చిత్రకళకు ‘సంస్కృతి’ ఆలవాలం

బొమ్మారెడ్డి అప్పిరెడ్డిగారు కృష్ణాజిల్లా పామర్రులో పుట్టారు. మొదట్లో కొన్నాళ్ళు జిల్లా పరిషత్ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచరుగా పనిచేసాక 1963 లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో చేరారు. మూడున్నరదశాబ్దాలకు పైగా కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు విస్తృత ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ పాఠశాలల్లో పిల్లల్తో బొమ్మలు వేయించడమే కాక, ఆ బొమ్మల్ని జపాన్, కొరియా, హంగరీ, ఫిలిప్పైన్స్, అర్జెంటినా, ఫిన్లాండ్, పోలాండ్ లాంటి దేశాల్లో జరిగే ప్రపంచ చిత్రకళాపోటీలకు పంపడం మొదలుపెట్టారు. ఆ బొమ్మలకి బహుమతులు రావడం మొదలయ్యింది. సోవియెట్ లాండ్ నెహ్రూ అవార్డులు పదహారుదాకా ఆ పిల్లలు సంపాదించుకోగలిగారు.

కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడే 1982 లో ఆయన ‘యంగ్ ఎన్వాయ్స్ ఇంటర్నేషనల్’ స్థాపించారు. ఆ సంస్థ ద్వారా చేపట్టిన కృషి ప్రపంచబాలచిత్రకళా పటం మీద భారతదేశానికి చెప్పుకోదగ్గ స్థానాన్ని సముపార్జించింది. ఆ తర్వాత 1992 లో సంస్కృతి పాఠశాల మొదలుపెట్టారు. అప్పట్లో హైదర్ గూడ చిన్న గ్రామం. అక్కడ ఒక ఇంటిమేడమీద ఆయన మొదలుపెట్టిన పాఠశాల చాలాఎళ్ళ పాటు రోజూ సాయంకాలాలపాటు నడిచేది. ఒకదశలో వందమందికి పైగా విద్యార్థులు అక్కడకి ప్రతిసాయంకాలం చేరుకునేవారు. వాళ్ళల్లో చాలమంది ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, డిజైన్ వంటి రంగాల్లో ఉన్నతవిద్యావంతులయ్యారు. బరోడా, శాంతినికేతన్ లదాకా వెళ్ళి చదువుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.

పిల్లల బొమ్మల్ని పోటీలకు పంపడమే కాకుండా ప్రపంచ చిత్రకళా ప్రదర్శనలకు పిల్లల ప్రతినిధి బృందాల్ని తీసుకువెళ్ళడం కూడా సంస్కృతి పాఠశాల మొదలుపెట్టింది. రెడ్డిగారి అమ్మాయి పద్మారెడ్డి కూడా చిత్రలేఖకులు. ఆమె పిల్లల ప్రతినిధి బృందాల్ని ఇప్పటిదాకా మూడు సార్లు ప్రపంచబాల చిత్రకళా ప్రదర్శనలకు తీసుకువెళ్ళారు. లిడిస్ మెమోరియల్ కి చెందిన క్రిస్టల్ పాలెట్ అవార్డు పొందడం పిల్లలకి ఒక కల. దాన్ని కూడా సంస్కృతి పాఠశాల విద్యార్థులు సాధించారు. ఈ పాఠశాలకు చెందిన పధ్నాలుగు మంది విద్యార్థులకి సి.సీ.అర్.టి. స్కాలర్ షిప్పులు దొరికాయి. ఆ పిల్లలకి ఇరవయ్యేళ్ళ వయసొచ్చేదాకా భారతప్రభుత్వం నుంచి ఆ స్కాలర్ షిప్పులు అందుతుంటాయి.

పిల్లలు గీస్తున్న బొమ్మల్ని, సంస్కృతి పాఠశాల ప్రయత్నాల్నీ నలుగురికీ తెలియచేసే ఉద్దేశ్యంతో రెడ్డిగారు ఆర్ట్ డ్రైవ్ అనే పత్రిక కూడా వెలువరిస్తూ ఉన్నారు. ఇప్పటికి ముప్ఫై ఏళ్ళుగా ఆ పత్రిక నిరాఘాటంగా వెలువడుతూనే ఉంది. ఇన్నేళ్ళుగా ఒక కళా పత్రిక నడపడం ఒక రెడ్డి గారికే సాధ్యం.

ఒక్కమాటలో చెప్పాలంటే అది ఒక బొమ్మలతోట.

ఈ ప్రయత్నాలనీ ఉచితంగా, పిల్లలనుంచి ఒక పైసా కూడా ఫీజు వసూలు చెయ్యకుండా, కేవలం ఇష్టంతో, ప్రేమతో, చిత్రకళ పట్ల ఆరాధనతో చేస్తూ ఉన్నవి. ఆ పాఠశాలను సందర్శించని చిత్రకారుడు లేడు. ఆ పిల్లని అభినందించని పురప్రముఖుడు లేడు. కానీ అది చాలదు. అటువంటి పాఠశాలలు మరికొన్ని రావాలనీ, కనీసం జిల్లాకొకటేనా గ్రామీణ విద్యార్థులకోసం అటువంటి దీపాలు వెల్గించేవారుండాలనీ నేను కోరుకోడం అత్యాశ కాదనుకుంటాను.

వాడ్రేవు చినవీరభద్రుడు 

SA: