‘ఆత్మకూరు’ సృజనలకు దర్పణం ‘బహుముఖి’

ప్రతికాలంలోను ప్రతిభామూర్తులైన వారు సమకాలికులకు అంతగా బోధపడరు. ఎవరో ఒకరు గుర్తించి, ఎలుగెత్తి చాటిననాడే స్పురణకు వస్తుంది. “అవునుకదా!? అన్నట్లు…”
కవిచిత్రకారుడైన ఆత్మకూరు రామకృష్ణలోని బహుముఖీనమైన ప్రజ్ఞను కవిచిత్రకారుడైన కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు అత్యంత లోతైన పరిశోధనాత్మకంగా పరిశీలించి మనముందుంచారు. ఒక ప్రక్క చిత్రలేఖనం, ఇంకొక ప్రక్క కవిత్వం, మరోప్రక్క రచయితగా, విమర్శకుడిగా అనేక కళలను పండిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన పలు ప్రపంచరికార్డులను సాధించిన రామకృష్ణలోని కళాత్మకతను “బహుముఖి” పేరుతో పుస్తక రూపంలోకి తెచ్చి భావితరాలకు అందుబాటులో ఉంచారు.

గొప్ప సృజనశీలగా చిత్రలేఖనాన్ని, సాహిత్యాన్ని, ఆత్మీయస్పర్శగా మార్చి రసజ్ఞుల హృదయాల్లో స్థానం దక్కించుకున్న రసపిపాసిగా ఆత్మకూరు రామకృష్ణను అభివర్ణించిన ఉపోద్ధాత వ్యాసంలో కవిగా రామకృష్ణ భావుకతను, వర్ణాంచిత అంగుళీ విన్యాసంతో “ఫింగర్ పెయింటింగ్ మారథాన్”గా చిత్రకళారంగంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు సాధించిన వైనాన్ని; రామకృష్ణ నిరాడంబరతను వివరించారు. జీవనతరంగాలు వ్యాసం ద్వారా గీతగానిగా, రాతగానిగా రామకృష్ణ దినదినాభివద్ధిని చిత్రించారు.

‘కవిత్వం మీద కవిత్వమై కదిలిన కలం’ అంటూ రామకృష్ణ కవిత్వంలోని భావపటుత్వాన్ని, భాషాపటుత్వాన్ని వివరిస్తూ రామకృష్ణ రచనలైన ‘కలరవాలు, వికలకూజితం’అన్న కవితా సంపుటాలలోని కవితావేశాన్ని విపులంగా విశదీకరించారు. దుఃఖభాజితమైన కవితా వస్తువుల్ని తీసుకొని సమాజ గమనాన్ని, సమాజాన్ని నడిపిస్తూ తమ జీవితాలను దుఃఖమయం చేసిన పరిస్థితులను ఎదిరిస్తూ జీవితాల్ని గడుపుతున్న రైతుల, శ్రమజీవుల జీవన చిత్రాల్ని, ఆకలి డొక్కల కష్టాల్ని చిత్రికపట్టిన వైనాన్ని అక్షరీకరించారు. నిజమైన హృదయాన్ని కదిలించే కవిత్వపు మూలాల్ని వెలికితీసి విపులీకరించి ఆవిష్కరించిన కవి రామకృష్ణ అని అంటారు.
కావ్యోత్పత్తి హేతువులలో ప్రతిభ, అభ్యాసం ప్రధానమైనవి అని అలంకారికులు వివరించారు. ప్రతిభ వ్యుత్పత్తులు గల వ్యక్తి నిరంతర కావ్య రచనను అభ్యసిస్తూంటే రచనకు పరిణితి చేకూరుతుంది. “అనగననగ రాగమతిశయిల్లుచునుండు” అని పెద్దల అభిభాషణం. నిరంతరం కావ్యరచన చేస్తూండడం వలన భావ వ్యక్తీకరణంలో వైవిధ్యం ఏర్పడుతుంది. శైలి పరిపక్వత చెందుతుంది. అభ్యాసం అనేది మహాకవికైనా అవసరం. సహజంగా ప్రాప్తించిన ప్రతిభ, నిర్దుష్టమైన పాండిత్యం, నిరంతర అభ్యాసం ఉండడం వలన రామకృష్ణ కవిత్వం వైవిద్యభరితమైన ఆలోచనలకు అద్దం పడుతుంది. అటువంటి వైవిద్యభరితమైన ఆత్మకూరు కవిత్వాన్ని గురించి వెంకటేశ్వర రెడ్డి గారు వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. విరిగిన ఓడ, మరోప్రపంచం, కరగని స్నేహం, నీవు ఎరుగని నేను, జాబుకు జవాబు, అవకాశవాది వంటి కవితల్ని విశదీకరించిన వైనం చూస్తే రామకృష్ణ కవిత్వాన్ని ఆసాంతం అవపోశన పట్టాలి అన్నంత ఆకాంక్ష పాఠకునిలో కలుగుతుంది.

