శిల్ప, చిత్రకారిణి కుమారి దార్ల రాఘవ కుమారి కి ‘మాదేటి రాజాజీ స్మారక పురస్కారం’
_____________________________________________________________________
ఆచార్య మాదేటి రాజాజీ గారి జయంతోత్సవం అక్టోబర్ 5 వ తేదీన రాజమండ్రి దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు గారి అధ్యక్షతన భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ మరియు రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సభలో చిత్రకారులు మాదేటి రాజాజీ గారి స్మారక పురస్కారాన్ని 5 వేల రూపాయలు నగదుతో, మోమోంటో శాలువాలతో రాజమండ్రి కి చెందిన ప్రముఖ శిల్ప, చిత్రకారిణి కుమారి దార్ల రాఘవ కుమారి గారిని సత్కరించడం జరిగింది.
ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సన్నిధానం నరసింహ శర్మ గారు మాట్లాడుతూ ‘రాజమహేంద్రిలోని పూర్వ చిత్రకళ చరిత్రను మననం చేసుకుంటూ.. రాజాజీ గారు ఆర్ట్ గ్యాలరీ కి చేసిన సేవా కాలాన్ని స్వర్ణయుగంగా పోల్చారు. అద్భుతమైన చిత్రకళా సాధన చేస్తూ అసంఖ్యాకమైన శిష్యులను చిత్రకళలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారని రాజాజీ గారి సేవలను కొనియాడారు.
మద్దూరి శివసుబ్బారావు గారు మాట్లాడుతూ “భావి తరాలకు ఈ చిత్ర కళాదీప్తిని అందించేందుకు అందరూ సమాయత్తం అవ్వాలని, దానికి కావాల్సిన సహకారాన్ని తాను అందించగలరని” తన ప్రసంగంలో తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి ఎన్.వి.పి.ఎస్ ఎస్.లక్ష్మి మరియు మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ గార్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రికి చెందిన ప్రఖ్యాత చిత్రకారులు పి.ఎస్ ఆచారి గారు, కరణం నూకరాజు గారు, పట్నాల రాధారాణి, బాపిరాజు గారు, నారాయణమూర్తి గారు, రవికాంత్ మొదలైన చిత్రకారులు, కవులు, కళాభిమానులు పాల్గొన్నారు.
–కళాసాగర్ యల్లపు
కళా సాగరునికి అనేక ధన్య వాదములు.!
కలలను ప్రోత్సహించడంలో మొదటి వరుసలో నిల్చున్న మీకు శతకోటి అభివాదములు.!
ఉదయం జరిగిన కార్యక్రమాన్ని వెంటనే పాఠకులకు అందించారు. ధన్యవాదములు.!