అమెరికా అట్లాంటాలో జూన్ 7వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న 2024 ‘అటా’ మహాసభల విశేషాలు…
అట్లాంటా ‘అటా’ (American Telugu Association) వేడుకల్లో ప్రత్యేకంగా నాలుగు విశేషాలు ఆకట్టుకున్నాయి. జన హృదయ నేత దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించడం, నృత్య చూడామణి శోభానాయుడు కు నృత్య నివాళి సమర్పించడం ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఈనాడు చీఫ్ ఎడిటర్ రామోజీరావు మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. భారతరత్న పి.వి. నరసింహారావు, పద్మవిభూషణ్ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం లను గుర్తు చేసుకున్నారు. పద్మవిభూషణులు ఎం. వెంకయ్య నాయుడు, చిరంజీవి కొణిదెల లకు శుభాకాంక్షలు తెలిపారు.
మిమిక్రీ రమేష్ మోడరేటర్ గా వ్యవహరించిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి, డా. మహ్మద్ రఫీ, హరిప్రసాద్ లింగాల, గోపి రెడ్డి, రఘు తదితరులు వై.ఎస్. తో వారికి వున్న అనుభవాలను పంచుకున్నారు. మిమిక్రీ రమేష్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి వాయిస్ అనుకరణతో కార్యక్రమాన్ని ఆద్యంతం నిర్వహించి రక్తి కట్టించారు.
ప్రముఖ నాట్య గురువులు “నాట్యజ్యోతి” చింతలపూడి జ్యోతి, సుజాత వింజమూరి, సౌమ్య తదితరులు వారి శిష్యులతో కలసి శోభానాయుడుకు కూచిపూడి నృత్య నివాళి సమర్పించి ఆకట్టుకున్నారు. డా. కెవి సత్యనారాయణ నృత్య దర్శకత్వంలో నీలిమ శిష్యబృందం ప్రదర్శించిన గోదా కళ్యాణం కూచిపూడి నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దత్తరాజా డ్యాన్స్ అకాడమీ నాట్య గురు అపర్ణ తురగా బృందం ప్రదర్శించిన కాంతారా నృత్యానికి విశేష స్పందన లభించింది. గర్ల్స్ స్పిరిట్ పేరిట సయ్యంది పాదం విజేతలు బాలీవుడ్ టాలీవుడ్ గీతాలకు అద్భుతంగా నృత్యాలు ప్రదర్శించారు. అమెరికాలోని 40 రాష్ట్రాలకు చెందిన 250 బృందాలు పోటీ పడగా ఎనిమిది బృందాలను ఎంపిక చేసి బహుమతులు అందించారు.
- అట్లాంటా నుంచి డా. మహ్మద్ రఫీ