లలిత కళాసేవలో ‘మామిడిపూడి కృష్ణమూర్తి’

భువిపై ఒక వేకువ కారణమౌతుంది మరో వైపు రేయికి. వేకువ సృష్టించిన వెలుగు శాశ్వతం కాదు అలాగే రేయి సృష్టించిన చీకటీ కూడా శాశ్వతం కాదు. అవి రెండూ నిరంతర పరిణామాలే. నిండు పున్నమి నాటి పండు వెన్నెల మనసుకు నిజంగానే హాయిగొల్పుతుంది. కానీ అదీ శాశ్వతం కాదు దానివెంబడే మరలా అమావాస్య సృష్టించిన కటిక చీకటి కూడా వస్తుంది.మరల పౌర్ణమితెచ్చిన పండు వెన్నెలకూడా. ఇలా జీవితం కూడా నిరంతర పరిణామమే. ఒకపరి ప్రకాశవంతమైన వెలుగులో మరొకపరి అస్పష్ట మైన చీకటిలో.. జీవితం వెలుగునీడల సమ్మేళనమే గాదు ఒక అందమైన రంగుల సమ్మేళనం కూడా. అలాంటి అందమైన అనుభవాల స్మృతుల సారంగా సాగిన ఒక చిత్రకారుడి జీవన యాత్ర ఇది…

దాదాపు రెండేళ్ళ క్రితమనుకుంటాను.. ఒకానొక వేసవి సంధ్యా సమయంలో ఒక లాంగ్ రింగ్ టోన్ నా మొబైల్ లో. అది దేశీయమైన కాల్ కాదు అని తెలుస్తుంది. ఖచ్చితంగా అది ఇంటర్ నేషనల్ కాల్. కానీ ఎవరబ్బా ఇతర దేశాలనుండి మనకు కాల్ చేసేవారూ అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసాను. అవతలనుండి ఒక గంభీరమైన మధుర స్వరం హలో అంది. ఆ స్వరంలో ఎంతో సుదీర్గ మైన ఒక అనుభవ శాలి కనిపించాడు. ఒక గొప్ప వున్నతమైన వ్యక్తిత్వం కనిపించింది. నేను కూడా ఇవతల నుండి హలో అని పలకరించాను. అవతలనుండి ఆయన చెప్పుకొస్తున్నారు . ముందు తన వివరాలు తెలియ జేసి తాను కొంత కాలంగా 64kalalu.com లో నేను రాస్తున్న చిత్రకళా వ్యాసాలూ చూస్తున్నానని చాలాబాగా రాస్తున్నారని అభినందన తెలియజేయాలని మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తున్నానని అంత పెద్ద మనిషి అల్లంత దూరం నుండి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడం ఒక ఆనందానికి ఒక కారణమైతే , కళాపరంగా తన జీవితంలో ఎన్నో అనుభవాలు చవిచూసి మాత్రు దేశానికి వేలమైళ్ళ దూరంలో నేడు తన కుటుంభ సబ్యులతో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఆయన తరచుగా నాకు కాల్ చేస్తూ సుధీర్గమైన తన జీవనప్రస్థానంలో ప్రోది చేసుకున్న మధురమైన జ్ఞాపకాలను వివరిస్తూ వుండడం మరింత ఆనందదాయకంగా అనిపిస్తుంది . అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నుండి దాదాపు ప్రతీ వారానికి ఒకసారన్నా కాల్ చేస్తూ చిత్రకళా పరంగా తన అనుభవాలను నాతో పంచుకుంటూ నాకు మిక్కిలి ఆనందాన్ని కలగజేస్తున్న ఎనబై ఆరేళ్ళు నిండిన ఆ కళా మూర్తి మామిడిపూడి కృష్ణ మూర్తి గారు.

Mamidipudi Krishna Murthy painting

తొలిసారిగా వారు నాతో మాట్లాడిన సందర్భంలో తాను నెల్లూరు వాసినని. మామిడి పూడి రామ క్రిష్నయ్య గారి అబ్బాయినని చెప్పగానే నాకు అత్యంత ఇష్టమైన చరిత్రకారులు మామిడిపూడి వెంకట రంగయ్య గారు గుర్తుకు వచ్చి అడిగాను .వెంటనే వారు మా పెదనాన్న గారని, తన తండ్రి రామ క్రిష్నయ్య గారు, రంగయ్యగారు ఇరువురూ సొంత అన్నదమ్ములని చెప్పారు. అప్పటినుండి నాకు మరింత ఆనందకరంగా మారింది మా సంభాషణ , కారణం నేను చరిత్ర ప్రధానాంశంగా స్నాతకోత్తర విద్య నభ్యసిస్తున్నకాలంలో చరిత్ర గ్రంధాలు ఆంగ్లంలో రాసిన రొమిల్ల థాపర్ ,ఆర్ ఎస్ శర్మ, ఆర్. సి. మజుందార్, డి.డి. కోశాంబి, వి.డి. మహాజన్ ,తారా చాంద్ లాంటి వారి గ్రందాలకంటే డిగ్రీ వరకు తెలుగు మీడియం లో చదివిన నాకు ఒక్కసారిగా ఎం.ఏ. లో ఆంగ్లమాధ్యమం కావడంతో ఆంగ్లంలో గల పై రచయితల గ్రందాలకంటే ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారు భారత స్వాతంత్ర పోరాటానికి సంభందించి పై వాటికి దీటుగా తెలుగులో సవిరంగా రాసిన మూడు సంపుటాలు చాలా గొప్పగా అనిపించాయి. అంతే గాకా ఆంగ్లంలో ఫ్రీడం స్ట్రగుల్ కి సంభందించి తార చాంద్ ఎంత వివరంగా చరిత్ర రాసాడో అంత వివరంగానూ ఆనాటి భారత సామాజిక ఆర్ధిక రాజకీయ స్తితిగతులు, ఆంగ్లేయుల రాకకు, వారు స్థిరపడడానికి దారితీసిన పరిస్తితులు,ఆంగ్ల విద్య ప్రభావంతో వచ్చిన చైతన్యం, స్వాతంత్రపోరాట వివరాలు అన్నీ కూడా ఈ మూడు సంపుటాలలో వర్ణించిన తీరు ఎంతో గొప్పగా అద్భుతంగా వుంటుంది. సరళమైన మంచి భాషతో సవివరంగా పై ఆంగ్ల గ్రంధాలకు దీటుగా ప్రామాణికంగా వుండడంతో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారు నాకు బాగా నచ్చిన చరిత్రకారుడిగా నా మనసులో ముద్ర పడిపోయారు. ఆయన ఇంకా ఎన్నో చరిత్ర, సామాజిక, ఆర్ధిక విషయాలకు సంభందించి అటు ఆంగ్లం మరియు తెలుగులో కూడా ఎన్నో ప్రామాణిక గ్రంధాలు రచించడం జరిగింది. ఎప్పుడో 1970 లలో వెలువడిన ఆ గ్రంధాలను మావూరు ప్రక్క నున్న వెల్ల గ్రామ పంచాయితీ గ్రంధాలయంలో నాడు వాటిని చదవడం జరిగింది. ఇదంతా 30 ఏళ్ళ క్రిందటి మాట . ఎప్పుడో 70 లలో వెలువడిన ఆ గ్రంధాలు మరల ఇటీవల పునర్ముద్రితమై రావడం విశాలాంద్ర బుక్ స్టాల్ హైదరాబాద్లో నాకు కనబడడంతో వాటి అవసరం ప్రస్తుతం నాకు లేకున్నప్పటికి విలువైన ఆ గ్రందాలు నాకు అందుబాటులో వుండాలనే వుద్దేశ్యంతో వెంటనే వాటిని కొని నా వ్యతిగత లైబ్రరీ లో భద్రపరుచుకున్నాను.

Sketch by H V Ramgopal

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే గొప్ప చారిత్రక నేపధ్యం గల వ్యక్తుల పరిచయం నిజంగానే మనసును ఉత్తేజితులను చేస్తుంది. అందుకే ఈ వివరణ . కారణం మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఎంతటి గొప్ప విధ్యావేత్తనో వారి సోదరులు మరియు ప్రస్తుత మన వ్యాసమునందలి కథానాయకుల తండ్రి గారైన మామిడిపూడి రామకృష్ణయ్య గారు కూడా గొప్ప రచయిత వీరు యాబైలలోనే భారత భాగవత రామాయణాలను తనదైన శైలిలోరాసి మంచి ప్రామాణిక గ్రంధాలుగా వెలువరించారు . 1965లో వెలువరించిన ఆ నాలుగు గ్రంధాలలో మన కృష్ణ మూర్తి గారు భారత భాగవత రామాయణ భగవద్గీత ఘట్టాలకు సంభందించి వేసిన నాలుగు చిత్రాలు తో పాటు నాటి ప్రముఖ చిత్రకారులు ఎచ్ .వి.రాం గోపాల్ గారు వేసిన వీరి నాన్న గారి ప్రోపయిల్ స్కేచ్ కూడా వాటిల్లో ఎంతో జీవకళ వుట్టి పడినట్టుగా వుంటుంది .

నాటి గొప్ప కళాకారులందరికీ సుపరిచులైన శ్రీ కృష్ణ మూర్తి గారు నేటి తరం చిత్రకారులకు ఎవ్వరికి తెలియకపోవడం విచిత్రం .కారణం పదవీ విరమణ అనంతరం వీరు దేశానికి దూరంగా వారి పిల్లల తో అమెరికానందలి వర్జీనియా రాష్ట్రంలో స్థిరపడడం. ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం అప్పటికి మరో రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు చిత్రకళా వికాసానికి దోహదపడ్డ ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమి కి పరిపాలనా అధికారిగా ప్రారంభం నుండి 1985 లో అకాడమి తెలుగు విశ్వ విద్యాలయం లో సంలీనం అయ్యే వరకూ అకాడమి లో ఆయన నిర్వహించిన పాత్ర ఎంతో అపారమైనది., ఒకనాడు ప్రముఖ చిత్రకారులుగా వెలుగొందిన హెచ్ వి రాంగోపాల్, అంట్యాకుల పైడి రాజు. పి.టి. రెడ్డి, వడ్లమాని మధుసూదనరావు, కొండపల్లి శేషగిరిరావు, పి.ఆర్. రాజు, సంజీవ్ దేవ్, ఆచార్య మాదేటి రాజాజీ, వి. వి. టోమ్పే, వెల్లటూరి పూర్ణానంద శర్మ, ఆశపు అప్పారావు , సూర్య ప్రకాష్ , గౌరీ శంకర్, దొరై స్వామి , పి ఎస్ చంద్రశేఖర్, బి.ఏ రెడ్డి, శీలా వీర్రాజు ఎస్.వి.రామారావు లాంటి ప్రముఖ చిత్రకారులు చిత్రకళాభిలాషులు, సాహిత్యకారులు సంగీత కళాకారులందరితో వీరికి అనుభంధం ఉండడం విశేషం . ప్రస్తుతం రాష్ట్రంలోని మన కళాకారులకు ఎంతో దూరంలో అమెరికా నందలి వర్జీనియా రాష్ట్రంలో వుంటూ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నేటి మలి వయసులో కూడా అప్పుడప్పుడూ కుంచెకు పనిచెబుతూ ప్రకృతి చిత్రాలు జలవర్నాల్లో వేస్తూ వాటిని నాకు అప్పుడప్పుడూ మెయిల్ చేస్తుంటారు .

M Krishna Murthy painting

కృష్ణమూర్తి గారు తన సర్వీస్ లో వుంటుండగా హైదరాబాదు లో వేసిన చిత్రాలు ప్రస్తుతానికి రెండు మూడు మాత్రమే నాకు లభ్యమయిన కారణంగా 1993 లోనే హైదరబాద్ వీడి అమెరికాలో స్థిరపడిన తర్వాత 86 ఏళ్ల వయసులో నేటికి అప్పుడప్పుడూ వేస్తున్న ప్రకృతి చిత్రాలు మాత్రమే నాకు అందుబాటు లోకి వచ్చాయి. వాటిని గమనిస్తే నిజంగా అద్భుతం అనిపిస్తుంది జల వర్ణాల్లో ఆయన వేసిన ప్రకృతి చిత్త్రాల్లో ని విశాలమైన పచ్చిక బయళ్ళు, గుబురు చెట్లు , గలగలపారే సెలయేరులు, వసంత కాలపు విరబూసిన చెట్ల పొదలు, కొండలు, గుట్టలు, పచ్చిక మైదానాల మధ్య నీటి కొలనులు అత్యంత సహజంగా మనకు కనిపించి కంటికి ఒక ఆహ్లాదాన్ని కలిస్తాయి. చిత్రకళా విధ్యనబ్యసిస్తున్న కాలంలో వారు తనతండ్రి గారి భారత భాగవత రామాయణ గ్రందాల్లో వేసిన చిత్రాలు అలాగే 1965లో వేసిన వయ్యారపు నగ్న సుందరి ఇంకా మరొ ఇద్దరి స్త్రీ మూర్తుల చిత్రాలు వీరి ప్రతిభకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.

Krishna Murthy nude art

ఇక కృష్ణ మూర్తి గారి నేపధ్యం లోకి వెళ్తే వీరు 24-05-1935న నెల్లూరు నందు శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్య ,ఇందిరమ్మ అనే దంపతుల యొక్క పదహారుగురు సంతానంలో ఎనిమిదవవానిగా వీరు జన్మించారు. ప్రాధమిక విద్యనుండి కళాశాల విద్య వరకూ కూడ నెల్లూరు లోనే విద్య అభ్యసించారు. బాల్యం లో చిత్రకళపై ఏమాత్రం ద్రుష్టి పెట్టని వీరు 1952 లో తాను ఇంటర్ చదువుతుండగా తమ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే చిత్రకళా పోటీలలో పాల్గొనాలనే కోరిక కలిగి అంతవరకు రంగులు బ్రష్ లు ముట్టని క్రిష్ణమూర్తి గారు వేరే ఇతర స్కూల్ నందు చదువుతున్న తన చెల్లెల్లకి వారి డ్రాయింగ్ మాస్టర్ కొని ఇచ్చిన రంగుల పెట్టె నందలి రంగులు బ్రష్ లు వుపయోగించి అప్పటికి బాగా ప్రాచుర్యంలో నున్న భారతి మాస పత్రిక మరియు ఒక కాలెండర్ లోని ఎనిమిది బొమ్మలను చిత్రించి కళాశాల పోటీలకు పంపగా డ్రాయింగ్ మరియు పైయింటింగ్ రెండు విభాగాలలోనూ ప్రధమ బహుమతులు గెల్చుకున్నారు .ఐనప్పటికీ ఆ తర్వాత కూడా చిత్రకళను గురించి పెద్దగా ద్రుష్టి పెట్టలేదు ఆపై 1954నాటి ఒక వేసవిలో తన నాన్న గారి చిన్ననాటి మిత్రుడు కాకినాడ పి ఆర్ కళాశాలలో సహా విద్యార్ధి అయిన ప్రముఖ చిత్ర కారులు హెచ్.వి. రామ గోపాల్ గారి తండ్రి మన కృష్ణమూర్తి గారి తండ్రికి నెల్లూరు లేఖ రాస్తూ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చిత్రకళను అధ్యయనం చేసి ప్రస్తుతం అక్కడే చిత్రకళాచార్యుడిగా పని చేస్తున్న తన కుమారుడు రాంగోపాల్ ఒక పనిమీద నెల్లూరు వస్తున్నాడని తనికి నెల్లూరు నందు తెలిసిన పెద్దలను పరిచయం చేయవలసిందిగా రాసిన లేఖ లో కోరిన విదంగా హెచ్.వి. రాం గోపాల్ నెల్లూరు వచ్చినప్పుడు మన కృష్ణ మూర్తి గారి ఇంట్లో బస చేయడం అప్పుడే వీరు తనకు తెలియ కుండా భారతి పత్రికలో వచ్చిన రాంగోపాల్ చిత్రాలనే కాపి చేసినవాటిని ఆయనకే చూపించినప్పుడు బాగా అనుకరించావ్, కొన్ని ఒరిజినల్ కి దగ్గరగా వున్నాయని మెచ్చుకుని కుర్రాడిని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేర్పించవలసిందిగా కోరడంతో కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చేరమని చెప్పిన తన తండ్రి కోరిక మేరకు 1956 లో B.A. డిగ్రీ పూర్తి చేయడం జరిగింది, ఇలా డిగ్రీ చదువుతున్న కాలంలోనే తీరిక దొరికినప్పుడల్లా మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి వెళ్లి అక్కడ తరగతులు స్టూడెంట్స్ ని దర్శించడం జరిగేదని చెప్తారు. ఆ సమయంలోనే తన నెల్లూరుకు చెందిన వేగూరి శివకోటారెడ్డి, ఉదయగిరి శ్రీరాములు .డి భాస్కరరావు అనే ముగ్గురు విద్యార్దులు ఆ కళాశాల విధ్యార్డులుగా వుండడం వలన తరచూ వీరిని కలుస్తూ వుండేవారు .

Landscape art

1956 లో 2500వ బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా జగ్గయ్య పేట సమీపంలో వున్నముక్త్యాల రాజా వారు బుద్దుని జీవితం వారి ప్రవచనాలను ప్రభోదించే విదంగా ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుకు రాజా వారు హెచ్.వి రాంగోపాల్ గారిని ఆహ్వానించగా తన పదిహేను మంది శిష్యులతో ఆయన అక్కడకు బయలుదేరినప్పుడు మన కృష్ణ మూర్తి గారిని కూడా ఆ బృందంతో తీసుకెళ్లడం జరిగిందని చెప్తారు .. నెలరోజుల పాటు జరిగిన ఆ ప్రదర్శన ఏర్పాట్లలో తాను ఎన్నో చిత్రకళా మెలకువలను నేర్చుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది జూన్ మాసంలో మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రవేశానికి నోటిఫికేషన్ పడగా అప్లై చేసి పరీక్ష రాయడం పరీక్షలో తను చూపిన ప్రతిభ ఆధారంగా ఆనాటి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ శ్రీ దేవి ప్రసాద్ రాయ్ చౌదరి నేరుగా రెండవ సంవత్సరంలో చేర్చుకోవడంతో ఆరు సంవత్సరాల కోర్స్ ఐదు సంవత్సరాలకే అనగా 1961 లో కోర్స్ ఆఖరి సంవత్సర పరీక్షలు రాసి ప్రధమ శ్రేణి లో ఉత్తీర్నులయ్యారు .చిత్ర కళను అభ్యసిస్తున్న కాలంలో కోర్స్ నిభందనల ప్రకారం ప్రతీ ఏటా ఒక నెలరోజులపాటు దేశంలోని ప్రఖ్యాత చారిత్రక చిత్ర శిల్పకళా ప్రదేశాలు దర్శించే అవకాశం వుండడంతో దేశంలో ఎన్నో ప్రాంతాలు విద్యార్ధి దశలో చూడడం జరిగిందని అంతే గాకా ఆనాడు మద్రాస్ లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రఖ్యాత చిత్రకారులు ఎస్ యెన్ చామ్కూర్ , బాపు రమణలు, చందమామలో పనిచేసే శంకర్, వడ్డాది పాపయ్య లతో పాటు ఎం.టి.వి. ఆచార్య, మాధవపెద్ది గోఖలే, జి.వి. సుబ్బారావు తదితర కళాకారులను తరచుగా కలుసుకుంటూ వుండేవారు. 1961 లో చిత్రకళా విద్య ఆఖరి సంవత్సరం పరీక్షలు ముగుసిన తర్వాత పలితాల కోసం వేచిచూస్తున్న కాలంలోనే శ్రీ ఎస్. యెన్. చామ్కూర్ గారి సిపారసు మేరకు మద్రాస్ లో శ్రీ కె నాగేశ్వరరావు ఆర్ట్స్ గారి వద్ద చలనచిత్ర పరిశ్రమలో పబ్లిసిటి లెయౌట్ ఆర్టిస్ట్ గా విజయావారి గుండమ్మ కథ , జగదేక వీరుని కథ ఇంకా తమిళంలో మరి కొన్ని చిత్రాలకు పని చేసారు. అనంతరం మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ శ్రీ కె ఏం ఫణిక్కర్ గారి సలహాతో బెంగుళూరు నందు కామన్ వెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ అనే ఒక అంతర్జాతీయ్ సంస్తలో ఆర్టిస్ట్ గ జాయినయ్యారు.క్రిమి కీటకాలబొమ్మలు మాత్రమే గీసే అక్కడపని తనకు రుచించక దానిని వదిలి పెట్టిన కొన్ని రోజులకే మరలా తమిళనాడులోని కోయం బత్తూర్ కి దగ్గరలో మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బ్లాక్ డెవెలప్ మెంట్ ఆఫీసర్లకి శిక్షణ ఇచ్చే సంస్థలో ఒక ఆర్టిస్ట్ ఉద్యోగం కాళి వుంది ఇష్టమైతే జాయిన్ కావచ్చని మరలా పన్నిక్కర్ సర్ చెప్పిన సూచనమేరకు వెళ్లి జాయిన్ కావడం జరిగింది. అక్కడ సెంటర్ ప్రచురించే పోస్టర్స్ కి డిజైన్స్, లేఔట్ లు, పబ్లిసిటీ మెటీరియల్ డిజైన్ చేయడం లాంటిపనులు ఉండేవని చెప్తారు. శ్రీ కృష్ణమూర్తి గారు తెలుగు తో బాటు ఇంగ్లీష తమిళ్ లోనూ కూడా బాగా మాట్లాడడం వీరి పనితనం అక్కడ అందరికి నచ్చడంతో ఆ సంస్థ డైరెక్టర్ వీరిని బాగా ఇష్టపడేవారు. ఈ లోగ అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్త వత్సలం గారు ఈ సంస్థ ను విజిట్ చేయడానికి వస్తున్నారని తెలిసి అక్కడ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారికి మంచి అందమైన సన్మాన పత్రాన్ని చేసి బహుకరించాలనే తలంపును కృష్ణ మూర్తిగారి ముందు పెట్టడం దానిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాడు ముఖ్యమంత్రి గారి చొరవతో అక్కడ భావానీ సాగర్ ఏరియాలో ఏర్పడిన పలు సంస్థలను ప్రతిబింబిస్తూ వారి పోర్త్రయిట్, అందమైన కాలిగ్రఫి తో రాతతో వీరు తయారు చేసిన మంచి సన్మాన పత్రం అక్కడకు విచ్చేసిన ముఖ్యమంత్రి భక్తవత్సలం గారికి అమితంగా నచ్చి చిత్రకారున్ని స్టేజ్ పై పొగడడంతో ఆ సంస్థ డైరెక్టర్ తో పాటు సంస్థ సభ్యులందరిలో ఒక మంచి ప్రాధాన్యత వీరికి ఏర్పడడం జరిగింది .ఆ తర్వాత రెండేళ్లపాటు అక్కడ పని చేసి ఆ సంస్థ డైరెక్టర్ మరియు ఇతర సభ్యుల ఆదరాభిమానాలను చూరగొన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ నందు కొత్తగా ఏర్పడిన లలితకళా అకాడమి కి కార్యనిర్వాహణాధికారి పోస్ట్ కి సంభందించిన నోటిఫికేషన్ పడడంతో డిగ్రీ మరియు చిత్రకళలో డిప్లమో కూడా వున్న వీరు అప్లై చేయదలచి వారి డైరెక్టర్ కి చెప్పడంతో కృష్ణమూర్తి గారిని వదులు కోవడం వారికీ ఇష్టం లేకున్నప్పటికి చిత్రకారుడి భవిష్యత్హు దృష్ట్యా ఓకే చెప్పడమే గాక అకాడమీకి ఒక రికమండేషన్ లెటర్ కూడా రాసి కృష్ణ మూర్తి గారి అప్లికేషను ని ఫార్వార్డ్ చేసిన దరిమిలా హైదరాబాదు నందలి అకాడమి కార్యనిర్వాహణాధికారి పోస్ట్ కి వచ్చిన 15 మందిలో కృష్ణమూర్తి గారిని సెలెక్ట్ చేసి వెంటనే కొత్త పోస్టులో జాయిన్ కావాల్సిందిగా ఆర్డర్స్ రావడంతో 1964లో అప్పటివరకు తాను పనిచేస్తున్న సంస్థ యొక్క డైరెక్టర్ గారి ఆశీస్సులతో తమిళనాడులోని భవానిసాగర్ నుండి ఆంధ్రప్రదేశ్ నందలి హైదరాబాదుకు తన మజిలిని మార్చడం జరిగింది.

Geetopadesam by Krishna Murthy

1964లో కృష్ణమూర్తి గారు అకాడమి లో జాయిన్ అవడానికి మూడేల్ల క్రితమే అకాడమి బొగ్గులకుంట నందలి ఆంద్ర సారస్వత పరిషత్ ప్రాంగణమునందలి రెండు షాపులవంటి గదుల్లో వుండేదని ఒక గదిలో కార్యాలయం, రెండు టేబుల్లు, బీరువాలు, ఒక టైపు రైటర్ ,మరో గదిలోని రెండు బీరువాల్లో అప్పుడే నాంది పలికిన గ్రంధాలయం అటకపై అప్పటివరకూ కొనుగోలు చేసిన చిత్రాలు ఒక పెద్ద టేబుల్ దాని చుట్టూ ఒక పది, పన్నెండు కుర్చీలు వుండేవని చెప్తారు. వీరు అకాడమి లో చేరడానికి కొన్ని నెలల ముందు సంగీత సాహిత్య లలితకళల మూడు అకాడమీలకు అధ్యక్ష, కార్యదర్శిలతో కలిపి ఒక బిల్డింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని నాడు అధ్యక్షులుగా నూకల నరోత్తమ రెడ్డి గారు ,కార్యదర్శిగా శ్రీ ఎల్ యెన్ గుప్తా ఐఏఎస్ గారు వుండేవారని ,ప్రభుత్వంలో సీనయర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రీ గుప్త గారే బిల్డింగ్ కమిటీకి కూడా కన్వీనర్ గా వుండేవారని కేంద్రం లోని రవీంద్ర భవన్ లా మూడు అకాడమీలకి స్వంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది కమిటీ లక్ష్యం.అప్పటి రాష్ట్ర P.W.D మినిస్టర్ ఏ. సి. సుబ్బారెడ్డి గారి చొరవతో రవీంద్ర భారతి వెనుకవైపు ఐ. జి. పోలీసు ఆఫీసు కి ఎదురుగా వున్న భూమిని కొనుగోలు చేసి భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. నాటి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కొనుగోలు చేయడమేగాక భవన సముదాయనిర్మానానికి నాడు ఒక లక్ష ఎనబై వేల రూపాయలు కూడా మంజూరు చేసిందని దీనికి కేంద్ర ప్రభుత్వము కూడా మరో లక్ష మంజూరు చేయగా వీరు అక్కడ వుద్యోగంలో చేరిన నాలుగు నెలలకు నిర్మాణ పనులు ప్రారంబించారని కృష్ణమూర్తి గారు చెప్తారు .ఒక్క సంవత్సర కాలంలో పూర్తి అయిన భవనాన్ని నాటి ఉప రాష్ట్ర పతి సర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రారంబించి కళాభవన్ అని పేరు పెట్టడం జరిగిందని నాటి విషయాలు తెలియ జేసారు. దీనిలో ఆంద్ర ప్రదేశ్ లలితకళా అకాడమి ఆర్ట్ గాలరీ, ఆఫీసు లైబ్రరీ ,మీటింగ్ హాల్, స్టోర్ రూం, గ్రాఫిక్ వర్క్ షాపు లాంటి వసతులతో నిర్మించబడింది. దీనితో అంతవరకూ అరకొర వసతులతో బొగ్గుల కుంట లో నడుస్తున్న అకాడమీని నూతన భవనంలోకి మార్చడం జరిగిందని నాటి విషయాలను తెలియజేశారు .

రాష్ట్రంలో చిత్ర శిల్ప కళల వికాసానికి ఏర్పడిన అకాడమి తన రెండున్నర దశాబ్దాల కాలంలో చేసిన కృషిని వారు పలుమార్లు తెలియజేస్తుంటే నేడు అలాంటి అవకాశం లేకుండా పోయిందే అని బాధ మనకు కలుగుతుంది.

Artist Monograph printed by Telugu University

చిత్రశిల్పకలా వికాశంలో బాగంగా అకాడమి కొన్ని ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటుచేసి స్థానికంగా వారికి ప్రోత్సాహం వుండేలా చేసేడిది. తరచుగా జాతీయ అంతర్జాతీయ కళాకారులచే సెమినార్లు, కార్య శాలలు, ప్రదర్శనలు చేస్తూ ఒక ఉత్సహా పూర్వక వాతావరణం కల్పించేదని ,అకాడమి తరపున మంచి విలువైన పుస్తకాలు, సానీర్లు, బ్రోచర్లు ముద్రించి చిత్రకారులలో మంచి అవగాహనను రేకెత్తించేది . ఔత్సాహిక చిత్రకారులకు ఉన్నత కోర్సులకోసం ఎందరికో స్కాలర్ షిప్పులను కూడా మంజూరు చేసేదని ఇంకా అకాడమి తన ఇరవై రెండేళ్ళ లో24 వార్షిక చిత్రకళా ప్రదర్శలనను ముప్పై జాతీయ ప్రదర్శనలను మరియు నలబై అంతర్జాతీయ చిత్ర కళా ప్రదర్శనలు నిర్వహించిందని వారు చెప్తారు . దేశంలో ఏ అకాడమి వేయని విదంగా ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమి చిత్రకళపై విశేష కృషి చేసిన అంట్యాకుల పైడి రాజు, పి.టి. రెడ్డి, వడ్లమాని మధుసూదనరావు కొండపల్లి శేషగిరి రావు, సయ్యద్బిన్ మహమ్మద్, సి ఎస్ యెన్ పట్నాయక్,కాపు రాజయ్య,లక్ష్మా గౌడ్, సూర్య ప్రకాష్, ఉస్మాన్ సిద్దికి, గౌరీ శంకర్, పి.ఆర్. రాజు,దొరై స్వామీ ఇంకా ఎంతో మంది గొప్ప చిత్రకారుల మొనోగ్రాపులను పబ్లిష్ చేసింది. దాదాపు వెయ్యి చిత్రాల వరకు అకాడమి తరపున కొనుగోలు చేయడం జరిగిందని చెప్తారు .

ఇంకా లేపాక్షి చిత్రకళ పై , ఆంద్ర పైంటింగ్ ఆఫ్ రామాయణ ,ఆంద్ర నాట్య రీతులపైనా, మొక్కపాటి వారి భాగవత రేఖా చిత్రాలతో రామప్ప శిల్పకళను గురించి ఎన్నో విలువైన పుస్తకాలను కూడా ప్రచురించిందని తెలియజేశారు .

నాడు దేశంలో వివిధ రాష్ట్రాలలోని అకాడమీల కంటే ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమి ఎంతో మెరుగైన రీతిలో చిత్ర శిల్పకళాభి వ్రుద్హికి కృషి చేస్తుందని దీనిని మిగిలిన రాష్ట్రాల అకాడమీలు ఆదర్శంగా తీసుకోవాలని జుస్తిస్ జి డి ఖోస్లా కమిటీ తెలియజేసిందని ఇలాంటి తరుణంలో కొన్నిరాజకీయ వ్యక్తి గత స్వార్ధ కారణాలు తోడై 1985 లో స్వయంగా కళాకారుడైన ముఖ్యమంత్రే నాటి నార్ల వెంకటేశ్వర రావు గారి రిపోర్ట్ ఆధారంగా అర్ధాంతరంగా అకాడమీలను రద్దు చేసి తెలుగు యూనివర్సిటీలో విలీనం చేయడం ద్వారా నేటి సంగీత సాహిత్య చిత్ర శిల్ప కళా ప్రగతికి తిలోదకాలిచ్చినట్లయిందని వాపోయారు

లలిత కళా అకాడమి రద్దు కావడానికి ముందు వీరు అదునిక ఆంద్ర చిత్ర కళను గురించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసి దానిని కార్య వర్గం ముందు ప్రతిపాదించవలెనని వీరు అనుకున్నారు కాని అకాడమి ఉనికినే ప్రశ్నార్ధకంగా మారిన అలాంటి తరుణంలో ఆ ఆలోచనకు ఆస్కారం లేకుండా పోయిందని వాపోతారు అకాడమిలో చేరిననాటినుండి వీరు చిత్రకారులందరి జీవన చిత్రాలకు సంభందించి ఆంద్ర మరియు తెలంగాణా ఇరు ప్రాంతాలకు చెందిన వారికి సంభందించిన ప్రెస్ కట్టింగ్స్, కాట్లాగ్స్, బుక్స్ నుండి సేకరించిన సంక్షిప్త సమాచారము, ఫోటోగ్రాఫ్స్ ఇలా విభజించుకున్న సమాచారాన్ని7,8 పైళ్లలో వీరు భద్రపరచడం జరిగిందని అయినప్పటికీ వీరిలో కొందరి చిత్రాలు మాత్రమే అకాడమి సేకరణలో వున్నాయని ఇంకా చాలమందివి సేకరించవలసిన అవసరమున్నదని అందుకు తగిన ప్రణాళికను కూడ వేయాల్సి వున్న ఆ తరుణంలో అకాడమి రద్దు కావడంతో ఆ బృహత్ పధకం కార్యరూపం దాల్చలేదని వాపోతారు .అయినప్పటికీ కొన్ని పరిమితులతో అంచెలంచెలుగా ముందుకు వెళ్లేందుకు పధకం ఆలోచించి అందులో బాగంగా మన ఆధునిక తెలుగు చిత్రకళకు అంకురార్పణ గావించిన మన తొలి తెలుగు చిత్రకారులలో దివంగతులైన ఒక ఇరవైమందిని గుర్తించి వారి చిత్రాలను సేకరించి వాటితో ప్రదర్శన చేయాలన్న ప్రతిపాదనను నాటి తెలుగు విశ్వ విద్యాలయ కులపతి ఆచార్య తూమాటి దొణప్పగారి ముందు పెట్టగా వారు సహృదయంతో దానికి ఆమోదం తెలిపై ఆ భాద్యత తనపై పెట్టినారని తెలియ జేశారు .

కులపతి దోణప్ప గారు ఆమోదించిన ప్రతిపాదనను కార్యరూపంలోకి పెట్టడానికి వీరు తన సహా చరులు శ్రీ జి వెంకట రెడ్డి అన్న వారితో కలిసి ఆంద్ర రాష్ట్రం అంతటి తో పాటు మద్రాస్ కూడా వెళ్లి ఎట్టకేలకు 13 మంది చిత్రకారుల ఒరిజినల్ చిత్రాలను సేకరించి వాటికి సరిఅయిన మౌంట్ లు ప్రేం చేయించి ఒక ప్రదర్శనను Exhibition of works of renowned Telugu Artists of Yester years అనే మకుటంతో ఒక చిత్ర ప్రదర్శనను 08-11-1988 నుండి 17-11-1988 వరకు నిర్వహించారు. ఈ ప్రదర్శనను అప్పటి రాష్ట్ర సాంస్కృతిక శాఖా మాత్యులు శ్రీ జే .పుష్ప రాజ గారు ప్రారంబించారని తెలియ జేశారు . అంతే గాకుండా ప్రదర్శనకు వుంచిన పదమూడు మంది చిత్ర కారుల చిత్రాల్లో ఒక్కొక్కటి చొప్పున సచిత్ర మైన రంగులలో “తెలుగు ప్రతిభా ప్రభాత రేఖలు “అన్న పేరుతో “ప్రచురించిన కాటలాగ్ ను నాటి పత్రికలు అపురూపమైన కాటలాగ్ గా ప్రశంసించడం జరిగింది . దివంగత చిత్రకారుల ప్రదర్శన తర్వాత మరల తెలంగాణా ప్రాంత చిత్రకారుల విశేషాల తో కూడా మరో ప్రదర్శన చేయవలసి వున్నప్పటికీ విశ్వవిద్యాలయ నిర్వాహకులు పెద్ద సుముఖత వెలిబుచ్చని కారణంగా అది కార్యరూపం దాల్చలేదని చెప్తారు.

దేశంలోని ఇతర అకాడమిలు మన అకాడమీని ఆదర్శంగా తీసువాలని పేరు గాంచిన మన లలితకళా అకాడమీని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్య కారణంగా నామరూపాలు లేకుండా పోవడం శోచనీయమని వాపోతారు శ్రీ కృష్ణమూర్తి గారు.

దాదాపు రెండున్నర దశాబ్దాల అకాడమి చరిత్ర అలా ముగియగా దాని స్థానంలో ఆవిర్భవించిన నేటి తెలుగు యూనివర్సిటీలో ఒక గ Glorified Clerk గా మిగిలిపోయీ తాను వయసురీత్యా 1993 ఫెబ్రవరి 28న వుద్యోగ విరమణ చేసానని , అనంతరం తన యొక్క ముగ్గురు కుమార్తెలు అబ్బాయి అమెరికాలో స్థిరపడినందున ప్రస్తుతం వారి కుటుంభ సబ్యులతో నాటి జ్ఞాపకాలను ఇలా అభిరుచి వున్న నాలాంటి వ్యక్తులతో పంచుకుంటూ అప్పుడప్పుడూ చిన్నపాటి చిత్ర రచన జేస్తూ విశ్రాంతి జీవితం గడుపుతున్నారు.

Krishna Murthy art

ఇక చిత్ర రచన విషయానికి వస్తే అకాడమిలోకి చేరకముందు వీరుకూడా ఎన్నో చిత్రాలు వేయడం జరిగింది వాటికి కొన్ని వివిధ ప్రదర్శనలలో పలు బహుమతులూ కూడా అందుకున్నారు. దీనిలో. వాటిలో ముఖ్యంగా 1965 నాటి ఆకాడమి వార్షిక ప్రదర్శన పోటీలలో తాను చిత్రించిన Recycling Nude అన్న చిత్రానికి ప్రధమ బహుమతి రావడం జరిగింది.హైదరా బాద్ ఆర్ట్ అసోషియేషన్ పోటీలలోనూ కూడా పలు బహుమతులు సాధించారు. అయితే అకాడమి లో పని చేస్తున్న కారణంగా పోటీలలో ప్రభావితం చేస్తున్నారు అన్న అప ప్రద తొలగించుకోవడంలో బాగంగా తర్వాత వీరు పోటీలకు పెద్దగా పంపించే వాణ్ని కానని అయితే అకాడమి పరంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న క్రమంలో దేశంలోని బొంబాయి కలకత్తా, మద్రాస్, డిల్లి, లక్నో,చండీఘర్ మొదలైన పట్టణాలలో జరిగే ప్రదర్శనలో తన చిత్రాలను ప్రదర్శించానని తెలియజేశారు.. వీరి చిత్రాలు కొన్ని తెలుగు యునివర్సిటీ, సాలార్జంగ్ ముజియం ,రాష్ట్ర ఆర్కియాలజీ మ్యుజియం తో పాటు కొందరి ప్రైవేట్ వ్యక్తుల కలక్షన్లో కూడా వున్నట్టు తెలియజేసారు. వాటి ఫోటోల గురించి కూడా అడుగగా అన్ని అకాడమి ఫైల్స్ లలో నేటి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉండిపోయాయని తాను రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఉండిపోవడాన నేను మీకు అందించ లేకపోతున్నానని తెలియజేశారు.ఇటీవల కాలంలో తీరిక సమయంలో వాటర్ కలర్స్ లో వేసినకొన్నీ ప్రకృతి చిత్రాలు వారు పంపించడం జరిగింది.

ఒకనాడు అకాడమినందు కీలకమైన స్తానంలో వుండి నాడు అందరి ప్రముఖ కళాకారుల దృష్టిలో వుండే శ్రీ కృష్ణమూర్తి గారు నేటి తరం వారెవ్వరికీ తెలియని ఒక కళాకారుడిగా మిగిలిపోవడానికి కారణం తన మాతృభూమికి దూరంగా వేరే దేశంలో స్థిరపడిపోవమే. అందుకే సుదీర్గ అనుభవంగల ఈ చిత్రకారుడి గురించి నేటి మన చిత్రకారులకు కూడా తెలియ జేసే వుద్దేశ్యంతోనే ఇటీవల రాజమండ్రి చిత్ర కళానికేతన్ వారు వరదా వెంకటరత్నం గారి గారి 125 వ జయంతి సందర్భంగా వరదా గారి చిత్రకళా వైచిత్రి గురించి రూపొందించిన యు ట్యూబ్ వీడియో పరంపరలో ఒక సంచికలో వీరిచే కూడా మాట్లాడించే ప్రయత్నం చేయడం జరిగింది. నాటి కాలంలో చిత్ర, శిల్ప కళాకారులకు అకాడమి ద్వారా ఎంతటి ప్రాత్సాహం లబించేదో వివరిస్తే నేటి కళా కారులమైన మనం అకాడమీ లేకపోవడం వలన ఎంతటి అవకాసం కోల్పోతున్నామో తెలుస్తుంది. అందుకే నేటి తన 86 వ పుట్టిన రోజు సందర్భంగా ఆనాటి అనుభవాలసారంతో నేటి కళాకారులకు అకాడమి పునరుద్ధరించు కోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసేలా ఒక గ్రంధం తీసుకు రావాలని తద్వారా అందరిలో అకాడమి కాంక్ష రేకెత్తి తరిగి పునరుద్దరణ జరిగిన రోజు మరల మన తెలుగు చిత్రకళా లోకానికి ఒక నూత నుత్తేజం రావాలని వస్తుందని ఆశిద్దాం.

-వెంటపల్లి సత్యనారాయణ

Krishna Murthy art

23 thoughts on “లలిత కళాసేవలో ‘మామిడిపూడి కృష్ణమూర్తి’

 1. మంచి ఆర్టికల్, ఈకాలం వారికి వీరు ఆదర్శంగా ఉంటారు….అభినందనలు, మీ ఇరువురకు..

 2. చాలా చాలా గొప్ప శీర్షిక ప్రచురించినందుకు ధన్యవాదాలు. గొప్ప కళాకారుని గురించి తెలుసుకున్నాను. కృష్ణమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

 3. Thanks kalasagar garu for the article on MK. Mamidipudi venkata rangaiah is our grand father. My father’s own chinnana

 4. వెంటపల్లిగారు చాలా ఆనందం. విదేశంలో స్థిరపడి దాదాపుగా విస్మృతీకి గురైన ఒక గొప్ప కళాకారుణ్ణి మన తరానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వ్యాసం ఎత్తుగడ ఎంత బాగుందో అంత ఉదాత్తంగానూ శ్రీ మామిడిపూడి కృష్ణమూర్తి గారి కళాప్రస్థానాన్ని వివరించారు. 86 ఏళ్ళ వయసులో ఏమాత్రం వణుకు లేని కుంచెతో వారు చిత్రించిన లాండ్ స్కేపుల్లో కంటిమేరను దాటిన పచ్చని మైదానాల అంతులేని వైశాల్యాలు మైన్యూట్ డీటెయిల్స్ తో గొప్పగా అబ్బుర పరుస్తున్నాయి. ఆ కళామూర్తికి పాదాభివందనం – మాకినీడి సూర్య భాస్కర్

 5. తెలుగు జాతికి గ్రహణం పట్టింది ఒకనాటి వైభవం అంతరిన్మ్చిపోతుంది .అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు నేడు కనబడడం లేదు ఆర్టిస్టుల గురించి మీరు రాసే విధానం ఎంతో చక్కగా వుంటుంది.మామిడి పూడి కృష్ణమూర్తి గారి అర్టకల్ నిజంగా ఎంతో స్రద్ధత్తో రాసి ఎన్నో వివరాలను మాకు అందించారు ఈ సందర్భంగా మా గురుదేవులు శ్రీ సయ్య్ద్బిన్ బిన్ మహమ్మద్గారు కొండపల్లి శేషగిరిరావు గారు గౌరీ శంకర్మోదలైన వాళ్ళందరిని ఈ ఆర్టికల్ లో గుర్తు చేసినందుకు చాలా సంతోషం అయ్యింది .మీ ఆర్తికాల్స్ ద్వారా పరిచయమైన ఆర్టిస్ట్ ల చిత్రాలతో బాటు వారి జీవన విధానం మనస్తత్వం అన్ని కలిసి సంపూర్ణంగా వుంటాయి .మాకు తెలియని ఒక మంచి చిత్రకారులు శ్రీ మామిడి పూడి కృష్ణమూర్తి గారి పరిచయంద్వారా మాకు లలితకళా అకాడమి విషయాలను కూడా ఎన్నింటినో తెలియపరచిన వెంటపల్లి సత్యనారాయణ గారికి,కళాసాగర్ గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు

 6. Ventapalli garu your article on Mamidipudi Krishna Murthy is of good standard in terms of presentation , history part , common man’s language , preface and what not . My heartful appreciations to you as a writer as well as an artist . Finally it is worthy article conveying good message , thank you Ventapalli garu

 7. Very good article Ventapalligaru. You shared Many things unknown about Sri Krishna Murthy garu. Thank you very very much. Indeed a great personality and accomplished Artist.

 8. వెంటపల్లీ గారూ..
  చిత్ర కళ పై అభిమానం తో మీరు మొదలు పెట్టిన ఈ రచనా ప్రస్థానం కళా సాగరుని కళాభిమానం తో కలిసి మాకు కళా రత్నాలను వెలికి తీసి పరిచయం చేయడం లో ఎంతో సఫలీకృతులయ్యారు.

  ఇప్పుడు మీరు అందించిన వ్యాసం లో మహనీయ చిత్రకారులు శ్రీ మామిడిపూడి కృష్ణ మూర్తి గారి కళా సాధనను చిత్రాలతో సహితం అందజేసారు. అందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
  ఇక కృష్ణ మూర్తి గారు ప్రకృతి చిత్రాలు ఎంతో సునిశితంగా, సుకుమారంగా పూర్తి వివరణతో, రంగుల మేళవింపుతో చాలా సౌందర్యవంతంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో చిత్రించిన చిత్రాలు ఇంతటి సహనంతో చిత్రించడమంటే అనితర సాధ్యమైన విషయం. వారి కళాభిమానానికి ఒక కొలమానం.వారు ఇలాగే అపురూప చిత్రాలు చిత్రిస్తూ.. కళా చరిత్రను మన జాతికి అందిస్తూ మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా శతాధిక సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

  1. ధన్య వాదములుNVPSSL మేడం .సునిశితమైన పరిశీలనతో ఎంతో ఓపికగా శ్రీ మామిడిపూడి కృష్ణమూర్తి గారి గురించి నేను రాసిన విస్తారమైన వ్యాసాన్ని చదివి విలువైన అభిప్రాయాన్ని వెబుచ్చినందుకు ధన్య వాదములు .మీరుచెప్పినట్టు ప్రకృతి చిత్రాల్లో వారు సూక్ష్మ వివరాలతో ఆ వయసులో చిత్రించే విధానం నిజంగా అబ్బురపరుస్తుంది.అయితే నేటి మన తరానికి తెలియని వీరి చరిత గురించి తెలియాలనే ఉద్దేశ్యం మరియు నాటి లలిత కళా అకాడమీనిర్వహించిన పాత్ర గురుంచి దానివలన నాటి మన పూర్వ చిత్రకారులకు ఎంతటి బాసటగా అకాడమీ నిలిచేదో ,దానిని రద్దు చేయడం వలన నేటి మన తరపు కళాకారులం ఎంతటి అవకాశాలు కోల్పోతున్నామో చెప్పే క్రమంలో వ్యాసపరిధి పెరిగిపోయిన దృష్ట్యా అద్భుతమైన వారి చిత్రాలు చూపించగలిగామే గాని విషయం విస్తృతి దృష్ట్యా వివరన విమర్శ జోలికీ పోలేదు .విశ్లేష నాత్మకమైన మీ అభిప్రాయానికి ధన్యవాదములు మేడమ్

 9. మాకినీడు గారు చెప్పినట్లు ఈ తరానికి అపరిచితుడుగా ఉండిపోయిన కళాకారుడు, మరియు నాటి తొలినాటి లితకళా అకాడమి కార్యనిర్వాహణాధికారి అయిన శ్రీ మామిడిపూడి కృష్ణమూర్తి గారి గురించి ఎన్నో విషయాలు సేకరించి మన కందిచిన శ్రీ వెంటపల్లి గారు అభినందనీయులు.
  అలాగే రోజు రోజుకు తెలుగు కళా భాండాగారం(విక్కీపీడియ…. గూగూల్)గా రూపాంతరం చెందుతున్న 64 కళలు.కామ్ సంపాదకులు శ్రీ కళాసాగర్ గారి వ్యయప్రయాసలు చిరస్మరణీయాలు. దశ వర్షాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగిడిన 64 కళలు.కామ్ కు అభినందనలు.

  1. విలువైన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు సర్

 10. “64కళలు. కామ్” కు పది సంవత్సరాలు నిండిన విషయం వింటే చాలా ఆశ్చర్యానందం కలుగుతోంది. మన తెలుగు వారి పక్షాన నిలిచి కళాకారులను ప్రోత్సహిస్తూ ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా వెబ్ magazine ను నడపడంలో కళా సాగర్ గారి కృషి అత్యంత అభినందనీయం.

  సాగరమంత కళాభిమానం కల కళా సాగర్ గారికి మన తెలుగు వారంతా ఎంతో రుణపడి పోయాము.

  సాగర్ గారూ.. మీ కృషి బహుధా ప్రశంసనీయం.
  చిత్రకళ విషయంలో చిత్రకారుల పరిచయ వ్యాసాలు రాస్తున్న శ్రీ వేంటపల్లి గారికి కూడా అభినందనీయులు.
  మీ ఇరువురు అనేక ధన్యవాదాలు.

 11. సత్యనారాయణ గారు, కృష్ణ మూర్తి గారి గురించి చదివి వారి గొప్ప మనసు,కృషి తెలుసుకున్నాము.ఆకదేమీచరిత్ర ,కళాకారులకు ఆకదేమీచేసిన సేవ అజరామరం. అలాంటి అకాడెమీ లేకపోవటం దురదృష్టం.
  మామిడి పూడి వెంకట్ రంగయ్య గారి రచనలు చిన్నతనం లో తెలుగు విద్యార్థి పక్ష పత్రికలో చదివే వాళ్ళం. ఇక వ్యాసంలో ఒక చోట పేర్కొన్న వి వి తొంపే గారు మాకు బందరులో ఇంగ్లీష్ లెక్చరర్. మా మిత్రుడు చందు రోజూ ఆయన దగ్గిరకి చిత్ర కళ నేర్చుకునేందుకు వెళ్ళేవాడు.
  చాలా మంచి వ్యాసాలు రాస్తున్న మీకు, కళాసాగర్ గారికి ధన్యవాదాలు.

 12. విలువైన సమాచారంతో పాటు అరుదైన వ్యక్తిత్వంను కళ్ళ ముందుంచారు.అభినందనలు మీకు, ఆనందం మాకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap