కళ అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. అది కొందరికి పుట్టుకతో వొస్తుంది మరికొందరికి సాధనతో వొస్తుంది. రంగుల కళ అయిన చిత్రకళ సహజంగా వ్యక్తిలో ఉన్నంతమాత్రాన సరిపోదు, ఆ సహజమైన ఆలోచనను ఆచరణ ద్వారా సాధన చేస్తేనే అతడు మంచి చిత్రకారుడిగా రానించ గలుగుతారు. లేకుంటే అది కేవలం మాటల్లోనూ ఊహలలోనే మిగిలిపోతుంది. శాస్త్రీయంగా చిత్రకళను అభ్యసించిన వాల్లంతా గొప్ప కళాకారులు కావాలని లేదు, అలాగే శాస్త్రీయంగా కళను అభ్యసించని వాళ్ళు గొప్ప కళాకారులుగా రాణించకూడదనీ లేదు, ఒక వ్యక్తి గొప్ప కళాకారులుగా రాణించడం అనేది ఆ వ్యక్తి యొక్క కృషి, తపన, మరియు సాధనల పై ఆధారపడి వుంటుంది.కళల కాణాచి అయిన రాజమహెంద్రి లో రాజు అనే యువ చిత్రకారుడు శాస్త్రీయంగా చిత్రకళను ఎక్కడా అభ్యసించలేదు,కానీ శాస్త్రీయమైన అవగాహనతో విరివిగా చిత్రాలు వేస్తూ తన తోటి యువచిత్రకారులెందరికో ఆదర్శంగా నిలిస్తూ ఇక్కడ చిత్రకళారంగంలో ఒక ఉత్సాహబరిత వాతావరణాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు ఈ యువ చిత్రకారుడు.
రాజుగా సుప్రసిద్దుడైన కండిపల్ల అప్పలరాజు అక్టోబర్ 10వ తేదీన 1983 వ సంవత్సరంలో శ్రీ కండిపల్ల సూర్యనారాయణ , శ్రీమతి లలితకుమారి అనే దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు . దానవాయపేట హై స్కూల్ లో పదవతరగతి ఆపై ఇంటర్ ఆర్ట్స్ కళాశాలలో చదివారు, హైస్కూల్ లో వుండగా సూరిబాబు అనే డ్రాయింగ్ టీచర్ వద్ద మెళకువలు నేర్చుకున్నారు. ఆపై లోయర్ హయ్యర్ డ్రాయింగ్ పరీక్షలలో వుత్తీర్నడయి కాకినాలో టి టి సి కోర్స్ కూడా పూర్తి చేసారు. తండ్రి సూర్యనారాయణ రాజమహేంద్రవరంలో అప్పటికే ఆర్ట్ లైన్స్ పేరుతో సినీ పబ్లిసిటీ బ్యానర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండడంతో చిన్నతనంనుండే రాజుపై ఆ ప్రభావం పడింది. తన 13వ ఏటనే కిష్కింద కాండ సినిమా కు కటౌట్స్ తయారు చేయడంలో తండ్రికి సహకరించాడు. అలా సినీ కటౌట్స్ కి తన తండ్రి వేసిన నటుల రూపాలకి రంగులు అద్దడం ద్వారా రూపచిత్రాలు వేయడం లో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. మొన్న09-11-2019న రాజమండ్రి చిత్రకళా నికేతన్ దామెర్ల ఆర్ట్ గేలరీ లో జరిపిన అంట్యాకుల పైడి రాజు శత జయంతి వేడుకలో పాల్గొనిసాయంత్రం ఆర్టిస్ట్ రాజు ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగానే అతడు చెప్పిన ఆవిషయం నాకు ఆశ్చర్యం కలిగేలా చేసింది.ఒక్క రోజులో ఏక బిగిన ఐదు పోర్ట్రైట్స్ పూర్తి స్తాయిలో వేసేయగలడట. అతని సహచరులు కూడా దీన్ని ద్రువీకరించడం చాలా ఆశర్యాన్ని కలిగించింది. నిజానికి అతడికి కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్ గా ప్రభుత్వ పాటశాలలో ఉద్యోగం వొచ్చినప్పటికి అతను వెళ్ళకుండా పూర్తిగా ఫ్రీలాన్సర్ గా పనిచేస్తూ ఉండడానికి అదే కారణం అని చెప్తారు.
కేవలం మనిషిని చూసి లేదా ఫోటో చూసి పోర్ట్ రైట్స్ మాత్రమే వేసుకుంటూ కాలం గడిపే వారిని గూర్చి మనం చెప్పుకోనవసరం లేదు. వాటితో పాటు తనదైన సొంత చిత్రాలు వేసే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగితేనే వారిని గురించి మనం చర్చించుకోగలం. ప్రస్తుతం కమ్మర్షియల్ ఆర్టిస్ట్ గ నే పనిచేస్తున్న ఈ రాజు తన సొంత చిత్రాలతో కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. చెట్లు నరకడం వల్ల, విస్త్రుతమైన ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన పర్యావరణానికి కలిగే అనర్ధాలు, జాతీయ సమైక్యత, ఇంకా పలు సామాజిక సమస్యలపై అతడు సొంతంగా వేసిన చిత్రాలు మనల్ని ఆలోచింపజేస్తాయి.అప్పుడప్పుడు తనదైన శైలిలో చిన్నచిన్న కార్టూన్లు కూడా వేస్తూ తనసృజనాత్మకతకు పదును పెడుతున్నాడు. ఇంకా తన స్వీయభావాలకనుగుణంగా చిత్ర రచన చేయాలి అనే ప్రయత్నంతో ముందుకు సాగుతున్నట్లు అతను వేస్తున్న కొన్ని బొమ్మలు చూస్తే మనకు అర్ధమౌతుంది.
రంగు రూపం లక్షణాలపరంగా కృష్ణుడికి నెమలికి ఒక పోలిక వుందని చెప్పవచ్చు. కృష్ణుడు ఎంతటి మోహన రూపం కల వాడో పక్షులలో నెమలి కూడా అంతే మనోహర రూపం గలది. ఇద్దరివి నీలవర్నమే . అంతేగాక నెమలి పించంలేని కృష్ణుడిని మనం ఎవరం ఊహించుకోలేము.అలాగే అందమైన ఆ ఈకలు లేని నెమలి రూపాన్ని కూడా ఊహించుకోలేము. అంతలా ఇరు రూపాల మధ్యపోలికను ఈ చిత్రకారుడు చూపించాలనుకున్నాడో ఏమో అతని చిత్రాల్లో ఒకటైన “నెమలి కృష్ణుడు” అన్నచిత్రంలో ప్రధానంగా కనిపించే నెమలి రూపంలో కృష్ణుడు రూపం అతని గాధలకు చెందిన చిత్రాలను, అదే చిత్రంలో ఛాయా రూపంలో వేసిన కృష్ణుడిరూపంలో అంతర్లీనంగా నెమలి చిత్రాలను చిత్రిస్తూ నేపధ్యాన్నంత కూడా స్వచ్చతకు శాంతికి ప్రతిభింబంలా మరళా దవల వర్ణ మయురాలని చూపిస్తూ ఒక గమ్మత్తైన భావనను ప్రేక్షకుడి మదిలో రేకెత్తించేలా చేసాడు.
అలాగే ఒక నిండు చూలాలు తన గర్భం నుండి బయటకు రాబోయే బిడ్డను మురిపెంగా నిమురుకుంటు అద్దం ముందు మురిసిపోతున్న సమయంలో ఏకంగా తన కలల రూపమైన బిడ్డను ఎత్తుకున్న ప్రతిభింబం ఆమెకు ఆ అద్దంలో కనిపించేలా చిత్రాన్నివేయడం అతని సృజనాత్మకతను తెలియజేస్తుంది. అలాగే పాప పుట్టిన దగ్గరనుండి బాల్యం. యవ్వనం,విద్యాభ్యాసం,పరిణయం, పిల్లలు కుటుంభం, వార్ధక్యం ఇలా ఒక స్త్రీ జీవితంలోని అన్నిఘట్టాలను లీలగా నేపధ్యంలో చూపిస్తూ వేసిన అందమైన అమ్మాయి చిత్రం, ఇంకా మాతృత్వం మధురిమ, బౌద్ధమే ముక్తికి మార్గం అన్న రీతిలో వేసిన దలైలామ చిత్రం గాని, గుర్రం జాషువా, అలాగే అల్లూరి సీతారామరాజు జీవిత ఘట్టాలకు సంభందించి రాజు వేసిన రెండు చిత్రాలు, గోదావరి నదీ తీరంలో శివపార్వతుల తాండవ నృత్యాన్ని ఒక నవ్య రీతిలో వేసిన చిత్రంగాని అతని ఆలోచనా రీతికి దర్పనాలుగా నిలుస్తాయి.
ప్రతి రోజూ వాట్స్ అప్ మరియు పేస్ బుక్ లలో అలవోకగా అతడు వేసి పోస్ట్ చేసే వివిధ వ్యక్తుల మరియు మిత్రుల యొక్క రూప చిత్రాలు పోర్ట్రైట్ చిత్రణ లో అతని సామర్ధ్యాన్ని తెలియజేస్తాయి. రాజు అన్నతన పేరు కి తగినవిదంగా తన రూప చిత్రాన్ని కూడా ఒక మాహా రాజైన కృష్ణదేవరాయల తరహా లో చిత్రించుకోవడం ఈ విదమైన తన ఆలోచన పరిధి లోకే వస్తుంది అని చెప్పవచ్చు .
ఇక చిత్రకారుడిగా ఒక ప్రక్క ఎందరో వ్యక్తుల అవసరాల మేరకు ఆర్డర్స్ పై రూప చిత్రాలు తదితరమైన వాటితో తీరికలేని స్థితిలో ఉన్నప్పటికీ, తన కోసం కొన్ని సొంత బొమ్మలను వివిధ వర్ణాలు,వ్యర్ధాలు , ఇంకా వివిధ వస్తువులతో ప్రయోగాలు చేస్తూ బిన్నంగా ఎప్పుడూ అతడు చిత్రాలు వేసే ప్రయత్నాన్ని నేను రాజమండ్రి లో అతని ఇంటికి వెళ్ళినప్పుడు గమనించడం జరిగింది. అలా అతడు వేసిన చిత్రాలు రాష్ట్రంలోను రాష్ట్రానికి ఆవల జరుగుతున్న వివిధ చిత్రకళా పోటీలకు సైతం పంపి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు ఈ యువ చిత్రకారుడు రాజు.
2017లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సర్వశిక్షా అభయాన్ తూర్పు గోదావరి జిల్లా వారు నిర్వహించిన పోటీలలో ఉత్తమ చిత్రకారుడి అవార్డ్ ను గెల్చుకోగా కోనసీమ చిత్రకళా పరిషద్ అమలాపురం వారి నుండి చిత్రానంద అవార్డ్, చిత్ర మిత్ర అవార్డ్ లను 2017, 2018లలో వరుసగా అందుకున్నారు మరియు రాబోయే2020 కి గాను ప్రగతి చిత్ర ఇంటర్ నేషనల్ గోల్డెన్ అవార్డ్ ని అందుకుంటున్నారు, అలాగే శ్రీ దర్శిని కలైకోడం తమిళనాడు వారి చిత్రకళా పోటీలు 2018-2019 కి గాను బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డ్ ను అందుకున్నారు. మరియు చోడవరం చిత్రకళా నికేతన్ వారి 2018 మరియు 2019 పోటీలలో వరుసగా టాప్ టెన్ అవార్డులు అందుకున్నారు, ఇంకా క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమి గుంటూరు నుండి 2018-2019 లో జ్యూ రీ అవార్డ్, కాళీపట్నం ఆర్ట్ అకాడమి హైదరాబాద్ నుండి 2018లో పద్మశ్రీ బాపు అవార్డ్ను అందుకున్నారు. ఇంకా ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్, రాజమండ్రి చిత్రకళానికేతన్, భగీరధి ఆర్ట్ ఫౌండేషన్, మరియు రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమి రాజమండ్రి తదితర సంస్థల నుండి ఎన్నో పురస్కారాలను ఈ యువ చిత్రకారుడు అందుకోవడం జరిగింది .
శాస్త్రీయంగా కళాశాలలో చిత్ర కళను అభ్యసించినవారంతా గొప్ప కళాకారులు కావాలని లేదు అలాగే శాస్త్రీయంగా కళను అభ్యసించనంత మాత్రాన గొప్ప కళాకారులు కాకూడదనీ లేదు. కళకు ముందు కావలసింది సృజనాత్మకత మరియు ఉత్సాహం. ఈ రెండూ వున్నవ్యక్తికి శాస్త్రీయమైన విద్య ఆ రంగంలో లేకున్నా కృషితో తనదైన రీతిలో ఆ రంగంలో ఉత్సాహంగా పని చేస్తూ ముందుకు సాగుతాడు. అందుకు వుదాహరణే ఈ యువ చిత్రకారుడు రాజు అని చెప్పవచ్చు. అయితే ఈ కృషి మాత్రమే సరిపోదు అంతం లేని కళకు నిరంతర సాధన, పరిశ్రమ, పట్టుదల ఇంకా అవసరం. వాటితో మారుతున్న కాలరీతుల కనుగునంగా నవ్యరీతిలో సృజనాత్మకంగా ఆలోచిస్తూ నిరంతరం కుంచెకు పదును పెడుతూ ముందుకు సాగినప్పుడే ఏ చిత్రకారుడికైనా మంచి భవిష్యత్తు వుంటుంది. ఆ విధంగా రాజు కూడా మరింత కృషి చేస్తూ ముందుకు సాగాలని కోరుకుందాం.
-వెంటపల్లి సత్యనారాయణ (9491378313)
అద్భుతమైన చిత్రకారురు రాజు గారి గురించి చాలా చక్కగా సమాచారం అందిచారు…
వీరి స్నేహితుల్లో ఒకరుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను… కె.రాజు గారికి అభినందనలు తెలుపుతు…వ్యాసకర్త శ్రీ వెంటపల్లి వారికి ధన్యవాదములు… 🤝