చిత్రకళారంగంలో మన దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి మరోసారి ఋజువు చేసిన వ్యక్తి యం.యఫ్. హుస్సేన్. వీరి పూర్తి పేరు మక్బూల్ ఫిదా హుస్సేన్. 1915వ సంవత్సరంలో సెప్టెంబర్ 17 న మహారాష్ట్రలోని పంధాపూర్‌లో జన్మించిన హుస్సేనకు చిన్న తనంలోనే తల్లిపోయింది. తండ్రి మరో వివాహం చేసుకున్న తరువాత ఇండోర్లో చదువుపూర్తిచేసి 1935వ సంవత్సరంలో బొంబాయికి నివాసం మార్చుకుని జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో జాయిన్ అయ్యారు. తరువాత కాలంలో సినిమా బేనర్లు పెయింట్ చెయ్యడం ప్రారంభించాక, హుస్సేన్ నివసించడానికి కనీసం యిల్లులేక సినిమా కటౌట్లు, బేనర్స్ రాయడానికి షెడ్ నిర్మించుకోలేని పరిస్థితుల్లో బొంబాయిలో ‘నోవల్ థియేటర్’ సమీపంలోని ఫుట్ పాత్ మీదే పడుకొని థియేటర్ వెనుక భాగానవున్న చిన్న స్థలంలో బేనర్లు రాసేవారు. పెద్ద సైజు బేనర్లు రాయవలసి వచ్చినప్పుడు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి వుండి జనసమర్థం, ట్రాఫిక్, ట్రామ్స్ లేని సమయం చూసుకుని నడిరోడ్డుమీదే కేన్వాస్ పరిచి తెల్లవారుఝామున తిరిగి ట్రామ్స్ నడవడం ప్రారంభించేంత వరకు పనిచేసేవారు. ఇంత చేసినా బేనర్ పెయింటింగ్ కు ఒక చదరపు అడుగుకు నాలుగణాల పారితోషికంతో కాలం గడిపిన అతని చీకటికాలం నుంచి నేడు దేశం గర్వించతగ్గ చిత్రకారుడిగా ఎదిగారు. నలుగురుకీ తెలిసిన హుస్సేన్ మొదటి ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘జూరిచ్’లో జరిగినప్పుడు యూరప్ లోనూ అమెరికాలోనూ వెలుగులోకి వచ్చారు.
1966లో భారత ప్రభుత్వంచేత పద్మశ్రీ అవార్తో గౌరవింపబడి చిత్రకళారంగంలో మన దేశ ప్రతిష్టను ప్రపంచంలో ఋజువు చేసిన వ్యక్తి యం.యఫ్. హుస్సేన్. వీరి కళాప్రపంచం పూర్తిగా అటు యాబ్ స్ట్రాక్ట్ కాదు, ఇటు మోడరన్ ఆర్ట్ కాదు. మధ్యేమారంలో పయనించిన మిశ్రమం. ఆయన సాధన అనంతమైనది. గలగలా ప్రవహించే సెలయేరులా తనచేతిలో ఉన్న బ్రషైనా, పెన్నిలైనా. కలమైనా జోడు గుర్రాల వేగంతో సాగిపోతుంది. ఆయన మన దేవతామూర్తులను చిత్రించేటప్పుడు భావన, శిల్పం మాత్రమే “చాలనుకున్నారుగాని ఆ బొమ్మలో నగ్నత్వం కనపడుతుందని ఊహించి ఉండరు. హైందవ రాతి శిల్పాలలోనూ, లోహ శిల్పాలలోనూ దూరం నుంచి చూస్తే వస్త్రధారణ ఉన్నట్లు కనబడదు. దగ్గరకు పోయి చూస్తే మాత్రం చిన్న చిన్న గీతలతో వస్త్రాల బోర్డర్లు కనిపిస్తాయి. హుస్సేన్ ఎనాటమిలోని సొంపుల్ని చూపే ప్రయత్నంలో వస్త్రధారణ ఉందా లేదా అన్న అంశాల్ని అంతగా పట్టించుకుని ఉంచకపోవచ్చు. ఏది ఏమయినా దేశ విదేశాల్లో అఖండ ఖ్యాతినారించి ప్రపంచ ప్రముఖుల సరసన నిలిచిన ఎమ్.ఎఫ్. హుస్సేన్ ను లలిత కళా అకాడెమీ “ఫెలోషిప్”తో గౌరవించింది. మన దేశంలో వివాదాల్లో చిక్కుకున్న ఈయన దేశం విడిచి ‘ఖతార్’ దేశ పౌరసత్వంతో అక్కదే స్థిరపడి, జూన్ 9 న 2011 లో లండన్ లో కన్ను మూయడం కళాపిపాసకులకు ఒక శాపంగా మారింది.
ఈశ్వర్, ఆర్టిస్ట్
చాలా బాగుంది
భారతీయ చిత్రకళ పై చెరగని సంతకం
Great Artist
భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు హుస్సేన్
గారు.గొప్ప వ్యాసం అందించిన ఈశ్వర్ గారికి ధన్యవాదాలు..ఎం.నాగేశ్వర రావు
Nice article