రాత-గీతల్లో రారాజు – బాపిరాజు

నేడు అడివి బాపిరాజు 128 వ జయంతి (1895-2023)

అడివి బాపిరాజు చిత్రకారుడు మాత్రమే కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారుడు, కళా దర్శకుడు, గాయకుడు ఈయనలో దాగి ఉన్నారు. 1895 అక్టోబర్ 5న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం సమీపంలోని సిరిపల్లె గ్రామంలో జన్మించిన అడివి బాపిరాజు తండ్రి నుంచి లలిత కళలమీద ఆసక్తినీ, అభిమానాన్ని పెంచుకొని, రాజమండ్రిలో అప్పటి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఓస్వాల్డ్ జె. కూల్టే అండదండలతో చిత్ర లేఖనంలోను ఆంగ్ల భాషాజ్ఞానంలోనూ అపారకృషి చేశారు.

భారతావనిలో ఉన్న అనేక దేవాలయాలు, శిల్పాలు, గుహలు కుడ్య చిత్రాలను సందర్శించి వాటిలో ఉన్న కళావిలువలను పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అనేక చిత్రాలకు రూపకల్పన కూర్చిన ఘనత వీరిది. తెలుగుతనపు జానపద కళారూపాలకు ప్రాణం పోశారు. అఖండ దేశభక్తి కలిగిన బాపిరాజుగారు 1922లో బి.ఏ. పాసయ్యాక స్వాతంత్ర్య సమరంలో రెండేళ్ళపాటు కారాగార జీవితం కూడా గడిపారు. బందరు జాతీయ కళాశాలకు కోపల్లె హనుమంతరావుగారి ఆహ్వానంతో 1935 నుంచి 1938వరకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.
1935-40 ప్రాంతాలలో తీసిన “సతీ అనసూయ”, “మీరాబాయి”, “ధృవ విజయం ” చిత్రాలకు కళాదర్శకునిగా పనిచేసిన ఘనత కూడా వారిదే. తొలి సినీనృత్య దర్శకులు వెంపటి సత్యం తొలినాళ్ళలో బందరులో అడివి బాపిరాజు గారి వద్ద చిత్రలేఖనం నేర్చుకున్నారు. అప్పుడు సత్యంలో నున్న నృత్య ప్రతిభను గుర్తించి, తను మీరాబాయి చిత్రానికి కళాదర్శకత్వం వహించడానికి మద్రాసు వెళ్ళినప్పుడు ఆ చిత్రానికి నృత్యదర్శకునిగా వెంపటి సత్యం ను పరిచయం చేసారు. అదే సమయంలో మద్రాసు ప్రభుత్వం తరఫున శ్రీలంకలోని సికిరియా కుడ్య చిత్రాలకు నకలు చిత్రాలు రచించి పంపించారు. 1943లో హైదరాబాద్ నుంచి వెలువడుతున్న ‘మిజాన్’ అనే తెలుగు దిన పత్రికకు సంపాదకునిగా పనిచేశారు.

Biskhuvi and Mulugu Papaiah Sastry bu Bapiraju

వీరు రచించిన ప్రముఖ నవలలు ‘నారాయణరావు’ ‘హిమబిందు’ ‘గోనగన్నారెడ్డి’ కొణంగి’ బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆయన చిన్ననాటి ఊహాసుందరి శశికళను ఆరాధ్యదేవతగా భావించి పెక్కు ప్రేమగీతాలు రచించి ఒక ప్రతిరూపాన్ని సృష్టించుకున్నారు. ఈయన వేసిన చిత్రాలలో శశికళ, స్వయంవరం, సముద్రగుప్త, మృత్యుంజయుడు, సూర్యదేవ, భారతి, నాగన్నత్యం, కిరాతార్జునీయం, తిక్కన, గోధూళి, రుద్రమదేవి, శ్వేతతార, బృందావన గీతం మొదలయినవి అతి ముఖ్యమైనవి. ఈ లలిత కళల మహారాజు 1952 సెప్టెంబర్ 22 న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. వీరి ముని మనుమలు అడివి శేషు నటునిగా, అడివి సాయి కిరణ్ దర్శకునిగా తెలుగు సినీ రంగంలో రాణిస్తున్నారు. వీరి కుటీంబీకులు పలువురు అమెరికాలో స్థిరపడ్డారు.

-కళాసాగర్ యల్లపు

SA: