అరుణ్ సాగర్ ను మరచిపోలేం!

అవును, అంతే, అరుణ్ సాగర్ ను మరిచిపోలేం! అతనొక అందమైన వెంటాడే కవిత్వం! కొత్తదనాన్ని పత్రికా రంగానికి తద్వారా పాఠక లోకానికి పరిచయం చేసేందుకు నిరంతరం తపించిన మేధావి జర్నలిస్ట్! అతను నిరంతరం ఆలోచించే ప్రవాహం! నిత్యం వెంటాడే జ్ఞాపకం.

నాకు మొదట విజయవాడ ఆంధ్రజ్యోతి లో 1994 లో పరిచయం. అప్పట్లో కవి దివంగత త్రిపురనేని శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి సండే ఇంఛార్జ్. సాగర్ స్పెషల్ డెస్క్ ఇంఛార్జ్. ఆ రెండు డెస్క్ ల మధ్య పొడవాటి మొఫసిల్ డెస్క్. నళిని రంజన్ గారు ఇంఛార్జ్. అప్పుడే సబ్ ఎడిటర్లుగా రెండు పూటలా పరీక్ష రాసి ర్యాంకులు కొట్టి కాలర్లు ఎగరేసి మరీ జాయిన్ అయిన నాతో పాటు మరికొందరికి అంతా కొత్త క్రేజ్. టక్ చేసుకుని పీలగా స్టయిలిష్ గా అటు ఇటు తిరుగుతూ ఉండే సాగర్ ను అలాగే చూడాలనిపించేది వెళ్ళే వరకు… కనిపించే వరకు. పక్కకు కాస్త ఒరిగి నడిచే స్టైల్ బావుంటుంది.

కట్ చేస్తే, రెండు నెలల తరువాత అప్పటి ఎడిటర్ నండూరి రామ మోహన్ రావు గారు పిలిచి ఇవాళ్టి నుండి అరుణ్ సాగర్ దగ్గర పని చేయండి, ఆయనే మీకు బాస్ అన్నారు. ఆనందం వేసింది. భయం కూడా వేసింది. అప్పటికి నాకు అనువాదాలు కొత్త. ఆంగ్లం నుంచి తర్జుమా చేస్తూ కొంత పైత్యం జోడించాలి. భయపడుతూనే సాగర్ దగ్గరకు వెళ్ళాను. పరిచయం చేసుకుంటూ ఉండగానే “కూర్చో బాస్” అన్నాడు. ఆయన బాస్ అనుకుని వెళితే, నన్నే బాస్ అనేశాడు. భలే నచ్చేసాడు. ఇట్టే కలిసిపోయాడు. 10 రోజుల తరువాత ఈ అనువాద ఆర్టికల్స్ నా వల్ల కాదు, నేను పొలిటికల్ డెస్క్ కు వెళ్ళిపోతాను అని చెప్పేశాను> అప్పుడు సాగర్ చేసిన కౌన్సిలింగ్ ఇప్పటికి మరచిపోలేను. నాలో పెంచిన ఆత్మవిశ్వాసం ఇప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. దటీజ్ అరుణ్ సాగర్.

వాక్య నిర్మాణాన్ని ఫ్యాషన్ గా రాయడం నేర్పించాడు. రాసిన ఆర్టికల్ ను తను మళ్ళీ రాసి తేడా చూపించే వాడు ఎంతో ఓపిగ్గా.
రెండేళ్ల తరువాత డెస్క్ అంతా హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చేశాం. ఒక బాస్ లానే కాదు. ఒక స్నేహితుడి లా, ఒక అన్న లా, ఒక నాన్న లా చూసుకునే వాడు.

అయితే, అన్ని రోజులు ఒకేలా వుండవుగా. కొన్ని బేధాభిప్రాయాలు, కొన్ని మనస్పర్థలు, మరికొన్ని అపార్ధాలు. సాగర్ సర్దుకు పోయేవాడు. భరించేవాడు!
అయితే నాకు కెరీర్ పరంగా తృప్తి లేదు. గుర్తింపు లేదు. ఎన్నాళ్ళు వున్నా సాగర్ రెక్కల్లోనే అనే అసంతృప్తి మొదలైoది. ఇంతలో ఆంధ్రజ్యోతి మూత పడింది. అదృష్టం, సాగర్ టీమ్ లోంచి బయటకు వచ్చేశాను. ఆ తరువాత tv9, మళ్ళీ ఆంధ్రజ్యోతి, 10టీవీ, టివి 5 లలో ఆయన వున్నప్పుడు రెడ్ కార్పెట్ వేశారు. తలుపులు తెరిచే వుంటాయని ప్రెస్ క్లబ్ లో కలసినప్పుడు చెప్పేవాడు. నేను ఒకసారి ధైర్యం చేసి చెప్పేశాను, మీరు నాకు ఎప్పటికి బాస్. కానీ, మీ టీమ్ లోకి రాలేను అని. ఆ తరువాత కలసినప్పుడు మనసారా మాట్లాడుకునే వాళ్ళం. నా శిష్యుడే అని అందరితో చెప్పేవాడు. సాగర్ అంటే నాకు భయం. సాగర్ అంటే నాకు వల్లమాలిన ప్రేమ. సాగర్ అంటే ఎక్కడలేని గౌరవం.

మొదటి నుంచి కూడా సాగర్ కు ఆరోగ్యం అంతంత మాత్రమే. ఆ తరువాత ఆరోగ్యం విషమించడం, అక్కడెక్కడో కవిత్వం రాసేయాలంటూ త్వరగా చిన్న వయసులోనే అందరిని వదిలేసి అర్ధాంతరంగా వెళ్ళిపోయి నాతో పాటు చాలా మందిని బాధ పెడుతూనే ఉన్నాడు. అరుణ్ సాగర్ అంతే. అతనితో పరిచయం అయితే చాలు, మరిచిపోలేం. మరి రెండు దశాబ్దాల అనుబంధం… అందుకే వెంటాడుతూ ఉంటాయి అతని జ్ఞాపకాలు. అతనొక ట్రెండ్ సెట్టర్.

Arun Sagar Award to Prasad Murthy

ఇవాళ(02-01-22) సాగర్ జయంతి. సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అరుణ్ సాగర్ పురస్కారాలు. అతనికి అత్యంత ఇష్టమైన ప్రసాదమూర్తి కి ఇవ్వడం సంతోషం. అరుణ్ సాగర్ కు బాస్ అయిన ప్రస్తుత ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. శిఖామణి, శివారెడ్డి, గోరటి వెంకన్న, అల్లం నారాయణ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

  • డా. మహ్మద్ రఫీ

1 thought on “అరుణ్ సాగర్ ను మరచిపోలేం!

  1. స్పూర్తి దాయక వ్యక్తులు…
    *అభినందనలు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap