మంచి ముత్యాలు – మంచెం చిత్రాలు

(రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గాలరీ నందు నవంబర్ 9 న మంచెం గారి చిత్ర ప్రదర్శన –  ‘పైడి రాజు శత జయంతి పురస్కారం ‘ అందుకుంటున్నసందర్భంగా …)

స్వచ్చతకు మారుపేరు ముత్యం . మంచెం గారి మనసు కూడా ముత్యమే. అంతే కాదు వారి కుంచెనుండి జాలువారిన చిత్రాలు చూసిన వారెవరైనా మేలైన మంచిముత్యాలు అనడం కూడా తధ్యం. కారణం వారు చిత్రాలకు ఎంచుకున్న విషయం, చిత్రీకరణకు ఆయన ఎంపిక చేసుకున్నవస్తువు, ఆపై వారి చిత్ర రచనా రీతికి ఎంచుకున్న పద్ధతి  అన్నీ కూడా ఉత్తమంగా వున్నప్పుడు ఆ కుంచెనుండి జాలువారిన చిత్రాలు ఉత్తమం కాకుండా ఎలా వుంటాయి? అందుకే  మంచెం గారి చిత్రాలను  మంచి ముత్యాలుగా చెప్తాము.
మంచెం గారు చిత్రీకరణకు ఎంచుకున్న రంగులు జలవర్ణాలు, మాధ్యమం వాష్ టెక్నిక్. ఆయన చిత్రీకరణకు వస్తువుగా మామూలు డ్రాయింగ్ షీట్లు లేదా కాన్వాస్ క్లాత్ కాకుండా విన్సర్ న్యూటన్ డ్రాయింగ్ షీట్లనే వాడడానికి ఇష్టపడతారు. రంగులు కూడా ఖరీదైన ఆ విన్సర్ న్యూటన్  నీటిరంగు బిల్లలనే వాడతారు. ఈ విధానంలో  చిత్రించ దలచుకున్నఅంశం తాలూకు చిత్రాన్నిసన్నని రేఖామాత్రంగా ముందు  డ్రాయింగ్ షీట్ పై చిత్రించి దానిపై ఆ చిత్రము నందలి భావవ్యక్తీకరణకు సరిపడే రంగులలో ప్రాధమికమైన వర్ణాన్ని ముందు పూసిన తర్వాత దాన్నిపూర్తిగా కడిగి తదుపరి వేరొక వర్ణం పూసి మరల కడిగి ఇలా పదేపదే విభిన్న రంగులు వేసి కడగడం ద్వారా చివరగా పూసిన వర్ణాలకు తోడు ముందు పూసిన వర్ణాల తాలూకు చాయలు కూడా సూచాయగా కనిపిస్తూ  చిత్రానికి సహజత్వం మరియు ఒక ప్రతేకమైన శోభ వచ్చేలా చేస్తారు. మంచెం గారు చిత్రించిన చిత్రాలన్ని ఈ విధానంలో చేసినవే. ప్రస్తుత కాలంలో ఈ విధానంలో ఒక్క మంచెం గారు తప్ప బహుసా ఎవరూ చేయడంలేదనే చెప్పవచ్చు.
ఒకప్పుడు చైనా జపాన్ చిత్రకారులు వాడే ఈ వాష్ టెక్నిక్ ని తర్వాత కాలంలోమనదేశంలో  అబ్దుల్ రెహ్మాన్ చుగతాయ్ బెంగాల్ లో  నందలాల్ బోస్ తదితరులు బాగా వ్యాప్తిలోకి తీసుకు రాగా తర్వాత మన రాష్ట్రంలో దామెర్ల రామారావు, రాజాజీ, భగీరధి, వరదా వెంకటరత్నం తదితరుల  కొంతవరకు కొనసాగించారు. అనంతరం కొండపల్లి శేషగిరి రావు గారు ఆయన శిష్యుడు ఉల్చిల తర్వాత  నేడు పూర్తిగా ఈ పద్దతిలో విరివిగా చిత్ర రచన చేస్తూ ముందుకు సాగుతున్న చిత్రకారుడు మంచెం సుబ్రహ్మన్యేశ్వర రావు గారు.
ఆయన చిత్రాలలో ఆధునికత పేరుతో నేడు నడుస్తున్న వివిధ పెడధోరణులు కనిపించవు . గజిబిజి రేఖలు జిగిబిగి వర్ణాలు వుండవు. చక్కటి సున్నితమైన మైన రేఖా సౌందర్యం వుంటుంది. ఆ రేఖల మధ్య పారదర్శకంగా పూసే వర్ణ సౌందర్యం వుంటుంది. ఆ వర్ణాలతో రూపొందిన పొందికైన చిత్రాలలో చక్కటి సాంప్రదాయం కనిపిస్తుంది. చరిత్ర వుంటుంది. ఒకవిదమైన ఆధ్యాత్మికత భోదపడుతుంది. తరతరాలుగా మన దేశంలో వర్ధిల్లుతున్నవివిధ వృత్తి పనివాళ్ళు. సామాన్య జనావళి యొక్క జీవన విధానం మనకు దర్శనమిస్తుంది.

వీరి చిత్రాలను ప్రధానంగా మూడు రకాలుగా  చెప్పుకోవచ్చు. తరతరాలుగా మన ఆచార సాంప్రదాయంలో ఇమిడిపోయిన దేవుళ్ళు,దేవతల ఊరేగింపులు, సంభరాలు, సమర్పణలు, మొక్కుబడులు, బోనాలపండుగలు. మామిడి తోరణాలు, గరగాటలు, కోలాటాలు, లాంటివి ఒకరకమైతే, గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే తల్లిప్రేమ గొర్రెలకాపరులు, విజిటబుల్ వెండర్స్, జాలరి స్త్రీలు , బాంగిల్ సెల్లర్స్, కుమ్మరి, కమ్మరి, సాలెల జీవనవిధానం, పాట్ పెయింటర్స్, ఇంకా గ్రామీణ కళారూపాలను తయారుచేసే కళాకారులు లాంటి చిత్రాలు ఇంకో రకం. ఇక మూడవ రకంలో చరకుడు, ధన్వంతరి ఇంకా బౌద్ధ జాతక కథలకు సంభందించిన చారిత్రక  చిత్రాలు వస్తాయి. ఎన్ని చేసిన ఏమి చేసినా ప్రతి చిత్రాన్నినిదానంగా సన్నని సుకుమారమైన రేఖలమధ్య పారదర్శకంగా పూసే వాష్ టెక్నిక్ లో వర్ణాలు అద్దుతూ వీక్షకుడి కంటికి మనసుకు హాయిగోల్పే రీతిలో చిత్రాన్నితీర్చిదిద్దడం శ్రీ సుబ్రహ్మన్యేశ్వర రావు గారి శైలిగా మనం చెప్పవచ్చు.
శ్రీ మంచెం గారు తూర్పు గోదావరి జిల్లానందలి  సముద్ర తీర ప్రాంతమైన ఉప్పాడకు సమీపంలోని నేమం అనే గ్రామంలో శ్రీమతి మంచెం అమ్మాజీ, ధర్మా గణపతి రావు అనే దంపతులకు మే 26. 1957 లో జన్మించారు . నిజానికి చిత్రకళ వీరి వృత్తి కాదు. కేవలం ప్రవృత్తి మాత్రమే. వృత్తిరీత్యా ఆయన నిత్యం ఎన్నో ఆర్ధిక లావాదేవీలతో కూడుకున్న ఒక ఉన్నత స్థాయి బ్యాంకు అధికారి. ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్ గా చేసి ఇటీవలనే పదవీ విరమణ పొందారు. బాల్యం నుండే చిత్ర కళ పై ఆసక్తిగల వీరు మొదట హై స్కూల్ లో తాడేపల్లి వెంకన్న అనే డ్రాయింగ్ టీచర్ వద్ద  చిత్రకళలో మెళకువలు నేర్పారు. ఆపై దామెర్ల ఆర్ట్ స్కూల్ నందలి రామారావు, అడవిబాపిరాజు, అంట్యాకుల పైడిరాజుల చిత్రాలు వారిపై బాగా ప్రభావం చూపాయి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో అక్కడ చిత్రకళాధ్యాపకులుగా పనిచేస్తున్న ఉల్చి గా ప్రాచుర్యం పొందిన రెడ్డిబోయిన వెంకటేశ్వర్లు గారితో ఏర్పడిన సాన్నిహిత్యంతో అలవడిన ఈ వాష్ టెక్నిక్ విధానం వీరికి బాగా నచ్చడంతో ఆ శైలిలో విరివిగా చిత్ర రచన చేయడం ప్రారంబించారు.
చిత్రకారుడిగా ఇప్పటికే హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గేలరీ, మరియు ICICR ఆర్ట్ గేలరీ తో పాటు ,గుంటూరు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి శ్రీకాకుళం జిల్లనందలి  రణస్థలం, తదితర ప్రదేశాలలో వ్యక్తిగత ప్రదర్శనలు చేయడం జరిగింది. సామూహికంగా రాష్ట్రంలోను రాష్ట్రానికి ఆవలకూడా తన చిత్రాలను ప్రదర్శించి కాళిదాస్ సాంస్కృతిక అకాడమి ఉజ్జయిని అవార్డ్, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ అకాడమి నాగపూర్ వారి అవార్డ్ తో పాటు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏట చిత్రకళకు ఇచ్చే పదివేల రూపాయల నగదు బహుమతిని 2010లో మంచెం గారే గెల్చుకోవడం విశేషం. ఇంకా కోనసీమ చిత్రకళ పరిషద్, అజంతాకళారామం, అడపా చిత్రకళా పరిషద్ , హరివిల్లు ఆర్ట్ అకాడమి, లలితకళా పరిషద్ విశాఖపట్నం, లలితకళా కేంద్రం బాపట్ల మొదలగు వారు నిర్వహించిన పోటీలలో ప్రధమ బహుమతులు మంచెం గారి చిత్రాలు గెల్చుకోవడం గొప్ప విషయం. అంతేగాక 2007లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ తొలిసారిగా ప్రవేశ పెట్టిన గోల్డ్ మెడల్ ని కూడా మంచెం గారే సొంతం చేసుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు. ఇదంతా ఆయన ప్రవృత్తి పరంగా సాదించిన విజయాలలో కొన్ని మాత్రమే.
ఇక వృత్తిపరంగా కూడా తాను పని చేసిన ఆంధ్ర బాంక్ గ్రామీణాభి వృద్ధి సంస్థ రాజమండ్రి శాఖకు దేశంలోనే ఉత్తమ శాఖగా గుర్తింపు తెచ్చి నాటి కేంద్ర గ్రామీణాభివ్రుద్ది శాఖామంత్రి శ్రీ జైరాం రమేష్ చేతులమీదుగా ఉత్తమ అధికారిగా జాతీయ పురస్కారం అందుకుని గొప్ప ఆదర్శ అధికారిగా కూడా పేరు తెచ్చుకోవడం గొప్ప విశేషం. అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటా ఉన్నత స్థాయిలో కృషి చేస్తున్నమంచెం సుబ్రహ్మన్యేశ్వర రావు గారు నేడు ఒకనాటి జానపద చిత్రకళకు రారాజైన అంట్యాకుల పైడి రాజు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గాలరీ నందు నవంబర్ 9 న చేస్తున్న వారి చిత్ర ప్రదర్శన తో బాటు రాజమండ్రి చిత్రకళా నికేతన్ వారి నుండి  ‘పైడి రాజుగారి పురస్కారం ‘ అందుకుంటున్నసందర్భంగా వారికి ఇవే మా శుభాభినందనలు

-వెంటపల్లి సత్యనారాయణ ( 9491378313)

3 thoughts on “మంచి ముత్యాలు – మంచెం చిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap