ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

కళాకారులకు, కళాభిమానులకు మరియు కళాపోషకులకు నావందనాలు.

ఒక ఆటగాడిగా ఎందుకు పుట్టలేదని బాధపడే స్థాయికి “కళాకారుడు ‘ వచ్చాడు…

కళాకారుడంటే ఎవరో నేను ప్రత్యేకంగా ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదనుకొంటున్నాను. ఎందరో మహానుభావులు అందులో కళాకారునిదే మొదటి స్థానం. బ్రహ్మ ఈ సృష్టికి కారకుడైతే, ఆ బ్రహ్మకే రూపరచన గావించింది. ఒక కళాకారుడు. యుగయుగాల నుండి కళాకారునికి గొప్ప స్థానం ఉంది. అలాంటిది ఈ కలియుగంలో రానురాను కళాకారుని స్థానం మరీ దిగజారిపోతుంది. అందుకు కారణాలు ఎన్నెన్నో. కళారూపాల్ని అస్థవ్యస్తంగా చూపిస్తూ కొందరు, స్వార్ధపూరిత మనస్సుతో కొందరు, బాధ్యతలు మరచి ఇంకొందరు, కళాకారులు తమ విలువలు తామే సమాజంలో కోల్పోతున్నారు.

కళాకారుడు చిత్రిస్తున్న తెల్లకాగితం రంగులమయం కావాలి తప్ప తన మనస్సు ఎప్పుడు తెల్ల కాగితంలా ఉండాలి. ఆ కాగితంపై తన సృష్టికి ప్రోత్సాహక సంతకాలు తప్ప మరే ఇతర విషయాలు ఉండకూడదు. ఈ ప్రపంచంలో ఎందరో గొప్ప కళాకారులు ఉన్నారు. వారందరికి నా విన్నపం ఒక్కటే. ఈ తరంలో ఉన్న యువచిత్రకారులకు మీ మంచి సూచనలు ఇస్తూ, కళా విలువలను వివరిస్తూ, బాధ్యతలను గుర్తుచేస్తూ, కళాకారునికి ప్రభుత్వ పరంగా, సమాజపరంగా, పూర్వపు వైభవాన్ని పొందేలా తోడ్పడ్డారని ఆశిస్తున్నాను.

పోతే ఒక మంచి చిత్రం కళాకారుని మేధస్సు ద్వారా వస్తే దానికి నిజమైన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. నిజమైన ప్రోత్సాహం అని ఎందుకంటున్నానంటే, మన భారతదేశం బీదదేశం అంటే నేను నమ్మను. మన లాంటి వారు బీదవారుగానే ఉన్నారు కాని డబ్బులు ఎలా ఖర్చు చేయాలో తెలియక ఫలానా కళాకారుని సంతకం ఉంటే చాలు లక్షలు పోసి ఆచిత్రాన్ని కొంటున్న వారు చాలా మంది ఉన్నారు. వారు నిజమైన కళాభిమానులు కళాప్రోత్సాహకులు కారు. అనలైన కళాపోషకులు వేరే ఉన్నారు. కాబట్టే ఇంకా -కళాకారుడు బ్రతికి ఉన్నాడు. మంచి చిత్రానికి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. “ఒక చిత్రం – ద్వారా ఒక విద్యార్థి నేర్చుకోగల్గి, ఒక -కళాకారుడు తెలుసుకోగలిగి, ఒక సామాన్య మానవుడు సహితం చిత్రం ద్వారా ఎదో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోగల్గి తద్వారా సమాజమే చైతన్యవంతమైనప్పుడు ఆ కళాకారునికి జన్మధన్యమైనట్లు”అలాంటి కళాకారుల్ని పోషించి ప్రోత్సహించండి. కళాపోషకులకు కూడా సమాజంలో గొప్ప గుర్తింపు ఉంది. ఆ ఈనాటి ప్రభుత్వాలు తాత్కాలిక ఆర్బాటాలకు కోట్లు ఖర్చు చేసేదాని పైనే దృష్టిపెట్టింది. కాని అదే కోట్లు ఒక కళాకారున్ని ప్రోత్సాహించి అతని మేధస్సుకు పని చెప్పి తద్వారా బయటపడే ఆలోచనలకు రూపాన్నిచ్చి చిరకాలం నిలబడే పనులు చేసే ఆలోచన లేనే లేదు. భారత దేశంలో ఉన్న అనేక కళాకృతులు, అజంతా, ఎల్లోరా, హలీబేడు, బేలూరు, తాజ్ మహల్, చార్ మినార్ లాంటి ఎన్నో ఎన్నెన్నో కళానంవదలను తిలకించి తరించడానికి ఎందరో పాశ్చాత్య దేశీయులను సహితం నెలల తరబడి అక్కడే కూర్చోబెట్టగల కళాఖండాలు భారతదేశంలో ఈనాడు మన ముందు ఉన్నాయి అంటే ఆనాటి కళాపోషణే కారణం, అటు సమాజం పట్టించుకోక… ఇటు ప్రభుత్వాలు పట్టించుకోక కళాకారుడు తనకు ప్రోత్సాహం కరువై అసంతృప్తితో ఇతర వృత్తుల్లో స్థిరపడి జీవిస్తున్నాడు.

ఒక కళాకారునిగా కాకుండ ఒక ఆటగాడిగా ఎందుకు పుట్టలేదని బాధపడే స్థాయికి “కళ” కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు దిగజారుతున్నాయి. గత మూడు దశాబ్దాలుగా పాఠశాలల్లో ఉన్న చిత్ర కళోపాధ్యాయులను నియమించడం లేకపోగా కనీసం రిటైర్డ్ అయిన డ్రాయింగ్ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయక పోవడం కళపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి దర్పణం పడుతుంది.

భారతదేశపు చిత్రకళా జగత్తుకే “రారాజు”తన మకుటాన్ని సహితం త్యాగం చేసి కళామతల్లిని ఆశ్రయించి చిత్రకళకే ఒక క్రొత్త నిర్వచాన్నిచ్చిన రాజా రవివర్మలు, శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ ఉంటే తన్మయత్వంతో తమను తామే మర్చేస్థితి ఎలాగైతే ఉంటుందో గీతల లాలిత్యంలో అంతటి నయనానంద కరాన్నికలిగించి బొమ్మ దగ్గరే కట్టిపడేసే, శక్తి కలిగిన బాపులు, సమాజంలో అశాంతిని పారద్రోలి శాంతికి నిలయాలైన ఎన్నో దేవాలయాల సృష్టికి కారకులు అమర శిల్పి జక్కన మరియు గణపతి స్థపతి లాంటి ఎందరో మహానుభావులు, మళ్ళీ మళ్ళీ పుట్టి వారి సేవల నందిస్తూ కళాకారులు సమాజంలో ఉన్న అనేక అరాచక శక్తుల పై తమ దైన శైలిలో కుంచెద్వారా గీతలు వర్ణాలను సందిస్తూ చైతన్యపర్చాలని – పోటీలకని, అవార్డులకని న్యాయనిర్ణేతల కోసమే అన్నట్లు అర్ధంకాని బొమ్మలు గీయకుండా (నేను ఆధునిక చిత్రకళకు వ్యతిరేకిని కాను, అన్ టైటిల్ అని వ్రాసి అర్థం అయితే అర్థం చేసుకో లేకపోతే నీఖర్మపో అనే విధంగా చేసే బొమ్మలకు వ్యతిరేకిని) నిరంతరం శ్రమిస్తే మీరు అనుకొన్నది సాధించడం చాలా సులువని యువకళాకారులకో మనవి. “అవార్డులు చిత్రకారునిలోని మేధాశక్తికి కొలమానం కాదు.”

చివరగా ఈ పత్రిక ఎడిటర్ శ్రీకళాసాగర్ గారు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఇంతకు ముందు ఆంధ్రకళాదర్శిని గ్రంధాన్ని వెలువరించి దాదాపుగా ఆ గ్రంధంలో తెలుగు చిత్ర, శిల్ప కళాకారుల సమూహాన్ని పొందుపర్చి మనకందించారు. గత పదేళ్ళుగా 64కళలు.కాం వెబ్ పత్రిక ద్వారా వందలాది మంది కళాకారులను అంతర్జాలంలో అవనిలో ఎక్కడ నుంచైనా చదువుకొనే విధంగా కృషిచేస్తున్నారు. ఇది మన కళాకారులకు ఒక ప్రత్యేక వేదిక, ఇందులో పరిచయం కావాలని ప్రతీ కళాకారుని కోరిక.

-జి.వి. సాగర్

2 thoughts on “ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

  1. కళాకారుడి ఆవేదనని, కళని కళాకారుడిని గౌరవించే సమాజాన్ని కోరుకుంటూ శ్రీజివి సాగర్ గారి వ్యాసం సమాజహితంగా వుంది. కళాకారుల అభ్యున్నతికి శ్రీ కళాసాగర్ గారి కృషిని ప్రశంసించడం ఆవశ్యకం, –బొమ్మన్ కార్టూనిస్ట్ &ఆర్టిస్ట్ ఏలూరు.

  2. అన్ టైటిల్ అంటే మీకు అర్ధం కాకపోతే ఇంకెవ్వరీకీ అర్ధం కాదా! అది అర్ధం చేసుకొనే స్టాండెట్ మీకులేదని గ్రహించలేక పోతున్నావు. అది మీకు మీఖర్మ. ప్రపంచంలో ప్రస్తుతం రాష్టమేలుతుంది ఇటువంటి abstract పెయింటింగ్సే అన్న సంగతి మీకు తెలుసా. దీనిని బట్టి మీకు పెద్దగా అవగాహన లేదని తెలుస్తుంది. హ.హ.హ. తెలుగులో వార్తలు అందరికి అర్ధమవుతాయి. సంస్కృతంలో వార్తలు చాలా మందికి అర్ధం అవ్వవు. అంటే అర్ధం కాక పోతే ఆ వార్తలకు వాల్యూలేదా. మీకు చెప్పేది అలాగేవుంది.ఎవ్వరితో చెప్పకండి నవ్విపోతారు…..గౌస్ బేగ్. Abstract artist,vijayawada.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap