భావ వ్యక్తీకరణకు ‘చిత్ర’ భాష్యం

స్వచ్చమైన ‘ముత్యం’లాంటి మనసు మాత్రమే మారుతున్న వస్తుప్రపంచాన్ని తెల్లని కాన్వాసులపై ముద్రించగలదు, వర్ణమయం చేయగలదు. కొంతమంది చిత్రకారులను చూసినప్పుడు మాత్రమే ఇది వారి సొంతమని అనిపిస్తుంది. ముత్యం శ్రీనివాస్ రెడ్డి వంటి నిష్ణాతులైన చిత్రకారులను చూసినప్పుడు సంక్లిష్టమైన భావాలను ఇంతసూక్ష్మంగా చిత్రించవచ్చా అన్న సంశయము కలుగుతుంది.

ముత్యం శ్రీనివాస్ రెడ్డి 1970 లో పల్నాడు జిల్లా నరసరావుపేట లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకట నరసమ్మ, శ్రీ రామకృష్ణారెడ్డి గార్లు. అక్క, తమ్ముడు ఉన్నారు. ప్రాథమికవిద్య మున్సిఫల్ హైస్కూల్లోను, శ్రీ భ్రమరాంబ ప్రాధమికోన్నత పాఠశాలలోను, ఇంటరు ఎస్.ఎస్.యన్ కళాశాలలోను చదివారు. చిత్రలేఖనంపై ఉన్న మక్కువతో బాల్యంలో దేవాలయ శిల్పాలకు, పత్రికల్లోని భారతీయ చిత్రకారుల చిత్రాలకు, ఇలస్ట్రేషనులకు ఆకర్షితుడై వాటిని చిత్రించటం; అది చూసిన తండ్రి పిల్లవాని అభిరుచిని గమనించినవాడై హైదరాబాదులోని జె.ఎన్.టి.యు ఫైనార్ట్సు కళాశాలలో BFA చదువుకొనేందుకు ఎంట్రన్స్ వ్రాయించటం జరిగింది. 1988లో సీటు సంపాదించుకున్నారు. 5 సంవత్సరాల డిగ్రీని ఎంతో శ్రద్ధతో 1994 లో పూర్తి చేసారు. చిత్రలేఖనంపై మక్కువ మిక్కుటమవటం వలన అంతటితో ఆగక మాష్టర్స్ డిగ్రీ MFA ని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో కొనసాగించారు. 1996కి పూర్తిచేసారు.

ముత్యం శ్రీనివాస్ రెడ్డి చిత్రలేఖనం తప్ప మరేవ్యాపకం లేని చిత్రకారుడు. తండ్రి మరణానంతరం పెద్ద కుమారుడిగా ఇంటి బాధ్యతలు, తండ్రి ఉద్యోగం పట్టి బంధించాయి. ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో విద్య నేర్చినప్పటికీ, పరిస్థితులు ఎంత ప్రతిబంధకంగా మారినా ప్రయత్నాన్ని ఆపలేదు. రోజులో కొంత సమయాన్నైనా తనకిష్టమైన రంగులతో గడపటం నిత్య కృత్యంగా మలచుకున్నాడు. సాయం సంధ్యవేళకు ఎంత ఆలస్యంగా ఇంటికి చేరినా తన శ్రీమతితోపాటు ఈజిల్ పై ఒక (అసంపూర్ణ) చిత్రం ఎప్పుడూ తన రాకకై ఎదురుచూస్తూ వుంటుంది అన్న విషయం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

ముత్యం శ్రీనివాస్ రెడ్డి చిత్రాలు గ్యాలరీని చేరకుండానే ఫ్రేమింగ్ దశలోనే చూసిన కళాభిమానులు అధిక మొత్తాన్నిచ్చి సొంతం చేసుకున్న సందర్భాలెన్నో. పెన్ & ఇంక్ (బ్లాక్ అండ్ వైట్) మీడియంపై మక్కువ కలిగిన శ్రీనివాస్ రెడ్డి నిరంతరం సాధన చేస్తూ ఉండేవారు. అపారమైన ప్రావీణ్యాన్ని సంపాదించారు. కాపీ బొమ్మలను ఇష్టపడేవాడు కాదు. ఒకానొక సమయంలో అవుట్ డోరులో లైవ్ స్కెచ్చస్, ఇన్ డోరులో ఊహాచిత్రాలు గీస్తూ ప్రపంచాన్ని మరచిపోయిన సందర్భాలున్నాయి.

1999 లో తనకంటూ ఒక శైలి ఏర్పడ్డాక, ఇక వెనుదిరగక ముందుకు అడుగులువేస్తూ తన కళాప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ఆనందసమయాన్ని గడిపాడు. ముత్యం చిత్రాల్లో “ఏకమూర్తి చిత్రాలు ఎక్కువ” అనేకంటే; “అన్నీ అవే” అన్న అతిశయోక్తి లేదు. ఆ మూర్తి చిత్రాల బాడీ లాంగ్వేజ్ నాట్య భంగిమలను తలపిస్తూ అర్థనగ్న పురుషులు, నిండైన వస్త్రధారణతో స్త్రీ మూర్తులు దర్శనమిస్తారు.

దేవాదాయ శాఖ ఉద్యోగిగా మారిన తరువాత తనలోని కళాకారుడు అజ్ఞాతవాసిగా మారిపోయాడు. తోటి ఉద్యోగులకు సైతం తానొక చిత్రకారుడన్న విషయం తెలియనివిధంగా శ్రద్ధతో విధులు నిర్వహిస్తూ, ఉద్యోగం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నాడు. చిత్రలేఖనా వ్యాపకాన్ని ఆస్వాదిస్తూ, చిత్రాలను సృజిస్తూవచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అమరావతి రాజధాని కావటంతో వారి ఆఫీసు కార్యాలయం విజయవాడ గొల్లపూడికి మార్చడమైనది.

శ్రీనివాస్ రెడ్డి యాబ్ స్ట్రాక్ట్ ఆర్టును మొదటి నుండి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. అలా అని సాంప్రదాయాన్ని అనుసరించేవాడు కాదు. పుస్తకసేకరణ పై అపారమైన ప్రీతి కలవాడు. అబిడ్సు వీథుల్లో ఆదివారపు అంగళ్ళ మధ్య కొన్ని వందల చిత్రకళా గ్రంథాలు సేకరించి వుంచాడు. అన్నమైనా మానుకొని తనకు ఇష్టమైన పుస్తకాలను కొనేవాడు. శ్రీనివాస్ రెడ్డి రూమును సందర్శించిన మిత్రులకు ఆ పుస్తకాలను చూపుతూ తానెరిగిన ఎన్నో విషయాలు వివరించేవాడు. ఇప్పుడు తన మిత్రులకు, విద్యార్థులకు పంచుతున్నాడు.

తెల్లనికాగితాలపై నల్లని ఇంకుతో ఉద్యమంగా ఎన్నో చిత్రాలను చిత్రించాడు. తాను గీయాలనుకున్న చిత్రాలకు స్కెచ్ బుక్కులు చిన్నవైపోయాయి. తన బృహత్తరమైన చిత్రాలకు కుడ్యాలే చివరకు వేదికలయ్యాయి. విద్యార్థిగా అబిడ్సులోని రెడ్డిహాస్టలు నివాసమైనప్పటికీ రోజుకొకమారైన కింగ్ కోటిలోని జె.ఎన్.టి.యు ఫైనార్ట్సు అండ్ ఆర్కిటెక్చర్ హాస్టలుకు మిత్రులను కలిసేందుకు వచ్చేవాడు. ఆ మిత్రుల్లో నేను ఒకడిని.

శ్రీనివాస్ రెడ్డి తన చిత్రరచనా శైలిని వివరిస్తూ “నాకు కళ అనేది భావోద్వేగాల సమన్వయం. చిత్రాలు చిత్రించడానికి బాహ్యజగత్తు వాస్తవికత ప్రేరణ నాపై చాలా తక్కువ. కాని, నా అంతర్గత వాస్తవికత ఆనందం మొదలైన అనుభవాలతో నిండి ఉంది. అదే నా చిత్రాలలో చిత్రీకరించేందుకు ప్రయత్నించాను. నా పెయింటింగ్స్‌లోని పాత్రలు నాలోని భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి.

నా పని భారతీయతా పారంపరిక వర్ణ ప్రకృతి గురించి భాషిస్తుంది; ప్రాచీనతకు ప్రతిబింబంగాను నిలుస్తుంది. ఉదహరించాల్సివస్తే అజంతా, ఎల్లోరా, లేపాక్షి మొదలైన భారతీయ కళారూపాల్లో ఉన్నట్లుగా ఉంటూనే నాదైన నవ్యత గోచరిస్తుంది. వ్యక్తమైన ప్రతి రూపము నా అంతర్గత అనుభవాలను స్పష్టంగా చూపుతుంది. రంగుల విషయానికే వస్తే నేను ఆధ్యాత్మిక జ్ఞానం, ఆనందం వ్యక్తం చేసేందుకు పసుపువర్ణాన్ని ఉపయోగిస్తాను. అది సూర్యుని సృష్టి శక్తిని కూడా సూచిస్తుందనేది నా నమ్మకం. వివిధ రకాల గోధుమ, కేశర రంగులు నాకు దేవాలయాలలో దేవీదేవతలుగా కనిపిస్తాయి” అంటారు.

ఏక వ్యక్తి, బహుపాత్రలు పోషించేందుకు రంగస్థలంలా క్యాన్వాసును సిద్ధం చేసుకుంటాడు. ఒక ఘనీభవించిన క్షణాన్ని క్యాన్వాసుపై భంగిమగా ముద్రిస్తే ఆ వైఖరిలో అనేకానేక సూక్ష్మ భావనలు నిబిడీకృతమై గోచరిస్తాయి. ఆ మూర్తుల్లో శ్రీనివాస్ తూలికావిన్యాసం దృఢ నైపుణ్యాలను కనుగొనవచ్చును. ఈ ప్రక్రియలో చిత్రించిన వరుస చిత్రాలను 2007లో నిర్వహించిన తన మొదటి వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శన ‘Art of Expression’లో ప్రతిబించాడు.
శ్రీనివాస్ చిత్రశైలిపై శ్రీమతి అవని రావ్ గాండ్ర కళావిమర్శకురాలు తన అభిప్రాయాన్ని వ్యక్తపరస్తూ “యోగాసనాలు, మైమ్, డ్రామా, ఆలయ శిల్పం, యుద్ధ – నృత్యభంగిమల సమ్మిళితం. సాధారణ నేపథ్యానికి భిన్నంగా సూత్రబద్ధం కావించబడిన ఏకవ్యక్తి యొక్క బహురూపాలు దర్శనమిస్తాయి. భారతీయ మరియు గ్రీక్-రోమన్ భంగిమలను తలపిస్తాయి. గ్రామీణ యువకుల పాత్రలలోని భంగిమలు, భావవ్యక్తీకరణలు, మేని ఛాయల్లో రాముడు, కృష్ణుడు దర్శనమిస్తారు.

వేణువాదకుడు, విలుకాడు, యోధుడు, మయూర భంగిమ వంటి అంశాలు, బాడీలాంగ్వేజ్‌లోని కవిత్వం వీక్షకుల మస్సును మాయాజాలానికి లోనయేలాచేస్తుంది. పాత్రదారి ఆనందం లేదా వేదనను వ్యక్తపరచటం అనే ముఖ్యలక్ష్యంతో చిత్రీకరణ జరుగుతుంది. గోరింటపూచిన పాదహస్తాలు, వాలుచూపులు, ముదురు రంగు చర్మం పై ప్రకాశవంతమైన పసుపు వర్ణంలోను, ఛాతీపై పసుపు చుక్కలు మరియు కెంపులు పూసిన బుగ్గలు ఈ క్షణాలను పవిత్రం చేయడానికి ప్రయత్నించే మ్యాపింగ్ వంటి మండలాకారాన్ని కలిగి ఉంటాయి.
అమ్మాయిలు తమ భావోద్వేగాలలో మరింత ప్రశాంతంగా అజంతా స్త్రీని, భారతీయ సూక్ష్మ చిత్రాల నాయికలుగా కనిపిస్తారు. స్వాభావికమైన చిత్రకారుడు ముత్యం శ్రీనివాస్‌రెడ్డి.

2020లో నిర్వహించిన 2వ వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శన ‘Inherent’లో అతని పాత్రలు మరియు సాంప్రదాయ భారతీయ కళారూపాలతో స్వాభావిక బంధాన్ని ఉదహరించే అండర్ కరెంట్. సరళీకృత, సంక్షిప్త మరియు మితభాష్య దృశ్యకావ్యంగా అందించబడింది, అతని చిత్రాల్లోని స్త్రీ, పురుషరూపాలు వీక్షకులకు తక్షణమే అవగతమవుతారు. గ్రామీణ అందాలు, కర్షకులను ప్రాథమిక సారాంశంగా నింపబడ్డాయి, అదే వారి చిత్రం వర్ణబలాలతో విశ్వవ్యాప్తంగా మారడానికి దోహదపడుతుంది. వర్ణ వ్యక్తీకరణ, రూప సూక్ష్మీకరణ సమకాలీన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
ముత్యం శ్రీనివాస్ రెడ్డి పలు చిత్రకళా(వ్యక్తిగత, సామూహిక) ప్రదర్శనలలోను, పోటీలలోను పాల్గొని, విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. 2016 నుండి ఉద్యోగం, చిత్రలేఖనంపై మాత్రమే దృష్టి సారించారు. 2018లో డా. పట్టాభి కళా పీఠము శ్రీనివాస్ రెడ్డి ప్రతిభను గుర్తించి ఉత్తమ చిత్రకారునిగా జాతీయ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.

ఆత్మకూరు రామకృష్ణ, కవి, చిత్రకారుడు

5 thoughts on “భావ వ్యక్తీకరణకు ‘చిత్ర’ భాష్యం

  1. నూతన రచనలకు, రచయితలకు మీరిస్తున్న ప్రోత్సాహము ప్రశంసనీయము. సకాలంలో సమీక్ష ముద్రించిన మీకు ధన్యవాదములు.🙏💐

  2. ముత్యాల వర్ణచిత్రాల మీద మీ చిత్రభాష్యం అద్భుతంగా ఉంది

  3. శ్రీనివాస్ రెడ్డి గారి గురించిన వివరణ చాలా చక్కగా ఉంది రెడ్డి గారికి శుభాకాంక్షలు 💐💐
    కళసాగర్ గారికి అభినందనలు 💐💐

  4. ఆత్మకూరు రామకృష్ణ గారికి అభినందనలు
    శ్రీనివాస్ రెడ్డి గారి పరిచయం చక్కగా ఉంది 💐💐

  5. ఎంతోమంది కవులను, కళాకారులను ప్రపంచానికి పరిచయంచేస్తూ… ఎంతో కాలంగా కళాత్మక జీవన గమనంలో శ్రమిస్తూ ముందుకు సాగుతున్న ప్రియ మిత్రులు శ్రీ కళాసాగర్ గారు ఈసారి ఉగాది కళారత్నం గానీ, పురస్కారం లో గాని మెరుస్తారనుకున్నాం…
    సమతుల్యత పాటించి ఉంటే వీరికీ పురస్కారం వచ్చేది అని అనిపిస్తుంది

Comments are closed.

Share via
Copy link
Powered by Social Snap