అంతరిక్షంలో ఆంధ్రా అమ్మాయి

ఆంధ్రప్రదేశ్ లోని చిన్న పట్టణంలో పుట్టి, పంజాబ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసి, నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తిచేసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు దక్కించుకొని, అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ లో ఆస్ట్రోనాట్ కాండిడేట్ గా టైటాన్ స్పేస్ మిషన్ ను 2029లో చేపట్టనుంది కుమారి దంగేటి జాహ్నవి. ఆమె విజయగాథ ఈ రోజు మీకోసం.

జాహ్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో దంగేటి శ్రీనివాస్ – పద్మశ్రీ దంపతుల సంతానంగా 2002లో జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరు కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. జాహ్నవి చిన్నప్పటి నుండి పాలకొల్లులో అమ్మమ్మ దగ్గరే పెరిగింది.

జాహ్నవి పాలకొల్లులోనే ఇంటర్ పూర్తి చేశారు. ఆతర్వాత పంజాబ్‌ లోని “లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో” ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

స్పేస్ ప్రోగ్రామ్ దిశగా అడుగులు: జాహ్నవి అమ్మమ్మ చిన్నతనంలో పదే పదే చందమామను చూపిస్తూ కథలు చెప్పడంతో చంద్రుడిపై అడుగుపెట్టాలని అనుకునేది. ధృఢనిశ్చయంతో వున్న జాహ్నవి తన లక్ష్యాన్ని చేరుటకు 2021లో అమెరికా లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ కి భారతదేశం నుంచి ఎంపికై రికార్దు సృష్టించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతున్న వ్యోమగామి శిబిరాల్లో శిక్షణ పొందుతూ వస్తోంది. పోలెండ్ లో “అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్” లో శిక్షణ పొందిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది జాహ్నవి. ఇంకా, 1965, 1967 సంవత్సరాల్లో అమెరికా అపోలో ఆస్ట్రోనాట్ లు శిక్షణ పొంది చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన “నీల్ ఆర్మ్ స్ట్రాంగ్” బృందం, ఐస్ లాండ్ దేశంలో జియో స్పేస్ సెంటర్ లోనే శిక్షణ పొందటం తెలుసుకొని వారి స్ఫూర్తితో జాహ్నవి “జియో స్పేస్ సెంటర్లో” శిక్షణ తీసుకున్న మొదటి భారతీయురాలిగా నిలిచింది..

జాహ్నవి 16 ఏళ్ల వయసులో “ఇస్రో వరల్డ్‌ స్పేస్‌ వీక్‌” లో పాల్గొంది. ఆస్ట్రోనాట్‌లకు అవసరమని స్కూబా డైవింగ్‌ నేర్చుకుంది. దేశంలోనే పిన్న అడ్వాన్స్‌డ్‌ స్కూబా డైవర్‌గా నిలిచి, నాసా పదిరోజుల ప్రోగ్రామ్‌కి ఎంపికై, ఇట్టి అవకాశం అందుకున్న తొలి భారతీయురాలు గా నిలిచింది. మిషన్‌ డైరెక్టర్‌గా మినీ రాకెట్, అండర్‌ వాటర్‌ రాకెట్‌ లాంచ్‌ భాగమైంది. ఆ తర్వాత 2022లో పోలాండ్‌లో “లూనార్‌ మిషన్‌”లో పాల్గొని అతిపిన్న అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందింది జాహ్నవి.

తల్లిదండ్రులు తనతో లేకపోయినా, అమ్మమ్మ పెంపకంలో, ఆమె చందమామను చూపిస్తూ, ఆమె చెప్పిన కథలు వింటూ పెరిగి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌ లో డిగ్రీ పూర్తిచేసి, నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసి ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా
అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్‌ స్పేస్‌ ఇండస్ట్రీస్.. టైటాన్‌ స్పేస్‌ మిషన్‌‌ కోసం పిన్న వయసులోనే ఆస్ట్రోనాట్ కాండిడేట్‌గా ఎంపికైన తొలి బారతీయురాలు కుమారి దంగేటి జాహ్నవి. ఇది పాలకొల్లు పట్టణం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జాహ్నవి దంగేటి విజయగాథ. మరో విశిష్ట వ్యక్తి సక్సెస్ స్టోరీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.

మధుసూదన్ మామిడి
సెల్ నం. 8309709642

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap