ప్రజల చిత్రకారుడు – మోహన్

మోహన్ పుట్టినరోజు (24-12-1950) సందర్భంగా…
“ఉన్నారా వెళ్లిపోయారా అనేది అనవసరం! మోహన్ ఒక ఫీల్! అదెప్పటికీ ఉంటుంది’ అని ప్రముఖ కార్టూనిస్టు ఈపూరి రాజు అన్నట్టు ఉండీ లేని నందిగ్ధ స్థితికి తెరదించుతూ 21-09-2017 తెల్లవారుజామున మోహన్ వెళ్లిపోయారు. ఈ ఫీల్‌ను ఆయన తెలిసిన వందలాది మందికి, తెలియని వేలాది మందికి మిగిల్చి వెళ్లిపోయారు. తెలుగులో ఒక రేఖా చిత్రం గీసినా, అక్షరాలు తీర్చిదిద్దినా సంతకం అవసరంలేని చిత్రకారుడు మోహన్. బహుశా బాపు తర్వాత తెలుగులో అంత పాపులర్ చిత్రకారుడంటే ఎవరికీ అభ్యంతరం వుండదనుకుంటాను. హైదరాబాద్లో కవి శివారెడ్డి కేంద్ర బిందువుగా కొనసాగిన ద్వారకా మిత్రుల కలయికకు ముందు తర్వాత కూడా మోహన్ కేంద్రంగా కవులు, రచయితలు, కళాకారులు, మేథావులు, కార్యకర్తలూ నిత్యం కలుసుకునే కేంద్రం మోహన్ గారి స్టూడియోలాంటి యిల్లు, యిల్లు లాంటి స్టూడియో! ఈ పాతిక ముప్పై యేళ్లలో మోహన్ కేంద్రంగా సభ. అనంతరం ఏకకాలంలో జరిగేవి. మీ వూల్లో నత్తలుండవా అని ప్రశ్నించి కొంగలకు హంస ఏం సమాధానం చెప్పిందో మోహన్ బృందం అదే సమాధానం చెప్పింది.
అవుడెపుడో కనువిచ్చి, చేతుల్నిండా రంగుల్ని పులుముకుని కొత్తగా ఆర్ట్ పేపరు కరాబు చేస్తున్న ఎంతో మంది యువ చిత్రకారుల చూపుడు వేలును ప్రేమతో తన చేత్తో పుచ్చుకుని, ఒక తండ్రిలా కాన్వాసు గుడ్డ మీద ఓం నమ:శివాయ అని బొమ్మల అక్షరాభిషేకం చేయించినవాడు మోహన్. ఈ వేళ పత్రికల కథలు, కవితల ఇలస్ట్రేషన్స్ క్రింద ఉన్న చాలా సంతకాలకు మోహన్ సంతకం ప్రేరణ. అంతకు మించి యిష్టదైవం, ఇవన్నీ ఒక ఎత్తు, వామపక్ష భావజాలం నుంచి వచ్చిన గొప్ప వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం మరొక ఎత్తు. పత్రికల్లో పనిచేసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసినా మోహన్ తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ వీడలేదు. పొలిటికల్ కార్టూనిస్టుగా ఇటు ప్రింట్ మీడియాలోనూ, అటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మోహన్ ప్రవేశపెట్టిన ఒరవడి అప్పుడూ ఇప్పుడూ ఒక ట్రెండ్ సెట్టరే! ప్రైవేటు సంభాషణల్లో తరచూ తను ‘విశాలాంధ్ర’ పత్రిక కార్యాలయంలో చిరు సహాయకుడిగా ప్రస్థానం ప్రారంభించానని చెప్పడం వామపక్ష భావజాలం పట్ల, రాజకీయాలపట్ల తనుకున్న అభినివేశాన్ని చెప్పుకోవడానికే! అయితే నిజానికి మోహన్ అంతటి సీనియర్ చిత్రకారుడు ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదని మామూలు దృష్టికి అనిపిస్తుంది కానీ, ఆయన భావజాలం విషయంలో తనను తాను తగ్గించుకోవడానికి ఎప్పటికీ వెనకాడలేదు.

వీటన్నిటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ప్రస్తుతం తెలంగాణలోనూ విద్యార్థి ఉద్యమాల గురించి, ఉభయ వామపక్ష పార్టీ కార్యకలాపాలన్నింటికీ మోహన్ వేసిన పిడికిలి బిగించిన చెయ్యి, కొడవలి కుక్కుల్ని పోలిన పదునైన అక్షరాలు తెలుగునాట విప్లవోద్యమ స్ఫూర్తికి ఊపిరి లూదాయి. అందుకే మోహన్ ప్రజల చిత్రకారుడు. నా పరిమిత జ్ఞానంలో భారతీయ చిత్రకారులతో మోహనను పోల్చవలసి వస్తే కనిపించే వినిపించే ఒకే ఒక పేరు చిత్త ప్రసాద్. తొలినాళ్లలో మోహన్ చిత్త ప్రసాద్ రేఖలతో ప్రేరణ పొంది వుండవచ్చు. తదనంతర కాలంలో చిత్త ప్రసాదు తెలుగు కళా ప్రపంచానికి పరిచయం చేసి ఉండవచ్చు. మోహన్ వుండి ఉంటే చిత్త ప్రసాద్’ తన పోలికను ససేమిరా అంగీకరించకపోయి ఉండేవాడే! అయితే మోహన్ ఓ వ్యక్తి కాదు. సమిష్టి. ఆ సమిష్టి దీనికి తప్పక ఆమోదం తెలుపుతుంది.
మోహన్ గొప్ప చదువరి. ఆర్ట్స్ పుస్తకాలే కాదు, కవిత్వం, ఫిక్షన్, రాజకీయాలు ఆయనకు ఆసక్తికర విషయాలు. తన బొమ్మల మధ్య నిత్యం వాటిని చదువుతూ ఉ ండేవాడు. ముఖ్యంగా ఇంగ్లీషు పేపర్లలో వచ్చిన వార్తా కథనాల్ని చదివి అటు ప్రకాష్ తోనూ, ఇటు వచ్చిన మిత్రులతోనూ షేర్ చేసుకునేవాడు. ఎల్లలు దాటిన ఆయన అధ్యయన ప్రపంచం ఒక్కోసారి మనల్ని విస్తుపోయేట్లు చేస్తుంది. దానికి ఇదీ విషయం అనే నిబంధన ఏదీ లేదు. ఈ నేపథ్యంలోనే అనుకుంటా తెలుగు కవులు, రచయితలు, చిత్రకారుల మీద మోహన్ ఎప్పుడూ ఒక ఫిర్యాదు చేస్తుండేవాడు మనవాళ్లు చదవరని. మరీ ముఖ్యంగా ఆయా రంగాల్లో బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని వాళ్లు ఆయారంగాల్లో ఎలా చెలామణి అవుతారని ఆయన అభియోగం! అందులో నూటికి నూరుశాతం నిజం వుంది- తెలుగు సాహితీ కళా ప్రపంచం దీని గురించి ఇముడైనా ఆలోచిస్తుందని అనుకుంటున్నాను.
వీటితోపాటు మోహన్ కళా ప్రపంచంలో నాకూ చిన్న ప్రేక్షకపాత్ర లభించినందుకు అమితానందంగా ఉంది. 1992లో అనుకుంటా… ‘నా ప్రయోగ వాది పరిధి’ పుస్తకానికి బాలి ముఖచిత్రం వేస్తే అట్టవెనుక బొమ్మ, మాటల కోసం మోహన్ దగ్గరకి మొదటిసారి వెళ్లాను. అప్పట్లో ఆయన విద్యానగర్లో ఉండేవారు. అదొక విద్యుత్ కేంద్రం. యజమాని మాదిరి పిచ్చుక యిల్లు మారినట్లు ఆయన మారిన ప్రతి ఇంటికీ నేనూ వెళ్లాను. నేనే కాదు సమస్త మోహన్ ప్రపంచం తరలివెళ్లింది. నేనే కాదు నా మిత్రులను బొమ్మలకు తీసుకెళ్లినా అంతే ప్రేమ స్పందన. నక్కా విజయరామరాజు ‘మా వూరి కథలు’, ఎన్. ఈశ్వర్ రెడ్డి ‘కన్నీటి వాగు’, మోకా రాత్నరాజు ‘ట్రంకు పెట్టి’, గూటం స్వామి ‘మా నాయిన గోదావరి’, ఇంకా ఎన్నో… ఎప్పుడూ కాదనలేదు. వేస్తానన్నాడు. ఇస్తానన్నాడు. ఆ ప్రయత్నంలోనే ఉండేవాడు. బహుశా పికాసో వేసిన వాటికన్నా చెరిపేసినవే ఎక్కువ అన్నట్టు, మోహన్ వేసిన వాటి కంటే వెయ్యవలసినవే ఎక్కువేమో! అయితేనేం! ఆయన బొమ్మల్లో 50 ఏళ్ల తెలుగు సమాజం ఉంది. వామపక్ష ఉద్యమం వుంది – పేద ప్రజల జీవితం ఉంది! మోహన్ ఉండగానే కళా సాహిత్యాల గురించి ఆయన రాసిన రచనలు, బొమ్మలు, కార్టూన్లు సంపుటాలుగా తెచ్చే ప్రయత్నం జరిగింది కానీ సఫలం కాలేదు. మోహన్ అభిమానులు, కళాప్రియులు ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ వంటి సంస్థలు ఆ కలను సాకారం చేయడానికి పూనుకోవాలి! మోహన్ కు అదే మనమిచ్చే నిజమైన పుట్టినరోజు కానుక!
-శిఖామణి
(కవిసంధ్య – సంపాదకులు)

SA:

View Comments (3)

  • Very nice tribute to lezendary artist cartionist,animatar and art critic MOHAN sir.nice writeuo congratulations sir

  • We can say with pride, that we also lived when Mohan lived ! But we stared at his awesome life style and enjoyed his unique personality. Legends are to be revered and praised as they are fountain heads of inspiration... Mohan is Alive... Eternally...