మహిళలూ రాణించగలరు – లావణ్య

శ్రీమతి మెరుగు లావణ్య గారు, సరూర్ నగర్, హైదరాబాద్.
స్వతహాగా గృహిణి. ప్రవృత్తి పరంగా ఆర్టిస్ట్.
“వివాహం విద్యా నాశాయ” అంటారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో, పెళ్ళయితే అంతే. ఇల్లు, భర్త, పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. కొత్తగా నేర్చుకోవడం లాంటివేమీ ఉండవన్న విషయం సహజం. ఇది ఒక్కొప్పటి సంగతి.”
లావణ్య గారు డిగ్రీ చదువుతుండగానే అంటే 19 ఏళ్ళ వయసులోనే వివాహం జరిగింది. తర్వాత బి.యస్.సి. వరకు చదివారు. కుటుంబంతో సాదాసీదా గృహిణిగా ఉండిపోవల్సిందేనా అనుకుంటూ ఉండగా, లావణ్య గారి అమ్మమ్మ, తాతయ్య ప్రోత్సాహం కొండంత బలమిచ్చింది.
పెళ్ళయ్యి మూడు దశాబ్దాలుగా ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో మొదట బ్యూటీషియన్ కోర్సు చేశారు. ఇంట్లోనే బ్యూటీ క్లినిక్ నిర్వహించారు. భర్త గారి ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వచ్చేసారు. 2006 లో కళల పట్ల ఆసక్తి కలిగింది. ముందుగా సెట్విన్ సంస్థలో ఆరు నెలల పాటు ఫ్యాబ్రిక్ పేయింటింగ్ ను, తర్వాత ఎంబ్రాయిడరీని, ఆ తర్వాత ఆయిల్ పేయింటింగ్స్ ను నేర్చుకున్నారు. తృప్తి అన్పించక మలకపేట్ లో శ్వేత శుక్ల గారి వర్క్ షాపులో పూర్తి స్థాయిలో టెర్రకొటా, జ్యూవలరీలోను, సిల్క్ థ్రెడ్ జ్యూవలరీలోను శిక్షణ తీసుకున్నారు. అలాగే ప్రావీణ్యం సంపాదించారు. సరదాగా మొదలయిన విద్య, శిక్షణలతో లావణ్య గారి ఊహాత్మకమైన ఆలోచనలతో, ఉత్సాహంతో వందల కొద్దీ డిజైన్లలో జ్యూవలరీలను తయారు చేశారు. వీటి తయారీలో కష్టమైనా, ఇష్టంతో చేయడం వల్ల ఆ కష్టం కనిపించలేదని, అయితే తయారీ వేరు. మార్కెటింగ్ వేరు. గృహిణి కావడం, పరిచయాలు లేకపోవడంవలన తగినంతగా మార్కెట్ చేసుకోలేక, తెలిసినవాళ్ళకు బహుమతిగా ఇచ్చేసారు. మహారాష్ట్ర వర్లీ టైబ్రల్ ఆర్ట్ లోను శిక్షణ తీసుకుని చిత్రాలు గీశారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఫ్యాషన్ డిజైనింగ్ మీదకు మనసు మళ్ళటం మరో ఎత్తు. ఏడాది శిక్షణ కాలంలో మరో కొత్త ప్రపంచాన్ని చూశారట. నీతా లుల్లా వంటి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్లు, ఫ్యాషన్ స్టైలిస్టుల ఇచ్చే సలహాలు, సూచనలతో ముందుకు సాగిపోతున్నారు.
ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పుడంటే అప్పుడు, నచ్చిన కళను యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ, గురుముఖతః నేర్చుకునే విద్యయితే మరింత రాణిస్తుందన్న నమ్మకంతో సరైన గురువును వెతికి సమయాన్ని, ధనాన్ని వెచ్చించి నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజుకి ఆరేడు రంగాలలో రాణిస్తున్నానంటే నా కుటుంబ సభ్యులు ఆర్థికంగాను, ప్రోత్సాహిస్తూ నన్ను ఈ కొత్త ప్రపంచానికి పరిచయం చేసారని” వివరించారు.
అటు కుటుంబాన్ని, ఇటు కెరీర్ నూ బ్యాలెన్స్ చేస్తున్న లావణ్య గారిని చూసి తనకంటే చిన్నవారు, తోటి విద్యార్ధినులు “సంతూర్ మమ్మీ” అని పిలుస్తూవుంటే చాలా హోదాగానూ, సరదాగానూ, గర్వంగానూ వుంటుందన్నారు. తనతోటి మహిళలంతా కలిసి గోండు ఆర్ట్ ఆధారంగా రూపొందించిన డిజైన్లు “గోన్ కుడీస్” ప్రదర్శనలు ఇస్తున్నారు. భవిష్యత్ లో “ఫ్యాషన్ డిజైనింగ్” రంగంలోను, మరియు కళారంగంలోను తనదైన ముద్రను నిరూపించుకోవాలన్న “తపన-ఆలోచన-ప్రయత్నం” లో వున్నానని వ్యక్తపరిచారు.
కళారంగంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 150 దాకా చిత్రాలను రూపొందించడం జరిగిందని, కొన్ని బహుమతులుగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీ సమయంలో, సమయాన్ని వృధా చేయకుండా చిత్రకళను చేస్తున్నానని తెలిపారు లావణ్య గారు. చేసినంతవరకు తృప్తిగా వున్నా, ఇంతవరకు ఎక్కడా ఎలాంటి ప్రదర్శనలలో పాల్గనలేదని, కేవలం హాబీగానే చేస్తున్నానని తెలిపారు.
చివరిగా “కుటుంబ సహకారం, ప్రోత్సాహం లభిస్తే ప్రతి ఇల్లాలు తనేమిటో నిరూపించుకోగలరని” శ్రీమతి మెరుగు లావణ్య గారు నవ్వుతూ అన్నారు.

డా. దార్ల నాగేశ్వర రావు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap