మహాశిల్పి దురుగడ్డ బాలవీరాచారి

ఒక శిల్పికి శతజయంతి పండుగ చేయడం తెలుగువారిలో ఇదే ప్రథమం.

సంస్కృత విద్యకి కాశీ ఎలాంటిదో, సంగీతానికి తంజావూరు ఎంత గొప్పదో, శిల్పకళకి ఆళ్ళగడ్డ అంతటి కీర్తి తెచ్చుకుంది.

1850వ సంవత్సరం నాటికే ఆళ్ళగడ్డలో గొప్ప శిల్పులు ఉన్నారని పరిసరాల గ్రామాల్లో నిర్మించిన దేవాలయాల స్తంభాలు పలికే సరిగమలే సాక్ష్యాలు. ఆ రాతిబొమ్మల అందమైన ఆలాపనలే ఆధారాలు.

విశ్వబ్రాహ్మణ సమాజంలో ఆనాటికే పేరుమోసిన దురుగడ్డ కుటుంబం వారు వాస్తు శిల్ప శాస్త్రాలలో పేరు గడించారు. వారిలోని చినగురువయ్యాచారి ఏకంగా ఒక శిల్పశాలనే నడిపించేవారు. కాబట్టే ఆయన ఆచార్యుడయ్యాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వీరభద్రాచారి, బాలవీరాచారి, పోతులూరయ్యాచారి. ముగ్గురూ శిల్ప శాస్త్రంలో నిష్ణాతులే. అయితే మధ్యలో ఉన్న బాలవీరాచారి అందరికంటే విస్తృతంగా అధ్యయనం చేయటం వలన గొప్ప శిల్పిగా ప్రఖ్యాతి గాంచాడు.

ఈ బాలవీరాచారి సోదరులతో కలిసి నిర్మించిన చాగలమర్రి గ్రామంలోని అమ్మవారి శాల (కన్యకాపరమేశ్వరీ దేవస్థానం), కోవెలకుంట్లలోని శివాలయం, శ్రీశైల పర్వతం మీద నిర్మించిన భ్రమరాంబికా ఆలయంలోని సింహ స్తంభాల మండపం, బ్రహ్మంగారి మఠంలోని ఆలయాలు, ఆళ్ళగడ్డలోని అమ్మవారి శాల, ఆయనకి ఎనలేని కీర్తిని సంపాదించాయి. అన్నిటికంటే ముఖ్యంగా మహానందిలోని స్తంభాల మీద ఆయన గుర్తుగా వేసుకున్న స్వీయముఖ ఉల్బణ శిల్పాలు ఎంతగానో ఖ్యాతిగాంచాయి. ఎంతో స్వాతంత్ర్యాన్ని తీసుకొన్న ఆ శిల్పాల్లో ఒక కళాకారుని ఆత్మగౌరవం తెలుస్తుంది.

మహాశిల్పి, బ్రహ్మశ్రీ బాలవీరాచారి (1926-1986) శతజయంతి ఈ ఆగస్ట్ 16 వ తేదీన ఆళ్ళగడ్డ శ్రీ శారదా శిల్పకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు.

…………………………………………………

13వ శతాబ్దపు కవి బద్దెన తన సుమతీ శతకంలో చెప్పినట్లుగా బాలవీరాచారి తన తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగించాడు. అందరూ బాలవీరాచారిని గుర్తించి, గొప్పగా పొగిడారు. సర్వజనులూ మురిపెంగా, ముద్దారా సేవించుకొన్నారు. తండ్రి చిన గురువయ్యాచారి ఆనందంతో ఉప్పొంగాడు. సంబరపడ్డాడు. సంతోషించాడు. కన్నతండ్రి జన్మ ధన్యం చేశాడు.

ఒక శిల్పికి వంద సంవత్సరాల పండుగ చేయటం ఇంతవరకూ నేను చూడలేదు. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు బాలవీరాచారి కొడుకులు. వాళ్లు కూడా ఇప్పుడు తండ్రికి మించిన తనయులైనా, తమకు వారసత్వంగా వచ్చిన శిల్పకళా నైపుణ్యాన్ని మరింతగా పదును పెట్టుకొని, పురోగమిస్తూ ఈ శత వసంతాల జయంతిని ఎంతో వేడుకగా జరుపుకొనడానికి ముందుకు వచ్చి, తమ శిల్ప కళాకేతనాన్ని ఆళ్ళగడ్డ ఆకాశంలోకి ఎగురవేస్తున్నారు. ఇది ఎంతో ఆనందించవలసిన విషయం. గర్వించదగిన అంశం.

ఇది ఎంతో ఘనమైన, గణతంత్రమైన సందర్భం. అలాంటి గొప్ప దురుగడ్డ శిల్పుల సమక్షంలో నేనూ ఉన్నాను. వారంతా నా స్నేహితులు అని చెప్పుకుంటాను.

అలలు అలలుగా కదిలే వారి ఉలుల సంగీతపు చిరుజల్లుల్లో తలమునకలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఆచార్య దేవోభవ – గురుదేవోభవ

డా. M. ఆదినారాయణ
విశ్రాంత ఆచార్య, ప్రొఫెసర్ ఇన్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ
లలితకళా విభాగం, ఆంధ్రాయూనివర్సిటీ

Share via
Copy link
Powered by Social Snap