బాలీవుడ్ ‘హిట్ గర్ల్’ పారేఖ్ కు ఫాల్కే పురస్కారం

(ఆశా పారేఖ్ కు ఫాల్కే పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)

భారతీయ సినిమారంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు భారత ప్రభుత్వం ఇచ్చే జీవితకాల విశిష్ట పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’. ఢుండిరాజ్ గోవింద ఫాల్కే అనే ‘దాదా ఫాల్కే’ భారతీయ సినిమాకు పితామహుడు. 1913లో తొలి పూర్తి స్థాయి మూకీ సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మించి, తన 19 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 95 సినిమాలను, పాతిక లఘుచిత్రాలను అందించిన ప్రతిభావంతుడు ఫాల్కే. ‘మోహినీ భస్మాసుర’, ‘లంకాదహన్’, ‘శ్రీకృష్ణ జనన్’, ‘కాళియ మర్దన్’ దాదా నిర్మించిన సినిమాల్లో పేరెన్నికగన్నవి. దాదా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1969లో ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ను తొలిసారి ప్రవేశ పెడుతూ, ఆయన సంస్మరణార్ధం ఒక తపాలాబిళ్ళను కూడా 1971లో విడుదల చేసింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో, భారత రాష్ట్రపతి చేతులమీదుగా అందించే ఈ పురస్కారం కింద, అవార్డు గ్రహీతకు రూ. పది లక్షల నగదు బహుమతితోబాటు స్వర్ణ కమలాన్ని, శాలువాను అందజేస్తారు. తొలుత ఈ బహుమతిని చలనచిత్ర ప్రధమ నటిగా గణుతికెక్కిన దేవికారాణికి అందజేశారు. దేవికారాణి తరవాత రెండు చలనచిత్ర సంస్థలను, రెండు సినిమా థియేటర్లను నిర్మించి సినిమా కళను ప్రోత్సహించిన బీరేంద్రనాథ్ సర్కార్ కు ఫాల్కే మలి పురస్కారం దక్కింది. తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ లో నటించి, ‘పృథ్వి ధియేటర్స్’ నెలకొల్పి, భారతీయ సినిమాకు బహుముఖ సేవలందించిన పృథ్విరాజ్ కపూర్ కు 1971లో మరణానంతర పురస్కారంగా ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటించారు. ఇంతవరకు 51మంది కళాకారులకు ఈ పురస్కారం దక్కగా, 2022 సంవత్సరానికి నాటితరం బాలీవుడ్ ‘హిట్ గర్ల్’ గా పేరెన్నికగన్న ఆశా పారేఖ్ కు 27 సెప్టెంబర్ (మంగళవారం) నాడు ప్రకటించారు. ఒక గ్లామరస్ డ్యాన్సర్ గా, తుంటరి చిన్నదిగా హిందీ చలనచిత్రసీమలో అడుగిడి, జూబిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, అద్భుత నటనా పటిమగల హీరోయిన్ గా ఎదిగిన ఆ గుజరాతీ చిన్నది ఆశా పారేఖ్. వివాహితుడైన దర్శక నిర్మాతను మనసారా ప్రేమించి, అతణ్ణి మనువాడలేక, ప్రియుని భార్యకు ద్రోహం చెయ్యలేక, తన ప్రేమను ‘ఆరాధన’కు అంకితమిచ్చి జీవితాంతం అవివాహితగా నిలిచిన ఆదర్శ వనిత ఆశా పారేఖ్. కేంద్రీయ సెన్సార్ బోర్డు కు చైర్ పర్సన్ గా సేవలందించిన తొలి మహిళ కూడా ఆశా పారేఖే. సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా సేవలందించిన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం. శేషజీవితాన్ని సంఘసేవకు వినియోగిస్తూ పేదప్రజలకు వైద్యసేవలు అందించాలనే సదాశయంతో ఆసుపత్రి నిర్మించి నిర్వహిస్తున్న నిస్వార్ధ మహిళ ఆశా పారేఖ్. ఈ విశిష్ట పురస్కార విశేషాలు, ఆ పురస్కార గ్రహీత గురించి కొన్ని విశేషాలు….

తొలిరోజుల్లో…

ఆశా పారేఖ్ గుజరాతీ అమ్మాయి. 1942 గాంధి జయంతి నాడు ఆశా పారేఖ్ ప్రాణ్ లాల్ పారేఖ్, సుధా పారేఖ్ దంపతులకు జన్మించింది. వారికి ఆశా ఏకైక సంతానం. తల్లి బొహ్రా ముస్లిం (వీరిని ముస్లిం వర్గీయులుగా పరిగణించరు) వనిత. తల్లికి నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే ఆశా పారేఖ్ ను పండిట్ బన్సీలాల్ భారతి అనే నాట్యాచార్యుని వద్ద నాట్యశాస్త్రంలో మంచి శిక్షణ ఇప్పించింది. ఒకానొక నాట్యవేదికమీద ప్రముఖ దర్శక నిర్మాత బిమల్ రాయ్ ఆశా పారేఖ్ నాట్యాన్ని చూడడం జరిగింది. అప్పుడు ఆశా కు కేవలం పదేళ్ళు. బాలతారగా ఆమెను బాంబే టాకీస్ వారు నిర్మించిన ‘మా’ (1952) అనే సినిమాలో వెండితెరకు పరిచయం చేశారు. బిమల్ రాయ్ అప్పట్లో కలకత్తాలో ఉంటూ సినిమాలు నిర్మిస్తూ వుండేవారు. బాంబే టాకీస్ వారి ఆహ్వానం మీద తన సొంత నిర్మాణ సంస్థకు విరామం ప్రకటించి బొంబాయి వచ్చి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో భరత్ భూషణ్, శ్యామా, నాసిర్ హుసేన్ బి.ఎం.వ్యాస్ ప్రధాన పాత్రలు పోషించారు. తరవాత 1954 లో బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన ‘బాప్-బేటి’ సినిమాలో కూడా ఆశా పారేఖ్ బాల తారగా నటించింది. ఇందులో నళిని జయవంత్, నాసిర్ హుసేన్ ముఖ్య తారాగణం. తరవాత కూడా ఆశా పారేఖ్ మరికొన్ని సినిమాలలో బాల తారగా నటించినా అవి పెద్దగా విజయవంతం కాలేదు. దానితో ఆశా సినిమా నటనకు స్వస్తి చెప్పి చదువు మీద శ్రద్ధ పెట్టింది. పదహారేళ్ళ యుక్తవయసు వచ్చాక మరలా సినిమాలమీద దృషి సారించిన ఆశాకు తొలి ప్రయత్నమే బెడిసికొట్టింది. అది 1959లో విజయభట్ ‘గూంజ్ ఉఠీ షెహనాయీ’ సినిమా నిర్మిస్తుండగా అందులో హీరోయిన్ అవకాశం వచ్చినట్లే వచ్చి తప్పిపోయింది. విజయ భట్ ఆశా పారేఖ్ ను చూసి ఆమె సినిమాలకు పనికిరాదని తేల్చేశాడు. రాజేంద్రకుమార్ సరసన ఆశా స్థానంలో అమిత ను తీసుకున్నారు. వసంత దేశాయ్ సంగీతదర్శకత్వంలో ప్రముఖ షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సూపర్ హిట్ చిత్రానికి నేపథ్య సంగీతం అందించడం విశేషం. అయితే వారం తిరగకముందే ఆశా పారేఖ్ సుబోద్ ముఖర్జీ నాసిర్ హుసేన్ దర్శకత్వంలో నిర్మించబోయే ‘దిల్ దేఖో దేఖో’ చిత్రంలో బుక్ అయింది.

Asha Parekh

దిల్ దేఖో దేఖో తో హీరోయిన్ గా…

ఆశా పారేఖ్ హీరోయిన్ గా పరిచయమైన మొదటి సినిమా ‘దిల్ దేఖో దేఖో’’ (1959). షమ్మికపూర్ కామెడీ, డ్యాన్సింగ్ హీరోగా గుర్తింపు పొందిన సినిమా కూడా ఇదే. ఉషా ఖన్నా సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమాకూడా ఇదే. రాజేంద్రనాథ్ కమేడియన్ గా పరిచయమైన సినిమా కూడా ఇదేకావడం విశేషం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. నాసిర్ హుసేన్, షమ్మికపూర్, ఆశా పారేఖ్ ల కాంబినేషన్ లో తరవాత వచ్చిన సినిమా 1966 లో విడుదలైన సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ ‘తీస్రీ మంజిల్’ మాత్రమే. ‘దిల్ దేఖో దేఖో’ సినిమాలో హీరోయిన్ గా వహీదా రెహమాన్ అయితే బాగుంటుందని నాసిర్ హుసేన్ కు షమ్మికపూర్ సలహా ఇవ్వగా, అప్పటికే ఆశా పారేఖ్ ను బుక్ చేసినట్లు తెలియడంతో ఆ ప్రయత్నాన్ని షమ్మి విరమించుకున్నాడు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ యెంత పాపులర్ అయిందంటే నిర్మాత సుందర్ లాల్ నహతా ‘శాంతినివాసం’ చిత్రంలో ఇదేపాట బాణీని అనుకరిస్తూ ‘చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలుకేనా’ అనే కామెడీ పాటకు రూపమిప్పించి రేలంగి, బాలసరస్వతి మీద చిత్రీకరింపజేశారు. నిజానికి ఆ పాట మ్యాక్ గ్యూరీ సోదరీమణులు స్వరపరచిన ‘షుగర్ ఇన్ ది మార్నింగ్’ పాటకు మక్కికి మక్కీ. ఆశా పారేఖ్ తల్లి సుధా పారేఖ్ ఆశాకు కావలసిన కాస్త్యూములను డిజైన్ చేసేవారు.

నాసిర్ హుసేన్ హీరోయిన్ గా…

నాసిర్ హుసేన్ మంచి సినీరచయిత. ఖమర్ జలాలాబాది వద్ద పనిచేసిన తరవాత ఫిల్మిస్తాన్ లో రచయితగా చేరాడు. రచయితగా ‘అనార్కలి’, ‘మునీం జీ’, ‘పేయింగ్ గెస్ట్’ వంటి సినిమాలకు రచనచేశారు. ఫిల్మిస్తాన్ విచ్చిన్నమై బాంబే టాకీస్ గా రూపాంతరం చెందినప్పుడు ‘తుమ్ సా నహీ దేఖా’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తరవాత వచ్చిందే ‘దిల్ దేఖో దేఖో’ చిత్రం. 1961 లో నాసిర్ హుసేన్ సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ఎన్.హెచ్. ఫిలిమ్స్’ ను స్థాపించి ‘జబ్ ప్యార్ కిసీ సే హోతా హై’ సినిమా నిర్మించి సూపర్ హిట్ చేశారు. అలా ఆశా పారేఖ్ నాసిర్ హుసేన్ వరసగా నిర్మించిన ఆరు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘జబ్ ప్యార్ కిసీ సే హోతా హై’ సినిమాలో ఆశా పారేఖ్ సరసన దేవానంద్ హీరోగా నటించాడు. ఈ సూపర్ హిట్ చిత్రానికి శంకర్-జైకిషన్ సంగీతం అందించగా నాసిర్ హుసేన్ నిర్మించిన తదుపరి చిత్రాల్లో వీరిని సంగీత దర్శకులుగా తీసుకోలేదు. దేవానంద్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాలోని ‘జియా ఓ జియా’, ‘సౌ సాల్ పెహలె’ పాటలు సూపర్ హిట్లుగా నిలిచి నేటికీ వినపడుతూనే వున్నాయి. తరవాత 1963లో నాసిర్ హుసేన్ ‘ఫిర్ వొహీ దిల్ లాయా హూ’ అనే సినిమాను జాయ్ ముఖర్జీ ని హీరోగా పెట్టి ఆశా పారేఖ్ తో నిర్మించాడు. ఒ.పి. నయ్యర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. 1966లో నాసిర్ హుసేన్ నిర్మించిన మరొక సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘తీస్రీ మంజిల్’. అందులో అశా పారేఖ్ సరసన షమ్మికపూర్ హీరోగా నటించాడు. ఆర్.డి. బర్మన్ సంగీతం స్వరపరచిన పాటలు ఆల్ టైం హిట్స్ గా నిలిచాయి. నాసిర్ హుసేన్ 1985లో నిర్మించిన ‘జబర్దస్త్’ సినిమా వరకు హుసేన్ సినిమాలకు ఆర్.డి. బర్మనే సంగీత దర్శకుడుగా పనిచేశారు. 1967లో నాసిర్ హుసేన్ నిర్మించిన ‘బహారోం కే సప్నే’ బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో ఆశా పారేఖ్ కు జంటగా రాజేష్ ఖన్నా నటించాడు. ఇందులో మన్నాడే, లతాజీ ఆలపించిన ‘చునరీ సంభాల్ గోరీ’ మంచి హిట్. ఈ సినిమా ద్వారా జాల్ మిస్త్రీ కి ఉత్తమ బ్లాక్ అండ్ వైట్ చిత్ర సినిమాటోగ్రాఫర్ గా ఫిలింఫేర్ బహుమతి లభించింది. తరవాత 1969 లో ఆశా పారేఖ్ సరసన శశికపూర్ ని హీరోగా చేసి నాసిర్ హుసేన్ ‘ప్యార్ కా మౌసమ్’ అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమా సిల్వర్ జూబిలీ చేసుకుంది. ఇందులో ఆర్.డి. బర్మన్ స్వరపరచిన ‘ని సుల్తానా రే’ పాటలో ‘దుగ్గి’ అనే వాద్యాన్ని హోమీ ముల్లాన్ చేత వాయింపజేసి మంచి మెలోడీ రాబట్టడం విశేషం. ‘తుమ్ బిన్ జావూ కహా’ పాట కూడా మంచి హిట్టే. 1971లో జితేంద్ర హీరోగా, ఆశా పారేఖ్ హీరోయిన్ గా నాసిర్ హుసేన్ ‘కారవాన్’ అనే బాక్సాఫిస్ హిట్ సినిమా నిర్మించాడు. ఇందులో ‘దిల్ బర్ దిల్ సే ప్యారే’, ‘కితనా ప్యారా వాదా హై’, ‘పియా తూ అబ్ తో ఆజా’ పాటలు అజరామరాలే. ఈ సినిమా చైనా దేశంలో కూడా హిట్టయింది. ‘పియాతూ ఆబ్ తో ఆజా’ పాటకు ఆశా భోస్లే ఫిలింఫేర్ బహుమతి గెలుచుకుంది.

Asha Parekh

నాసిర్ హుసేన్ తో ప్రేమకు భాష్యం…

తనను హీరోయిన్ గా పరిచయం చేసిన నాసిర్ హుసేన్ అంటే ఆశా పారేఖ్ కు చాలా ఇష్టం. ఆ ఇష్టమే ప్రేమగా మారి ఆశా నాసిర్ హుసేన్ ని ఆరాధించడం మొదలెట్టింది. అయితే వారి ప్రేమ పెళ్లిదాకా వెళ్ళలేదు. కారణం నాసిర్ హుసేన్ కు అప్పటికే సహాయ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఆయేషా ఖాన్ తో వివాహమవడమే. ఆశా పారేఖ్ కు మాత్రం మరో మహిళతో కాపురం పంచుకోవడం ఇష్టంలేదు. అటువైపు నుంచి చూస్తే నాసిర్ హుసేన్ ఆయేషా ఖాన్ కు విడాకులిచ్చేందుకు సుముఖంగా లేడు. దానితో వారి ప్రేమ సుఖాంతం కాలేదు. ఆశా పారేఖ్ ‘ది హిట్ గర్ల్’ పేరుతో తన ఆత్మకథను రాసుకుంది. అందులో నాసిర్ హుసేన్ ని తప్ప తను మరెవరినీ ప్రేమించలేదు అనే విషయాన్ని తేటతెల్లం చేసింది. నాసిర్ హుసేన్ కుటుంబంలో తన ప్రేమాయణం వలన కలతలు రాకూడదు అని కూడా ఆశా పారేఖ్ అభిలషించింది. కుటుంబాలను కూల్చడం తన మనస్తత్వానికి విరుద్ధమని అందుకే తన ప్రేమను పదిలంగా దాచుకున్నానని ఆమె ఆత్మకథలో స్పష్టం చేసింది. అంతేకాదు పెళ్ళిచేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోయింది. పవిత్రప్రేమకు అద్దంపట్టిన జీవితం ఆశా పారేఖ్ ది. నాసిర్ హుసేన్ తన అభిమానానికి గుర్తుగా ఆశా పారేఖ్ కు తన 21 సినిమాల పంపిణీ వ్యవహారంలో భాగస్వామ్యం కలిపించాడు. మరో కథనం ప్రకారం… ఆశా పారేఖ్ కు తల్లిదండ్రులు 1970లో అమెరికాలో స్థిరపడిన ఒక భారతీయ యువకునితో పెళ్లి చేయాలనుకున్నారట. కానీ ఆ యువకునికి మరొక అమెరికన్ గాళ్ ఫ్రెండ్ ఉండడంతో ఈ పెళ్లి కి ఆశా పారేఖ్ ‘నో’ చెప్పిందని అంటారు.

గ్లామర్ తార ఉదాత్తమైన పాత్రల్లో…

1970 వ దశకం దాకా ఆశా పారేఖ్ నటించిన సినిమాలు గ్లామర్ తారగానే. అయితే 1966లో రాజ్ ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన ‘దో బదన్’, 1969లో వచ్చిన ‘చిరాగ్’, 1978 లో వచ్చిన ‘మై తులసి తేరే అంగన్ కి’ చిత్రాలలో ఆశా పారేఖ్ కు నటనాసామర్ధ్యమున్న పాత్రలు లభించాయి. రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన ‘దో బదన్’ చిత్రంలో ఆశా పారేఖ్ మనోజ్ కుమార్ సరసన నటించింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో ఆశా పారేఖ్ తన సొంత పేరుతోనే నటించింది. సిమి గారేవాల్(ఉత్తమ సహాయనటి), రవి(ఉత్తమ సంగీత దర్శకుడు), షకీల్ బదాయుని(ఉత్తమ గేయరచయిత), లతా మంగేష్కర్ (ఉత్తమ గాయని- ‘లో ఆగయీ ఉస్ కి యాద్’ పాటకు)లకు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ‘జబ్ చలీ థండీ హవా’ పాటకూడా బాగా పాపులర్ అయింది. ‘చిరాగ్’ చిత్రంలో ఆశా పారేఖ్ సునీల్ దత్ సరసన నటించింది. మదన్ మోహన్ అద్భుత సంగీతం ఈ చిత్రానికి అసెట్. ఈ సినిమాలో వినోద్ ఖన్నా, ఆశా పారేఖ్, నూతన్ నటించారు. ఈ సినిమాలో ఆశా పారేఖ్ తోబాటు వివిధ విభాగాలకు తొమ్మిది నామినేషన్లు వెళ్ళినా ఆశా పారేఖ్ కు ఉత్తమ నటి బహుమతి కొద్దిలో తప్పిపోయింది. ఆ బహుమతి ‘అపనాపన్’ చిత్రంలో నటనకు రీనా రాయ్ గెలుచుకుంది. నటనకు పదును పెట్టే పాత్రలు ఆశా పారేఖ్ కు దర్శకుడు శక్తి సామంత లభింపజేశాడు. 1970 లో ‘పగ్లా కహీ కా’, ‘కటీ పతంగ్’ సినిమాలు ఈ కోవలోనివే. షమ్మికపూర్ సరసన ‘పగ్లా కహీకా’లో ఆశా పారేఖ్ నటించింది. ఇందులో శంకర్-జైకిషన్ స్వరపరచిన ‘తుమ్ ముఝే యూ బులాన పావోగే’ అనే పాట నేటికీ వినిపిస్తూనే వుండగా ‘మేరీ భైన్స్ కో దందా క్యో మారా’ పాట సెమిక్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆశా పారేఖ్ నటన శక్తి సామంత కు ఎంతగానో నచ్చింది. వెంటనే ‘కటీ పతంగ్’ చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు. అందులో ఉత్తమ నటనకు ఆశా పారేఖ్ ఫిలింఫేర్ బహుమతి గెలుచుకుంది. రాజేష్ ఖన్నాకు బాగా నచ్చిన చిత్రం ‘కటీ పతంగ్’. మంచి ఉచ్చదశలో వుండగా ఆశా పారేఖ్ ‘అఖండ సౌభాగ్యవతి’, ‘లంవర్దని’ వంటి మూడు గుజరాతీ సినిమాల్లోను, మరొక కన్నడ సినిమాలోను కూడా అద్భుతమైన పాత్రలు పోషించింది. 1976 తరవాత గ్లామర్ పాత్రలకు స్వస్తి చెప్పి సహాయ పాత్రల్లో క్యారక్టర్ రోల్స్ కు పరిమితమైంది. వాటిలో వదినగా, తల్లిగా నటించింది. కానీ ఆపాత్రలు తనకు నచ్చకపోవడంతో సినిమా నటనకు స్వస్తి చెప్పింది. 1990 లో టెలివిజన్ డైరెక్టర్ గా మారింది. ‘ఆకృతి’ అనే సంస్థను ప్రారంభించి ‘బాజే పాయల్’, ‘కోరా కాగజ్’ ‘పలాష్ కే ఫూల్’, ‘దాల్ మే కాలా’ వంటి బుల్లితెర సినిమాలు నిర్మించింది. 1994-2000 మధ్యకాలంలో సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు చైర్ పర్సన్ గా వ్యవహరించింది. తరవాత కేంద్రీయ సెన్సార్ బోర్డుకు చైర్ పర్సన్ గా కూడా వ్యవహరించింది. 2002లో ఫిలింఫేర్ సంస్థ ఆశా పారేఖ్ కు జీవన సాఫల్య పురస్కారం అందించింది. రియాలిటీ షో లకు న్యాయనిర్ణేతగా కూడా ఆమె వ్యవహరించింది. ప్రస్తుతం ఆశా పారేఖ్ ఒక నృత్య అకాడమీని స్థాపించి నడిపించడమే కాకుండా, శాంతా క్రూజ్ వద్ద ‘ఆశా పారేఖ్ ఆసుపత్రి’ పేరిట ఒక పెద్ద వైద్యశాలను నిర్వహిస్తోంది.

పురస్కారాలు

ఆశా పారేఖ్ కు 1992లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2002 లో ఫిల్మ్ ఫేర్ సంస్థ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. అలాగే 2004లో కళాకార్ అవార్డ్, 2006లో అశాకు అంతర్జాతీయ భాతీయ ఫిల్మ్ అకాడెమీ బహుమతి లభించింది. 2007లో న్యూయార్ లోని లాంగ్ ఐలాండ్ లో వార్షిక బహుమతి లభించింది. అదే సంవత్సరం పుణె నగరంలో కూడా బహుమతి అందుకుంది. కొన్ని టెలివిజన్ ధారావాహికలకు బహుమతి ప్రకటించే న్యాయనిర్ణేతగా కూడా ఆశా పారేఖ్ వ్యవహరించింది. అక్టోబర్ 2న ఆశా పారేఖ్ 80వ జన్మదిన వేడుకలు జరుపుకోనుంది.

ఆచారం షణ్ముఖాచారి
94929 54256

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap