(హైదరాబాద్, రవీంద్రభారతిలో పి.సుశీల గారికి వెండి కిరీటం పౌర సన్మానం)
భారతదేశం గర్వించదగిన మేటి గాయనీ మణులు ముగ్గురే ముగ్గురు అని, వారిలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారికి, దీదీ లతా మంగేష్కర్ గారికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘భారత రత్న’ పురస్కారాలు లభించాయని, సుశీలమ్మకు వస్తే సంపూర్ణత చేకూరుతుంది, జనం హర్షిస్తారని నేను ప్రకటించగానే… కిక్కిరిసిన రవీంద్రభారతి ప్రేక్షకులు ఆమోదం తెలియచేస్తూ గౌరవంగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో హోరెత్తించారు!
వెంటనే మైక్ తీసుకున్న సుశీల గారు స్పందిస్తూ…భారతరత్న పై తనకు ప్రేమ లేదని, వచ్చినప్పుడు కాదనలేనని, కానీ అంతకు మించి జన హృదయాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి వున్నానని, ఇంతకు మించి తనకేం కావాలని, ఈ జన్మకిది చాలు అన్నారు. మీరు చెప్పిన మొదటి పాయింట్ ను నేను అంగీకరిస్తా, అందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. తనకు పాటలే ప్రపంచం, అంతకు మించి ఏమీ తెలియదని చెప్పుకున్నారు. గోదారి గట్టుంది, ఆకులో ఆకునై, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలు ఉత్సాహంగా పాడి అలరించారు. ప్రత్యేకంగా నవరస గాయని ఆమని, చంద్రతేజ, వి.కె.దుర్గ, సుభాష్, శ్రీనివాస్ లతో తనకు ఇష్టమైన కొన్ని పాటలు పాడించుకుని ప్రోత్సహించారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సీల్ వెల్ కార్పొరేషన్, తిరుమల బ్యాంక్, స్టాంజా సంస్థల సౌజన్యంతో శృతిలయ ఆర్ట్స్, ఆర్.ఆర్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం(18-05-22) హైదరాబాద్, రవీంద్రభారతిలో పి.సుశీల గారికి వెండి కిరీటం, కాంశ్య నంది జ్ఞాపిక తో పౌర సన్మానం ఘనంగా జరిగింది. “88 ఏళ్ళ సుశీల…70 ఏళ్ళ ఆమె పాటకు వందనం అభివందనం” పేరిట సుశీలమ్మ పాట ప్లాటినం జూబ్లీ వేడుక అంగ రంగ వైభవంగా నిర్వహించారు.
ముఖ్యఅతిధిగా విచ్చేసిన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సినీ సంగీతంలో 70 ఏళ్ళ పాటు కొనసాగడం అసామాన్యం అని, ఆ ఘనత సుశీలమ్మ సొంతం అని కొనియాడారు. సుశీలగారు పాడిన ఆకులో ఆకునై పాట తనకెంతో ఇష్టమని, చాలా సార్లు విన్నానని గుర్తు చేశారు. లాలీ లాలీ పాట చాలా సార్లు పాడినట్లు చెప్పుకున్నారు. సుశీలమ్మ గాయనిగా రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణమని, వారితో కలసి తెలంగాణ ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పాట పాడాలనే కోరిక ఉందని చెప్పి ఆమెతో కలసి ఆ పాట ఆలపించడంతో ఆడిటోరియం పులకించిపోయింది.
సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు స్వాగతోపన్యాసం చేశారు. తిరుమల బ్యాంక్ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ అధ్యక్షత వహించిన ఈ సభ లో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్, స్టాంజా అధినేత నీరజ్ లఖోటియా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, డాక్టర్ మహ్మద్ రఫీ, తెలంగాణ శోభన్ బాబు అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు, జితేందర్, పవన్ కుమార్, తాటికొండ పట్టాభి, డాక్టర్ వంశీ రామరాజు, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. పి.ఎం.కె.గాంధీ, ఎ.తులసీరామ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శ్రీమతి ఆమని పర్యవేక్షించారు.
- డాక్టర్ మహ్మద్ రఫీ