ఎక్కడో యూరఫ్ ఖండం నందలి స్పెయిన్ దేశం మలగాలో 1881 అక్టోబర్ లో పుట్టిన పికాసో ఆసియా ఖండంలోని భారతదేశం రావడం, అక్కడనుండి మరలా ఆంద్రప్రదేశ్ నందలి మారుమూల పల్లెటూరైన మా ఊరు కందులపాలెం రావడమే కాదు మా ఊరి ఇంటి గోడలపై ఎన్నెన్నో బొమ్మలు కూడా వేసి వెళ్ళాడు.
నిజంగా ఇది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కదూ…అవును విచిత్రమే మరి. పికాసో 1970లలో తన చివరి రోజుల్లో ఎలా వుండే వాడో అచ్చు పికాసోనే పోలిన వ్యక్తి 1970 – 75 ప్రాంతంలో మా ప్రాంతం వచ్చి మా ఊరినందలి చాల మంది ఇంటి గోడలపై అలవోకగా బొమ్మలు వేసి వెళ్లి పోతుంటే అవి చూసి నేను ఆశ్చర్యముగా నోరెళ్ళ బెట్టిన రోజులవి. అలా నా చిరు ప్రాయంలో మా వూరోచ్చి కళా పరంగా ప్రభావితం చేసిన ఆ పికాసో పేరు గాడాల గంగయ్య. నాకే కాదు ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాలలోని చిత్ర కళా బీజాలు అప్పుడప్పుడే పడుతున్న నాలాంటి చాలా మంది గ్రామీణ బాల కళాకారులను తన రేఖా చిత్రాలతో విస్మయపరిచడమే గాక తొట్ట తొలిగా ప్రభావితపరిచిన వ్యక్తి కూడా ఈ గాడాల గంగయ్య.
ఎందుకొచ్చాడో తెలియదు , ఎక్కడినుండి వచ్చాడో కూడా తెలియదు . కానీ నా బాల్యంలో మా వూరి ఇళ్ళ గోడలపై అతను అలవోకగా గీస్తుండే రేఖా చిత్రాలను చూస్తుంటే నిజంగానే నేను నోరెళ్ళబెట్టేవాడిని. ఎలా గీయగలుగుతున్నాడు.. అని. అసలు యే బొమ్మను చూడకుండా ముందస్తు స్కెచ్ కూడా ఏమీ గీసుకోకుండా డైరెక్ట్ గా అన్ని బొమ్మలు ఎలా వేస్తున్నాడు అని చాలా ఆశ్చర్యానికి గురయ్యేవాడిని. పోనీ అలవోకగా అతను గీసే అ అందమైన బొమ్మల రూప కల్పనకు అతను వాడే పరికరాలు నేడు మనం వాడే కేమల్ ,జైన ,వెల్డన్ తదితర కంపెనీలు తయారు చేసే ఖరీదైన కుంచెలులాంటివి కాదు. కేవలం మెత్తగా నమిలిన వేప పుల్ల లేదా కానుగ పుల్ల అంతే. అవే ఆ రోజుల్లో అతని కుంచెలు.. వాటితోనే అతడు రసమయమైన రేఖాచిత్రాలు సృష్టించేవాడు .రంగులు కూడా ఇప్పుడు మనం వాడేటటు వంటివి కాదు. చిక్కుడు ఆకులు లేదా రాబిన్ బ్లూ నీలి మందు లేదా ఒక్కోసారి జేగురు రంగు పౌడర్ .ఇవే అతని రంగులు. చిక్కుడు ఆకులు చేతితో పట్టుకుని ఆ ఆకులను గోడపై రుద్దుతూ లేడిని తరుముతున్న సింహాన్ని వేసేవాడు. నాడు అతను ప్రధానంగా వేసే చిత్రాల్లో ఎక్కువగా కృష్ణ అర్జున యుద్ద ఘట్టం. గీతోపదేశం, సీతాదేవి మాయలేడిని తెమ్మని రాముడిని కోరడం ఇలాంటి సన్నివేశాలు.వేప పుల్లను మెత్తగా నమిలి నీలిమందులో ముంచి ఎలాంటి ముందస్తు స్కెచ్ లేకుండా సునాయాసంగా అతడు గీసే రేఖా చిత్రాలు ఏమీ తెలియని ఆ బాల్యంలో విస్మయపరచకుండా ఎలా వుంటాయి ?
మనిషి కాస్త పొట్టిగా కాస్త లావు సన్నం కాకుండా మధ్యస్తంగా కాస్త బట్ట తల తో వున్న ఆ వ్యక్తిని ఇప్పుడు తలచుకుంటుంటే అచ్చు పికాసో రూపం అతనిలో నాకు కనిపిస్తుంది .డిటో అతనిలాగే వుండేవాడు గాడాల గంగయ్య. అసలు అతనిది ఏవూరో ఎక్కడినుండి వచ్చేవాడో తెలియదు, కానీ చుట్టుప్రక్కల గ్రామాలలోని అందరి ఇంటి గోడలపై అతని రేఖా చిత్రాలు కనిపించేవి. ప్రధానంగా వాటిలో పైన పేర్కొన్న దృశ్యాలే ఎక్కువగా వుండేవి .మరొక చిత్రం కూడా వుండేది .అది ఒక వ్యక్తి పొడవాటి కర్ర చేత పట్టుకుని ఒక పళ్ళాన్ని పైకి ఎగరేసి గిరగిరా తిప్పుతున్నట్టు కూడా మరో బొమ్మ వేసేవాడు. ఒక విదంగా అది అతని సెల్ఫ్ పోర్త్రైట్ అని ఊహ తెలిసిన కొన్నాళ్ళకు నాకర్ధమయ్యింది. ఎందుచేతనంటే ఉదయం బొమ్మలు వేసే అతను ఆయా ఊర్లలో సాయంకాలం ఆ ఊరి గుడి వద్ద చేసే విన్యాసాలలో అది ఒకటి . ప్లేట్ పైకి ఎగరేసి కర్రతో గిరగిరా బేలన్సుగా తిప్పడం ఒక విన్యాసం .
అతను చేసే ఆ విన్యాసాన్నే కొందరి ఇంటి గోడలపై కూడా వేసేవాడు . నాకు ఊహ తెలిసిన తర్వాత మొదట నేర్చుకున్న కాకి , ఏనుగు బొమ్మలు మా అమ్మనాన్నలనుండి అయితే , పులి, సింహం, గుర్రం బొమ్మలు ఈ గాడాల గంగయ్య ఆనాడు గోడలపై గీసిన బొమ్మలనుండి నేర్చుకున్నవే. ఆ నేర్చుకోవడానికి గలకారణం ఆ రోజుల్లో మా ఊరి వెంకన్న బాబు తీర్ధంలో మేము చూస్తుండే ఏనుగు పులి గుర్రం ఆట ప్రధాన కారణం. బాల్యంలో మాకు ఆ తీర్ధంలో మాత్రమే కనిపించే ఆ ఆట మేము ఇంటివద్ద కూడా ఆడుకోవాలనే కుతూహలంతో చిన్న పిల్లలమైన మేము ఆరోజుల్లో సిగరెట్ పేక ముక్కలపై ఆ సింహం ,పులి ,ఏనుగు బొమ్మలు వేసుకోవాల్సి వచ్చేది .కనుక మా పిల్లల బాచ్ లో నేనే బొమ్మలపట్ల ఆసక్తి కల వాడిని కావడం వల్ల ఆ సింహం ఏనుగు గుర్రం బొమ్మలను సిగరెట్ పేక ముక్కల వెనుక వేసేవాడిని .అలా ఆ ఆట కోసం నేను వేసిన ఏనుగు బొమ్మ మా నాన్న నుండి నేర్చుకున్నదైతే, మిగిలిన పులి, గుర్రం బొమ్మలు ఈ గాడాల గంగయ్య గారి బొమ్మలనుండి నేర్చుకున్నవే.
కేవలం అతను ఒక చిత్రకారుడు మాత్రమే కాదు. ఐదు పదులు దాటిన ఆ మలి వయస్సులోనూ అతను సాయంత్ర సమయాల్లో, ఒక్కోసారి రాత్రి వేళల్లో గ్రామాల్లో ఆటలు ప్రదర్శించే వాడు .ఆ ఆటలు చాలా సాహసంతో కూడుకున్నవి, మరియు ఆశ్చర్యం గోలిపేవిగా వుండేవి. వాటిని మా రామాలయం ముందు ప్రదర్శించేవాడు .ఎక్కువ విన్యాసాలు కాదు గానీ ఒకటి రెండు సాహాసాలు చేసి గ్రామాల్లోని ప్రజలలో ఆనందం ఆశ్చర్యాలు కలిగించేవాడు . అతను ప్రదానంగా ఆడే ఆటల్లో ఒకటి ఒక సీమండి పళ్ళెం తీసుకుని ఒక కర్రపై నిలబెట్టి పలుసార్లు గిరగిరా తిప్పుతూ అల్లంత ఎత్తుకు ఎగరేసి మరలా దాన్ని తన కర్రపైకి సరిగ్గా పడనిచ్చి మరలా గిరగిర త్రిప్పుతూ ఎగరేసి అందరిని అలరించేవాడు .. రెండవ ఆట అతను నుదిటి పై చేతి కర్ర పట్టుకుని చాల దూరం నడిచి అలరించేవాడు . అచ్చు పికాసోను పోలి వుండే అతడు అప్పటికే కాస్త వయసు మల్లినవాడు అయినప్పటికీ ఆఖరిగా అతను మా రామాలయం లో బజన సెట్టుయొక్క ఇనుప చువ్వతో అందరికి గుగుర్పోడిచే సాహసం మరొకటి చేసేవాడు. బజన సెట్టు అంటే ఇప్పటి జనాలకు తెలియకపోవచ్చు అది కంచుతో కళాత్మకంగా తయారు చేయబడిన ఒక పొడవైన దీపపు స్థంభం.
ఆ దీప స్థంభం చుట్టూ కంచుతోనే చేయబడ్డ అనేక చెట్టు కొమ్మలలాంటి అలంకరణలతో కళాత్మకంగా తయారు చేయబడిన దీపపు కుందేను ఆ రోజుల్లో బజన సెట్టు అనే వాళ్ళం .కారణం ఈ దీపపు కుందేకు చుట్టూ చెట్టు కొమ్మల్లా అమర్చబడిన కంచు కొమ్మలపై చిలుక, నెమలి , హనుమ తదితర కంచు రేకుతోనే చేయబడ్డ అందమైన బొమ్మలుండేవి . ఆ దీపపు కుందే చుట్టూరా వుండే ఆ కొమ్మల చివర్లలో అమర్చబడిన ప్రమిదలలో నూనె పోసి వత్తి పెట్టి దీపాలు వెలిగించి ఆ బజన సెట్టు చుట్టూరా గుడిలో కూర్చుని ఊరి పెద్దలు బజన చేసేవారు . పండుగ సమయాల్లో ఆ బజన సెట్టును తోమి తెల్లగా చేసేందుకు దాని మధ్య అమర్చిన రంద్రంలో ఇనుప చువ్వను పెట్టి దానిని అటువైపు ఇటువైపు కొందరు కుర్రవాళ్ళు తమ బుజాలపై పెట్టుకుని మోసుకుంటూ మా వూరి పెద్ద కాలువకు తీసుకెళ్ళి చింతపండు ఇటుకపోడిలతో శ్రీరామ నవమి,వినాయక చవితి , దీపావలి పండుగ సందర్భాలలో తళతళా మెరిసేలా తోమేవారు. ఆ బజన సెట్టు ఊస యొక్క ఒక కొనను మన గాడాల గంగయ్య గారు మా గుడి మెట్లకు ఆనించి రెండవ కొన అతని ఎడమ కంటికి ఆనించి ఆ బలమైన వూసను వంచేవాడు మరలా రివర్స్ లో వంచి యదావిదిగా చేసేవాడు. నిజంగా ఈ ముసలివాడికి ఇంత బలమెక్కడినుంది వస్తుందబ్బా అని చిన్నతనంలో ఆశ్చర్యముగా చూసేవాళ్ళం.
అతడు స్తిరంగా ఒక చోట వుండే వాడు కాదు . అలా చుట్టు ప్రక్కల ఊర్లన్నీ తిరుగుతూ ఆనాడు గ్రామాల్లో వున్న మట్టి ఇళ్ళ సున్నం కొట్టిన గోడలపై వాళ్ళ వాళ్ళ అభీష్టం మేరకు బొమ్మలు వేసి వెళ్లి పోయే వాడు. సాయంత్ర వేళల్లో ఇలా ఆటలు ప్రదర్శించేవాడు అందుకు అతనుఎవరినీ ఏమి అడిగే వాడు కాదు కాని ,గ్రామస్తులే ఎవరికి తోచిన డబ్బులు వారు అతనికి వేసేవారు.
లోకంలో పుట్టిన ప్రతి మనిషిని భగవంతుడు ఏదో ఒక ప్రత్యేక కార్యం కోసమే పుట్టించి వుంటాడేమో అనిపిస్తుంది ఒకోసారి. వాళ్ళు ఈ భూమి మీదకు వచ్చి పలాపేక్ష రహితంగా భగవంతుడు వాళ్లకు నిర్దేశించిన కార్యాన్ని చేసుకుంటూ పోతారా అని అనిపిస్తుంది కొందరు వ్యక్తులను చూస్తుంటే. ఒక లక్ష్యం లేకుండా ప్రతి పలం ఆశించకుండా ఎవరి గుర్తింపు, పట్టింపులతో నిమిత్తం లేకుండా ఒక స్థిర నివాసం అంటూ లేకుండా అన్నూర్లు తిరుగుతూ తమకు తోచిన పనులు తాము అలా చేసుకుంటూ పోతూ దిసానిర్దేశ్యం లేనివారిగా కనిపించే అలాంటి వారిని చూస్తుంటే నేడు నిజంగా మనం వేరేలా భావిస్తాం. కారణం ఏదీ ఆశించకుండా ఎవడూ నేడు పని చేయని సమాజం మనది. అందుకే మనకు వేరే భావన కలుగుతుంది . కానీ వాళ్ళు మనం ఊహించు కున్నట్టు పిచ్చోళ్ళు కాదు. నిదానంగా ఆలోచిస్తే లోకంలో ఎవరెవరినో ప్రభావితం చేసేందుకు భగవంతుడు పంపించిన గొప్ప వ్యక్తులేమో అని కూడా అనిపిస్తుంది. అలా నా చిరు ప్రాయంలో కళా పరంగా ప్రభావితం చేసిన వక్తుల్లో ఒకరు గాడాల గంగయ్య . నాకే కాదు ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాలలోని చిత్ర కళా బీజాలు అప్పుడప్పుడే పడుతున్న ఎందఱో గ్రామీణ బాల కళాకారులను తన రేఖా చిత్రాలతో విస్మయపరిచడమే గాక తొట్ట తొలిగా ప్రభావితపరిచిన వ్యక్తి కూడా ఈ గాడాల గంగయ్య.
పెరిగి పెద్ద వాడినయ్యి చిత్రకళపై నాదైన రీతిలో కృషి చేస్తున్న నాకు ఎక్కడో యూరఫ్ ఖండం స్పెయిన్ నందలి మలగా అనే మారు మూల వూరిలో పుట్టిన ఆ పికాసో గురించి తెలుసుకోగలిగాను గాని బాల్యంలో మమ్మల్ని అంతలా ఆశ్చర్యానికి గురిచేసి నన్నే కాదు మా ప్రాంతం నందలి నాలాంటి చిత్ర కళాభిలాషులను ప్రభావితం చేసిన మావూరు పికాసో అసలు ఏ వూరు వాడో ఇప్పటికీ తెలుసుకోలేక పోయాను.
-వెంటపల్లి సత్యనారాయణ ( 9491378313)