అన్నపూర్ణావారి ‘ఆత్మగౌరవం’ కు షష్టిపూర్తి గౌరవం

(‘ఆత్మగౌరవం’ సినిమాకు 60 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం)

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి, తమ ఆశయాలకు అనుగుణంగా వారిని సమాజం మెచ్చేలా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తాపత్రయపడుతుంటారు. అయితే పిల్లలకు కూడా సొంత అభిప్రాయాలుంటాయి. అవి సంఘర్షణకు దారి తీస్తుంటాయి. తమ మాట నెగ్గించుకోవాలని పెద్దలు, తమ వ్యక్తిత్వం నిలుపుకోవాలని పిల్లలు పోటీపడుతుంటారు. ఈ సంఘర్షణల మధ్య ఆస్తులు, అంతస్తులు బలీయమైన శక్తులుగా పనిచేస్తాయి. అవి అంత త్వరగా లొంగవు. కానీ, వీటన్నిటికంటే అంతఃకరణ, ఆత్మగౌరవం ప్రధానమని తెలియజెప్పిన గొప్ప చిత్రాన్ని అన్నపూర్ణా పిక్చర్స్ వారు ‘ఆత్మగౌరవం’ పేరుతో నిర్మించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి రంజింపజేసిన ఈ చిత్రం 11, మార్చి 1966 న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. షష్టిపూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలు కొన్ని…

చిత్ర కథ: నమ్మకస్తుడైన రామయ్య(గుమ్మడి) పల్లెటూరి రైతు. అతని తల్లి శాంతమ్మ (హేమలత). ఎనిమిదేళ్ళ రామయ్య తమ్ముడు శ్రీనివాసరావు@వాసు(నాగేశ్వరరావు)ను అతని భార్య జానకమ్మ(పుష్పకుమారి) చిన్నతనంనుంచి కన్నతల్లిలా పెంచుతుంది. జమీందారు వరహాలరావు (రేలంగి) పొలాన్ని రామయ్య సాగుచేస్తూ వుంటాడు. సంతులేని జమీందారు వాసుని దత్తత చేసుకుంటాడు. కానీ, అతని భార్య సంతానలక్ష్మి (సూర్యకాంతం)కి మొదటినుంచి తన చెల్లెలి కొడుకు వేణు(చలం) ను దత్తత చేసుకోవాలని వుంటుంది. ఆమె కోరిక ఫలించకపోవడంతో, వాసుని కన్నవారికి ఎన్నివిధాలా దూరం చెయ్యాలో అన్ని విధాలా దూరం చేస్తుంది. వరహాలరావు వాసుని రామయ్య కుటుంబానికి దూరంగా, పట్నంలో చదివించి పెద్దచేయిస్తాడు. వాసుని తల్లికంటె మిన్నగా పెంచిన రామయ్య భార్య జానకమ్మ జబ్బుచేసి చనిపోతుంది. ఆ వార్తను వాసుకు తెలియకుండా సంతానలక్ష్మి తొక్కి పెడుతుంది. దత్తస్వీకారానికి ముందే రామయ్య తన మేనకోడలు సావిత్రి (కాంచన)తో వాసుకు వివాహం జరిపించాలని జమీందారు నుంచి వాగ్దానం తీసుకుంటాడు. కానీ సంతానలక్ష్మి అందుకు విరుద్ధంగా పట్నంలో వున్న జడ్జి భజగోవిందం (రమణారెడ్డి) కూతురు గీత (రాజశ్రీ)తో వాసుకు పెళ్లిసంబధం ఖాయం చేస్తుంది. రామయ్యకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేని అశక్తుడైన జమీందారు కూడా భార్య మాటకు యెదురు చెప్పలేకపోతాడు. వాసుని అపార్ధం చేసుకున్న రామయ్య పంతం కొద్దీ సావిత్రికి మరో గొప్పింటి సంబంధం చేయాలని, అందుకు ప్రతిగా ఆ ఇంట్లో పిచ్చిపిల్ల పార్వతి(వాసంతి)ని వివాహం చేసుకునేందుకు సిద్ధపడతాడు. తనవల్ల మామయ్య జీవితం నరకం కాకూడదని పెళ్లికి ముందురోజు సావిత్రి ఇల్లువదలి వెళ్లిపోతుంది. ఇచ్చినమాట నిలుపు కునేందుకు రామయ్య పిచ్చిపిల్లను పెళ్లాడతాడు. ఇల్లు వదలిన సావిత్రి పట్నంలో సేవాసదన్ లో చేరి నృత్యం నేర్చుకొని ప్రదర్శనలిస్తుంటుంది. వాసు ఆమెను చూసి మనసిస్తాడు. సావిత్రికి వాసు తన మేనమామ అని తెలుస్తుంది. ఈలోగా వరహాలరావు, జడ్జిగారు వాసు-గీతల పెళ్లి ఖాయం చేసుకుంటూ తాంబూలాలు ఇచ్చిపుచ్చు కుంటారు. సావిత్రి తన మేనకోడలని, అన్న రామయ్యకు అన్యాయం జరిగిందని తెలుసుకొన్న వాసు, తల్లికి, అన్నకు క్షమాపణలు చెప్పి, పెంచినవారిని యెదిరించి సావిత్రిని పెళ్లిచేసుకుంటాడు. వాసు ఈ క్లిష్ట సమస్య ను అందంగా, ఆహ్లాదంగా పరిష్కరించి అందరి ఆత్మగౌరవాన్ని కాపాడడం ఈ సినిమా గొప్పతనం.

ర’సాలూరి’న పాటలు: సాలూరి రాజేశ్వరరావు సంగీత ప్రతిభను యెలా వాడుకోవాలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు తెలిసినంతగా మరే ఇతర నిర్మాతకు తెలియదు. అందుకే అన్నపూర్ణ సంస్థకు రాజేశ్వరరావు అందించిన సంగీతం అమరం. ఆత్మగౌరవం సినిమాలో మొత్తం పది పాటలున్నాయి. ఇందులో పాటలన్నీ మరలామరలా వినాలనిపించే అమృతగుళికలే. రేలంగి తన పొలాల గొడవ పరిష్కారంకోసం పల్లెటూరికి వచ్చి, గుమ్మడి ఇంటిలో విందు ఆరగించినప్పుడు చిన్ననాటి వాసు, సావిత్రి ఆలపించే సినారె గీతం “మారాజు లొచ్చారు మహరాజు లొచ్చారు మాయింటికొచ్చారు…మా మంచి వారంట మనసున్న వారంట మా కెంతొనచ్చారు” ఒక అద్భుతమైన పాట. ఈ సన్నివేశంలో రేలంగికి కుర్చీ వేసి, బల్లమీద భోజనం వడ్డించి గుమ్మడి విసనకర్రతో సేదదీర్చుతుంటే, అల్లు రామలింగయ్యకు పీట వేసి భోజనం వడ్డించడం విశ్వనాథ్ ప్రతిభ. ఈ పాటలో ముద్దపప్పు, ఆవకాయ, గుత్తివంకాయ, గారెలు, బూరెలు, నేతిబొబ్బట్లు ఆప్యాయంగా వడ్డించే గ్రామీణసంప్రదాయం గౌరవప్రపత్తులకు అద్దంపడుతుంది. సినిమా కథకు ఈ పాటే మలుపు. అంతర్ కళాశాల వత్క్రుత్వ పోటీల్లో అక్కినేని అలపించే ఆరుద్ర గీతం “ప్రేమించి పెళ్లి చేసుకో…నీ మనసంతా హాయినింపుకో” లో ప్రేమవివాహానికి పెద్దపీట వేశారు దర్శకుడు. ఈ ధృక్పథంతోనే కాంచనను తన మేనకోడలని తెలియకుండానే ప్రేమించడానికి దారితీస్తుంది. వరుని వలపు, వధువు తలపు తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపినా, కట్నాలకోసం పాకులాడినా చివరకు యెడమోము పెడమోములే మిగుల్తాయని, పురాణాలలో కూడా ప్రేమపెళ్ళిళ్ళు జరిగాయని కృష్ణుడు-రుక్మిణి; దుష్యంతుడు-శకుంతల;నలుడు-దమయంతి ల ఉదంతం పాటలో జొప్పించడం సందర్భోచితంగా ఉంటుంది. ఆరుద్ర రాయగా అక్కినేని, రాజశ్రీలమీద చిత్రీకరించిన “ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ కోతలు కోశావులే…ఆమాటలు ఏమైనవి అహ అయ్యగారు ఓడారులే” పాటకు, అక్కినేని కాలేజిలో పాడే పాటకు అవినాభావ సంబంధముంది. రాజశ్రీ-అక్కినేనిల యుగళగీతం సినారె రాసిన “పరువము పొంగే వేళలో పరదాల వెందుకో…చెంగున లేచీ చేతులు సాచీ చెలియ నన్నందుకో” కూడా అద్భుతమే. ఇక అక్కినేని- కాంచన విషయానికొస్తే రామప్ప, పాకాల సరస్సు వద్ద చిత్రీకరించిన దాశరథి గీతం “ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలిప్రేమ దీపం వెలిగిందిలే” గురించి చెప్పాలి. శంకరాభరణ రాగస్వరాలతో అల్లిన ఈ పాట హిందీ సినిమా “తాజ్ మహల్” లో పహాడి రాగంలో రోషన్ స్వరపరచిన “జో వాదా కియా వో నిభానా పడేగా” పాటను గుర్తు చేస్తుంది. పహాడిరాగం కూడా శంకరాభరణ రాగజన్యం కావడం ఈ పోలికకు కారణం కావచ్చు. సినిమా మొత్తం మీద ఈపాట మకుటాయమానం. ఆరుద్ర విరచిత అక్కినేని-కాంచన డ్యూయట్ “రాననీ రాలేననీ ఊరకె అంటావు… రావాలనే ఆశలేనిదే యెందుకు వస్తావు” ఒక టీజింగ్ సాంగ్. నటభైరవి రాగంలో ఈ పాటను ఘంటసాల పాడినతీరు అద్భుతంగా వుంటుంది. కారులో మొదలై విడిది గృహంలో చిరుజల్లుల మధ్య ఒదిగే మహాకవి శ్రీశ్రీ గీతం “వలపులు విరిసిన పూవులే కురిపించే తేనియలే” మరో అద్భుతగీతం. ఇందులో “ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి“ అంటూ అక్కినేని ఆలపిస్తే, “నీ హృదయములో ఒదిగినచో బెదురింక యేమున్నది” అని కాంచన గోముగా జవాబివ్వడం మంచి ప్రయోగం. “దాశరథి గీతం “అందెను నేడే అందని జాబిల్లి…నా అందాలన్నీ ఆతని వెన్నెలలే” ఒక జాబిలిపాట. ఈ పాట చివర్లో అక్కినేని కారులోవచ్చి కాంచన సోయగాలు వీక్షించడం పాటకు కొస మెరుపు. “ముందటి వలె నాపై నెనరున్నదా సామి…ముచ్చటలిక నేలరా…మువ్వగోపాలా” అనే క్షేత్రయ్య పదానికి నర్తించిన రాజశ్రీ-కాంచన రాధాకృష్ణుల నృత్యం డా. సుమతీ కౌశల్ కూర్చిన కూచిపూడి నృత్యరీతులను అత్యద్భుతంగా ఆవిష్కరించింది. సుశీల ఆలపించిన విషాద గీతం “బ్రతుకే నేటితో బరువై పోయెలే…మదిలో ఆశలే మసిగా మారేలే” దాశరథి రచన. ఈ సినిమాలోని హిట్ పాటలే “ఆత్మగౌరవం” రిపీట్ రన్ లో కాసుల వర్షానికి కారణమయ్యాయి. ఈ సినిమాకు ముగ్గురు హీరోలు.. సాలూరి రాజేశ్వరరావు, విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావులు అనేది నిస్సందేహం.

మరిన్ని విశేషాలు: కళాతపస్వి విశ్వనాథ్ కు దర్శకునిగా “ఆత్మగౌరవం” మొదటి సినిమా. విశ్వనాథ్ పట్టభద్రుడయ్యాక తొలుత మద్రాసు వాహిని స్టూడియోలో ధ్వనిముద్రణ విభాగంలో రికార్దిస్టుగా చేరారు. వాహినీ స్టూడియోలో ప్రతి టెక్నీషియను కెమెరా ప్రొజెక్షన్, లేబరేటరీ వంటి అన్ని విభాగాలలో పనిచేయాలి అనే నిబంధన వుండేది. అలా ఆడియో విభాగంలో విశ్వనాథ్ యెన్నో చిత్రాలకు సౌండ్ రికార్దిస్టుగా పనిచేశారు. తర్వాత రామనాథ్ కు సహాయకుడిగా కూడా పనిచేశారు.

అన్నపూర్ణా వారి “తోడికోడళ్ళు” సినిమాకు సౌండ్ రికార్దిస్టుగా పనిచేస్తున్నప్పుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం యేర్పడింది. ఆ పరిచయంతోఅన్నపూర్ణా వారి “ఇద్దరు మిత్రులు”, “చదువుకున్న అమ్మాయిలు”, “డాక్టర్ చక్రవర్తి” చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేస్తునప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేనిల దృష్టిని ఆకర్షించడం జరిగింది. “మూగ మనసులు” చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడు విశ్వనాథే.

అలా అన్నపూర్ణా సంస్థలో “వెలుగునీడలు” చిత్రం నుంచి యెక్కువ సినిమాలకు సహకార దర్శకునిగా విశ్వనాథ్ పనిచేశారు. అన్నమాట ప్రకారం “డాక్టర్ చక్రవర్తి” సినిమా తర్వాత అన్నపూర్ణా సంస్థ “ఆత్మగౌరవం” సినిమాకు దర్శకత్వ పగ్గాలు విశ్వనాథ్ కు అప్పగించింది.

అప్పట్లో ఆకాశవాణి, హైదరాబాదులో ప్రొడ్యూసరు గా పనిచేస్తున్న గొల్లపూడి మారుతీరావు ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణితో కలిసి “ఆత్మగౌరవం” సినిమాకు కథను సమకూర్చారు. అంతకుముందు “చదువుకున్న అమ్మాయిలు” సినిమాకు సులోచనారాణి సినరియో రూపకల్పన లో సహకరించింది. ఈ సినిమా కథా చర్చలు ముఖ్యంగా హైదరాబాదు అబిడ్స్ తాజమహల్ హోటల్లోను, పబ్లిక్ గార్డెన్స్ లోను జరగడం విశేషం.

గొల్లపూడి మాత్రం చిత్రసీమకు ఈ సినిమాతోనే పరిచయమయ్యారు. సంభాషణలను భమిడిపాటి రాధాకృష్ణతో కలిసి మారుతీరావు రాశారు. సినేరియోను దుక్కిపాటి ఒక్కరే రూపొందించడం విశేషం.

Lఅన్నపూర్ణ సంస్థకు హీరాలాల్ నృత్యదర్శకుడుగా వుండేవారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలిరావడంతో, స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని ప్రముఖ నృత్య కళాకారిణి డా. సుమతీ కౌశల్ ను నృత్యదర్శకురాలిగా పరిచయం చేశారు. హీరాలాల్ ఆమెకు సహకరించారు. ఆరోజుల్లో డా. సుమతీ కౌశల్ ”నృత్యశిఖర డ్యాన్స్ స్కూల్” పేరుతో బాలబాలికలకు కూచిపూడి, భరత నాట్యం, ఒడిస్సీ నాట్యరీతుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తుండేది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తొలి మహిళా నృత్యదర్శకురాలు ఈమే!

ఈ సినిమాలో రాజశ్రీ, కాంచన నృత్యం చేసే క్షేత్రయ్య పదం “ముందటి వలె నాపై నెనరున్నదా సామి…ముచ్చటలిక నేలరా…మువ్వగోపాలా”కు సుమతీ కౌశల్ కూర్చిన కూచిపూడి నృత్యరీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆకాశవాణి నాటక విభాగంలో పనిచేసే ఛాయాదేవి చేత కామాక్షమ్మ పాత్రను, ప్రకటనల విభాగంలో వ్యాఖ్యాతగా వ్యవహరించే వెంపటి రాధాకృష్ణ చేత పురోహితుడు శాస్త్రి పాత్రను పోషింపజేసి స్థానిక కళాకారులను ప్రోత్సహించిన గౌరవం అన్నపూర్ణ సంస్థకే దక్కింది.

ఈ సినిమా అవుట్ డోర్ షూటింగు కోసం ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, లక్ష్మీపతి బ్రదర్స్ కు చెందిన బంగాళాతోబాటు వారి తోటను కూడా వినియోగించుకున్నారు. ఆంద్ర మహిళా సభ వారు సెట్స్ అలంకరణలో సహకరించారు.

ఈ సినిమాలో పాటలన్నిటిని రామప్ప దేవాలయ ప్రాంగణంలోను, దిండి ప్రాజెక్టు, పబ్లిక్ గార్డెన్ లోను స్థానికంగానే చిత్రీకరించారు.

1964లో “నంది” బహుమతులను ప్రవేశపెట్టిన తర్వాత 1966లో ”ఆత్మగౌరవం” చిత్రానికి కాంస్య నంది లభించగా, ఉత్తమ కథా రచనకు గొల్లపూడి మారుతీరావు, యద్దనపూడి సులోచనా రాణిలకు సంయుక్తంగా “నంది” బహుమతి లభించింది.
ఆచారం షణ్ముఖాచారి

Share via
Copy link
Powered by Social Snap