అక్షరానికి ప్రాణవాయువతడు… సాహితీ జీవన నిరాశావాదాన్ని పారదోలిన ఆశావాది తెలుగు పదాల చిరునవ్వుతో…. ఆడుతూ పాడుతూ పద్యాన్ని అవలీలగా అల్లి.., సర్వేపల్లి రాధాకృష్ణకు తెలుగు తీయదనాన్ని పంచిన “బాలకవి”. ‘శారదా తనయుడిగా తెలుగు పద్యానికి పట్టం కట్టాడు. దేశం నలుమూలల్లో అవధాన కళా తోరణం కట్టి “అవధాన కోకిలై” ప్రపంచమంతా తెలుగు మాధుర్యాన్ని చాటిన ‘మధురకవి’ వాణీ వరపుత్రుడై ఎందరో శిష్యులను తెలుగు సాహితీ జగత్తుకు అందించిన ‘అవధానాచార్య అవధాన కళతో తెలుగుకు కొత్త వెలుగు పంచిన కళాతపస్వి’ ఎందరికో కవితా నడకలు నేర్పి… సాహితీ వినీలాకాశంలో వెలుగు తారలుగా నిలిపిన గురుదేవులు పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావుకు అక్షరనివాళి.
ఆశావాది అంటే అక్షరం పద్యమై చిందులేస్తుంది. తెలుగు నేలంతా అవధాన ప్రకాశమై వెన్నల కురుస్తుంది. ఒక కవిగా, అవధానిగా, ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ఒక సామాజిక చైతన్య దీపికై, ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపినవారు ఆశావాది ప్రకాశరావు గారు. జనవరి 2021లో, వీరు ఆర్ట్స్ అండ్ లిటరేచర్ విభాగంలో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. అష్టావధానిగా, 170 ప్రదర్శనలు ఇచ్చారు. మరియు వివిధ శైలులలో 50 పుస్తకాలను వ్రాసి ప్రచురించారు. వీరి ప్రధానమైన సాహిత్య సహకారం అవధానం – ఒక సాహిత్య ప్రదర్శన. వీరి సాహితీ సేవలకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సగౌరవంగా సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ నుండి విశిష్ట ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తను ఏదైతే నమ్మారో జీవితాంతం నమ్మిన సిద్ధాంతాలపైన, నమ్మిన సాహిత్యం మీద కడశ్వాస వరకూ నిలబడిన గొప్ప వక్తి. తన ఆశయసాధన కోసం నిరంతరం తపించి తన ఆశయాన్ని నెరవేర్చుకొని ఆ సరస్వతీ తల్లి పాదాల చెంతకు వెళ్ళిపోయిన సరస్వతీ పుత్రులు పద్మశ్రీ ఆశావాది గారు. వీరు ఫిబ్రవరి 17వ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం 2 గం॥ లకు స్వర్గస్థులైన వార్తను ఇంకా సాహిత్య లోకం జీర్ణించుకోలేక పోతున్నది. తెలుగు సాహితీ లోకానికి ఇదొక తీరని లోటు.
తారణ నామ సంవత్సరం, శ్రావణమాసం, త్రయోదశి, బుధవారం 1944వ సంవత్సరం ఆగష్టు 2వ తేదీ ఆశావాది ప్రకాశరావు కుళ్ళాయమ్మ, పక్కిరప్ప దంపతులకు కొరివిపల్లి గ్రామంలో మాతామహుల ఇంటిలో జన్మించారు. వీరి అసలు పేరు ఆసాది ప్రకాశం. ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య వీరి పేరును ఆశావాది ప్రకాశరావుగా మార్చారు. దళిత కుటుంబంలో జన్మించారు. బాల్యాన్ని బెళుగుప్ప మరియు సిరి గ్రామాలలో గడిపారు. ఆ గ్రామాల్లోని సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1953-1959 మధ్య కాలంలో అనంతపురంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలుర పాఠశాల మరియు రాజేంద్ర మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. 1960-61 మధ్య అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పీయూసీ పూర్తి చేశారు. అదే కాలేజీలో 1962-65లో బీఏ కూడా పూర్తి చేశారు. తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్-4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లోయర్ డివిజనల్ క్లర్క్ గా ఏలూరులో కొన్ని రోజులు పనిచేశారు. తన ప్రగతికి అడ్డంకిగా ఉన్న ఆ ఉద్యోగాన్ని వదిలి 1966-68 మధ్యకాలంలో వెంకటాద్రిపల్లె, వై.రాంపురం, కణేకల్, కుర్లి జిల్లా పరిషత్ పాఠశాలల్లో తెలుగు పండితుడిగా పనిచేశారు. 1968-70 మధ్య అనంతపురం పీజీ సెంటర్ (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి అనుబంధంగా ఉంది) నుండి యం.ఎ. తెలుగు భాషాశాస్త్రం చేసారు. 1970 నుంచి రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అనంతపురం, గుంతకల్లు, నగరి, పుంగనూరు, పెనుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి 2002లో పదవీ విరమణ చేశారు.
-కుమార్ స్వామి