బొమ్మలు చెక్కిన శిల్పం

(మరో ప్రపంచంలో తన బొమ్మలతో దుమారం రేపడానికి మోహన్ బయలు దేరి అయిదేళ్లు అయిన సందర్భంగా చిన్న జ్ఞాపకం)

బొమ్మలు కూడా మాట్లాడతాయి.
మాట్లాడ్డమే కాదు జనం తరపున పోట్లాడతాయి.
కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి.
కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి.
రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి.
అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు.
బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి
ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి
ఆ మనసులో రెప రెప లాడే ఎర్ర జెండా పొగరును బట్టి
బొమ్మలు కాలర్లెగరేస్తాయి.
అలా కాలర్లెగరేసే బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్
తాడిమోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు.

కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఒక్కళ్లు కూడా ఉండరు.
మోహన్ అంటే సకలకళా వల్లభుడు.
కార్టూన్లు ఇలస్ట్రేషన్లు కేరికేచర్లు కవర్ పేజీ బొమ్మలు ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు.
రాజ్యాధికారపు దురహంకారాన్ని కాలరు పట్టుకుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండాలపై బొమ్మలు
బిగించిన పిడికిళ్లు కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్ లు.
మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరునవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్.
ఎక్కడో ఏలూరు లో పుట్టి అక్కడెక్కడో పశ్చిమబెంగాల్ లో జ్ఞానానికి సాన పట్టి విజయవాడ విశాలాంధ్ర మీదుగా హైదరాబాద్ కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు మోహన్.
తెలుగు నాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్ ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు.
ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు.
తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంపకాయలు కొట్టేయడమే.
ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు.
మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయకులు.
నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి.
అదే అయిదు దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది.
ప్రభువెక్కిన పల్లకీలు మోసి వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూటకట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసిపోతారు.
ఎవరికీ గుర్తుకు కూడా రారు.

పల్లకినెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తర తరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు.
గుర్తు పెట్టుకోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు.
అటువంటి అరుదైన యోధుడు కళాకారుడూ మన మోహన్.

-C.N.S.యాజులు
మోహన్ బొమ్మలు : చిత్ర మరియు మాకిరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap