సృష్టిలో ఎన్నో రంగులు, ఎన్నో రూపాలు. తరచిచూస్తే దృశ్యజగతిలో ప్రతీది రేఖలమయమే. పొందికైన కొన్ని రేఖల సమూహం రూపాలను సృష్టిస్తే, అందమైన కొన్ని వర్ణాలు ఆ రూపాలను సుందరమయం చేస్తాయి. ఈ రంగు రేఖల కలయికతో ఏర్పడిన ప్రకృతిలోని ప్రతీదీ సుందరమైనది కానక్కరలేదు. సౌందర్యమైనదైతేనే మనసుల్ని ఆకట్టుకుంటుందన్న రూలూ లేదు. యోచించే మనసు ఆధారంగా వుంటుంది సౌందర్యమనెడి భావన.
సౌందర్యరహితమైన భావాలకంటే సౌందర్యజనితమైన రూపాలే ఆకట్టుకంటాయి కొందరిని. అలాగే సౌందర్యజనితమైన రూపాలకంటే సౌందర్య రహితమైన భావాలే ఆకట్టుకొంటాయి ఇంకొందరిని. ఏది ఏమైనా చిత్రంలో కొందరికి రూపం ప్రధానమైతే మరికొందరికి భావం ప్రధానం. ఇంకొందరికి రూపం భావం రెండూ ప్రధానమౌతాయి. చెప్పదలచుకున్న భావానికి పూర్తిగా రేఖలను ఆశ్రయిస్తారు కొందరు. ఆ భావవ్యక్తీకరణకు పూర్తిగా రంగులనాశ్రయిస్తారు ఇంకొందరు. అటు రంగులను, ఇటు రేఖలను రెండింటినీ ఆశ్రయిస్తారు మరికొందరు.
కేవలం రేఖలనే ఆశ్రయించేవారు రేఖాచిత్రకారులైతే కేవలం రంగులనే ఆశ్రయించేవారు వర్ణచిత్రకారులు అవుతారు. అటు రేఖలు, ఇటు రంగులు రెండింటిని సమానంగా వినియోగిస్తూ, కళను సృష్టించేవారిని వర్ణచిత్రకారులు అనవచ్చు. అలా రేఖలను, రంగులను సమానంగా ఉపయోగిస్తూ, సౌందర్యభరిత చిత్రాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్న చిత్రకారుడు మేడిశెట్టి వెంకటరమణ.

వెంకటరమణ గారు చిత్రకళను ఎక్కడ అభ్యసించలేదు. ఏ గురువు వద్ద శిష్యరికమూ చేయలేదు. ఆయన కళ పూర్తిగా స్వయంకృషితో అలవర్చుకున్నదే. వీరి చిత్రాలకు ప్రధాన వస్తువు సౌందర్యం. ఆ సౌందర్య వ్యక్తీకరణకు ఆలంబనగా వీరు స్త్రీమూర్తి రూపాన్ని ఎంచుకుంటారు. పలు సందర్భాలలో స్త్రీమూర్తి యొక్క వివిధ భంగిమలను తన సౌందర్యవంతమైన రేఖల ద్వారా ముందు ఆయన కాన్వాస్పై ఆవిష్కరిస్తారు. అందుకే వీరి చిత్రాల్లో రేఖ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వ్యక్తుల రూప నిర్మాణంలో వీరు ఉపయోగించే రేఖలు ప్రతి విభాగంలో సరియైన ప్రమాణాలతో ఉండటం ఒక ఎత్తు అయితే ఆ రేఖలలో ఆయన అద్దిన అందమైన హొయలు, లయలు చిత్రానికి ప్రధాన ఆకర్షణను తీసుకువస్తాయి. అలా శరీర భాగాల నిర్మాణంలో అతను ఉపయోగించే రేఖల యొక్క సరియైన ప్రమాణాలు చూసిన వెంటనే చిత్రంలోని రూపం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చేస్తాయి.
ఒక భవన నిర్మాణానికి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, అలాగే వీరి చిత్రాల్లో ప్రాధమికంగా వేసే రేఖలు కూడా అంతే ప్రధానంగా ఉంటాయి. అయితే భవన నిర్మాణ అనంతరం ఫౌండేషన్ భూమిలోనికి పోయి దాని అస్థిత్వం కనుమరుగు అవుతుంది. కాని వీరి చిత్రాలకు ప్రధాన ఆధారంగా గీసే రేఖలు చిత్రం పూర్తి అయిన తర్వాత కూడా తమ అస్థిత్వాన్ని కోల్పోవు సరికదా, చిత్రానికి ప్రధాన శక్తిగా నిలిచేవి మేమే అంటూ తమ అస్థిత్వాన్ని వీరి రేఖలు చాటుకుంటాయి. అందుకు బలమైన కారణం, రూప నిర్మానంలో ప్రతి విభాగంలోనూ కనపరిచే ఖచ్చితమైన అనాటమి. ఒక గురువు వద్ద గానీ, శిక్షణాలయంలో గాని, ఎక్కడా చిత్రకళలో ఓనమాలు నేర్వని వీరు అంతటి సరియైన అనాటమి మనిషి యొక్క ఏ భంగిమలోనైనా రూపొందించే నేర్పును సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం.

ఎంచుకున్న విషయం తాలూకు రూపాన్ని రేఖల్లో చిత్రించిన తర్వాత ఆ చిత్రంలో చెప్పదలుచుకున్న భావానికి అనుగుణమైన రంగులను వేస్తూ చిత్రానికి భావ పరిపుష్టిని వీరు తీసుకువస్తారు. ఉదాహరణకు వీరు వేసిన గిరిజన యువతి చిత్రాన్ని మనం చూసినట్లయితే ఆమె శరీర వర్ణానికి సాధారణంగా మనం ఉపయోగించే ఎరుపు, నలుపు వర్ణాలకు బదులుగా వారు నివసించే పచ్చని ప్రకృతిని ప్రతిబింబించేలా ఆకుపచ్చ వర్ణాన్ని వాడడం, అలాగే ఆమె ధరించే వస్త్రాల్లో వాడిన వివిధ రంగులు, వర్ణాలతో పాటు చిత్రానికి వెనుక బ్యాక్ గ్రౌండ్లో వేసిన జేగురువర్ణం దానిపై శుద్ధ తెలుపు వర్ణంతో రేఖమాత్రంగా గీసిన సవర గిరిజన రేఖా చిత్రాలు వెరసి ఆ చిత్రానికి ఒక గిరిజన ఆత్మను, నిండుదనాన్ని తీసుకువచ్చేలా చేస్తాయి. అలాగే అతను వేసిన “సాధన” అనే మరో చిత్రంలో వాడిన నలుపు, తెలుపు, పసుపు వర్ణాలు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు సాగే ప్రయాణంలా, సాంప్రదాయాన్ని వ్యక్తం చేసేలా చేస్తుంది. అలాగే ఇంకా వీరు వరుసగా వేసిన ప్యారెట్ వెండర్, ముస్తాబు, నిరీక్షణ, కన్నె కలువ, గ్రామీణ దంపతులు, వాయులీన వినోదిని, పలకరింపు, గిరిజన బాలలు, కలువలను సేకరిస్తున్న కోమలాంగులు, తదితర చిత్రాలను గమనించినట్లయితే అన్నింటాకూడా రంగుకు ఎంతటి ప్రాధాన్యం వుంటుందో, రేఖకు కూడా అంతే ప్రాధాన్యత వీరి చిత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇంకా రేఖలను ఏ కోణం నుండి చూపిస్తే దాని యొక్క అందం మరింత ఇనుమడిస్తుందో చెప్పడానికి గొప్ప ఉదాహరణగా వీరి కుంచెనుండి జాలువారిన సులోచన, ప్రేమికులు, గణపతి తదితరమైన వీరి రేఖా చిత్రాలను పేర్కొనవచ్చును.
కళావారసత్వం ఏమీలేని ఇంట్లో శ్రీమతి మేడిశెట్టి మంగాయమ్మ, శ్రీరామమూర్తి దంపతులకు తూర్పుగోదావరిజిల్లా, కాకినాడలో వెంకటరమణ జన్మించారు. అక్కడ ఎం.ఎన్.ఎన్. చారిటీస్లో విద్యాభ్యాసం ముగిసిన పిదప 1983 లో ఆంధ్రాబ్యాంక్, హైద్రాబాద్ శాఖ నందు ఉద్యోగంలో నియమింపబడ్డారు. 28 సంవత్సరాల పాటు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన పిదప 2012 లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని నాటినుండి చిత్రకళపై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తూ చిత్రకళలో తనదైన శైలిని సృష్టించుకున్నారు.
