చిట్టి చేతులతో చిత్రాలు గీయిస్తున్న చిత్రకారుడు

చిన్నారి చిట్టి చేతులకు చిత్రకళలో ఓనమాలు దిద్ది, రంగులు అద్దేందుకు అలు పెరుగని ఉత్సాహంతో అహర్నిశలు శ్రమిస్తున్న చిత్రకారుడు, బాలల బంధువు బొమ్మారెడ్డి అప్పిరెడ్డి. వందలాది అవార్డులు, వేలాది ప్రతిభా సర్టిఫికెట్లు, అసంఖ్యాక కళాభిమానుల అభినందనలు అందుకున్న వీరు కళాజగతిలో ఎన్నెన్నో చమక్కలు మెరిపించారు. ఒకటి రెండుసార్లు మినహాయిస్తే వరుసగా 16 సార్లు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు సాధించడం వీరి అసమాన ప్రజ్ఞకు నిదర్శనం.

ప్రకృతి బడిలో బాల్యం : కృష్ణాజిల్లా పామర్రులో మార్చి 1, 1940 సం.లో రైతు కుటుంబంలో జన్మించిన బి.ఎ. రెడ్డి పై పల్లె పచ్చదనం, ప్రకృతి రమణీయత బలమైన ముద్రవేశాయి. తండ్రి కోటిరెడ్డి ఫోటోగ్రాఫరు కావడంతో బి.ఎ. రెడ్డి కూడా సృజనాత్మక కళాభ్యాసం వైపే మొగ్గు చూపారు.
చిత్ర కళాభ్యాసం : పామర్రు పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చిత్రకళలో ఓనమాలు దిద్ది, తరువాత కొప్పాడ వేణుగోపాల్ శిష్యరికంలో గవర్నమెంట్ డిప్లొమా పొందారు. తొలుత గుంటూరు జిల్లాలో డ్రాయింగ్ టీచరుగా నియమితులయ్యి, పిమ్మట కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో ఆయన పల్లెలు విడిచి పర రాష్ట్రానికి వెళ్ళి నాసిక్ లో విద్యాధికులైన కళాకారుల సాంగత్యంలో అనేక రకాలైన దృక్పథాలను, కళాత్మక పోకడలను ఆకలింపు చేసుకున్నారు.
చిత్ర కళాబోధన : హైదరాబాద్ లోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయంకు 1966లో బి.ఎ.రెడ్డి. బదిలీపై వచ్చి, తనకు వచ్చిన కళను ఆశక్తిగల వారికి నేర్పాలి అన్న విశాల భావంతో గ్రామీణ విద్యార్థులను దండుగా కట్టించి, చిత్రకళలో ఓనమాలు దిద్ది, ఎందరో భావి కళాకారులను తీర్చిదిద్దుతూ,  16 సార్లు సోవియట్ లాండ్ అవార్డు సాధించగల్గారు. హైదరాబాద్ పేరును అంతర్జాతీయ గ్యాలరీల్లో తళుక్కుమనిపించారు. చిత్రకళలో విజేతలైన పదిహేనుమంది పైగా ఆయన విద్యార్థులు మాస్కో దేశంలో ప్రభుత్వ అతిథులుగా పర్యటించి వచ్చారు. అక్కడి ప్రజల జీవన స్థితిగతులు, కళా స్వరూపాన్ని అవగాహన చేసుకొన్న వారిలో కొత్తగా కనిపిస్తున్న ఆత్మ విశ్వాసాన్ని చూస్తే బి.ఎ.రెడ్డి గార్కి పట్టరానంత ఆనందం కలిగేది. అది పట్టుదలగా మారి ప్రతి ఏడాది తన విద్యార్థులు విజేతలుగా నిలబడటానికి కృషి జరిపారు. వందలాది అవార్డులు, వేలాది మెరిట్ సర్టిపికేట్లు వీరి శిష్యుగణం కైవసం చేసుకొన్నారు.
జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాల విద్యార్థుల ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఇరవై ఏళ్ళపాటు నిర్వహంచారు. సుమారు వందమంది బాల చిత్రకారులకు స్వర్ణ పతకాలు, అయిదుగురు గురువులకు మెడల్స్ ఇచ్చి సత్కరించారు. ప్రతీ వారం ప్రపంచంలో ఏదో ఒక మూల నుంచి ఆయన విద్యార్ధులకు ఏదో బహుమానమో, సర్టిఫికెట్ రావడం పరిపాటైపోయింది.

చిత్రకళా సాధనలో : దేశంలో అనేక ప్రాంతాలు తిరిగిన రెడ్డి గారిలో సామాజిక అవగాహన పెరగడంతో చిత్రాల్లో విషయ వైవిద్యం ఏర్పడింది. ఎన్నో దృశ్యాలు, విషయాలు, సంఘటనలు. కొన్ని ఆలోచింపజేసేవి, కొన్ని ఆహ్లదపరిచేవి మరికొన్ని కలవరపేట్టేవి. ఆ సంఘటనలన్నిటికీ, ఆ భావనలన్నిటికీ తన చిత్రాల్లో చోటిచ్చారు. ఎదురయ్యే సందేహాలకు తన కుంచేతో సమాధానం వెతుక్కుంటూ వచ్చారు.
‘సంస్కృతి’కి శ్రీకారం : ఉద్యోగ విరమణ తర్వాత బి.ఎ.రెడ్డిగారు మరింత ఉత్సాహం తో గ్రామీణ విద్యార్ధులకు చిత్రలేఖనంలో తర్ఫీదు ఇచ్చే గొప్ప కార్యక్రమానికి అంకితమయ్యారు. ‘యంగ్ ఎన్ వాయిస్’ అనే సంస్థను స్థాపించి నగరానికి సమీపంలోని పల్లె ప్రాంతంలో రూరల్ ఆర్ట్ సెంటర్ ‘సంస్కృతి’కి శ్రీకారం చుట్టారు. పల్లెల్లో బురదలో ఆడుకుంటూ, మట్టి కొట్టుకుపోతున్న చిన్నారులను పలుకరించి పట్టుకెళ్ళి బొమ్మలతోను, రంగులతోనూ స్నేహం కుదుర్చారు. ఈ చిన్నారులే నేడు దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.

అవార్డులు – రివార్డులు : ప్రపంచం నలుమూలల్లో జరిగే బాలల చిత్రకళా ప్రదర్శనల్లో వీరి ప్రతాపానికి పెద్ద పెద్ద కళావేదికలన్నీ నివ్వెరపోతున్నాయి. చిత్రకళా బోధనలో గత నలభై ఏళ్ళ కృషికి పోలెండ్ ప్రభుత్వం నుంచి ‘ఆర్డర్ ఆఫ్ స్మైల్’ మెడల్ ను, భారత ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును’ 1984 లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును, హెవింకా, ఫిలాండ్ నుంచి బంగారు పతకంను, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమి నుండి ‘బాలబంధు'(1993) అవార్డును, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవాద్యాలయం వారి ప్రతిభా పురస్కారం(2005), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుండి ‘కళారత్న హంస ‘ పురస్కారం లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. చిత్రకళకు సంబంధించిన ‘ఆర్ట్ డ్రైవ్’ అనే త్రైమాసిక పత్రికను గత 30 ఏళ్ళుగా  నడుపుతున్నారు. ప్రస్తుతం ఏ.పి. ఆర్టిస్ట్స్ గిల్డ్ కు అధ్యక్షులుగా వున్నారు. ‘కళ ‘ కళకోసమే కాదు సమాజానికి కూడా అని నమ్మే రెడ్డి గారు ‘రామాయణ’, మహాత్మాగాంధీ’ వంటి పలు అంశాలపై జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. 2019లో మహాత్మగాంధీ 150 వ జయంతి సందర్భంగా మన దేశంలోని, బయట దేశాలలోని  బాలచిత్రకారులు గాంధిజీ పై చిత్రించిన 150 చిత్రాలతో ‘Tiny Hands – Mighty Tributes’ పేరుతో చక్కటి పుస్తకాన్ని ప్రచురించారు.

గోల్డెన్ పేలట్ :  బి.ఏ. రెడ్డి గారు తన ఆరు దశాబ్దాల కళాయాణాన్ని ‘ గోల్డెన్ పేలట్  ‘ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకానికి ఆప్తవాక్యాలు రాస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు గారు  ” గోల్డెన్ పేలట్  కేవలం ఒక చిత్రకారుడి జీవిత రేఖాచిత్రణ కాదు. ఈ ప్రపంచంలో పిల్లలు కేవలం ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మారడానికి మాత్రమే పుట్టడం లేదని, వాళ్ళ కలన్నీ, కల్పనల్న్నీ బహువర్ణ రాగరంజితం చేసుకునే చిత్రకారులుగా కూడా కావచ్చునని తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక అవకాశం, బంగారు సుర్యకాంతి మన ఇంటి గదుల్లోకి ప్రసరించడానికి తెరిచిన ఒక గవాక్షం. ” వంటిది అన్నారు.
వీరి కుమార్తెలు పద్మారెడ్డి, సుధారెడ్డి, అల్లుడు అంట్వాకుల రాజేశ్వరరావు కూడా చిత్ర కళారంగంలో చురుకైన పాత్రను నిర్వహిస్తున్నారు. బాలలలోని సృజనాత్మకతను వెలికి తీసి, వారిని భావి చిత్రకారులుగా దిద్దుతున్న బి.ఎ. రెడ్డి గారు నిజంగా బాలల బంధువే.

-కళాసాగర్ యల్లపు

4 thoughts on “చిట్టి చేతులతో చిత్రాలు గీయిస్తున్న చిత్రకారుడు

  1. Good informative articles are being written by Kalasagar. I would like to appreciate his spirit and enthusiasm in word and deed. He is very much dedicated for the purpose and propagation of art.

  2. Sri kalasaagar garu Dr. B. A.Reddy gaaru చిత్ర కళా కృషిని చక్కని వాక్యాలలో పరిచయం చేశారు. ఆ మహా చిత్రకారుని కళా సేవ అనితర సాధ్యం. వీరి గురించి 64 కళలు.లో article రావడం అభినందనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap