జలవర్ణమంత స్వచ్ఛమైనది ‘సిరాజుద్దీన్’ మనసు

*అక్టోబర్ 14 న హైదరాబాద్ లో కన్నుమూసిన చిత్రకారుడు ‘సిరాజుద్దీన్’
*తనకన్నా నాలుగేళ్ళు సీనియర్ అయిన ‘సిరాజుద్దీన్’ తనను ఎలా ప్రభావితం చేశాడో మనకు తెలియజేశారు కవి, చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ.

1988 నుండి నాకు పరిచయమున్న వ్యక్తి సిరాజుద్దీన్. తాను హైదరాబాద్ JNTU లో, బి.ఎఫ్.ఎ. 5వ సంవత్సరంలో ఉండగా నేను మొదటి సంవత్సరంలో చేరటం జరిగింది. మేమిద్దరం నెల్లూరోళ్ళం కావటం వలన ఆయన ఓ గార్డియన్ గా వ్యవహరించేవాడు. పెద్దన్నలా సమయాన్ని బట్టి సలహాలు ఇచ్చేవాడు. మితభాషి అనలేము కానీ, మిత్రులతో చక్కగా మాట్లాడేవాడు. నెల్లూరు జండా వీధిలో నివాసం ఉండేది వారి కుటుంబం. సిరాజుద్దీన్ నాన్న సైకిల్ మెకానిక్ గా ఉంటూ సిరాజును హైదరాబాదులో జె.ఎన్.టి.యు. లోని ఫైనార్ట్స్ కళాశాలలో చదివించారు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్నున్నా సంపాదనపై దృష్టి కన్నా కళపట్ల ప్రగాఢమైన మక్కువతోనే పూర్తి సమయాన్ని కళకే అంకితం చేశాడు సిరాజ్.

అంతేకాదు 3వ సంవత్సరంలో అప్లైయిడు ఆర్ట్సులో ఉన్నతాను పెయింటింగ్ లోకి మారటం జరిగింది. అంటే వారికి ఆ సబ్జెక్టుపై ఉన్న ప్రేమ ఎంతటిదో తెలుస్తుంది. నాకు రెండింటిలోనూ సీటు రాగా పెయింటింగ్ తీసుకుంటానని మొండిగా చెప్పినా బలవంతంగా నా చేత అప్లైయిడు ఆర్టు తీసుకునేలా పురిగొల్పాడు. అడ్మిషన్స్ కు ముందురోజు నన్ను షరీఫ్ అన్న హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్ లెక్చరర్ ఇంటికి కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాడు. వారి స్వీయానుభవం, ఆనాటి వారి మాటలే నా జీవితానికి శ్రీరామ రక్షగా నిలిచాయి. ఆ విధంగా నాడు సిరాజు చేసిన మార్గనిర్దేశనం కారణంగానే అప్లైయిడు ఆర్టులో చేరి, రెండు సబ్జక్టయిన పెయింటింగులో ప్రావీణ్యము సాధించటం జరిగింది.

కళాశాల వసతి గృహంలో మంచి చిత్రకారునిగా ఎదగాలనుకున్న వారందరు సిరాజును ఆదర్శంగా తీసుకునేవాళ్లు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టాలని ఎంతో తపించి నిరాశ పడ్డాడు. అతని నిరాశే నా పలు విజయాలకు స్ఫూర్తినిచ్చాయి. ఫైల్ల్యూరు కథలే కొత్త జీవితాలకు దారి చూపుతాయన్న అబ్హుల్ కలాం గారి మాటలు అక్షర సత్యాలు. నేను కూడా పార్ట్ టైం జాబులపై దృష్టి పెట్టకుండా కొంత కాలం ‘డోంగ్రే’ అనే ఆర్టు టీచరు దగ్గర సాయంకాలం క్లాసుల్లో చేరడం జరిగింది. పలువిధాల ఆర్టును పెంపొందించేందుకు నిరంతరం కృషి చేసాను. ఇందుకు స్పూర్తి సిరాజే అంటే అతిశయోక్తి కాదు. నిరంతర సాధన తప్ప మరో యావలేని, పనిరాక్షసునిగా పేరుగాంచిన వాడు సిరాజు. ఎప్పుడు చూసినా ఎదో ఒక చిత్రాన్ని చిత్రిస్తూ కనిపించేవాడు.

హాస్టల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు స్థానం లేదని నన్ను బయటకు పంపినప్పుడు సిరాజు చూపిన ప్రేమ మరువరానిది. తనకొచ్చిన కష్టంలా వ్యథచెంది. ఆఘమేఘాలమీద మరో వసతి చూసిపెట్టాడు.

కళలను ఉద్ధరించాలని ఎన్నో కలలు కన్నాడు. ఒకానొకప్పుడు ఓ ప్రముఖుని ప్రోద్భలంతో ఒక చిత్రకళ కళాశాలను కూడా నెల్లూరులో స్థాపించాలనుకున్నాడు. కలలు కల్లలుగా కంటి ముందు వాస్తవ జీవిత చిత్రాన్ని చిత్రిస్తుంటే కసిగా చిత్రాలను సృజించాడు. బిచ్చగాళ్ళను, మురికివాడలను, జీవితంలో ఓడిపోయిన నిర్భాగ్యులను ఎన్నో కోణాల్లో సృజించాడు. ఇవే తన విద్యార్థి దశలో చిత్రకళకు వస్తుసామగ్రి. ఈ మధ్యకాలంలో వనకన్యలను (శకుంతల) ఇతివృత్తంతో ఏక, బహురూపాలు పొదిగిన చిత్రాలను పుంకాను పుంకాలుగా చిత్రించి, ఫేస్ బుక్ ద్వారా కళా హృదయుల హృదయాలను చూరగొన్నాడు.

జలవర్ణాలతో ఆయనకున్న అనుబంధం ప్రయోగాత్మకంగాసాగింది. చిత్ర చిత్రానికి వైవిధ్యాన్ని వెతుకుతూ ఎన్నో ప్రయోగాలను చేశారు. శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్సు కళాశాలలో ఉపన్యాసకునిగా దాదాపు 15 సంవత్సరాలు పైగా తన ఉద్యోగ జీవితాన్నిగడిపారు. ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది ఆదర్శగురువుగా నిలిచారు.

బాల్యంలో అమితంగా ప్రేమించిన తాత అబ్బాస్ మియా మరణాన్ని ఎన్నోఏళ్ళు గడిచినా పదే పదే గుర్తు చేసుకునేవాడు. అలాగే కరోనా కాలంలో భార్య మరణం బాధించకుండా ఎలా ఉంటుంది. సిరాజ్ ప్రేమించినా, ద్వేషించినా అంతర్ముఖంగా తీవ్రంగా అనుభవించేవాడు. మనస్సును అందులో ఆజ్యంచేస్తూ తన ఆయుషును సమిధగా మారుస్తున్నాడని తెలియరాలేదు.
కళ కోసమే పుట్టిన ఓ దివ్యాత్మ ఈ సమాజంలో తన అస్థిత్వాన్ని వెతుకుతూ సౌందర్య సృజనచేస్తూ కళాప్రియులనే కాదు కళాకారులను అబ్బురపరిచే కళాకృతులను సృజించి ఈ నెల(అక్టోబరు) 21వ తేదీన ఈ లోకానికి వదిలి వెళ్ళిపోయింది. చిత్రకళా జగత్తు వీరి జ్ఞాపకాలను చిరకాలం నెమరువేసుకుంటుంది.

ఆత్మకూరు రామకృష్ణ

Share via
Copy link
Powered by Social Snap