(అక్టోబర్ 2 న రవివర్మ వర్థంతి)
“రవివర్మకే అందని ఒకే ఒక అందానివో,
రవి చూడని పాడని నవ్య నాదానివో.
ఏరాగమో తీగ దాటి ఒంటిగా పిలిచి…”
అంటూ “రావణుడే రాముడైతే” చిత్రంలో ఓ సినీ మహాకవి గారు హీరోయిన్ అందాలను వర్ణిస్తూ అద్భుతంగా రాశారు ఈ పాటని. అంటే ఆ సినిమాలో హీరోయిన్ ని రాజా రవి వర్మగారి చూసి ఉంటే ఆ హీరోయిన్ ని తన కుంచెతో ఇంకా అద్భుతంగా మలచేవారు అంటూ రవివర్మ చిత్రకళా ప్రతిభకు చక్కని గుర్తింపుని చ్చారనే చెప్పాలి ఈ పాటలో. అవును నిజమే రాజా రవి వర్మ గారు భారతదేశంలోని చిత్రకారుల్లో నెంబర్ వన్ చిత్రకారులుగా ఎంతో ఖ్యాతిని గడించారు. పండితులు, విద్యావంతులు రామాయణం, మహాభారతం లాంటి పురాణ ఇతిహాసాలను చదువుతూ వాటికి సంబంధించిన సన్నివేశాలను తలుచుకుంటూ దేవుళ్లు దేవతలు రూపాల్ని ఊహించుకొంటుండేవారు. కాని శివుడు, ఆంజనేయస్వామి, రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. అలాగే లక్ష్మీదేవి, పార్వతీ దేవి ఎలా ఉంటారో కూడా తెలియదు. కాని ఓ వ్యక్తి తాను చదివిన పురాణేతిహాస గ్రంథాల్లోని దేవతామూర్తులను, వారి ఆకారాలను ఎంతో గొప్పగా ఊహించుకొని అంతకుమించి అద్భుతంగా ఆలోచించి చివరకు తన ఊహకు కుంచె ద్వారా ప్రాణం పోసి ఓ సరికొత్త రూపాన్ని ఇచ్చారు. అలా ఊహల్లో నుంచి రూపాంతరం చెందినవే మనం నిత్యం పూజించే దేవుళ్ళు దేవతలు. దేవుళ్ళు, దేవతలు కూడా తమకు ఇచ్చిన రూపానికి సంతోషించి వరాలనిస్తే అందుకున్న వ్యక్తే “లెజెండర్ రాజా రవివర్మ” గారు.
భారతీయ చిత్రకళని విశ్వవ్యాప్తం చేసిన లెజెండ్ రాజా రవివర్మ కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని కలి మానూర్ రాజప్రసాదంలో 1848 ఏప్రిల్ 29న నీలకంఠన్ బట్టాద్రిపాద్, ఉమాంబ తాంబురాట్టి పుణ్యదంపతుల ఇంట జన్మించారు. రవి వర్మ చిన్నతనం నుంచి కూడా గొప్ప ప్రతిభామూర్తి. కళలంటే ఆసక్తి మెండు. వీరి ప్రతిభను చూసి ట్రావెన్కూర్ మహారాజా తిరు నాయక్ చేరదీసి ప్రోత్సహించారు. అక్కడి ఆస్థాన చిత్రకారుడైన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికంలో చిత్రకళను మరింత పదును పెట్టి బాగా నేర్చుకున్నారు. తైలవర్ణచిత్రం జర్మన్ దేశస్థుడైన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నారు. 1873 వియన్నాలో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో తన చిత్రాలను ప్రదర్శించి మొదటి బహుమతి గెలుచుకున్న్నారు. అప్పటినుండి రవివర్మ బాగా వెలుగులోకి వచ్చారు.
రవి వర్మ తన చిత్రాల ఇతివృత్తం కోసం భారతదేశమంతటా జైత్రయాత్ర చేసి దక్షిణ భారత స్త్రీల అందచందాలకు అచ్చెరువొంది వారినే ఊహించి చిత్రించారు. వీరికి 18 ఏళ్ల వయసులోనే భగీరధి భాయి అనే 12 ఏళ్ల అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. సరికొత్త ఆలోచనలతో తన కుంచెతో అవిశ్రాంతంగా ప్రయాణం చేస్తూనే కట్టు, బొట్టు సాంప్రదాయం కలగలసి ఎన్నో వర్ణచిత్రాలను, తైలవర్ణ చిత్రాలు పెయింటింగ్స్ లో చూపించిన తీరు వర్ణనాతీతం. సప్తవర్ణాలతో తన కుంచె ఎన్నో పరుగులు పెట్టి ఎన్నెన్నో కళాఖండాలు కళామతల్లి పాదాల చెంతకు వచ్చి వాలాయి.అలాగే వీరు మహాభారతంలోని నలదమయంతుల చిత్రాలు, శకుంతల దృశ్యంతుల ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో ప్రాశస్త్యం పొందారు. అంత అద్భుతంగా చిత్రాలు గీసినా కూడా తన చిత్ర శైలిలో చాందసంగా ఉంటారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్న కూడా 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ పోటీల్లో మూడు బంగారు బహుమతులు గెలుచుకుని భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. వడోదర లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో మీరు గీసిన చిత్రాలు ఇంకా భద్రపరచబడి ఉన్నాయి.
ట్రావెన్కోర్ ప్రధానమంత్రి అయిన శ్రీ మాధవ రావు సలహాతో 1894లో ముంబైలోని గట్కోవర్ లో ప్రెస్ ప్రారంభించారు. దాని పేరు రాజా రవివర్మ “లితో గ్రాఫిక్స్ ప్రింటింగ్ ప్రెస్”. గ్రాఫిక్ యంత్రాలు చిత్రించడానికి అనువైన రాళ్లు, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించారు రవివర్మ. కాని ప్రారంభించిన నాలుగు సంవత్సరాలకే కొన్ని సాంకేతిక కారణాల వలన మహారాష్ట్రలోని కొండ కోనల నడుమ ఉన్న మాళవి అనే ప్రదేశానికి మార్చారు. ఇక్కడ వేలకొలది దేవతామూర్తుల చిత్రాలు అచ్చువేశారు. కొన్ని కారణాల వల్ల రవివర్మ చనిపోవడానికి రెండు సంవత్సరాల ముందు తన స్నేహితుడైన జర్మన్ సాంకేతిక నిపుణుడికి అమ్మవలసి వచ్చింది. ప్రెస్ తో పాటు 100 చిత్రాలకు కాపీ రైట్స్ ను కూడా ఇచ్చారు రవివర్మ. 1972లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తరువాత మిగిలిన చిత్రాలను, రాళ్లను చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చారు.
వీరు అద్భుతంగా చిత్రించిన చిత్రాలలో వీరికి పేరు తెచ్చిన చిత్రాలు “పల్లెపడుచు, ఆలోచనలో మునిగి పోయిన స్త్రీ, దమయంతి, వాద్యకారుల బృందము, సుభద్రార్జునులు, లేడీ విత్ ఫ్రూట్స్, హార్ట్ బ్రోకెన్, వీక్షకుల కుటుంబం, గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ, రిషి కన్య, నాయర్ల స్త్రీ…” లాంటి ఎన్నో చిత్రాలు వీరికి అద్భుతమైన పేరు తెచ్చిపెట్టాయి. “కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగౌతారు, ఇలవేల్పులౌతారు…” అని నిరూపించి తన చిత్రకళ ద్వారా విశ్వవ్యాప్తంగా పేరుగడించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన రాజా రవివర్మ 1906 అక్టోబర్ 2న కేరళలోని ట్రావెన్కోర్ ఆస్థానంలో పరమపదించారు. రంజిత్ దేశాయ్ రచించిన రాజా రవి వర్మ అనే నవల ఆధారంగా “రంగ్ రసియా” అనే హిందీ సినిమాను, మరియు “మకర మంజు” అనే మలయాళం సినిమాలు నిర్మించి వీరి ప్రతిభకు పట్టం కట్టారు.
*
-పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు, రచయిత్రి
ఫోన్ నెంబర్.9704725609