ప్రకృతి చిత్రకారుడు భగీరధి జన్మదినం

ప్రకృతి ప్రేమికుడు. వరహాగిరి వెంకట భగీరధి గారు జన్మించిన రోజు ఈ రోజు (జూలై 21).
ఆదర్శవంతమైన, కళామయమైన, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఓలలాడి అనేక భక్తి శతకములు రచించిన కళాకారుడు ఈయన.

సౌందర్యమయ, నిరామయ ప్రకృతిని చిత్రించడం కోసం కాలి నడకన కొండల కోనల్లో ఎక్కి దిగుతూ దక్షిణ భారతదేశమంతట పర్యటించి అపురూప చిత్రాలను చిత్రించడమే కాకుండా నా ఏజెన్సీ ప్రయాణం, జైపూర్ ప్రయాణం వంటి యాత్రానుభవాలను కూడా రచించారు. ఆ రచనల్లో కీకారణ్యంలో పులులు తిరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటించిన సందర్భాలు చదివితే ప్రకృతి దృశ్యాల కోసం ఎంతగా పరితపించారో తెలుస్తుంది. రమణీయ ప్రకృతి ప్రదర్శించే కమనీయ కావ్యాలను తన కుంచెతో, కలంతో అక్షర రూపం, చిత్ర రూపాలను ఇచ్చి మురిసిపోయారు.

ప్రకృతి చిత్రకారుడిగా పేరుపొందిన భగీరధి విశాఖ జిల్లా అనకాపల్లికి సమీప గ్రామం మామిడికుదురులో 1901 జులై 21న నరసమాంబ సర్రాజు పంతులు దంపతులకు జన్మించారు. చదువు కోసం మేనమామ రాజమహేంద్రవరం తీసుకెళ్లారు. భగీరధి మాత్రం చదువుకున్న ప్రతి పరిశీలనకు అధిక సమయం కేటాయించేవారు అదేసమయంలో ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావుతో పరిచయం కలిగి ఆయన వద్ద చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకున్నారు. భగీరధి నదితీర ప్రాంతాలు, ప్రకృతి సౌందర్యం నిలయాలుగా ఉన్నవి సందర్శించి, అక్కడే కూర్చుని ఆ దృశ్యాల్ని తనదైనశైలిలో రంగుల్లో బంధించేవారు. జలపాతాలు, కొండలు, కోనలు, నదులు ఆయన చిత్రాలు. తర్వాత ఆయన బ్రహ్మానంద సరస్వతి స్వామి మహారాజ్ సుభాన్ పై ముంబైకి చెందిన సర్ జె.జె.స్కూల్ ఆఫ్ లో చేరి శిక్షణ పొందారు. భగీరధి మొదట్లో పెద్దసైజులో చిత్రాలు గీచినా తర్వాత మినియేచర్ చిత్రాలకే పరిమితం అయ్యారు. ప్రకృతి చిత్రాల్లో కూడా ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఆల్ఫాబెట్స్ అక్షరాలను కలుపుతూ, పిక్చర్ అనే ఆంగ్ల అక్షరాలు కనిపించే విధంగా ఆయన పకృతి చిత్రాలు గీచారు. విజయనగరంలో జరిగిన స్వదేశీ చిత్రకళా ప్రదర్శనలో భగీరధి 1933 సంవత్సరంలో ప్రథమ బహుమతి, 1934 లో బంగారు పతకం గెలుచుకున్నారు. వీరి సూర్యోదయం, చంద్రోదయం చిత్రాలు హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఆయన డ్రాయింగ్, డ్రిల్ మాస్టర్గా నియమించినా, తరచు చిత్రాలు గీయడానికి సెలవులు పెట్టేవారు. 1949 నవంబర్ 19న ఆయన కన్నుమూశారు.

42 చిత్రాలు మరియు 14 అసంపూర్తి చిత్రాలు మనుమరాలు, చిత్రకారిణి ఎన్.వి.పి.ఎస్.ఎస్. లక్ష్మి (రాజమండ్రి) వద్ద వున్నాయి. వీరు అనేక శతకాలు, పంచడోద్దండ అనేక నాటకాన్ని, నా ఏజన్సీ ప్రయాణము, నా జయపుర ప్రయాణము తదితర గ్రంధాలు రచించారు. వీరు షిర్డి సాయి నిజదాసుడు. వీరి అంతరాత్మ దేశభక్తి కల్గినది. ఆయన మనుమరాలు ఎన్.వి.పి.ఎస్. లక్ష్మి రాజమండ్రిలో ‘భగీరది ఆర్టు ఫౌండేషన్’ ఏర్పాటు చేసి వారి జ్ఞాపకార్థం గత నాలుగు సంవత్సరాలుగా ప్రముఖ చిత్రకారులను సత్కరిస్తున్నారు. భగీరధి గురించి భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో వారి చిత్రాలతో, జీవిత విశేషాలలతో లక్ష్మి గారు ” ప్రకృతి చిత్రకారుడు-భగీరధి ” పుస్తకం రూపొందిస్తున్నారు.

కళాసాగర్

SA: