దేవతామూర్తులకు చిత్రకల్పన చేసిన ‘రవివర్మ ‘

(అక్టోబర్ 2 న రాజా రవివర్మ వర్థంతి సందర్భంగా ….)
ఏచిత్రకారుని వద్దగాని, ఏకళాసంస్థలోగాని శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ పొందకుండానే రవివర్మ చిత్రకళలో ఉన్నత శిఖరాలందుకున్నారు. భారతీయమైన అంశాలను, ముఖ్యంగా పౌరాణిక గాధలను చిత్రాంశంగా ఆయిల్ కలర్ లో ప్రతిభావంతంగా రూపొందిన ప్రప్రధమ చిత్రకారుడు రాజారవివర్మ. ధనిక వర్గానికే కాకుండా, సామాన్య ప్రజలకు కూడా తన చిత్రాల్ని అందుబాటులోకి తెచ్చారు.నేడు కోట్లాది ఇళ్ళల్లో వెలసిన దేవతామూర్తుల చిత్రాలు రవివర్మ చిత్రించినవే.
కేరళలోని తిరువాన్కూర్ రాజవంశీకుల బంధువర్గానికి చెందిన కుటుంబంలో త్రివేండ్రంకు సమీపగ్రామంలో కిలిమనూలో 1848 ఏప్రిల్ 29న జన్మించిన రవివర్మకు చిన్ననాటి నుండి చిత్రకళపట్ల ఆశక్తి, అభిరుచి ఉండేది. ఆనాటి రాజులు, మహారాజులు చిత్రకళ తమ అవసరార్ధమే అయినా అధికంగా ఆదరించినవారే. తంజావూర్ కళ క్షీణదశలోనున్న కాలంలో ఆశైలి చిత్రంలో నిపుణుడైన అలగిరి నాయుడును త్రివేండ్రం రాజస్థానానికి ఆహ్వానించి ఆస్థాన చిత్రకారునిగా నియమించారు. ఆయన నుంచి కళామర్మాలను అవగతం చేసుకొన్న రాజవర్మ రాజారవివర్మకు స్వయాన మేనమామ. తన మేనల్లుడు రవివర్మకు చిత్రకళలో ఉన్న ఆసక్తి గమనించి ప్రోత్సహించి, తనకున్న కళా పరిజ్ఞానాన్ని రవివర్మకు నేర్పించారు.
రవివర్మ పద్మాలుగేళ్ళ వయస్సుకే సీనియర్ చిత్రకారులు అసూయపడేవిధంగా చిత్రాలు చిత్రించే స్థాయికి చేరుకున్నాడు. ఆ కాలంలోనే త్రివేండ్రం మహారాజు కోసం కొన్ని చిత్రాలు వేయడానికి ధియోడర్ జాన్సన్ రవివర్మకు తను విద్యను నేర్పడానికి నిరాకరించాడు. అయితే తను చిత్రిస్తుండగా చూడటానికి మాత్రం అనుమతించాడు. గ్రహణ శక్తి, స్వయంశిక్షణా పద్ధతిలో ప్రజ్ఞాపాటవాలుగల రవివర్మ ఎవరు నిరాకరించినా, అంగీకరించకపోయినా స్వశక్తితో ఉన్నత శిఖరాల దిశగా ముందుకు నడిచారు. 1873లో మద్రాసులో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో పాల్గొని ప్రథమబహుమతిని, స్వర్ణ పతకాన్ని గెలుచుకొని తన కళాకౌశలాన్ని ప్రదర్శించారు. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనకు రవివర్మ భారతీయ మహిళలలోని వైవిద్యాన్ని ప్రదర్శించే పదిపెయింటింగ్లు పంపగా అన్నిటినీ ఎన్నికచేసి ప్రదర్శించి బహుమతి గెల్చుకున్నారు.
పురాణ పాత్రలకు, సంస్కృత కావ్యాల్లోని పాత్రలకు చిత్రరూపమీయడంలో రవివర్మ ఖ్యాతినార్జించారు. దమయంతి, శకుంతల, ద్రౌవది, సరస్వతి, మిల్క్ మెయిడ్ వంటి చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. ప్రస్తుతం ఆయన గీసిన స్కెట్లు, చిత్రాలు కేరళలో కిళిమనూర్ కోవిలకమ్ లోని గ్యాలరీలో సందర్శకులను అలరిస్తున్నాయి. 1906, అక్టోబర్ 2 న రాజా రవివర్మ తన 58 వ యేట కన్నుమూసారు.

వర్మ పేర పురస్కారం…
రాజా రవివర్మ చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వం ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం ప్రతి ఏటా కళలు, సంస్కృతి అభ్యున్నతికి విశేష కృషి చేసిన వారికి ఇస్తుంది. కె.జి. సుబ్రహ్మణియన్‌, ఎమ్‌.వి.దేవన్‌, ఎ.రామచంద్రన్‌, వాసుదేవన్‌ నాయర్‌, కనై కున్హిరామన్‌, వి.ఎస్‌. వల్లిథాన్‌ లాంటి వారు ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. రాజా రవివర్మ పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్‌ఆర్ట్‌‌స కళాశాలను కూడా నెలకొల్పారు.
-కళాసాగర్
రవివర్మ రూపచిత్రం – చిత్రకారుడు: ఎం. రాజు

SA:

View Comments (2)