(నేడు చిత్రకారుడు, కార్టూనిస్ట్ మోహన్ 70 వ జన్మదినం సందర్భంగా ….)
మనకు గొప్ప చిత్రకారులు ఉండవచ్చు. అద్బుతమైన మనుషులు ఉండవచ్చు. కానీ మనుషులుండటం ఎంత అద్భుతం!
కేవలం మనిషి. పేరుంది గనుక వారిని మోహన్ గారని పిలుస్తున్నాం గానీ ఆయన just a Man kind.
దీన్ని వివరించి చెప్పడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాను. ఎలా అంటే, ఆయన నేరుగా మనిషితో వ్యవహరిస్తాడు.
కులం, మతం, లింగం, ప్రాంతం, ధనం, ఇటువంటివేవీ లేకుండా మనిషితో నేరుగా ఆయన ఉంటాడు. ఆ మనిషితో పూర్తిగా అంగీకారంతో ఉంటాడు.
కావాలంటే మీరు వెళ్లండి. మీకేం కావాలో అడగడు. మీరెవరు, ఎక్నడ్నుంచి వచ్చారు, ఏం కావాలో అడగరు. తెరిచిన తలుపులతో ఆయన సదా అందుబాటులో ఉంటారు. తనవద్దకు అలా వచ్చి అట్లా ఉండిపోయిన మనుషులు కూడా చాలా మందే ఉన్నారు. అయినా ఆయన మారలేదు. మనిషి మారలేదు.
+++
మళ్లీ చెప్పాలంటే, ఆయన కేవలం మనిషి. వివరించి చెప్పాలంటే, తాను మీతో మాట్లాడుతున్నాడంటే వారికి మీ వ్యక్తిత్వం నచ్చో కానక్కరలేదు. నచ్చక పోయినా మాట్లాడుతాడు. నచ్చడం, నచ్చక పోవడం. అభిరుచులు కలవడం, కలవకపోవడం అన్నదాంతో సంబంధం ఏమీ లేదు. నిజానికి, అవేవీ లేకుండాను, మానవ సంబంధాల్లో ఏదో ఒక ఆశింపు ఉంటుంది చూడండి. అలాంటిదీ కనీసం లేశమాత్రం కూడా లేకుండా వారు మనతో బిహేవ్ చేస్తారు.జీవిస్తారు. కేవలం మనిషిగా బతుకుతారు. అంతే. అదీ ఆయన విశేషం. అంతకుమించి ఇంకేమీ లేకపోవడమే మోహన్.
ఒక మనిషి ఒక మనిషితో నెరిపే సంబంధ బాంధవ్యాలకు అతనొక నిజ వ్యక్తిత్వం. అంతకన్నాఇంకేమీ లేదు.
+++
తనకు పెద్దవాడూ చిన్నవాడు… ధనికా పేదా… ఆడా మగా…పరిచితుడూ అపరిచితుడూ…గురువూ శిష్యుడూ…ఇటువంటి వేవీ ఉండవు. ఆయనకు మనిషి వినా మరేదీ అక్కర్లేదు.
ఆ మనిషి తనతో పని చేయించుకుంటాడని తెలుసు. అయినా ఫరవాలేదని ఊరుకునే తాత్వికత ఆయనది.
మనుషులు దోచుకుంటారని కూడా తెలుసు. అయినా దోపిడీకి గురవుతున్నామన్న చర్చోపచర్చలు లేని స్థితప్రజ్ఞత వారిది.
కేవలం ఒక పిడికిలి.
ఆయనకైనా మరో మనిషికైనా అంతకన్నా’సొంత ఆస్థి’ ఇంకేదీ ఉండదని తాను బలంగా భావిస్తారేమో! బహుశా ఆ పిడికిలి తప్పా ఆయన ప్రపంచానికి ఇచ్చింది ఇంకోటి లేదనే అనుకుంటాను, నేనైతే!
+++
పోరు బాటలో ఒక పిడికిలి.
కుడి ఎడమలతో సంబంధం లేదు. వామపక్షం వాళ్లడిగినా చంద్రబాబు అడిగినా ఇచ్చాడు. తన సాహిత్యం అదే అన్నట్టు, నోరు తెరిచి ఎవరు అడిగినా సరే, తల పంకించి ఆ బొమ్మ వేసిచ్చారు, ఇస్తూనే ఉన్నారు.
అది కూడా తానూ ఒక మనిషిని అన్న ఎరుకతోనే తప్పా అదొక గొప్ప అచీవ్ మెంట్ అని కూడా ఆయన అనుకోరు.
ఇంత సింపుల్ మనిషిని నేనూ ఊర్లో ఒకరిద్దర్రే చూశాను. అదృష్టం అంటే నాది.
+++
చిత్రమేమిటంటే, మోహన్ గారు మనుషులకు సంబంధించి వాళ్ల పూర్వపరాలు, స్థితిగతులతో సంబంధం లేకుండా వ్యవహరించడం. అదే ఆయన! ఇంత బతికినా మనిషి మారలేదు.
బహుశా అందరికీ అందుబాటులో ఉండటం మనకు బాగుంటుంది. తలలో నాలుకలా మెసలడం మనకు బాగానే ఉంటుంది. ఓ మనిషి తనకోసం తాను ఆలోచించకపోవడం కూడా ఎవరికైనా హాయిగా ఉంటుంది. కానీ ఆయన ఇంతమంది మనుషులను భరిస్తూ మనిషిగానే ఉండగలగడం నాకు ముచ్చటేసే సాహిత్యం.
ఒక సారి, నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభపు రోజుల్లో మోహన్ గారు ఒకరిద్దరు మనుషులను పంపారు. వారి గురించి ఎన్నో సార్లు వాకబు చేశారు. “పనైందా లేదా?” అని ఆరా తీశేవారు. ఒక రోజు “వాళ్లు మీ మిత్రులా?” అని అడిగితే, “లేదబ్బా…ఏమో! ఎవరో ఏమో!” అన్నారు.
మరొకసారి ఆయన ఎవరితోనో ఇష్టంగా మందు సేవిస్తున్నారు. చాలా సేపటికి తెలిసింది, వారి సంభాషణల్లో…వాళ్లూ తానూ అపరిచితులు…
అదీ ఆయన పద్ధతి. అపరిచుతులైనా పరిచితులైనా ఒకటే.
+++
వాళ్లు ఏం కోరిక కోరినా సరే, అది ఉద్యోగంలో పెట్టివ్వమనడం కావచ్చు, బొమ్మ వేసి పెట్టడం కావచ్చు. పుస్తకం గురించి కావచ్చు. యానిమేషన్ కావచ్చు.
అది పది పైసల కార్యం కావచ్చు, కోటి రూపాయల వ్యవహారం కావచ్చు.
ఏదైనా ఒకటే. అడిగిన వాళ్లకు ఆ అర్హత ఉందా లేదా అన్న విచారణ తనకు లేదు. ఆ పని చేయడం తప్పా అందుకు ఇంకే హేతువూ తనకు అక్కర్లేదు.
మరో మాటలో చెబితే, అవతలి వాడు మనిషిగా ఏం అడిగితే దానికి ప్రతిస్పందనగా ఈ మనిషి వ్యవహరించడం! ఇంతకుమించిన అద్భుతం నేనూ ఈ భూమ్మీద చూడలేదు!
నీ పుట్టిన రోజు నిజంగా మనిషి పుట్టిన రోజే…
మోహనన్నకు ప్రేమతో….
–కందుకూరి రమేష్ బాబు
Nice writup on great artist humanist mohan sir by kandukoori Ramesh garu .Congratulations
Great man