‘సంగీత మపి సాహిత్యం
సరస్వత్యాః స్తన ద్వయం ఏకమాపాత మధురమన్యదాలోచనామృతమ్’ అని అంటారు పెద్దలు. సంగీతానికీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం. లయబద్ధంగా వున్న కవిత్వంలో సంగీతం ఉంటుంది. సాహిత్యం లేకుండా సంగీతం ఉండదు. అలాగే కవిత్వానికీ, చిత్రకళకూ విడదీయరాని సంబంధం. మంచి కవి తన కవిత్వంలో చక్కని పదబంధాలతో తాను చెప్పదలుచుకున్న దాన్ని బొమ్మ కట్టిస్తాడు. అలాగే మంచి చిత్రంలో కవిత్వం ఉంటుంది. మనదేశంలో, రాష్ట్రంలో కవులుగా చిత్రకారులుగా రాణించినవారు చాలామంది ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిగా చిత్రకారుడుగా ప్రసిద్ధులు. ఎస్.వి. రామారావు గారు, సంజీవదేవ్ గారు, మాకినీడి సూర్యభాస్కర్ గారు, ఎల్.ఆర్ వెంకటరమణ గారు, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కవులుగా, చిత్రకారులుగా ప్రసిద్ధులు. ఆ కోవకు చెందినవారు ఆత్మకూరు రామకృష్ణ గారు. వీరు చిత్రకళా రంగంలో ప్రసిద్ధులు. అలాగే ఎన్నో కవితా సంపుటాలు రచించారు. వారి గురించి వివరాలు తెలుసుకోవడానికి విజయవాడలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళదాము పదండి.
ప్ర. మీరు ఫింగర్ పెయింటరుగా ప్రసిద్ధి పొందారు కదా. దానిని గురించి వివరించండి?
జ. 1993 నాటికి చేతివేళ్ళనే కుంచెలుగా చేసుకుని పూర్తి చిత్రాన్ని చిత్రీకరించే వారిలో నేనొకడిని. అప్పటికి ప్రపంచం పోకడేమిటో తెలిసేదికాదు. అదే అరుదైన విషయమనుకుంటే, దానిని మించిన అనితరమైన విషయాన్ని ఆలోచించాను. చేతివేళ్ళ చిత్రణ ద్వారా ప్రపంచ రికార్డులను నెలకొల్పి ప్రపంచంలోనే ఒకేఒక్కడుగా చరిత్ర సృష్టించాలని అనుకున్నాను.
2010 – మే 20వ తేదీన బెంగుళూరు ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు క్యాంపస్’లోని కేంద్రీయ విద్యాలయాన్ని వేదికగా చేసుకుని 100 తైలవర్ణ చిత్రాలను క్యాన్వాసులపై కేవలం చేతివేళ్ళతో 13 గంటల 26 నిమిషాలలో చిత్రించి ఓ నూతన ప్రపంచ రికార్డును సృష్టించి, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌ను అందుకున్నారు.
‘‘Fastest Time to Paint 100 Land Scape Paintings – 806 Minutes’’ అని URDB యూనివర్‌సల్ రికార్డును USA ఇవ్వగా Most Finger Painting Marathon అంటూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఎవరెస్ట్ వరల్డు రికార్డ్, స్టేట్‌బుక్ ఆఫ్ రికార్డ్ (ఏకవీర) లాంటి దాదాపు పదిహేను ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వరల్డు రికార్డ్ సంస్థల నుండి గుర్తింపు పత్రాలను, పతకాలను అందుకున్నారు.
చిత్రకారులు మాష్టర్ మీడియంగా పరిగణించే తైలవర్ణాలను ‘ఫింగర్ పెయింటింగు’గా వాడవచ్చునన్న సత్యాన్ని ప్రపంచానికి చాటాను. అన్వేషకునిగా దూరదర్శన్ గుర్తించి, ఓ లఘుచిత్రాన్ని చిత్రించి ప్రసారం చేయడం జరిగింది.
ప్ర. యూట్యూబురుగా మీరు సాధించిన విజయాలు ?
జ. యూట్యూబ్ ద్వారా ప్రపంచ రికార్డు: 2009లో ప్రారంభించిన నా ఛానల్ ఆత్మకూరు రామకృష్ణ ఆర్టిస్టు కు 2021లో గుర్తింపు లభించింది. కరోనా కష్టకాలంలో కలిసొచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో… 12 సంవత్సరాల క్రితం ‘ఫింగర్ పెయింటింగ్ మారథాన్’ కొరకు సింగిల్ టేక్‌లో షూట్ చేసిన వీడియో ఫూటేజీని 100 ఎపిసోడ్స్‌గా ఎడిట్‌చేసి 2021 జనవరి 1వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేది వరకు; రోజుకొకటి చొప్పున 100 రోజులు; భారతీయ కాలమానం ప్రకారం ఉదయాన్నే 5:30 నిమిషాలకు క్రమం తప్పకుండా ప్రసారం చేయటం జరిగింది.
“Shortest shot of Hand Painting in the Highest number of YouTube Episodes ever. అన్న ప్రసంశను ‘మిరాకిల్స్ వరల్డ్ రికార్డు’ నుండి అందుకున్నాను.
యూట్యూబరుగా మరో ప్రపంచ రికార్డు: అత్యధిక ఫింగర్ పెయింటింగులను అప్ లోడు చేసిన ఆర్టిస్టుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గుర్తించింది.
ప్ర. మీరు ప్రధానంగా చిత్రకళ అధ్యాపకులు కదా. మీ రంగంలో మీ అనుభవాలు ఏమిటి?
జ. చిత్రకళ అధ్యాపకులుగా చిత్రకళను బోధించటమేమనన్న భ్రమలో ఉద్యోగాల్లో చేరాం. జీవితమంతా కళగా బ్రతికేద్దాం అనుకున్నాం. అందుకు భిన్నంగా ఉంది పరిస్తితి. స్కౌట్ మాష్టర్ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ లు(ఇంటెల్, మైక్రోసాఫ్ట్), అవేకన్ సిటిజన్ పోగ్రామ్ (రామకృష్ణ మిషన్)… ఇలా ఎన్నో.
పిల్లలను వివిధ కాంపిటీషనులకు సిద్ధం చేయటం, ఎస్కార్టు చేయటం… ప్రయాణాలు… కవిత్వం ఆదారుల్లో పుట్టిందే… బస్సు, రైళ్ల టికెట్ల వెనుక రాసుకున్న ఉద్వేగాలే ఆ తరువాత కాలంలో కవిత్వాలయ్యాయి.
నా విద్యార్థులు కళాభిరుచి కలిగిన ఉత్తమ పౌరులయ్యారు. ప్రధాని నుండి ఆవార్డు అందుకున్నవారు ఉన్నారు.
పిల్లలకోసం స్కూలు గోడలపై దృశ్యకళ.. చిత్రాలతోపాటు, గణితం, సామాన్య శాస్త్రం అవగాహనకొచ్చేలా ప్రామాణిక చిత్రాలు వేసాను. వివిధ ప్రముఖుల ముఖచిత్రాలను చిత్రించి.. స్కూలు గోడలపై అలంకరించాను.
చిత్రకళ అధ్యాపకులకు రిసోర్సు పర్సనుగా వ్యవహరించాను. విద్యార్థులకు క్యాంపులు నిర్వహించాను. కేంద్రీయ విద్యాలయ రీజనల్ లెవల్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవటం జరిగింది -2013.
ప్ర. చిత్రకారునిగా వుంటూ కవిత్వంవైపు ఎలా వచ్చారు?. కవిత్వం రాయాలనే భావం మీకెందుకనిపించింది?
జ. ఒకటి దృశ్యకావ్యం, మరొకటి శబ్దచిత్రం. మాటలు మౌనంవహిస్తే చిత్రం శబ్దమై ధ్వనిస్తుంది. ఈ రెండు తీసుకునే స్పేస్‌లు ఒకటికాదు. అక్షరం సూటిగా ఆలోచింపచేస్తుంది. గీతలు అలాకాదు… తమదైన ఆలోచనలను అవలోకింపజేస్తాయి.
కళాకారుడనేవాడు కాగితంపై కలం పెడితే కవిత్వం, రంగు పెడితే చిత్రం అవుతాయి. ప్రకటించే విధానంలోనే ఒక చిన్నమార్పు. ఆ చిన్న మార్పును నేను గొప్పగా ఆహ్వానించాను. అనుకున్నప్పుడల్లా బొమ్మలు వేయలేము; కవిత్వమూ వ్రాయలేము. ఏది వీలయినప్పుడు అది చేసుకు పోవటమే!
శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు చినుకు మాసపత్రిక ద్వారా కవి-చిత్రకారులను పరిచయంచేసేందుకు వ్యాస పరంపరను సృష్టిస్తున్న క్రమంలో… కవుల్లో చిత్రకారులను; చిత్రకారుల్లో కవులను అన్వేషిస్తూ ఓ రోజు నాకు ఒక ‘ఎస్.యం.ఎస్’ పంపారు. “మీరు కవులా?”అని.
నా కవిత్వాన్ని వారికి పంపాను. “ఒకటి, రెండు సంపుటాలు అచ్చయిన బాగుండు, మీపై వ్యాసం రాయడానికి”అన్నారు. నా కవిత్వాన్ని పుస్తకంగా తెచ్చే ప్రయత్నం చేసాను. కలరవాలు- తొలివేకువ సవ్వడి-(2013). నేటివరకు 5 కవితా సంపుటాలను అచ్చువేయగలిగాను. అందులో రెండు దీర్ఘకావ్యాలు.
‘కవి-చిత్రకారుడు’ అన్న ప్రశంస శ్రీ మాకినీడి సూరన్న మెమోరియల్ ట్రస్ట్, కాకినాడ- 2014లో అందుకున్నాను.
ప్ర. మీరు రాసిన ‘తుఫానురాత్రి నేపధ్యం గురించి?
జ. మలిప్రయత్నంలో ‘తుఫాను రాత్రి’ దీర్ఘ కవితను 2014లో ఆవిష్కరించాను. తుఫాను గురించి వ్రాసుకున్నప్పుడు ప్రకృతి విలయానికి విలవిల్లాడిన ప్రాణుల్లో ప్రాణిలా ధీనుణ్నై వ్రాసుకున్నాను.
నా రెండవ సంపుటి వచ్చేసరికి, కవితానిర్వహణ పూర్తిగా మారిపోయింది. కవితాఖండికల స్థానే ఒక దీర్ఘ కవితగా వచ్చింది. వస్తువు ఒక తుఫాను రాత్రి ఎనిమిదేళ్ళ పిల్లాడి మనసులో రేపిన భయకంపిత కలవరం. నలభై అయిదేళ్ళ వయసులో ‘తుఫాను రాత్రి’ అనుభవాలను దీర్ఘకవితగా మలచి, తుఫానుల్లో చిక్కి అవస్థలు పడ్డ ప్రాణుల ‘ఆత్మ’లకు అంకితమిచ్చాను.
ప్ర. మీ నాన్న గారి గురించి రాసిన అవ్యక్తం గురించి?
జ. అవ్యక్తం- తిరిగిరాని బంధంకోసం… బాధ్యతల నిర్వహణలో క్లేశాలను, సుఖదుఃఖాల్లో దుఃఖాన్ని నేనంటే నేనంటూ… భుజానికెత్తుకునే ఓ పెద్దదిక్కు(తండ్రి) ఆ ఇంటిలో..! ఇక లేడు అన్నప్పుడు ఆ వ్యథ వర్ణనాతీతం. ఈ సమస్య నాకూ ఎదురయింది. చిగురుటాకులా వణికాను. ఆయనతో వేసిన ప్రతి అడుగు ఓ అనుభవంలా మదిని ముద్రించిన పేజీలు కొల్లలు. అందుండి నేను వ్యక్తపరచగలిగిన, వ్యక్తపరచలేని అవ్యక్తానుభవాలకు అక్షర రూపమే నా దీర్ఘకవిత – అవ్యక్తం (2016). ఇది నా నాల్గవ కావ్యం.

ప్ర. మీరు చేతివ్రాత గురించి ఓ పుస్తకం రాసారు. వివరించి తెలపండి?
జ. హస్తలేఖనం ఓ కళ: విశాలాక్షి మాస పత్రిక, 64 కళలు డాట్ కామ్ వెబ్ మాగజైన్‌లలో కాలమిస్టుగా చేతివ్రాతపై నేను వ్రాసిన వ్యాసాలు 12 అధ్యాయాల్లో 112 ఉపశీర్షికలతో సచిత్రంగా వివరించిన ఆంగ్లాక్షర లేఖనా శాస్త్రం.
చక్కని చేతివ్రాత నేర్వడానికి మెళకువల సర్వస్వంగా ‘హస్తలేఖనం ఓ కళ’అన్న పుస్తకాన్ని సచిత్రంగా రూపొందించాను. ప్రతి స్కూలులోను, ఉపాధ్యాయుల చేతుల్లోను, ప్రతి ఇంటిలోను, దస్తూరీని నేర్పే వారికి హ్యాండ్ బుక్కుగా ఉండదగిన పుస్తకం.
ప్ర. మీరు కవే కాకుండా, ఎందరో కవుల కావ్యాలకు ముందు మాటలు రాసారు గదా! వాటి గురించి వివరించండి.
జ. తొలినుడుల గుది: ఎనిమిది మంది రచయితల 15 పుస్తకాలకు వ్రాసిన ముందుమాటలను గుది గుచ్చిన సంపుటం -2022. అందులో 8 పుస్తకాలకు ముఖచిత్రాలు నేను చిత్రించినవే కావటం మరోవిశేషం!
మోనోగ్రాఫులకు సంపాదకత్వం: కళాసాహిత్య రచనా ప్రస్థానంలో కళకోసం, కళాకారులకోసం ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎల్లా సుబ్బారావుగారి చిత్రకళ- జీవిత విశేషాలను సచిత్రంగా, సమగ్రంగా గ్రంథస్తం చేసేందుకు సంపాదకుని బాధ్యతలు నిర్వహించి ‘సువర్ణ తూలిక’ – 2017, అలాగే ‘ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు-కీ.శే. వరదా వెంకటరత్నం’-2025 లో వెలువరించటం జరిగింది.
నాపై వచ్చిన గ్రంథాలు: శతాధిక గ్రంథ కర్త శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ గారు తన “చిరుగ్రంథ కానుక మరుగంధ మాలిక”అన్న శీర్షికన వెలువరించిన 12వ గ్రంథంగా ‘ఆత్మకూర్పు రామకృష్ణ’ – 2021లోను, ప్రపంచీకరణ యుగకర్షక కవి శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఆత్మకూరు రామకృష్ణ ‘బహుముఖి’ సృజనకు పలురెక్కలు తొడిగిన పిడుగు – 2025 లోను ప్రచురించారు.
ప్ర. మీ బాల్యం, మరచి పోలేని సంఘటనలు?
జ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామంలోని ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు శ్రీ ఆత్మకూరు రమణయ్య, శ్రీమతి రత్నమ్మ గార్లు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు మగపిల్లలం. నేను ప్రధముడను. బొమ్మలు గీయటం బాల్యం నుండే అలవాటయింది. ఊరిచుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి చిత్రలేఖనాభిలాషకు గురువయింది.
నా చిన్నతనంలో మాటలు ఆలస్యంగా వచ్చాయట. నాలుక మందమని సంస్కృతం నేర్పితే ఉచ్చారణ బాగుంటుందని ఒక శాస్త్రీయ ఆలోచనతో ఒక తెలుగు పండితుడిని ఇంటికి పంపారు. కానీ, ఆ శిక్షణ నేను ఊహించినంత గొప్పగా ఏమీ సాగలేదు, అంతా శూన్యం!
ఆ పంతులుగారు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి, వాలు కుర్చీలో అలా వాలేవారు. నన్ను చదవమనేవారు. నేను అమరకోశంలోని మొదటి పేజీ తీసి, ‘యశ్యజ్ఞానా దయాసింధో…’ అని చదవడం మొదలుపెట్టడమే ఆలస్యం… ఆ శ్లోకం ఆయనకు జోలపాటలా మారి నిద్రకు ఉపక్రమించేవారు! అలా ఆ పుస్తకంలో మొదటి పేజీకి మించి ముందుకు సాగలేదు.
ప్ర. మీ విద్యార్హతలు, మీ కుటుంబం గురించి…
జ. ప్రాథమిక విద్య గ్రామ పంచాయితీ పాఠశాలలోను, ఉన్నత విద్య 1984 సం॥ ఉన్న ఊరిలోనే ఉన్న శ్రీ మాగుంట కోటారెడ్డి హైస్కూలు నుండి 10వ తరగతి ప్రధమశ్రేణిలో పూర్తి చేసాను. 1987 సం॥ శ్రీ వెంకటగిరి రాజా కళాశాలలో ఇంటరు (యం.పి.సి)ని ఇంగ్లీషు మాధ్యమంలో పూర్తిచేసాను. 1988-1994 సం॥ల మధ్య హైదరాబాద్ జె.ఎన్.టి.యు ఫైన్ ఆర్ట్సు కళాశాలలో బి.ఎఫ్.ఏ. డిగ్రీని యూనివర్శిటీ బంగారు పతకంతో సాధించాను. అప్పటి గవర్నర్ మాన్యశ్రీ కృష్ణకాంత్‌గారి చేతుల మీదుగా అందుకొన్నాను.
1996 బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ నుండి 2 సంవత్సరాల మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాష్టర్స్ డిగ్రీని అందుకొన్నాను.
1999 లో స్వాతితో వివాహం. కుమార్తె వైష్ణవి. MCA., కుమారుడు హరికేష్ B.Tech.

ప్ర. మీ వృత్తి వివరాలు, ఉద్యోగంలో సాధించిన విజయాలు?
జ. 1997లో4 నెలల పాటు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్సులో లెక్చరర్ గా ప్రవేటు ఉద్యోగిగా మొదలయిన నా ప్రస్థానం, అదే సంవత్సరం కేంద్రీయ విద్యాలయం విజయవాడలో చిత్రకళ అధ్యాపకునిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. 2001 నుండి 2010 వరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు క్యాంపస్‌లోని కేంద్రీయ విద్యాలయం- బెంగుళూరు, 2010 జూన్ నుండి కేంద్రీయ విద్యాలయం-2, విజయవాడలో చిత్రకళ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తు వస్తున్నాను. 29 ఏళ్ళ ఉపాధ్యాయనిగా నాకున్న అనుభవం. 2008 నుండి అడ్వాన్స్ స్కౌట్ మాస్టరుగా విద్యార్థులకు శిక్షణ నిస్తున్నాను. 2012 – రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కేంద్రీయ విద్యాలయ సంఘఠన్, హైదరాబాద్ రీజియన్ నుండి అందుకొన్నాను.

ప్ర. ఆయారంగాలలో మీరు పొందిన అవార్డులు.
జ. చిత్రకారునిగా… ఇప్పటివరకు 12 వ్యక్తిగత, 15 సామూహిక చిత్రకళాప్రదర్శనలను, 15కి పైగా కార్యశాలల్లోను, 15 ప్రత్యక్ష చిత్రణ ప్రదర్శనలను ఇచ్చి కళా విమర్శకుల ప్రశంసలను అందుకున్నాను. టివి ఛానళ్ళు ప్రసారం చేసాయి. నా చిత్రాలను పలు ప్రముఖ పత్రికల, పుస్తకాలు ముఖచిత్రాలుగా ముద్రించాయి.
1993 -పాపులేషన్ కంట్రోలు బోర్డు నుండి టి.ఎస్. మెహతా జాతీయ అవార్డును,
1994 -ఎక్సలెన్స్ ఇన్ ఆర్ట్ పురస్కారాన్ని కేమెల్ ఆర్ట్ మెటీరియల్ లిమిటెడ్ సంస్థ నుండి అందుకున్నాను.
1997 -5వ అంతర్జాతీయ ప్రింటిగ్ మరియు అలయిడ్ మిషన్‌రి ప్రదర్శనలో నా చిత్రం ముఖచిత్రంగా అచ్చయిన ‘సత్యం కంప్యూటర్స్’ డైరీ అంతర్జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతిని సాధించగా, వారి ప్రశంసలను అందుకున్నాను.
2012- ‘స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూలు’ నుండి ‘కళారత్న’ అవార్డును, కోనసీమ చిత్రకళా పరిషత్ నుండి వైజయంతి పురస్కారాన్ని, దామెర్ల రామారావు అవార్డును అందుకొన్నాను. జయహో భారతీయం-తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ‘తెలుగు రత్నం’అన్న బిరుదును ప్రదానం చేసారు-2023.
2019 – భగీరథి ఆర్టు ఫౌండేషన్ మరియు ఆచార్య మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్టు అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ చిత్రకారునిగా, ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని అందుకొన్నాను.
ఆచార్య రాజాజీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ‘చిత్రరచన కళాసేతు’అన్న బిరుదు పత్రాన్నిచ్చి సన్మానించింది.
సంస్కార భారతి, గోదావరి టాలెంట్ టెస్ట్ వారు గురుపూజోత్సవం సందర్భంగా సత్కరించారు. ‘విశాలాక్షి సాహిత్య’ మాసపత్రిక వివిధ రచనా ప్రక్రియలలో కృషి చేసిన వారికి అందించే పురస్కారాన్ని ‘వర్ణాంచిత అంగుళీ విన్యాసం’కు -2025 లో ఇచ్చి సత్కరించింది.
‘ప్రపంచ ఫింగర్ పెయింటర్స్ డే’: 2010 – మే 20వ తేదీ నా చిత్రకళ జీవితంలో అత్యంత ముఖ్యమైన దినం. 100 తైలవర్ణ చిత్రాలను కేవలం చేతివేళ్ళతో స్టెచ్డు క్యాన్వాసుపై(12X18 ఇంచుల) 13 గంటల 26 నిమిషాల్లో చిత్రించి ఓ నూతన ప్రపంచ రికార్డును సృష్టించిన సుదినం. అందుచేత మే 20ని ‘ప్రపంచ ఫింగర్ పెయింటర్స్ డే’గా ప్రకటించటం జరిగింది. ఇందుకు మీ అందరీ మద్దతు కోరుతున్నాను.
ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)
