“ఇలాంటి ఓ ప్రయాణం ” (కవితా సంపుటి)
మనుషుల్ని నిజమైన ప్రేమజీవులుగా, నిర్మల మనుస్కులుగా తీర్చిదిద్దేది ప్రేమ అని ఆ ప్రేమను అందరికీ అందాలని ఆరాటపడేది కవిత్వం. అటువంటి కవిత్వం కోసం నిర సాధన, ఘర్షణ, పోరాటం తప్పనిసరి. అలా ఘర్షణ పడుతూ “ ఇది ఆకలి గురించి తన ప్రేమ గురించి మాట్లాడుకోలేని సందర్భమనీ… జీవించడానికీ లేదా మరణించడానికీ . యుద్ధం అనివార్యమ”నీ అంటున్నాడు అరుణ్ బవేరా. తనకు తెలియకుండానే కవిత ప్రపంచంలోకి అలవోకగా నడిచొచ్చాడు. దానికి కారణం కవిత్వ మూలాలెక్కడో తన పూర్వతరంలో ఉన్నాయి. అందుకేనేమో నిర్మలంగా, నిదానంగా, పూలరాశులమీద అడుగులేస్తున్నట్టు సున్నితంగా, చెట్ల ఆకుల మీద కురుస్తున్న చినుకుల సంగీతంలా సంతోష మోహనంగా వచ్చాడు కవిత్వ ప్రపంచంలోకి.
కళింగాంధ్ర యువకవుల్లో అరుణ్ బవేరాది ప్రత్యేకమైన పద్దతి. సమాజ చలనాలను గుర్తించడంలో, సంక్షోభాల్ని అనుభవించడంలో తనదైన వ్యక్తీకరణతో, తనదే అయిన సాహిత్య వ్యక్తిత్వంలో దర్శనమిస్తాడు. పాఠకుల హృదయాలమీద స్పష్టమైన తనదైన స్వంత ముద్ర వేస్తాడు. “మనషులు ఖాళీచేసిన ఊరు… ఆ ఊరిలో చీకటిని జయించడానికి కన్నీళ్ళు చాలవని, కళ్ళనిండా ‘పొలంలో ధాన్యం గింజలు ఏరుకుంటున్న పిట్టలు రెక్కలల్లారుస్తున్న సన్నివేశాలు మారిపోయాక సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతున్న దు:ఖం, గూళ్ళు చెదిరి గువ్వలు ఎగిరిపోయిన వేదన’తో కవిగొంతు “మాటలు పోగొట్టుకున్న మూగదానిలా మూలుగుతుంది” అంటాడు. “గాయకులందరూ గొంతులు విప్పుకుని వెళ్ళిపోయాక ఏ పడవా ప్రయాణీకుల రక్షణకు పూచీ పడద”నే బాధతో “రాత్రంతా గుక్కపట్టిన ఊరును చంకనెత్తుకుని చందమామరావే, నా పల్లె బొజ్జలో పాలబువ్వైపోవే” అని పాడుకుంటాడు.
“ఆత్మను ఖాళీచేసుకున్నంత తేలిగ్గా ఇళ్ళనూ ఖాళీచేసుకు”ని వేటకుక్క వెంటతరిమినట్టు ఎటువేపైనా పోవాల్సిరావడం తప్పనిసరైన కళింగాంధ్రుల దుస్థితికి చలించిపోతాడు. వలసదారిలో అలిసి ఆత్మనేకాదు సమస్తదేహాన్నీ నగరానికి తాకట్టు పెట్టుకున్నాక ప్రేమను పదే పదే యాచించడానికి చేతులెక్కడివి? అని దిగులు పడుతుంటాడు. “ గాయపడటం, గాయపడ్డామో లేదో అని సందిగ్గపడేటట్టు గాయపడ్డంలోని విషాదానికి, జీవితమే గాయమైపోవాల్సిన అనివార్యతకూ గాయపడి, గాయాల్నే గానం చేస్తుంటాడు.
అక్షరాలు మనుషులతో సంభాషిస్తాయీ, మనసులతో పెనవేసుకుంటాయనీ, అక్షరాల్ని ప్రేమించేవాడు మనుషుల్ని ప్రేమిస్తాడనీ నమ్మి జీవితాన్ని అక్షరయాత్రగా మలుచుకుని, కవిత్వం పట్ల ప్రేమతో, సమాజం పట్ల బాధతో, తన విలక్షణమైన గొంతెత్తి ‘ “ఇలాంటి ఓ ప్రయాణం ” కవితా సంపుటి ని ప్రచురించిన అరుణ్ బవేరాను అభినందిస్తూ, కవిత్వ ప్రేమికులందరు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
రచయిత అరుణ్ బవేరా – 94407 10678
-గంటేడ గౌరునాయుడు
Nice review.
Very good book review.