‘అంధీరాత్‌’గా హిందీలోకి అనువదించబడిన 18 చాప్టర్ల ‘తుపాను రాత్రి’ దీర్ఘకవిత గురించి సుదీర్ఘంగానే వివరించారు. 8 సంవత్సరాల బాలుని మనోఫలకంపై చెరగని ముద్రవేసిన విధానాన్ని గురించి తెలుసుకోవాలంటే ‘తుపాను రాత్రి’ చదవాల్సిందేనంటారు. రామకృష్ణ మరో దీర్ఘకవిత ‘అవ్యక్తం’. నాన్న గురించిన జ్ఞాపకాల్ని ఇందులో కవితామయం చేసి స్మతికావ్యంగా మలిచారు. విస్తతించిన కవి ప్రతిభను మనముందుంచడంలో వెంకటేశ్వర రెడ్డి గారి కలానికున్న గొప్పతనం తెలుస్తుంది.

చిత్రకళమీద అభిరుచితో చిత్రకళను అభ్యసించి, చిత్రకళలో బెనారసు హిందు విశ్వవిద్యాలయం నుండి పి.జి పట్టాను పొంది, కేంద్రీయ విద్యాలయంలో చిత్రకళాధ్యాపకునిగా 28 ఏళ్ళుగా రాణిస్తున్న రామకృష్ణ మనోఫలకంపై వెల్లువెత్తిన భావాలను తన చేతివేళ్లతో చిత్రించి సమాజానికందించి తిరుగులేని చిత్రకారునిగా ఘనకీర్తిని పొందుతున్న వైనాన్ని “చితక్రళావైదగ్ధ్యం చివురులెత్తించిన రామకృష్ణ” అనే వ్యాసం ద్వారా చిత్రిక పట్టారు. గీతల్లో అభౌతిక మాధుర్యాన్ని రంగుల్లో రసతత్వాన్ని రంగరించి ఆలోచనలను అనంతాన్వేషణ దిశకు మళ్లించిన “సారూప్య” చిత్రకారునిగా రామకృష్ణను అభివర్ణిస్తారు. కవి కల్పనలకు చిత్రంతో రూపం ఇచ్చే కళను పుణికిపుచ్చుకున్న రామకృష్ణ ధన్యులు. భావిభారత విద్యార్థులకు, వారిని తీర్చిదిద్దే పెద్దలకు ఉపయోగపడాలనే తలంపుతో “హస్తలేఖనం ఓ కళ” అనే పుస్తకాన్ని తీసుకురావడం రామకృష్ణలోని తృష్ణకు తార్కాణం.

చలువ వెన్నెలల తెలుపునకు సౌరభమబ్బినట్లు ప్రతిభకు పాండిత్యం తోడవడం వలన చక్కని కవిత్వాన్ని, చూపు మరల్చలేని చిత్రాలను లోకానికందిస్తూ, చిత్రకారునిగా, రచయితగా, కవిగా, సంపాదకునిగా, సమీక్షకునిగా తన దైన శైలిలో బహుముఖీన ప్రజ్ఞాశాలిగా ఘనకీర్తిని పొందుతున్న ఆత్మకూరు రామకృష్ణ జీవన చిత్రాన్ని అక్షరీకరించిన కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, చక్కని పుస్తకాన్ని ప్రచురించిన మయన్ ఆర్ట్ స్టూడియోస్, విజయవాడ వారికి అభినందనలు.

సమీక్షకులు: సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు

ప్రతులకు: 94930 01948

Share via
Copy link
Powered by Social Snap