చిత్రకారుడిగా 2013 నుండి నేటి వరకు విశాఖ “హుద్ హుద్ తుఫాన్” బాధితుల సహాయార్ధం “ఆర్ట్్ఫర్ కాజ్” పేరుతో జరిగిన ప్రదర్శనతో పాటు, తామర, ఏకదంత, దుర్గ, ప్రస్థానం, రేస్ ఆఫ్ బుద్ధ, లార్డ్ గణేషా, బతుకమ్మ, సలాం తెలంగాణా తదితర పేర్లతో జరిగిన 24 సామూహిక చిత్ర ప్రదర్శనలలో వీరి చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో 8 ప్రదర్శనలు హైద్రాబాద్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చేయగా మిగిలిన ప్రదర్శనలు కూడా హైదరాబాదు నందే గల నిర్మల్ గ్యాలరీ ఆఫ్ ఫైనార్డ్స్, రెయిన్బో ఆర్ట్ గేలరీ, అద్వైత ఆర్ట్ గేలరీ, ఐకాన్ ఆర్ట్ గేలరీ, గేలరీస్పేస్, మంజీరామాల్, తాత్కృష్ణా, ఫెగాసెన్ ఆర్ట్ గేలరీ, బియాండ్ కాఫీ, తెలుగు విశ్వవిద్యాలయాలతో పాటు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, తదితరమైన చోట్ల వీరి చిత్రాలు ప్రదర్శించారు.

ప్రఖ్యాత బెంగాలీ జానపద చిత్రకారుడు జామినీరాయ్ జన్మదినం సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియం, హైద్రాబాద్ నందు నిర్వహించిన వర్క్షావ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ చిత్రకళా సంస్థలైన లలితకళా పరిషత్ విశాఖపట్నం వారి నుండి మెరిట్ అవార్డు, 2014, 2015 సంవత్సరాల్లో అజంతా కళారామం తెనాలి, కోనసీమ చిత్ర కళాపరిషత్, అమలాపురం, అమీర్ ఆర్ట్ అకాడమీ నెల్లూరు సంస్థానం నుండి వరుసగా 3 జ్యూరీ అవార్డులను, కోనసీమ చిత్రకళాపరిషత్ అమలాపురం నుండి 2016లో బాపూ అవార్డు, 2017 లో చిత్రమిత్ర క్యాష్ అవార్డు, 2017 లో అజంతా కళారామం తెనాలి వారి నుండి మరియు కాళీపట్నం ఆర్ట్ అకాడమి హైద్రాబాద్ నుండి నగదు బహుమతులను అందుకున్నారు. అలాగే 2018 జనవరిలో జరిగిన కోనసీమ చిత్రకళాపరిషత్ పోటీల్లో కూడా ప్రగతి చిత్ర క్యాష్ అవార్డులు వీరు అందుకున్నారు.
చిత్రకళను అభ్యసించిన వారంతా చిత్రకారులుగా రాణించాలని లేదు. చిత్రకళను అభ్యసించనంత మాత్రాన ఎవరూ చిత్రకారులు కాకూడదనీ లేదు. ఏ కళకైనా ముందు కావలసింది ఆసక్తి. ఆపై కృషి, పట్టుదల, తపన ఈ లక్షణాలు ఉన్నవారు శాస్త్రీయంగా కళను అభ్యసించక పోయినప్పటికి వారికి ఆ కళపై గల ఆసక్తి, కృషి, పట్టుదలలు ఆ కళలో రాణించేలా చేస్తాయి. వెంకట రమణ గారిలో ఇలాంటి లక్షణాలు అన్ని పుష్కలంగా ఉ న్నాయి కనుకనే ఎలాంటి శిక్షణ లేకుండానే తనదైన శైలిని సృష్టించుకుని చిత్రకళలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే “సౌందర్యం” పేరుతో చిత్రాలను రూపొందించిన వీరు ప్రస్తుతం “కృష్ణ” పేరుతో వరుసగా చిత్రాలను సృష్టిస్తున్నారు. ఆపై పద్యకావ్య నాయికలు పేరుతో వేరొక శిరీస్ ను సృష్టించబోతున్నారు. సౌందర్యాన్ని ఇష్టపడే వీరికుంచె మరిన్ని శిరీస్లలో మరింత సొగసైన చిత్రాలను సృష్టిస్తూ, లోకాన్ని సుందరమయం చేస్తూ, అందరిని అలరిస్తుందని ఆశిద్దాం.
ఎస్.ఎన్. వెంటపల్లి
