చిత్రకళారత్నం-మన్మోహన్ దత్

మన్మోహన్‌దత్ తెలుగు చిత్రకళా రంగానికి సుపరిచితమైన ఒక పేరు. పేరును బట్టి ఆయన ఒక ఉత్తర భారత దేశానికి చెందిన వారని నేటి తరం అపోహపడవచ్చు. కానీ ఆయన నూరు పైసల ఆంధ్రులు. ఆయన పుట్టిన గుంటూరులో నాటి కమ్యూనిస్టు ప్రముఖులు పెట్టిన పేరు. దత్ ఒక చిత్రకారులు. ఒక చిత్రకళోపాన్యాసకులు, చిన్న కథలు గేయాలు వ్రాసిన రచయిత. వీటన్నిటిని మించి ఆయన ఓ ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్. ఇంకా ఆయన భార్య ఇద్దరు పిల్లలు అందరూ కళాకారులే. వారిది ఒక చిత్రకళా కుటుంబం.

2020 వెళ్తూ బాతిక్ బాలయ్యను తీసుకెళ్తే, కొత్త సంవత్సరం వస్తూనే ఈ చిత్రకళారత్నాన్ని తీసుకెళ్లింది. బహుముఖ ప్రజ్ఞ కల్గిన మన్మోహన్ 1943 ఆగష్టు 23 న గుంటూరులో ఒక నిరు పేద కుటుంబంలో పుట్టారు. హైద్రాబాదు చెందిన ఫైన్ ఆర్ట్పు మరియు ఆర్కిటెక్చర్ కళాశాల నుండి పెయింటింగ్ లో డిప్లమో చేసి, చెన్నయ్ ప్రభుత్వ చిత్రకళాశాల నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. అంతేకాక ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె సిలస్ ఫనిక్కర్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. తర్వాత తాను చదువుకొన్న హైద్రాబాద్ కళాశాలలో అధ్యాపకులుగా సీనియర్ ప్రొఫెసర్ గా మూడు దశాబ్దాలు పైగా పనిచేసి 2001లో ఉద్యోగ విరమణ చేశారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలను సందర్శించి అనేక స్కెళ్లు, డ్రాయింగ్స్ వివిధ పత్రికల్లో వేశారు. అవి ఎంతో సహజ సుందరంగా వుండి కళాభిమానుల్ని విశేషంగా అలరించాయి. దత్ ఐదు వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలు, మూడు సామూహిక, కుటుంబ చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు. పెయింటింగ్ గ్రాఫిక్ విభాగాల్లో అనేక బంగారు పతాకాలు, బహుమానాలు, ప్రశంసాపత్రాలు గెలుపొందారు. ఆయన చిత్రాలు సాలార్‌జంగ్, ఆర్కియాలజీలతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ చిత్రశాలలు సేకరించాయి.
సూర్యప్రకాష్ పై 1992లో డాక్యుమెంటరీలు తీసి, హైద్రాబాద్, ముంబాయిలలో జరిగిన పనోరమ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. అరవిందుని కాంచనగంగకు స్క్రిప్టును సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వాలు ఫిల్మ్ డివిజన్ కోరిక పై, ‘ఏజర్నీ ఆఫ్ బస్సర్’ డాక్యుమెంటరీ తీశారు. అమరావతి ఫిల్మ్ మేకర్స్ అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అనేక డాక్యుమెంటరీలు తీసి ‘శభాష్’ అనిపించుకొన్నారు.

అర్ధ శతాబ్దం పాటు ఆధునిక విధానాల్లో కళాభిమానుల్ని అలరించి, ఆనందింపజేసి మన్మోహన్ ఆకస్మిక మృతి తెలుగు చిత్రకళారంగానికి తీరని లోటు.
-సుంకర చలపతిరావు
9154688223

SA: