నిత్య కళాప్రేమికుడు మృత్యుంజయ రావు

1990 వ దశకంలో నా విద్యార్ధి జీవితం పూర్తయ్యి ఉద్యోగ కోసం మార్గాలు అన్వేషిస్తూ లైబ్రరీల చుట్టూ తిరుగుతున్న కాలంలో మా ఊరుకి ఓ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నందలి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నవోదయ విద్యార్ధుల యొక్క ప్రతిభాపాటవాల గురించి, మరియు వారిని తీర్చిదిద్దుతున్న చిత్రకళాఉపాధ్యాయుడి గురించి దిన పత్రికలలో తరచుగా వస్తూ వుండే వార్తలు నన్ను అమితంగా ఆకర్షించేవి.

కారణం నేను చిత్రకారున్ని మరియు చిత్రకలాభిలాషిని కావడం ఒక ఎత్తయియితే ఒక గురువంటూ లేకుండా నాకు తోచిన ఆలోచనలను నాదైనరీతిలో వేస్తున్న నా చిత్రణా పద్ధతి సరి ఐనదా కాదా? అనే దిశానిర్దేశం లేని నా కళా సాధనపట్ల నాలోనే ఒకింత సందిగ్దం వెంటాడుతున్న క్రమంలో ఆ సందిగ్ద నివృత్తి కోసం తొలిసారిగా ఆరోజుల్లో నన్ను అమితంగా ఆకర్షించిన ఆ యానం చిత్రకళా ఉపాధ్యాయుడిని కలిసి నివృత్తి చేసుకోవాలనే ఆలోచనతో ఆయనకు ఒక లేఖ రాయడం జరిగింది. దానికి ఆయన కూడా స్పందిస్తూ ఒకసారి మీ బొమ్మలు తీసుకుని యానం రండి అని ప్రతిలేఖ రాయడంతో నేను అంతవరకు నాకు తోచిన రీతిలో వేసిన కొన్ని జలవర్ణ చిత్రాలను తీసుకెళ్ళి ఆయనకు చూపించడం, చూసిన పిదప మీ ఆలోచనలు బాగున్నాయ్ కంటిన్యూ చేయండి అని మెచ్చుకుంటూ మీకు వీలైనప్పుడు ఇక్కడకు వస్తూ వుంటే కొన్ని మెళకువలు తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఆపై ఆయన ఇంటి ఆవరణలో సాధనలొ బాగంగా వారి స్కూల్ విద్యార్ధులు వేస్తున్న సజీవ చిత్రాలతో పాటు ఆ ఉపాధ్యాయుడు అప్పటికే స్వామి అయ్యప్ప జీవితంపై ఒక సిరీస్ గా వేసిన చిత్రాలను చూపించినప్పుడు వాటిల్లో నాకు కనిపించిన సరి ఐన అనాటమీ కంపోజిషన్ రంగులలోని స్వచ్చత అన్ని చాలాబాగా అనిపించాయి. ఒక పద్ధతిగా గురుముఖంగా నేర్చుకున్నవాల్లకి యే కళ అయినా శాస్త్రీయ బద్దంగా అలవడుతుంది. అలాంటి గురువులవద్ద విద్యనభ్యసిస్తున్న విద్యార్దులు కూడా అలాగే సాధన చేయడంవలన కళాపరంగా మంచి విజయాలను సాధిస్తారు అని చెప్పడానికి ఉదాహరణయే నాడు తరచుగా పత్రికల ద్వారా ప్రాచుర్యానికి నోచుకున్న వారి విద్యార్ధులు అని నాకనిపించింది. ఆ తర్వాత నేను వీలైనప్పుడల్లా ఆయన వద్దకు వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది అనుకున్న నా ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ నాకు ప్రభుత్వ ఉద్యోగము రావడం, అందులో బాగంగా మొదట గోదావరికి అవతలవైపున్న ముమ్మిడివరం ఆ తర్వాత ఖమ్మంలో స్థిరపడిపోవడంతో ఒక గురుముఖంగా ఆర్ట్ నేర్చుకోవాలన్న నా కోరిక అసలు నెరవేరలేదు. కానీ ఆ తర్వాత కాలంలో నేను చిత్రకారుడిగా మరియు చిత్రకళా రచయితగా మారడం ఆయన కూడా బదిలీలలో బాగంగా యానం నుండి రాజమండ్రి ఆపై గుంటూరు తదితర ప్రాంతాలకు మారడం జరిగినా రాజమండ్రి చిత్రకళా నికేతన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా వారు నిర్వహించిన చిత్రకళా కార్యక్రమాలద్వారా మేము అప్పుడప్పుడూ కలుసుకోవడం వలన మా కళా భందం అలాకొనసాగుతునే వుంది, తొలిరోజుల్లో కళాపరంగా నన్ను ఆకర్షించిన ఆ చిత్రకళా ఉపాధ్యాయులే నేడు గుంటూరు కేంద్రీయ విద్యాలయ ఆర్ట్ టీచర్ గా పదవీ విరమణ చేస్తున్న టేకి మృత్యుంజయరావు గారు.

దాదాపు మూడు దశాబ్దాల కాలంలో భౌతికంగా మేము కలిసింది తక్కువే కావచ్చు కాని కళాపరంగా మామధ్య ఏర్పడిన భందం ఎక్కువే అని చెప్పవచ్చు. కారణం మా గోదావరి ప్రాంతంలో చిత్రకళా పరంగా సేవ చేస్తున్న కోనసీమ చిత్రళాపరిషత్ గాని రాజోలు చిత్రకళాపరిషత్, ఆర్ట్ అసోషియేషన్ గిల్డ్, భగీరధీ ఆర్ట్ పౌండేషన్ ఇంకా అజంతా చిత్రకళారామం మరియు రాజమండ్రి చిత్ర కళానికేతన్ తదితర సంస్థలు నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో కూడా మృత్యుంజయరావు గారి పాత్ర లేకుండా సాగని కారణంగా అన్నికార్యక్రమాలలోను తప్పనిసరిగా మా కలయిక ఉండేది. ఇక ఏదైనా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేటప్పుడు దానిని గురించి ఒక ఆర్టికల్ రాయమని దానికి సంభందించిన పూర్వాపరాల గురించి పలుసార్లు ఫోన్ వారు ద్వారా చర్చించడం సర్వసాధారణం. ముఖ్యంగా వీరి సంభాషణల్లో ఎప్పుడూ మనం నేడు ఈ స్థానాల్లో ఉన్నాము అంటే అదంతా మన పూర్వీకులు మనకు వేసిన మంచి బాట అని చెబుతూ కళారంగంలో మన పూర్వీకులను ఎప్పుడూ స్మరించుకోవడం నాకు బాగా నచ్చే ఒక అంశం. వారి మాటల్లో తరచుగా ఏ.ఎస్.రాం, కూల్డ్రే, దామెర్ల, అడవి బాపిరాజు, భగీరధి, బుచ్చికృష్ణమ్మ, సత్యవాణి, మొక్కపాటికృష్ణమూర్తి, వరదావెంకట రత్నం, మాదేటి రాజాజీ, తదితర ముందు తరపు చిత్రకారులు వారి చిత్ర రచన మరియు వారి కళాసేవను గురించిన ప్రస్తావన లేకుండా ఆయన మాటలకు ముగింపు ఉండదు అది పెద్దల పట్ల ఆయనకున్నగౌరవ భావం అని చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రస్తుత వర్ధమాన కళా కారులప్రస్తావన తీసుకువస్తూ వారి సంభాషణలు కొనసాగించడం బాగుంటుంది. అందుకే ఆయన కార్యదర్శిగా ఉన్న రాజమండ్రి చిత్రకళా నికేతన్ యొక్క ఎంబ్లం మన ఆధునిక ఆంద్ర చిత్రకళకు ఆధ్యులయిన వారిని స్మరించుకుంటూ వారి భావాలకు అద్దం పట్టేలా ఉంటుంది.

ఉత్తమమైన గురువు యొక్క ఆధ్వర్యంలో గరిపిన శిక్షణ తప్పనిసరిగా మరో ఉత్తమ శిష్యుణ్ణి తయారు చేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా మృత్యుంజయరావు గారిని చెప్పవచ్చు. శ్రీమతి టేకి సరోజ, రమణాచారి అనే దంపతులకు 12-07-1964 నాడు కళల కాణాచి అయిన రాజమహేంద్రి లో జన్మించిన వీరు తన యావత్ జీవితాన్ని నిస్స్వార్ధంగా చిత్రకళాసేవకు అంకితం చేసిన గొప్ప గురువర్యులయినటువంటి ఆచార్య మాదేటి రాజాజీ గారి వద్ద శిష్యరికం చేసి గురువుకు తగ్గ ఆదర్శ శిష్యుడిగా పేరు గడించారు. ఆపై హైదరాబాద్ జే.ఎన్.టి.యు. ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో 1984-89 మద్య కాలంలో పెయింటింగ్ లో బి.ఎఫ్.ఏ. కోర్స్ కూడ పూర్తి చేసి, ఆ కళాశాల నందు అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు గానూ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆపై చిత్రకళా ఉపాధ్యాయ శిక్షణలోనూ కూడా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై మొదట యానాం నవోదయ విద్యాలయంలో ఆర్ట్ టీచర్ గా నియమింపబడి 1991-95 వరకు అక్కడ పనిచేశారు. ఆపై రాజమహేంద్రవరం కేంద్రీయ విద్యాలయము, తమిళనాడు ఎం.ఆర్.సి. కేంద్రీయ విద్యాలయం లోనూ, చెన్నై కేంద్రీయ విద్యాలయ ఐ.ఐ.టి.లో ఆర్ట్ టీచర్ గాను చివరగా గుంటూరు కేంద్రీయ విద్యాలయముల నందు ఆర్ట్ టీచర్ గా పని చేసి ఎందరో విద్యార్ధులను కళాకారులుగా తీర్చిదిద్దారు.

మృత్యుంజయరావు గారి కళాయాణంలో మూడు పార్శ్వాలను మనం గమనించవచ్చు.అవి ఒకటి చిత్రకారుడిగా, చిత్రకళా ఆచార్యుడిగా , మరియు చిత్రకళా సేవకుడిగా ఇలా మూడు కోణాల్లో అయన ప్రతిభను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ మూడింటిలో యే అంశం గొప్ప అనుకుంటే మూడింటా ఆయన ప్రతిభ మనకు కనిపిస్తుంది. కానీ ఇటీవల ఆయనగురించి తెలిసిన వారికి మొదటి అంశంకంటే చివరి రెండింటినందే ఆయన గొప్ప అనే భావం కలగవచ్చు, కారణం ఆయన కొన్ని ఏళ్లుగా చిత్రకారుడిగా బొమ్మలు వేయడం కంటే చిత్రకళా సంస్థ ద్వారా చిత్రకళను ప్రోత్సహించే కార్యక్రమాలలోనే ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అగుపిస్తుంది. కాని ఒక వ్యక్తి చిత్రకళా కార్యక్రమాలు చేయాలి అంటే ముందు అతను మంచి చిత్రకారుడు కావాలి. ప్రతిభ గలవానిగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ తర్వాతనే మిగిలిన వాటిల్లో ప్రతిభను అంచనా వేసేందుకు అవకాసం ఉంటుంది ప్రాధమికమైన చిత్రకళ లోనే ప్రతిభ లేనప్పుడు మిగిలిన వాటిని గురించి ఆలోచించడం హాస్యాస్పదంగా ఉంటుంది. కాని మృత్యుంజయరావు గారి విషయంలో అందుకు ఆస్కారం లేదు. ఆయన ప్రతిభావంతుడైన చిత్రకారుడు.

ఆయన ఒరిజినల్ చిత్రాలలో కొన్నింటిని చూసిన సందర్భం నాకు రెండుసార్లు కలిగింది. అది తొలిసారిగా మేము యానంలో కలిసిన సందర్భంఒకటయితే, ఆ తర్వాత దాదాపు పాతికేళ్ళ తర్వాత నేను గుంటూరులొ ఒక చిత్రప్రదర్శనకు వెళ్తూ అప్పటికి గుంటూరు లోనే వుంటున్న వారింటికి వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద సైజులోగల వర్ణచిత్రాలు మరియు ఆయన నోటితో పెన్సిల్ పట్టుకుని వేసిన వివిధ ప్రముఖ వ్యక్తుల రూపచిత్రాలను చూడడం జరిగింది. నిజంగా రంగులలో వేసిన చిత్రాలు ఎంత సాదికారతతో వున్నాయో కొద్ది సమయంలో చేతితో గాకుండా నోటివద్ద పెన్సిల్ పెట్టుకుని డైరెక్ట్ గా వేసిన రూప చిత్రాలలో కూడా ఆయన అంతే సాధికారత కనబరిచారు. రూపచిత్ర రచన అనేదేఒక గొప్ప ప్రక్రియ అదీ చేతితో కాకుండా నోటిలో పెన్సిల్ పెట్టుకుని ఎదురుగాఉన్నవ్యక్తి యొక్క రూపాన్ని ప్రేక్షకులచే మెప్పించేలా వేయడం అనేది మరింత గొప్పవిషయం. దానికి ఎంతో సాధన వుంటే గాని సాధ్యం గాని పని. ప్రఖ్యాత చిత్రకారులు మరియు సాహితీవేత్త శీలావీర్రాజు గారి చిత్రం వేసినప్పుడు ఆయన ఆ చిత్రంపై స్పందిస్తూ “నేటి చిత్రం నోటి చిత్రం బలే విచిత్రం” అని పేర్కొంటే అచ్చంగా నోట్లోనించే వూడిపడింది ఆశ్చర్యంగా అని మరో సాహితీవేత్త గోపి గారు స్పందించారు తన చిత్రంపై. అలాగే మరో కవి నగ్నముని గారు ”అవును నిజంగానే నోటితో చిత్రించిన అద్భుతం ఈ చిత్రం ” అని తన రూపచిత్రంపై స్పందిస్తే ఆచార్య సి నారాయణరెడ్డి గారు” నా ముందే క్షణాల్లో నోటితో బొమ్మ గీసిన మృత్యుంజయుని ప్రతిభ బహు ప్రశంసనీయం “అని వ్యాఖ్యానించారు. ఇక ఆయన వేసిన వర్ణ చిత్రాల్లో మంగళ స్నానం, పెండ్లి పిలుపు. పొయిలో పిల్లి, బ్లాక్ స్మిత్, మదర్ అండ్ చైల్డ్, గరగల నృత్యం మొదలగునవి ప్రసిద్దమైన చిత్రాలు.

ఆయన ప్రతిభకు కొలమానంగా ప్రాధమికంగా రాజమహేంద్రవరం నందు దామెర్ల రామరాయుని చిత్రశాలలో అభ్యసనం చేస్తున్న సమయంలోనే ఆ కళాశాల ఆచార్యుడు విఖ్యాత చిత్రకారుడు అయిన ఆచార్య మాదేటి రాజాజి గారికి తన కళాప్రతిభతో అత్యంత ప్రియ శిష్యుడిగా మారాడు. ఆపై హైదరాబాదు ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో సైతం అగ్రగన్యుడిగా గుర్తింపబడి ఆ కళాశాల నుండి స్వర్ణ పతకాన్ని సాధించారు. కళాశాలలో విద్య నభ్యసిస్తున్న కాలంనుండి నేటి వరకూ కూడా రాష్ట్ర, జాతీయ స్తాయిలొ వివిధ సంస్తలు నిర్వహించే పోటీలలో సర్వోత్త విశిస్తోత్తమ, ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థాయిల్లో ఎన్నో బహుమానాలను అందుకున్నారు. వ్యక్తిగతంగా సామూహికంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజమహేంద్రవరం, భీమవరం, విజయవాడ, విశాఖపట్నం గుంటూరు, నెల్లూరు, వెల్లటూరు, తిరుపతి, అనకాపల్లి, అమలాపురం. రాజోలు. హైదరాబాదు, మచిలిపట్నం, సిద్దిపేట మొదలగు ప్రాంతాలతో బాటు రాష్ట్రానికి ఆవల జాతీయ స్థాయిలో తమిళనాడునందలి వెల్లింగ్టన్, మధ్యప్రదేశ్ నందలి భోపాల్, ఉత్తరప్రదేశ్ నందలి వారణాసి, ముంబై ఒరిస్సానందలి పూరి, దేశ రాజధాని నందలి న్యూ డిల్లి మొదలగు చోట్ల జరిగిన జాతీయ చిత్ర ప్రదర్శనలలో తన చిత్రాలను ప్రదర్శించారు. అంతే గాక 2012 లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో కూడా తన చిత్రాలను ప్రదర్శించారు. అజంతా కళారామం వారు తెనాలి నందు నిర్వహించిన జాతీయ చిత్రకళా ప్రదర్శనా పోటీలలొ ఆయన ప్రత్యక్షంగా జల వర్ణాలతో ఒక ప్రముఖ వ్యక్తి యొక్క రూపచిత్రాన్ని లైవ్ లో వేస్తున్న సమయంలో ప్రేక్షకుడిగా వున్న నాతో బాటు అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా రాజమండ్రి, మచిలిపట్నం, అనకాపల్లి రాజోలు, తమిళనాడునందు వెల్లింగ్టణ్ మొదలగు పట్టణాలలో జరిగిన చిత్రప్రదర్శనలలో సైతం ఆయన స్పాట్ పెయింటింగ్ డెమోలు ఇచ్చి అందరిచే ప్రశంసలను అందుకున్నారు.

ఉత్తమ ఆర్ట్ టీచర్ గా ఒకనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్ బెన్ జోషి పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వైద్యలింగం గారిచే అలనాటి ఆంద్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖామాత్యులు డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారిచేత డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, హోం మినిస్టర్ చినరాజప్ప తదితరులచే ఎన్నో ప్రశంశలను అందుకున్నారు. అంతే గాకుండా ఒక ఆర్ట్ టీచర్ గా తాను మాత్రమే గాక తన విద్యార్దులను కూడా ప్రతిభావంతులుగా తీర్చి దిద్ది రాష్ట్ర జాతీయ స్థాయిల్లో జరిగిన అనేక పోటీలకు వారిని పంపిస్తూ వారు మంచి విజయాలను అందుకునేలా చేసారు.

ఇక రాజమండ్రి చిత్రకళా నికేతన్ వ్యవస్థాపక కార్యదర్శిగా, అలాగే ఆర్ట్ అసోషియేషన్ గిల్డ్ యొక్క గౌరవ కార్యదర్శిగా, హైదరాబాదు ఆర్ట్ సోసిటీ మరియు అమరావతి విజువల్ ఆర్ట్ సొసైటీ తదితర కళాసంస్థలలో శాశ్వత సభ్యునిగా ఇంకా కోనసీమ, రాజోలు, చోడవరం డ్రీం చిల్ద్రెన్ ఆర్ట్ అకాడమి మొదలైన కళాసంస్థలు నిర్వహించే చిత్రకళా కార్యక్రమాలలో కూడా వీరు తనదైన పాత్ర నిర్వహిస్తూ ఉండడం అందరికి తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను సమయంలో ఎందరో వ్యక్తుల రూపచిత్రాలను నోటివద్ద పెన్సిల్ పెట్టుకుని వేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని హుదూద్ తుపాను భాదితుల సహాయనిధికి పంపించడం సమాజంపట్ల ఆయనకు గల భాద్యతను తెలియజేస్తుంది.

ఒక భాద్యత గల ప్రభుత్వ ఉద్యోగానికి నేటి నుండి లభిస్తున్న విశ్రాంత జీవితం చిత్రకారుడిగా, చిత్రకళా గురువుగా, చిత్రకళా సేవకుడిగా బహు విదాలుగా సాగుతున్న వీరి కళాయానాన్ని మరింత ద్విగిణీకృతంగా ముందుకు సాగేలా చేస్తుందని ఆశిస్తూ ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలుకుతు విశ్రాంత జీవితంలోకి అడుగిడుతున్న టేకి మృత్యుంజయరావు గారికి వారి కుటుంభానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

వెంటపల్లి సత్యనారాయణ
చిత్రకారుడు, చిత్రకళారచయిత

2 thoughts on “నిత్య కళాప్రేమికుడు మృత్యుంజయ రావు

  1. చిత్రకారులు ఉపాధ్యాయులు ఐన మృత్యుంజయరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు తన కంటే కూడా తన చుట్టూ ఉన్న కళా ప్రపంచాన్ని ఎప్పుడు గొప్పగా చూడాలని కోరుకుంటారు. మృత్యుంజయ రావు గారి చిత్రకళశైలి, వాటర్ కలర్స్, స్పాట్ పోర్ట్రైట్స్, ఎంతో రమణీయంగా తీర్చిదిద్దుతారు. రాజమండ్రి చిత్రకళానికేతన్ యొక్క ప్రదర్శనలు, చర్చ గోష్టి, పోటీలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఎప్పటినుండో ఘనంగా నిర్వహిస్తున్నారు. మృత్యుంజయరావుగారి ధ్యాస మరియు తన ఊపిరి తమ గురువులైన రాజాజీ గారు, దామెర్ల రామారావు గారు మరియు వరద వెంకటరత్నం గార్ల పైనే సారిస్తారు. వెంటపల్లి గారు మంచి కాలంని రచించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap