శ్రీ లోలకపూరి నరేందర్ గారు, నివాసం శ్రీ తిరుమల శాంతి నిలయం, కొత్తపేట, హైదరాబాద్.
శ్రీ లోలకపూరి నరేందర్ గారు, శ్రీమతి & శ్రీ కమలాబాయి వెంకయ్య గార్ల సుపుత్రుడు, జనగామ జిల్లావాసి. చదువులో బి.ఎ పూర్తి చేసి, వృత్తిపరంగా 1995 సంవత్సరంలో బి.కె.బి హైస్కూల్, మలకపేట్ నందు చిత్రలేఖనోపాథ్యాయుడుగా తన జీవితాన్ని ప్రారంభించి. ప్రస్తుతం ముషీరాబాద్, కే.వి.కే హై స్కూలులో ఆర్ట్ టీచర్ గా తన వృత్తిని కొనసాగిస్తున్నారు.
ప్రవృత్తిపరంగా గత 23 సంవత్సరాలు నుండి చిత్రలేఖనంలో కళాకారుడుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం రాణిస్తున్న కళారంగమంటే చాలా చాలా ఇష్టమని, నాలో వున్న ఆసక్తి వల్ల తనలోని ఆలోచనలు, మనోభావాలను ఎన్నో రకాలుగా కాన్వాస్ పై రంగుల మిశ్రమాలతో ఎన్నో కళాఖండాలను రూపొందించగలిగానని వివరించారు నరేందర్ గారు.
తెల్లకాగితంలాంటి జీవితమనే క్యాన్వాసు పై సుఖదుఃఖాలు, మంచిచెడులు, రాగద్వేషాలు, జయాపజయాలు వంటి రంగులన్నీ కలిస్తేనే నిజమైన ఆనందం లభిస్తుందని నరేందర్ గారు పేర్కొన్నారు. వీరి తల్లి కమలాబాయి గారు చేసే అల్లికలను చూసి చిత్రకళను నేర్చుకొని, అదే కళతో తన వృత్తిగా చేపట్టారు. నేడు కళారంగంలో రాణిస్తున్నారు కూడా.
పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్, ఆయిల్ కలర్స్ మరియు పెన్సిల్-కలర్ పెన్సిల్స్ లతో……
- పోర్ట్రయిట్స్,
- ఇలస్ట్రేషన్స్,
- సన్మాన పత్రాలు,
- యానిమల్స్,
- కధలకు బొమ్మలు…. ఇలా పేయింటింగ్స్, డ్రాయింగ్స్ చేస్తున్నారు.
మొదట్లో వీరు ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో 45 స్వీయ చిత్రాలతో సోలోగా కళాప్రదర్శనను ఏర్పాటు చేసారు. వీరి ప్రతిభకు 2017 లో “ఆఫ్ఝ్ అబ్దుల్ కలాం ఎక్స్ లెన్సీ అవార్డును,
- తెలంగాణ ప్రభుత్వ ఉపముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ గారిచే “ఎక్స్టార్డనరీ బుక్ ఆఫ్ రికార్డును” అందుకున్నారు.
- మరియు “మార్వ్ లెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్”,
- మదర్ థెరీసా అవార్డ్,
- ”అర్పిత సాహిత్య, సాంస్కృతిక, సాంఘీక స్వచ్ఛంద సేవా సంస్థ” విశాఖపట్నం, నుండి “తెలంగాణ రత్న” అవార్డును,
- 2017 సెప్టెంబరు 5 న బెస్ట్ ఆర్ట్ టీచర్ గా అవార్డును అందుకున్నారు.
- ”చిత్రలేఖ శిరోమణి” సూర్యచంద్ర కల్చరల్ & సోషల్ ఆర్గనైజేషన్ నుండి,
- న్యూఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు డా.యస్.వేణుగోపాలా చారి గారి నుండి “సేవా శిరోమణి” అవార్డు,
- నేషనల్ ఛైల్డ్ ఆర్ట్ పనోరమా, హైదరాబాద్,
- జ్యోతిర్మయి చిత్రకళా దీప్తి, జనగామ,
- బాలచెలిమి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ, హైదరాబాద్,
- సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ నుండి “నేషనల్ ఇంటెగ్రేషన్ అవార్డ్,
- భావన ఆర్ట్స్ క్రియేషన్స్ నుండి “ఉగాది పురస్కారం”,
- సంఘమిత్ర సంస్థ నుండి “పికాక్ ఎక్సలెన్సీ” అవార్డును శ్రీ పి.సుధాకర్ రెడ్డి గారిచే ఇలా ఎన్నో అవార్డులను అందుకున్నారు.
ప్రస్తుతం “సునీత ఆర్ట్ అకాడమీ” విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 1992 సం. నుంచి పలుమార్లు ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ప్రముఖులచే ప్రశంసలను అందుకుంటున్నారు. వీరి చిత్రాలు పలు పత్రికలలో ప్రచురితమవ్వడం విశేషం. అంతేకాదు, విద్యార్థులకు చిత్రకళపై పోటీలను నిర్వహిస్తూ బహుమతులను, జ్ఞాపికలను అందిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఎక్కువుగా సామాజిక ఇతివృత్తం, ప్రముఖుల చిత్రాలను చిత్రిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపుగా వెయ్యికి పైనే బొమ్మలు చిత్రించారు. కాని తన దగ్గర వంద కంటే ఎక్కవ లేవని, చాలా వరకు సేల్ అయ్యావని, మరికొన్ని గిఫ్టులుగా ఇచ్చేసాని, రెండు సార్లు కళాప్రదర్శనలను కూడా ఏర్పాటు చేసానని తెలిపారు.
ఈ కళారంగంలో నేనొక కళాకారుడిగా గుర్తింపు రావడంతో నూటికి నూరు శాతం సంతృప్తిగా వుందని అన్నారు. ఇంకా ఎందరినో ఆర్టిస్టులను తయారు చేయాలనే ఆశయంతో దాదాపుగా వెయ్యిమందికి పైగానే శిక్షణ ఇచ్చానన్నారు. 2013 సంవత్సరం నుండి గాంధీభవన్ పక్కన, నాంపల్లిలో గల ప్రభుత్వ కళాశాలలో, సమ్మర్ శెలవులలో టి.టి.సి డ్రాయింగులో ఇన్స్ట్రక్టర్ గా చేస్తున్నారు. ఎంతోమంది శిష్యులను తయారు చేయడం వీరి ప్రత్యేకత. తద్వారా ఈ రంగంలో చాలా మందికి జీవనోపాధి లభిస్తుందని వ్యక్తపరిచారు.
చివరిగా “సాధన-కృషి-పట్టుదల ఉంటే, ఏ రంగంలోనైనా గుర్తింపు సాధించవచ్చని”, పెదాలపై కనీకనపడని చిరునవ్వుతో అన్నారు నరేందర్ గారు.