయిచ్చి పదవీ విరమణచేశారు. వీరికి 1948లో చంద్రమ్మగారితో వివాహమైంది. 1950 నుండి భీమవరంలో ‘చకోవి ఆర్ట్ సెంటర్’ను నిర్వహిస్తూ, భీమవరం పరిసర ప్రాతాలలోని విద్యార్థులకు చిత్రకళలో తర్ఫీదు ఇచ్చి తమిళనాడు ప్రభుత్వ డ్రాయింగ్ లోయర్, హైయ్యర్ గ్రేడ్ పరీక్షలకు పంపించేవారు. ఈ క్రమంలో ఎంతోమంది డ్రాయింగ్ టీచర్లగాను, కమర్షియల్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు.

Koti Veeraiah with students

అంకాల ఆర్ట్ అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తు, అకాడమీ తరపున ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండ విద్యార్థిని, విద్యార్థులకు Spot Drawing Competetion మరియు చిత్రకారులకు రాష్ట్రవ్యాప్తంగా పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. ఈ పోటీలలో potrait painting competetion మరియు స్త్రీలకు నిర్వహించే, ఎంబ్రాయిడరి, బొమ్మలు, మొదలగు రంగాలలో విశేషంగా చిత్రకారులు పాల్గొనేవారు.

గత ఫిబ్రవరి 23న భీమవరంలో అంకాల ఆర్ట్ అకాడెమీ-నూతన భవనం ప్రారంభోత్సవ సందర్భంగా అకాడెమీకి సుధీర్ఘ కాలం పాటు కార్యదర్శిగా తన సేవలందించిన సీనియర్ చిత్రకారులు చల్లా కోటివీరయ్య గారిని సత్కరించారు.

కోటివీరయ్య గారి మృతికి 64కళలు.కాం ఎడిటర్ కళాసాగర్, చిత్ర కళాపరిషత్ కార్యదర్శి సుంకర చలపతిరావు, విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు అల్లు రాంబాబు గార్లు వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

4 thoughts on “సురల గూటికి ‘కోటి వీరయ్య’

    1. కోటి వీరయ్య గారి మరణం తెలుగు వారికి తీరని లోటు. వారు నింగికీగినా, వారు సాన పెట్టిన కళాసాగర్ గారు లాంటి వజ్రాలు వారి ప్రతిభాపాటవాలను ప్రపంచానికి రుచి చూపిస్తున్నారు. కోటి వీరయ్య గారిని చిరంజీవిని చేస్తున్నారు. వారికి చిత్రకళాకారులు అందరి తరఫున కళా నీరాజనాలు, నివాళులు.

  1. చల్ల కోటి వీరయ్య గారి పేరు విన్నాను వారి గురించి ఇప్పుడు తెలుసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను .
    గొప్పచిత్రకారుడుకి శ్రద్దాంజలి

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap