చిత్ర,శిల్ప ‘కళారత్న’ జయన్న !

మట్టికి ప్రాణం పోసిన అభినవ జక్కన్న మన జయన్న. పాతికేళ్ళుగా హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో చిన్నారులకు చిత్రకళ నేర్పిస్తూ… విలక్షణ చిత్రకారునిగా… వైవిద్యం గల శిల్పిగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచారు.

కళాప్రస్థానం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా, బద్వేలు మండలంలోని చితపుత్తాయపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో 1971, జూన్ 1 న పుట్టిన గొల్లపల్లి జయన్న, చిన్నతనంలోనే మట్టితో బొమ్మలు తయారుచేసి వాటితో ఆడుకొనేవాడు. దానితో పాటు చిత్ర లేఖనంపై మక్కువ పెంచుకోని పెన్సిల్ గీతలతో ఎన్నో అందాలను సృష్టించి, రంగులద్ది చూపరులను అవాక్కుచేస్తూ తనమదిలో కళాబీజాన్ని నాటుకోని, ఆ గీతలతోనే తన నుదిటిగీతను మార్చుకోదలిచి, తన అలుపెరుగని ప్రయత్నాలను మొదలుపెట్టడం జరిగింది. కళాభిరుచికి పదునుపెడుతూ, ఎప్పటికప్పుడు తన పనితీరును మెరుగుపర్చుకుంటూ ఎందరినో ఆశ్చర్యబరుస్తు, గురువుల అండదండలు, ప్రోత్సహంతో చిత్రకళ, శిల్పకళలు తన రెండు కళ్ళుగా భావించి, వాటినే తన జీవితాశయంగా మార్చుకోని జీవితప్రయాణం మొదలుపెట్టి, పలువురి సలహా సూచనలతో హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో బిఎఫ్ఏ కోర్సులో చేరడం జరిగింది. ఇది జయన్న లక్ష్యానికి ఊతమిచ్చి, ఆయనలోని కళాకారున్ని మేల్కొలిపి ఒక గొప్ప చిత్ర, శిల్ప కళాకారుని గా నిలబడడానికి కారణమయ్యింది.

Gollapalli Jayanna sculpture

మానవ స్పందనలు, భావనలు, ఆలోచనలు లేదా మనస్సు నుండి కలిగే స్పందనకు లలిత కళలు ప్రతిబింబాలు. అంతేగాకుండా మన పరిసరాలను బట్టి కలిగించే స్పందనలు, భాష లేనప్పుడు, అక్షరం రూపుదాల్చనప్పుడు, మనోభావాలు వ్యక్తం చేసే అవకాశం లేనప్పుడు ఈ లలిత కళలు తరతరాలుగా సామాజిక సంస్కృతికి, భౌగోళిక పరిస్థితులకు అద్దంపట్టాయి. వీటికి నిదర్శనంగా ఈనాటి సమకాలీన లలిత కళలకు సమాజంలో ఒక సముచిత స్థానం ఉన్నది.
రంగుల బ్రష్ గానీ , ప్యాలెట్ గానీ, ఉలిని గానీ ఒక కళాకారుడు పట్టుకున్నాడంటే అతనిపై పరిసర ప్రాంతాల ప్రభావం, తన చుట్టూత ఉన్న సంస్కృతీ ప్రభావం సాధారణంగా ఉంటుంది. గురువుల ప్రోత్సహంతో భారతీయ చిత్ర, శిల్పకళల ప్రత్యేకతను, పలువురి కళాకారుల నైపుణ్యాలను పరిశీలించడానికి, కళా సాంప్రదాయాలను పరిశోధించడానికి, ఆధునిక కళారీతులను అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.

కళాసృజన: తన చదువును కొనసాగిస్తూనే జాతీయ, అంతర్జాతీయ చిత్ర, శిల్ప కళాశిబిరాలలో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో తెలుగోడి నైపుణ్యానికి ఎందరో, మరెందరితో జేజేలు పలికేవిదంగా తన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని పెంచారనడంలో ఎలాంటి ఆశ్చర్యమక్కరలేదు. జయన్న గారి కళానైపుణ్యంలో ఒక ప్రత్యేకమైన శైలీ ఉండి ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందడానికి బాటలు వేసిందని చెప్పవచ్చు.తాను పుట్టి, పెరిగిన నేపథ్యమంతా పల్లె వాతావరణానికి చెంది ఉండటం, చిన్నప్పటినుండియే కష్టాలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ, చూస్తూ పెరగడంతో ఆయా శ్రామికులను, వారి భిన్నరకాల వృత్తులను, వ్యవసాయ కూలీలు, రైతుల జీవన విధానం, కట్టు, బొట్లు, ఆచార సాంప్రదాయాలు, సంస్కృతీని ప్రతిబింబించే విదంగా దృశ్యాలు, సన్నివేశాలు తన మదిలో శాశ్వితంగా ముద్రించుకోని కళా నైవుణ్యంలో ప్రదర్శిస్తూ, చూపరులను ఆకర్శించే విదంగా , ఆలోచింపజేసే విదంగా ఆశ్చర్యపరిచే విదంగా చిత్ర, శిల్ప కళా ఖండాలను రూపొందించడం జరిగింది.

కళాభోదన : అలుపెరుగని శ్రామికుడివలే తన కళా నైపుణ్యాలకు పదును పెడుతూనే చదువుపై గల మక్కువతో జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకోని సామాజికాంశాలపై ఎంతో జ్ఞానాన్ని పొంది సమాజంలో ఒక సామాజిక సేవలందించే కార్యకర్తగా మారడానికి దారితీసిందని చెప్పవచ్చు. తన అభిరుచికి తగినట్లుగానే కేంద్రీయ విద్యాలయంలో చిత్రకళోపాధ్యాయులుగా ఉద్యోగం పొంది, విద్యార్థులకు చిత్ర, శిల్పకళల పట్ల ఎక్కువ మక్కువను పెంచుతూ, ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలలో విధులు నిర్వర్తించాల్సి రావడంతో అక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలను పరిశీలిస్తూ, అక్కడి కళలను పరిశోధిస్తూ, తన కళానైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, దేశ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖ చిత్ర శిల్ప కళాకారుల సరసన చేరి, ఎందరో మరెందరో మహానుభావుల ప్రశంసలు పొందుతూ, అవార్డులు పొంది అవార్డులకే వన్నె తెచ్చేవిదంగా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ వస్తున్నారు.

Gollapalli Jayanna

అవార్డులు: జయన్న అవార్డులను పరిశీలిస్తే … రాష్ట్ర ప్రభుత్వం నుండి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ‘ హంస పురస్కారం ‘ ( కళారత్న ) అవార్డుతో సత్కరింపబడ్డారు . నెలవంక నెమలీక సాహిత్య మాసపత్రిక వారు ‘ శిల్పకళాప్రపూర్ణ ‘ బిరుదుతో సన్మానించారు. 2019 లో కేంద్రీయ విద్యాలయ సంఘటన ఇన్సెంటివ్ అవార్డు పొందారు. ఇవియేగాక వివిధ సంస్థల అధిపతులు, రాష్ట్రంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించిన వ్యక్తుల చేతులమీదుగా 100 కి పైగా పురస్కారాలు తీసుకోవడం ఆయనకే చెల్లింది. అయన తీర్చిదిద్దే కమనీయ ఆకృతి, సృజనాత్మక కళా వైశిష్ట్యానికి మచ్చుతునుకగా నిలుస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందడం జరుగుతూనే ఉంటుంది .

Regional Level Best artist award receiving in 2019-20

కడపలోని బ్రవున్ స్మారక గ్రంథాలయంలో వెలుపల గోడపై ఆ మహాశయుని కుడ్య శిల్పాన్ని ఆవిష్కరింపదలిచి వ్యవస్థాపక అధ్యక్షులు డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి నైపుణ్యం కలిగిన చిత్రకళాకారులకై అన్వేషణగావించి చివరికి జయన్నకు అప్పగించడంతో ఆ కళాఖండం నేటికీ ఎందరి ప్రశంసలు చూడగోడుతుందో చెప్పడం కష్టమనడంలో ఎలాంటి అబద్దం లేదు. జయన్న యొక్క చిత్ర శిల్ప కళాఖండాలను పరిశీలిస్తే ఒక్కొక్క చిత్రం గానీ శిల్పం గురించి ఎన్నో వ్యాసాలను వ్రాసేంత సమాచారం ఇమిడి ఉంటుంది . రైతులకు సంబంధించిన చిత్రాలలో దీన స్థితి, సమస్యల సుడిగుండంలో మునిగితేలుతూ, అష్టకష్టాలు పడుతున్న సమయాలలో వారియొక్క వస్త్ర, అలంకరణ మోహంలో చెదిరిన కళ, కంట్లో కన్నీరు, ఏదో ఆలోచనలో వలయంలో ఉన్నట్లు ఆ శరీరాకృతి తినడానికి కూడా సరిపడా భత్యంలేని స్థితి … ఇలా ఎన్నోరకాలుగా వర్ణించేటటువంటి పరిధి కలిగి ఉంటాయి.
ఇవియేగాదు ఏ కళాఖండాన్ని తీసుకున్న దానికి తగిన సమాచారమంతా అందులో ఇమిడి ఉండి వీక్షకులను స్తంబింపజేయడం ఆయన చేతికున్న ప్రత్యేకత అని చెప్పడంలో నిజం లేకపోలేదు.

వైవిద్య భరితం: ఈ గ్రామీణ, జానపద వాద్య పరికరాలు మరియు ఈల పాట యొక్క విశిష్టతలకు ఆకర్షించబడటం ఒక్క జయన్నకే కాదు, ఈల పాట విన్న ఎవరికైనా తప్పదు. ఆ వాద్యాలకున్నటువంటి శక్తి, ఆధునిక పట్టుకాదు సంప్రదాయ శక్తి. జానపద కళాకారుల కళా పద్ధతులు, వారి మకుటాలు, వారుచేసే హావభావాలు జయన్న వైవిధ్యభరిత స్వీయశైలికి, కళాసృష్టికి ఆనవాళ్ళు, జయన్న ఫైబర్, గ్లాస్, టెర్రకోట, కొయ్య, రాయి, లోహ మాధ్యమాలలో ఈ వైవిధ్యభరిత కళాభావాలను బంధించగలిగాడు అనడంలో అతిశయోక్తి లేదు.
జయన్న శిల్పాలు సమకాలీన, సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబించడంతో పాటు వాస్తవ శిల్పరూపానికి ముక్కోణ దృక్పథ రూపాలలో కళాపిపాసులను రంజింపజేస్తాయి. తన శిల్ప కళాతృష్ణ ప్రేక్షకులను ఆకర్షించి నిశ్చేష్టులను చేయగలదనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

సమాజంలో ఇలాంటి నైపుణ్యం కలిగిన చిత్ర శిల్ప కళాకారులు అరుదుగా ఉంటారు. ఎందరో ఈ వృత్తిపట్ల మక్కువ పెంచుకున్న ఆధరణ పొందడం అంత సులభంగా లభించదు. దానికి ఎంతో వృత్తిపట్ల ప్రేమ నిరంతర కృషి, పట్టుదలతో పాటు నేర్పు, ఓర్పు అవసరం వీటన్నింటిని కలిగియున్నందుకే నేటితరం కళాఖండం జయన్నకు ప్రశంసల వరదలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. ఎదురుగా కూర్చున్న మనిషి యొక్క రూపాన్ని నాలుగైదు గంటల్లో ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరిస్తారంటే అతనియొక్క కృషి ఏమేరలో ఉన్నదో తెలియకనే తెలుస్తుంది. వీరి శ్రీమతి మంజులారాణి కూడా చిత్రకారిణే కావడం విశేషం.

రచనా వ్యాసంగం: కళా రంగంలో వీరికున్న అనుభవాన్ని రంగరించి 2016 లో ‘శ్రీజయనికేతనము ‘ పేరుతో జయన్న రచనలను, చిత్ర-శిల్పాలను పుస్తకంగా ప్రచురించారు. ప్రస్తుత సమాజంలో ఎవ్వరైనా ఒక లక్ష్యాన్ని నిర్దారించుకోని దానికి తగిన విదంగా అహర్నిశలు కృషిచేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తే లక్ష్యనెరవేరణ గావించవచ్చని జయన్న జీవితమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇలాంటి వ్యక్తుల గురించి సమాజానికి తెలియబరిచినప్పుడే రాబోయేతరాలకు ప్రేరణాత్మకంగా, ఆదర్శంగా దోహదబడుతూ పలువురి ఆలోచనావిధానంలో సకారాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుందనడం వాస్తవం.ఏదిఏమైనా రాష్ట్ర, కేంధ్ర ప్రభుత్వాలు సైతం జయన్న కళారూపాలను మరింతగా ప్రోత్సహిస్తూ సన్మాన సత్కారాలు అవార్డులతో అభినందిస్తూ మరింత వ్యాప్తికి పూనుకోవాలని ఆశిద్దాం.
ఇలాంటి వ్యక్తుల గురించి సమాజానికి తెలియబరిచినప్పుడే రాబోయేతరాలకు ప్రేరణాత్మకంగా, ఆదర్శంగా వుంటుందనడంలో సందేహంలేదు. కళారంగంలో జయన్న గారు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.
-కళాసాగర్

Jayanna creative works
SA: