కళ కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం. ప్రజలకు ఉపయోగపడని కళ కాలగర్భంలో కలిసిపోతుంది. మానవజాతి నాగరికత నేర్వని రోజుల్లో కళను బ్రతుకు తెరువుకు అనాగరికు ఉపయోగించుకొన్న సంఘటనలు మనకు గుహల్లో దర్శనమిచ్చాయి. తర్వాత కాలంలో తమ తమ మతాలకు సంబంధించిన ముఖ్య సంఘటనలను కళాకారులు తమ చిత్రాలకు వస్తువులుగా తీసుకొన్నారు. తర్వాత కాలంలో వివిధ దేశాల పాలకులు తమ కుటుంబ సభ్యుల రూపచిత్రాల్ని చిత్రింపచేసుకొని భద్రపర్చారు. మన దేశంలో బ్రిటీష్ వారి పాలన సందర్భంగా కూడా రూప చిత్రాలకు ప్రధాన్యత ఇచ్చారు. 20 వ శతాబ్దంలో రాజా రవివర్మ ప్రవేశంతో రూపచిత్రాలతో పాటు, ఇతిహాసాలు, పురాణాల్లో ముఖ్య సంఘటనలను, దేవతల రూపాలను చిత్రించడం ప్రారంభం అయింది. దేశం స్వాతంత్య్రం పొందాక పౌరాణిక చిత్రాలతో పాటు, సామాజిక సమస్యల్ని, సుందర ప్రకృతి దృశ్యాల్ని చిత్రించి, కళాకారులు సమాజ చైతన్యానికి కృషిచేసారు. బెంగాల్ కు చెందిన చిత్త ప్రసాద్, నిజాం నిరంకుస పాలనపై ఎన్నో లినోకట్ చిత్రాలు వేసి, తెలంగాణా ప్రజల కష్టాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. 1940 వ దశకంలో శ్రీకాకుళం జిల్లాలో విలయతాండవం చేసిన ‘కరవు ‘ పై అనేక చిత్రాలు గీసి, నిరుపేదల ఇక్కట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. తర్వాత సాంఘిక సమస్యలైన వరకట్నం, బాల్యవివాహాలు, మంచినీటి సమస్య, నిరుద్యోగం, అవినీతిని, పండుగలు, వేడుకల్ని చాలా మంది కళాకారులు చిత్రాలుగా మలిచి, సమస్యల తీవ్రతను ప్రజల దృష్టికి తీసుకెళ్ళగల్గారు.
కలర్ ఫొటోగ్రఫి, ప్లెక్ష్సీ, ఆధునికత సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి వచ్చాక చిత్రకారులకు అధరణ కొరవడిన మాట నిజం. ప్రస్తుతం చిత్రకళ అపార్ట్మెంట్ల గోడలపై అలంకరణకు పరిమితం అయింది. ఈ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా మాత్రం లేవు. ఇలాంటి స్థితిలో కొత్త సంవత్సరం 2020 వస్తూ కొత్త వ్యాధి ‘కరోనా ‘ ను తెచ్చింది. అనతికాలంలో ఇది ప్రపంచ సమస్యగా మారింది. ముందెన్నడు, కని-విని ఎరుగని సమస్య, కనుచూపుమేర పరిష్కారం కూడా కనిపించడం లేదు.
లాటిన్ భాషలో కరోన అంటే కిరీటం అని అర్థం. కరోనా వైరస్ పై పొడవాటి మకుటాలు ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. న్యూ అనే పదం నుండి నోవెల్ పుట్టింది. మునుపెన్నడూ కని-విని ఎరుగని సరి కొత్త వైరస్ కావడం వల్ల దీన్ని ‘నోవెల్ కరోనా వైరస్ ‘ అని పేర్కోంటున్నారు. కరోనా వైరస్ వల్ల సంక్రమించే శ్వాస సంబంధ వ్యాధి ఇది. కరోనా వైరస్ డిసీజ్ కి సంక్షిప్త రూపం ‘కోవిడ్-19 ‘ గా నామకరణం చేసారు.
కరోనా వ్యాధి సోకనుందన్న భయంతో పాలకులు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ విలువైన సమయాన్ని ప్రపంచ వ్యాప్తంగా నున్న కళాకారులు సద్వినియోగం చేసుకొంటున్నారు. తీరిక సమయాన్ని కళా సాధన వైపు మళ్ళించి, చిత్ర సృష్టికి కృషి చేస్తున్నారు.
-సుంకర చలపతిరావు
(ఇంకా వుంది….)
మీ లాంటి వారు వున్నారు కాబట్టే చిత్ర కళ నైపుణ్యం వెలికి తీస్తున్నారు. మీరు గొప్ప చిత్ర కారులు. కాబట్టే మా లాంటి కళాకారుల ప్రతిభ ప్రపంచాన్ని తెలియపరుస్తున్నారు. మీకు హృదయ పూర్వక అభినందనలు సార్.
very good article… thanks